housing department
-
కాపాడలేం.. అమ్మేద్దాం!
సాక్షి, హైదరాబాద్: హౌసింగ్ బోర్డు, దానికి అనుబంధంగా ఉన్న ‘డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)’ఆధీనంలోని భూములను అమ్మేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల నిర్వహణ కోసం భారీగా నిధుల సమీకరణ చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈ భూముల విక్రయంపై దృష్టిసారించినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గృహనిర్మాణ శాఖ సమావేశంలో దీనిపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలిసింది. సదరు భూములపై ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. తొమ్మిదో షెడ్యూల్లో ఉండటంతో.. ఉమ్మడి రాష్ట్ర సమయంలో.. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే అనువైన ఇళ్లను సమకూర్చేలా హౌసింగ్‌బోర్డు ఆధ్వర్యంలో కాలనీలు రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. బోర్డు ఏర్పడే నాటికే తెలంగాణ ప్రాంతంలో దాని ఆ«దీనంలో భారీగా భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలో కూడా బోర్డు భూములను సమకూర్చుకుంది. ఇందులో భారీ వెంచర్ల కోసం ప్రత్యేకంగా ‘డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిడెడ్ (దిల్)’పేరిట అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో దిల్ పరిధిలో 1,800 ఎకరాల భూములు, హౌసింగ్ బోర్డు ఆ«దీనంలో మరో 820 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఈ భూముల అంశం రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం పరిధిలో ఉంది. హౌజింగ్‌బోర్డు, దిల్లకు సంబంధించి ఏ ప్రాంతంలోని భూములు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ పట్టుబట్టినా.. షీలా భిడే కమిటీ భిన్న నిర్ణయాన్ని వెల్లడించింది. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఈ అంశం అలాగే తొమ్మిదో షెడ్యూల్లో తెగని పంచాయితీగా ఉండిపోయింది. హైకోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో సదరు భూములను అమ్మేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారుతోంది. కాపాడలేమంటూ కేంద్రం దృష్టికి.. హౌసింగ్‌బోర్డు, దిల్ భూములు కీలక ప్రాంతాల్లో ఉండటంతో వాటిపై కబ్జారాయుళ్ల దృష్టి పడింది. ఇప్పటికే చాలా భూములపై వివాదాలు మొదలయ్యాయి. ఈ భూముల విక్రయానికి ప్రక్రియ మొదలుపెట్టగానే.. అభ్యంతరాలు వస్తాయని, కోర్టులో కేసు ఉండగా ఎలా అమ్ముతారన్న ప్రశ్న వస్తుందని సర్కారు ముందుగానే అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఇటు కోర్టుకు, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ భూముల పరిరక్షణ సవాల్‌గా మారిందన్న విషయాన్ని తెలియపర్చాలని భావిస్తోంది. ‘‘ఇప్పటికే చాలా భూములు వివాదంలో ఉన్నాయి. వాటితోపాటు క్లియర్‌గా ఉన్న మిగతా భూములను పరిరక్షించటం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కబ్జాలు ఇంకా పెరిగి వివాదాలు కోర్టుల్లో పెరిగేంత వరకు ఉపేక్షించటం సరికాదు. ఈ భూములకు సంబంధించి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తాం. ముందు వాటిని వేలం ద్వారా విక్రయించి, వచి్చన డబ్బును తదనుగుణంగా వినియోగించుకోవచ్చు. అందుకు వీలు కల్పించాలి’’అని కోర్టును కోరాలని యోచిస్తోంది. కేంద్రానికి కూడా ఇదే వివరించాలని.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయిలో పర్యవేక్షించేందుకు ఓ ప్రతినిధిని కూడా నియమించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. -
TS: రూ.5 లక్షలు.. 500 చ.అ. ఇల్లు!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ పథకం అమలుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఈ పథకం కింద గృహ నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, ఆ మొత్తంతో దాదాపు 450 చదరపు అడుగుల (చ.అ) నుంచి 500 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు నిబంధనల ప్రకారం చుట్టూ ఖాళీ స్థలం వదలాలంటే 70 చ.గజాల వరకు స్థలం కావాలని అంచనా వేస్తోంది. ఇలా 70 గజాల స్థలం ఉన్నా, అంతకంటే ఎక్కువున్నా పరవాలేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు పూర్తిగా ఖర్చు చేసి 500 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రంలో 60 గజాల కంటే తక్కువగా సొంత స్థలం ఉన్న పేదలే ఎక్కువమంది ఉంటారని అంచనా. కాగా తక్కువ స్థలంలో చిన్న ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల లోపే ఖర్చవుతుందని, 60 గజాల కంటే తక్కువ స్థలం ఉన్న పేదలకు రూ.5 లక్షలు ఇస్తే, ఖర్చు కాగా మిగిలే మిగతా మొత్తం ‘దుర్వినియోగం’ ఖాతాలోకి చేరుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పష్టత లేకపోయేసరికి ఇప్పటివరకు అధికార యంత్రాంగం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకీ సమస్య అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ పథకం ఉన్న సంగతి తెలిసిందే. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణ పథకం గృహలక్ష్మి కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ దానిని ఇందిరమ్మ పథకంగా మార్చి ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షలకు పెంచి ప్రకటించింది. అంటే అర్హులైన ప్రతి లబ్ధిదారుకు రూ.5 లక్షలు అందిస్తారన్నదే ఆ ప్రకటన సారాంశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల పథకంలో ఒక్కో ఇంటికి దాదాపు రూ.5.20 లక్షల వరకు ఖర్చయింది. ఆ మొత్తంతో 500 చ.అ.కు మించిన విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం జరిగింది. లిఫ్టు వసతి లాంటి అదనపు హంగుల వల్ల జీహెచ్ఎంసీ పరిధిలో యూనిట్ కాస్ట్‌ను రూ.7 లక్షలుగా ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో అందరికీ సమంగా రూ.5 లక్షల చొప్పున ఇస్తే, నిబంధనల ప్రకారం ఖర్చు చేస్తే డబ్బులు మిగిలి దుర్వినియోగం కింద జమకట్టే ప్రమాదం ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇందిరమ్మ పథకంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల్లో కూడా ఇలాంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయని కొందరు గుర్తు చేస్తున్నారు. ఆ ప్లాన్లు ఎలా అమలు చేస్తారు? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మూడు నమూనాలు సిద్ధం చేసి, వాటి ఆధారంగా నిర్మాణం చేపడతామని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సొంత జాగాలో ఇళ్లను నిర్మించుకునే క్రమంలో ఈ నమూనాలు కూడా ఆటంకంగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పేదలకు ఉండే సొంత జాగాలు అన్నీ ఒకే ఆకృతిలో ఉండే అవకాశం ఉండదు. కొన్ని పొడవుగానో, వంకర టింకరగానో ఉంటే, ప్రభుత్వం రూపొందించిన ప్లాన్ల ప్రకారం ఇళ్లను నిర్మించుకునే వీలుండదు. అప్పుడేం చేయాలనే సందేహాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, అప్పుడే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కసరత్తు ముందుకు సాగుతుందని అంటున్నారు. -
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రోడ్లు భవనాల శాఖలోకి మారిన గృహ నిర్మాణ శాఖ విభాగాలను పునరుద్ధరించనున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గాను ఆ విభాగాన్ని పునరుద్ధరిస్తూ, చాలినంత సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై సమకూర్చుకోనున్నట్టు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మూడు, నాలుగు నమూనాలను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి గృహనిర్మాణ సంస్థ, రాజీవ్ స్వగృహ, గృహనిర్మాణ మండలి అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున, వాటి నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభిస్తామని పొంగులేటి చెప్పారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి గృహనిర్మాణ శాఖపై సమీక్షించనున్నారని, ఈ సందర్భంగా విధి విధానాలపై స్పష్టత ఇవ్వనున్నారని తెలిపారు. రాజీవ్ స్వగృహ ఇళ్ల విక్రయాల కోసం మార్కెటింగ్ నిపుణులను నియమించండి కొనుగోళ్లు కాకుండా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను విక్రయించేందుకు వీలుగా మార్కెటింగ్ చేయాల్సి ఉందని, ఇందుకు నిపుణులను నియమించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ సముదాయాలను ఏ ధరకు విక్రయించాలన్న విషయంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. వాటి ద్వారా సమకూరే మొత్తాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించనున్నట్టు పేర్కొన్నారు. -
మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, తిరిగి గృహనిర్మాణ శాఖను పునరుద్ధరించబోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం లక్షల సంఖ్యలో ఇళ్లను నిర్మించారు. ఆ సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. అవినీతి ఆరోపణలు చేస్తూ సీఐడీతో దర్యా ప్తు చేయించింది. చివరకు గృహ నిర్మాణ శాఖే లేకుండా చేసింది. రోడ్లు భవనాల శాఖలో ఓ విభాగంగా మార్చేసింది. అందులోని సిబ్బంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. కాగా త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి గృహ నిర్మాణాలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం అందటంతో, ఆగమేఘాల మీద అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ శాఖను పునరుద్ధరించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. వైఎస్ హయాంలో 14 లక్షల ఇళ్లు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణ పరిధిలో ఏకంగా 14 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మితమయ్యాయి. 2004–2009 మధ్యలో ఈ ఇళ్లు రూపొందగా, ఆ తర్వాత 2014 వరకు కేవలం నాలుగున్నర లక్షలు మాత్రమే నిర్మితమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అయితే తొమ్మిదేళ్లలో లక్షన్నర ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయింది. తర్వాత గృహలక్ష్మి పేరు తో ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా, దరఖాస్తులు స్వీకరించే సమయానికి ఎన్నికలు రావటంతో అది కాస్తా ఆగిపోయింది. ఇప్పు డు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారులకు రూ.3 లక్షలు చొప్పు న ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. అదనంగా సిబ్బంది కావాల్సిందేనా..? గృహనిర్మాణ శాఖలో 1983–87 మధ్య సిబ్బంది నియామకం జరిగింది. ఆ తర్వాత కొన్ని బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ మాత్రమే జరిగింది. కాలక్రమంలో చాలామంది పదవీ విరమణ చేశారు. అయితే రిటైర్మెంట్ వయసు పెంపు కారణంగా మొత్తం మీద 500 మంది వరకు ఉండగా, శాఖను రద్దు చేయటంతో 450 మంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. దీంతో కేవలం 50 మంది మాత్రమే ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కొనసాగించాలంటే పాత సిబ్బంది తిరిగి రావటమే కాకుండా, అదనపు సిబ్బంది కావాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ అధికారుల సేవలను వినియోగించుకుంటే మంచిదన్న సూచనలు అందుతున్నాయి. ఆ దరఖాస్తులేం చేస్తారు? గత ప్రభుత్వం చివరలో ప్రారంభించిన గృహలక్ష్మి పథకం కోసం 14 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిల్లో అర్హమైనవి 11 లక్షల వరకు ఉన్నట్టు గుర్తించారు. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ రావడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడా పథకమే లేకుండా పోనుంది. దీంతో ఆ దరఖాస్తులను ఏం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
ఏపీ గృహ నిర్మాణంపై కేంద్రం సంతృప్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ పథకాల అమలుపై కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు హౌసింగ్ లేఅవుట్ వద్ద జరుగుతున్న పీఎంఏవై–అర్బన్ గృహ నిర్మాణాలను కేంద్ర అధికారుల బృందం శనివారం పరిశీలించింది. పీఎంఏవై–అర్బన్ హౌసింగ్ డైరెక్టర్ ఆర్కే గౌతమ్, ఇంజినీర్లు సునీల్ పరేఖ్, మనీష్‌తో కూడిన బృందం సభ్యులు స్థానిక లబ్ధిదారులతో మాట్లాడారు. వారి గత, ప్రస్తుత జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లతో పాటు నిర్మాణంలో వినియోగిస్తున్న ఇటుకలు, సిమెంట్ తదితర సామగ్రిని స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు కేంద్ర బృందం విజయవాడలోని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమాలపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 5 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించిందని, మిగిలిన ఇళ్లను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తోందని రాష్ట్ర అధికారులు వివరించారు. అలాగే కేంద్ర బృందం మంగళగిరిలోని టిడ్కో ఇళ్లను పరిశీలించి అక్కడి లబ్ధిదారులతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కేంద్ర బృందం వెంట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ జేఎండీ కె.శివప్రసాద్, చీఫ్ ఇంజినీర్ జి.వి.ప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్లు వెంకట్‌రెడ్డి, ఎస్ఈలు జయరామాచారి, నాగభూషణం తదితరులున్నారు. -
ఏపీలో ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల్లో మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన
‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేసిన బ్యాంకు రుణాలకు సంబంధించి వడ్డీ డబ్బుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు.
-
ఇళ్ల సౌకర్యాలు బాగుండాలి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిరుపేద అక్కచెల్లెమ్మల ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేసిన బ్యాంకు రుణాలకు సంబంధించి వడ్డీ డబ్బుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇళ్ల లబ్ధిదారులపై భారం పడకుండా అదనపు సాయం కింద పావలా వడ్డీకి రూ.35 వేల చొప్పున బ్యాంకు రుణాలను అందిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మంజూరు చేసిన రుణాలకు సంబంధించి ప్రభుత్వం భరించే వడ్డీ మొత్తాన్ని జమ చేసేందుకు సన్నాహాలు చేయాలని సూచించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. గృహ నిర్మాణ శాఖపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఇంటినీ ఆడిట్ చేయండి జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17 వేలకు పైగా ఊళ్లనే కొత్తగా నిర్మిస్తున్నాం. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతి ఇంటిని ఆడిట్ చేయాలి. అందులో భాగంగా విద్యుత్, తాగునీరు కనెక్షన్లు ఇచ్చారా? ఇంకుడు గుంత ఉందా? తదితర అంశాలను పరిశీలించాలి. ఇంటి నిర్మాణంలో పేదలపై భారం పడకూడదు అదనపు సాయం కింద పావలా వడ్డీకి బ్యాంకు రుణాలను మంజూరు చేశాం. మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటి వరకూ మంజూరు చేసిన రుణాలపై వడ్డీ డబ్బుల విడుదలకు సన్నద్ధం కావాలి. గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరికి మరో ఐదు లక్షల ఇళ్లు నవరత్నాల పథకం కింద 21.25 లక్షల పేదల ఇళ్లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 7.43 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసి పేదింటి అక్కచెల్లెమ్మలకు అందించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. గత సమీక్షలో సీఎం నిర్దేశించిన ప్రకారం నిర్మాణాలు పూర్తై లబ్ధిదారులకు అందించిన ఇళ్లకు సంబంధించి మౌలిక సదుపాయాలపై నిశితంగా పరిశీలన చేసినట్లు వివరించారు. విద్యుత్, తాగునీరు సౌకర్యాలను సమకూర్చడంతోపాటు ఇంకుడు గుంతలు, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం అదనపు సాయం కింద 12,72,143 మంది మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున రుణాలను అందించామన్నారు. ఇలా రూ.4,483 కోట్ల మేర రుణాలను మహిళలు అందుకున్నట్లు సీఎం దృష్టికి తెచ్చారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దీవాన్ మైదీన్, టిడ్కో ఎండీ శ్రీధర్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పట్టణ ప్రాంత పేదలకు అందించిన టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థంగా పనిచేసేలా చూడాలి. వారికి తగిన అవగాహన కల్పించి ప్రభుత్వం అందించిన రూ.లక్షల విలువైన ఆస్తిని ఎలా సమర్థంగా నిర్వహించుకోవాలో దిశానిర్దేశం చేయాలి. తద్వారా భవనాలు నాణ్యతగా ఉండటంతోపాటు పరిసరాలు నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షణ ఉంటుంది. -
గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష
-
ఐదు లక్షల ఇళ్లు పూర్తి
సాక్షి, అమరావతి : పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డును నమోదు చేసింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లులేని పేదలకు పక్కా గృహాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని తాజాగా పూర్తిచేసింది. ఈ నెలాఖరులోగా వీటిని పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం నిర్దేశించిన లక్ష్యాన్ని ఆ శాఖ విజయవంతంగా ఛేదించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,00,653 ఇళ్ల నిర్మాణాన్ని సోమవారంతో పూర్తిచేసింది. అనతికాలంలోనే రికార్డు.. రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదల సొంతింటి కలను నిజంచేయడానికి 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీనికింద 31 లక్షలకు పైగా పేదింటి అక్కచెల్లెమ్మలకు పట్టాలు అందించారు. రెండు దశల్లో 21.25 లక్షలకు పైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో 18.63 లక్షలు సాధారణ ఇళ్లు. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తిచేశారు. వీటికి మౌలిక సదుపాయాలు కూడా చకచకా కల్పిస్తున్నారు. పూర్తయిన ఇళ్లకు కరెంటు, మంచి నీటి కనెక్షన్లు ఇస్తున్నారు. అలాగే, 2020 డిసెంబర్ 25న ప్రస్తుత కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో సీఎం జగన్ పట్టాల పంపిణీ చేయడంతో పాటు, పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేవలం రెండేళ్ల ఎనిమిది నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో ఇళ్లు పూర్తిచేసి పేదలకు అందించినట్లు అవుతోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి.. పేదల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నాటి నుంచి అడుగడుగునా టీడీపీ అడ్డుతగిలింది. కోర్టుల ద్వారా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకుండా అడ్డంకులు సృష్టించింది. వీటిని అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో టీడీపీ ఏకంగా 2021 అక్టోబర్‌లో కోర్టులకు వెళ్లి నిర్మాణాలనే అడ్డుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో కొందరు వ్యక్తుల సంతకాలు తీసుకుని, వారి సమ్మతి లేకుండా మోసపూరితంగా కేసులు వేసిన ఘటనలు వెలుగుచూశాయి. పేదలకు వ్యతిరేకంగా టీడీపీ చేసిన కుట్రతో అప్పట్లో ఆరునెలలపాటు ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. మరోవైపు.. నిర్మాణాలు ప్రారంభించిన వెంటనే రెండో దశ కరోనా వ్యాప్తి ప్రారంభం, గత ఏడాది తీవ్ర వర్షాలు, వరదలు ఇలా ప్రకృతి విపత్తులు.. టీడీపీ, ఇతర దుష్టచతుష్టయం రాక్షసబుద్ధిని ఎదురొడ్డి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసింది. అక్కచెల్లెమ్మలకు లక్షల విలువైన ఆస్తి పేదలందరికీ ఇళ్ల పథకం కింద రూ.లక్షల విలువైన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం పేద అక్కాచెల్లెమ్మల పేరిట సమకూరుస్తోంది. ఇందుకోసం అన్ని విధాలుగా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. ♦ ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వం రూ.15 లక్షల వరకు విలువైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసింది. ♦ ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతో పాటు పావలా వడ్డీకి రూ.35 వేల బ్యాంకు రుణం సమకూరుస్తోంది. ♦ అంతేకాక.. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తున్నారు. ♦ మిగిలిన ఐరన్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రిని మార్కెట్ ధరలకన్నా తక్కువకు సరఫరా చేయడం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.54,518 మేర అదనపు సాయం అందిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఇళ్లులేని ప్రతి కుటుంబానికి పక్కా ఇళ్లు సమకూరుస్తున్నారు. 5 లక్షల ఇళ్లు పూర్తిచేయడానికి అహర్నిశలు కృషిచేసిన గృహ నిర్మాణ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు. ఇదే స్పూర్తితో ఇక ముందూ పనిచేయాలి. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. – జోగి రమేశ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పండుగలా గృహ ప్రవేశాల వేడుకలు.. వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పండుగలా గృహప్రవేశ వేడుకలు చేపట్టనున్నాం.త్వరలోనే ఈ వేడుకలు ప్రారంభిస్తాం. ఒక పెద్ద కాలనీలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా ఇంటి తాళాలు అందజేస్తాం. ప్రజాప్రతినిధులు అన్ని జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ -
అమరావతి అందరిదీ
పేద వర్గాలపై పెత్తందారుల దోపిడీలను సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అలాంటి మార్పులకు మనసా వాచా కర్మణా సహకరించే ప్రభుత్వంగా, మీ అన్నగా.. నిరుపేద అక్కచెల్లెమ్మల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో ‘సామాజిక అమరావతి’కి పునాదిరాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మనందరిది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేదలకు మేలు జరిగే ప్రతి విషయంలో మనందరి ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదలకు మంచి జరగకూడదని రాక్షస బుద్ధితో అడ్డుకుంటున్న వారితో పెద్ద యుద్ధమే చేస్తున్నామన్నారు. సోమవారం సీఆర్డీఏ పరిధిలో పేదలకు 50,793 ఇళ్ల నిర్మాణం, 45 సామాజిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో సీఎం జగన్ మాట్లాడారు. తొలుత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... వెంకటపాలెంలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం ఆ తర్వాత కూడా బుద్ధి మారలేదు.. సీఆర్డీఏలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇళ్లç స్థలాలు ఇవ్వకుండా, ఇళ్లు కట్టించకుండా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు సృష్టించిన ఊరుపేరూ లేని సంఘాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ – 5 అడ్డు తగిలాయి. వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. ఇందుకోసం ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లిన దౌర్భాగ్యమైన పరిస్థితిని మన రాష్ట్రంలో మాత్రమే చూస్తున్నాం. ఈ పెద్దమనుషులు, పెత్తందార్లు, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో 5 కేసులు వేశారు. ఈ కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ మూడేళ్ల పాటు పోరాటం చేస్తూ వచ్చాడు. దేవుడు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ మంచికే ఉంటాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచింది. అనుమతులు తెచ్చుకుని మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి అడ్డు తగిలేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వారు ఎక్కని గడప దిగని గడప లేదు. కలవని కేంద్ర మంత్రీ, కేంద్ర సెక్రటరీలు కూడా లేరు. ఇంతమందిని కలిశాక చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా ఉండదు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఇంతమంది పెత్తందార్లు ఒక్కటై పేదవాడికి ఇళ్లు రాకూడదని అడ్డుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నించిన పరిస్థితులు దేశ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఇలా పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ, ఎన్నెన్నో అవరోధాలను అధిగమించి విజయం సాధించి పేదల ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ ఇళ్ల నిర్మాణానికి, మీ ఇంటి కలల సాకారానికి ఇవాళ ఇక్కడ పునాదులు కూడా వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల సొంతింటి కలల సాకారానికి మనం చేసిన సామాజిక న్యాయ పోరాటం చరిత్ర ఉన్నంత వరకూ ఎప్పడూ మర్చిపోలేనిది. పెత్తందారులపై పేదవాడు, పేదల ప్రభుత్వం సాధించిన విజయంగా చరిత్రలో పదిలంగా ఉంటుంది. గతంలో ఎన్నడూ చూడలేదు అమరావతిని పేరుకేమో రాజధాని అంటారు. రాజధానిలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుపడి కోర్టులకు వెళ్లారు. పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ (సామాజిక అసమతుల్యత) వస్తుందని, కులాల సమతుల్యం దెబ్బతింటుందని న్యాయస్థానాల్లో వాదించిన చరిత్ర వీళ్లది. ఇలాంటి పెత్తందారులున్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైన మనుషులను, మనస్తత్వాలను, వాదనలను, రాతలను, టీవీల్లో డిబేట్లను, రాజకీయ పార్టీలను గతంలో ఎప్పుడూ చూడలేదు. నయా జమీందార్ల మొసలి కన్నీరు పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే ఈ నయా జమీందార్లు, పెత్తందార్లంతా అడ్డుతగిలే కార్యక్రమం చేశారు. తెలుగు భాష ఏమైపోతుందని మొసలి కన్నీరు కారుస్తారు. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకే పంపిస్తారు. మన పిల్లలు మాత్రం తెలుగు బడులకే పోవాలంటారు. నా అక్కచెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తే రకరకాల కోర్టు కేసులు వేశారు. పేదవాడు ఎప్పుడూ పేదవాడుగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ ఆలోచనకు ఇవొక నిదర్శనాలు. మీ బిడ్డ పేదల కోసం అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్షకు చోటివ్వకుండా బటన్ నొక్కి రూ.2.25 లక్షల కోట్లు పంపిస్తే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీ బిడ్డ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. చంద్రబాబు హయాంలో కన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల వృద్ధి రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఈ రోజు ఎలా చేయగలుగుతున్నాడు? ఆ రోజు గజదొంగల ముఠా ఎందుకు చేయలేకపోయింది? మీ బిడ్డ హయాంలో ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తున్నాయి? చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏ పేదవాడు, అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని వలంటీర్, సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్షకు తావివ్వకుండా ఒకటో తారీఖునే అది ఆదివారమైనా, పండగరోజైనా సరే తెల్లవారుజామునే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చేతిలో పెన్షన్ డబ్బులు పెడుతున్నారు. ఈ వ్యవస్థను కూడా పెత్తందార్లు, పేదల వ్యతిరేకులు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు ఏ సమాజమైనా, కుటుంబమైనా నిన్నటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్ బాగుండాలని కోరుకుంటుంది. అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అంటారు. అలాంటి ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటే, వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం, అమానుషత్వం, రాక్షసత్వం అంటారు. విచిత్రమేంటంటే పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ దాన్ని వారు హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే ఈనాడు పేపర్లో చూశా. వాళ్లు రాసిన రాతలు చూసి ఆశ్చర్యం అనిపించింది. దిగజారుడుతనం ఏ స్థాయికి వెళ్లిందంటే చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికా, సింగపూర్ల నుంచి మనుషులు రావచ్చట. కానీ ఇదే అమరావతిలో చుటు్టపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఈనాడులో రాస్తారు. ఇంత దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావజాలం ఎక్కడైనా ఉంటుందా? జగనన్నను టచ్ కూడా చేయలేరు ఎన్నికల సీజన్ రాగానే కొందరు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు పేదలను పీక్కుతిన్నాడు. పవన్‌కళ్యాణ్ ఎన్నో పార్టీలు మార్చాడు. బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం.. ఇలా ఎన్ని పార్టీలైనా మార్చగలడు. మా జగనన్నను ఓడిస్తారా.. ఎంతమంది వచ్చినా ఆయన్ను టచ్ కూడా చేయలేరు.ఇంకొకడు జగనన్నతో పోటీ అంటూ నడుస్తున్నాడు. నువ్వెంత నీ స్థాయి ఎంత? పెత్తందార్ల కోటలను బద్దలుకొట్టి, పేదల పక్షాన నిలిచి సుప్రీంకోర్టు దాకా వెళ్లి వారిని గెలిపించి జగన్ చరిత్రను తిరగరాశారు. పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు అని కోర్టుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మీరొచ్చాకే బడుగు వర్గాలకు ధైర్యం వచ్చింది మీరు పాదయాత్ర చేస్తే రోడ్లపై పసుపు నీళ్లు చల్లిన వ్యక్తులను ఇక్కడ చూశాం. మా సమస్యలు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. జగనన్న వచ్చిన తర్వాత మాకు ధైర్యం, భరోసా వచ్చింది. జగన్ పేదల పక్కనుంటే చంద్రబాబు పెత్తందార్ల తరఫున యుద్ధం చేస్తున్నాడు. కోర్టులలో సైతం జగన్ గెలిచి ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జీవితకాలం పేద వాడి గుండెల్లో మీ పేరు నిలిచిపోతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలను లక్షాధికారులను చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుంది. – బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పాలకుడంటే ప్రజల కన్నీటిని తుడిచేవాడు.. పాలకుడంటే పాలించేవాడే కాదు, ప్రజల సంక్షేమాన్ని కోరుతూ వారి కన్నీటిని తుడిచేవాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త అర్థం చెప్పారు. మేం మీకు రుణపడి ఉంటాం. మీరే మా ధైర్యం అన్నా. మీకు పక్కనే ఉన్న వెంకన్న స్వామి, కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మాకు పట్టాలు ఇచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది, ఇప్పుడు ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. మేం అనేక పథకాల ద్వారా కూడా లబ్ధిపొందుతున్నాం. నగదు రూపంలో మొత్తం రూ.1,89,250, స్థిరాస్తి రూపంలో రూ.పది లక్షల నుంచి రూ. పదిహేను లక్షలు వరకు లబ్దిపొందాను. – రోజా, లబ్ధిదారు, మంగళగిరి వలంటీర్లపై బురద జల్లుతున్నారు నేను సొంత ఇల్లులేక, అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడ్డాను, నాకు ఏ ప్రభుత్వంలో ఇల్లు రాలేదు, కానీ, మీరు రాగానే మంజూరైంది, మా పేదల తరఫున మీరు నిలబడి చేసిన న్యాయపోరాటానికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. నేను వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధి పొందాను, నా కొడుకు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడంటే మీరే కారణం. అన్నా.. నేను నాలుగేళ్లుగా వలంటీర్‌గా సేవలు అందిస్తున్నాను, ఈ మధ్యకాలంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మాపై బురద జల్లుతున్నారు. మీరు మాకు ధైర్యం ఇచ్చారు, థాంక్యూ అన్నా. – స్వప్న, లబ్దిదారు, రాణిగారితోట, విజయవాడ తూర్పు నియోజకవర్గం -
ఐదేళ్లలో పేదలే ధనవంతులు
మంగళగిరి: ప్రభుత్వం స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించడంతో రానున్న ఐదేళ్లలో పేదలు ధనవంతులు కావడం ఖాయమని, దీంతో టీవీ–5, ఏబీఎన్, ఈనాడు అధినేతలు ఏడవడం, చంద్రబాబు కుళ్లి కుళ్లి చావడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శనివారం గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్‌ను సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధానిలో పేదలు ఉండకూడదని, సంపన్న వర్గాలు మాత్రమే ఉండాలని చంద్రబాబు కోరుకున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పారు. రాజధాని ప్రాంతం జీవం లేకుండా ఉందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూసినా చంద్రబాబు రైతుల ముసుగులో కోర్టులను ఆశ్రయించి అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అయినా రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని, 50 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఆరు నెలల్లో ఇక్కడ 25 ఊర్లు, 50 వేలకు పైగా నివాసాలు, రెండు లక్షలకు పైగా జనాభా వస్తుందని తెలిపారు. రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని, ఇది వారి స్వర్గమని, వారి సామాజిక వర్గం మాత్రమే ఉండాలని చంద్రబాబు, ఒక వర్గం మీడియా సుప్రీంకోర్టు దాకా వెళ్లారని, కోట్ల రూపాయలు న్యాయవాదులకు ఫీజులు కట్టారని, వారి నగ్న స్వరూపాన్ని ఇది బట్టబయలు చేసిందని తెలిపారు. సీఎం జగన్ ఎప్పుడూ పేదల పక్షాన పోరాటం చేసి అన్ని సౌకర్యాలతో అమరావతిలో ఇళ్లు నిర్మిస్తున్నారని చెప్పారు. రాజధానిలో రైతులు లేరని, చంద్రబాబు, ఆయన అనుచరులు భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈనెల 24న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ పేదల ఇళ్లకు శంకుస్థాపన జరుగుతుందని, అప్పుడు రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే రామోజీరావు పడుకోవడం, చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ–5 గుక్కపట్టి ఏడవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, సీఎం ప్రోగ్రామ్ కోఆరి్డనేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్, కల్పలతారెడ్డి, జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
సంకల్పం సడలొద్దు
మనిషి కనీస అవసరాల్లో ఒకటైన గూడును నిరుపేదలకు సమకూర్చడానికి మనం ఆరాట పడుతుంటే, ఈ గృహ యజ్ఞానికి ఆటంకాలు ఏర్పరుస్తూ పేదల కడుపు కొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. పేదలకు ఇళ్లు రాకూడదన్నదే వారి ఆలోచన. ఈ క్రమంలో మన సంకల్పం సడలడానికి వీల్లేదు. న్యాయ పరమైన, ఇతర అడ్డంకులన్నీ అధిగమించడానికి అన్ని చర్యలూ తీసుకోండి. ఏం కావాలన్నా వెనువెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థిర నివాసం లేకుండా ఒక్క పేద కుటుంబం కూడా ఉండటానికి వీల్లేదనే సంకల్పంతో మన ప్రభుత్వం ముందుకు వెళుతోంటే, ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు రానివ్వకుండా నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నాయని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వాటన్నింటినీ అధిగమించి ఇళ్ల నిర్మాణ వేగాన్ని ఇదే రీతిలో కొనసాగించాలని ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం పురోగతి గురించి మాట్లాడుతూ.. వైఎస్సార్– జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్న కొద్దీ అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలని చెప్పారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు వెనువెంటనే కరెంటు, నీటి సరఫరా కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ఒక్క విశాఖపట్నంలోనే 1.24 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, డిసెంబర్‌లోగా ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఇందుకు ఏం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వీలైనంత త్వరగా అక్కడ పేదలకు నివాసం కల్పించాలని ఆదేశించారు. పలు చోట్ల కోర్టు కేసుల కారణంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిపోయిందని, అక్కడ ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టి.. ఈ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని చెప్పారు. కొత్తగా ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించడంపై నిర్ధేశిత కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. వీటన్నింటినీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వచ్చే నెలలో 5 లక్షల ఇళ్లు పూర్తి వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పేదల ఇళ్ల నిర్మాణం పూర్తవుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఇప్పటి వరకు 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. రూఫ్ లెవల్, ఆపై స్థాయి నిర్మాణంలో 5,68,517, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి పేదల గృహ నిర్మాణాల కోసం రూ.2,201 కోట్లు ఖర్చు చేశామన్నారు. సీఆర్డీఏలో పేదల ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలను కూడా సీఎంకు వివరించారు. 45,101 మంది లబ్ధిదారులు ఆప్షన్–3 ఎంపిక చేసుకున్నారని తెలిపారు. ఆ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే కాంట్రాక్టర్లను ఎంపిక చేశామన్నారు. లే అవుట్లలో ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి నీటి సరఫరా, అప్రోచ్ రోడ్లు, విద్యుత్ సరఫరా తదితర పనులపై దృష్టి పెట్టామన్నారు. ఇప్పటి వరకు 71,452 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించామని అధికారులు వెల్లడించారు. ఈ నెలలో మరో 29,496, వచ్చే నెలలో 49,604 ఇళ్లను అప్పగించనున్నామని చెప్పారు. 300 చదరపు అడుగుల ఇళ్లను ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నందున మిగిలిన కేటగిరీల్లోని (365, 430 చ.అ) లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా దాదాపు రూ.2 వేల కోట్లు రుణాలుగా ఇప్పించామన్నారు. సీఆర్డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కోర్టులో పిటిషన్లు, వాటిపై విచారణ అంశాన్ని ప్రస్తావించారు. వాణిజ్య సముదాయాల ఏర్పాటు వందలు, వేల సంఖ్యలో ఇళ్లు ఉన్న టిడ్కో కాలనీల్లో వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి దశలో 15 టిడ్కో కాలనీల్లో ఏర్పాటు చేయాలన్నారు. మహిళల ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఏర్పాటయ్యేలా చూడాలని సూచించారు. దీంతో అందుబాటు ధరలలో సరుకులు అక్కడి పేదలకు అందుతాయని, మహిళలకూ ఉపయోగం ఉంటుందన్నారు. గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. టిడ్కో గృహ సముదాయాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వివిధ ప్రతిపాదనలను పరిశీలించాలన్నారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దీవాన్, టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ జి లక్ష్మీశా, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు, మైన్స్,æ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. జగనన్న కాలనీల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణం ప్రగతిపై అధికారులు వివరాలు అందించారు. ఇప్పటివరకూ 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ కామెంట్స్.. ►కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలి ►విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలి ►డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలి ►కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించాలి ►సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారు ► పేదవాళ్ల కడుపు కొట్టడానికి అందరూ ఏకం అవుతున్నారు ►పేదలకు ఇళ్లు రాకూడదన్నది వారి ఆలోచన ►గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి ►దీనికోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలి -
Fact Check: ఏపీలో రోజుకు 2,000 ఇళ్ల నిర్మాణాలు.. రామోజీ బురద వార్తలు
సాక్షి, అమరావతి: ఒకేసారి 30 లక్షల మందికిపైగా మహిళలకు ఇళ్ల పట్టాలను అందించడం దేశ చరిత్రలోనే ఓ రికార్డు కాగా అడ్డంకులను అధిగమిస్తూ పేదల గృహ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సాకారం చేస్తోంది. పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో ఏపీ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. అత్యధికంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (12.85 లక్షలు), గుజరాత్ (8.78 లక్షలు), మహారాష్ట్ర (8.10 లక్షలు) ఉండగా ఏపీలో 7.93 లక్షలు పూర్తైనట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ గణాంకాల్లోనే స్పష్టంగా ఉంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా సీఎం జగన్ చేస్తున్న గృహ యజ్ఞంపై కేంద్ర మంత్రులు సైతం పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మాత్రం అట్టడుగున ఉందంటూ యథావిధిగా వక్రీకరణ కథనాలను ప్రచురించారు. దేశంలోనే అత్యధిక ఇళ్లు పేదలకు పక్కా గృహాల కల్పనలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 30.6 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన 71,811.49 ఎకరాల భూమిని వైఎస్ జగన్ ప్రభుత్వం పంపిణీ చేసింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా పారదర్శకంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో ఏపీలో అత్యధిక ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. మంజూరైన ఇళ్ల పనులను మొదలు పెట్టడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన వనరులను వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పించడం, లబ్ధిదారులకు సబ్సిడీపై నిర్మాణ సామాగ్రి సరఫరా చేయడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంది. పేదల ఇళ్ల నిర్మాణాల పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న చిత్తశుద్ధిని చూసి ఇటీవలే సీఆర్డీఏ పరిధిలో 47వేల ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ అనుమతులు ఇచ్చింది. కుట్రలను అధిగమించి నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కోర్టులను ఆశ్రయించి న్యాయ వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. ఈ అవరోధాలను అధిగమించి 2020 డిసెంబర్లో 30.6 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించే సమయంలో కోవిడ్ రెండో విడత ప్రారంభం అయింది. దీంతో కొన్ని నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. 2021 జూలైలో మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించి తొలి దశలో 15.6 లక్షల గృహ నిర్మాణాలను ప్రారంభించారు. నిర్మాణాలు చురుగ్గా సాగుతున్న సమయంలో మరోమారు టీడీపీ కోర్టుల్లో కేసులు వేయడంతో కొద్ది నెలలు పనులు నిలిచిపోయాయి. విశాఖ, సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీని కూడా కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నించారు. విశాఖ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో గత ఏడాది ఏప్రిల్ నెలలో 1.24 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి నిర్మాణాలు ప్రారంభించారు. రోజుకు రెండు వేలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి. నిత్యం రెండు వేల ఇళ్లకు తగ్గకుండా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. పనుల్లో వేగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదలకు ఉచితంగా స్థలాలను పంపిణీ చేయడంతో పాటు యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందచేస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇస్తున్నారు. దీంతోపాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందించడంతో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తున్నారు. -
అమరావతిలో ఆప్షన్ 3 ఆవాసాలే!
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. సీఆర్డీఏ పరిధిలో మొత్తం 25 లేఅవుట్లలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన 22,125 మంది లబ్దిదారులు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 22,976 మంది ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంపిక చేసుకున్నారు. మొత్తం లబ్దిదారుల్లో 88.79 శాతం మంది ఆప్షన్–3కి మొగ్గు చూపారు. వైఎస్సార్ జయంతి రోజు శంకుస్థాపన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మే 26వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా శంకుస్థాపన తేదీని కూడా సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం జోరందుకోనుంది. ఉచితంగా ఇసుక.. రాయితీపై 14 రకాల సామగ్రి విలువైన ఇళ్ల స్థలాలను ఉచితంగా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి కూడా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో యూనిట్‌కు బిల్లుల రూపంలో రూ.1.80 లక్షలు, పావలా వడ్డీకి రూ.35 వేలు బ్యాంకు రుణంగా సమకూరుస్తూ రూ.2.15 లక్షలు చొప్పున అందిస్తోంది. దీనికి అదనంగా ఉచితంగా ఇసుకతోపాటు సబ్సిడీపై స్టీల్, సిమెంట్ లాంటి 14 రకాల నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. వీటి విలువ రూ.54,518 వరకు ఉంటుంది. ఇదే తరహాలో సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం అండగా నిలవనుంది. అక్కచెల్లెమ్మలకు విలువైన స్థిరాస్తి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 31 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. రెండు విడతల్లో 21.25 లక్షల ఇళ్ల (సాధారణ ఇళ్లు 18.63 లక్షలు + టిడ్కో ఇళ్లు 2.62 లక్షల ఇళ్లు) నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సాధారణ ఇళ్లలో సుమారు నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇళ్ల పథకం ద్వారా ఒక్కో పేదింటి మహిళకు సగటున రూ.15 లక్షల స్థిరాస్తిని సమకూర్చడం ద్వారా మొత్తం రూ. 3 వేల కోట్ల మేర సంపదను ప్రభుత్వం సృష్టిస్తోంది. కొనసాగుతున్న లబ్దిదారుల ట్యాగింగ్.. సీఆర్డీఏ పరిధిలో మెజారిటీ లబ్దిదారులు ఆప్షన్–3 ఎంచుకున్నారు. లబ్ధిదారులను గ్రూపులుగా చేసి ట్యాగ్ చేసే పనులు రెండు జిల్లాల్లో కొనసాగుతున్నాయి. 47 వేల ఇళ్లకు సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంసీ) అనుమతులు వచ్చాయి. మిగిలిన ఇళ్లకు కూడా అనుమతులు వస్తాయి. గృహ నిర్మాణాలకు జూలై 8న శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – అజయ్‌జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
త్వరితగతిన సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగానే నిర్మాణాలు మొదలు పెట్టాలన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేదలకు ఎంత త్వరగా పక్కా ఇళ్లను సమకూరిస్తే వారి జీవితాలు అంత త్వరగా బాగు పడతాయన్నారు. సీఆర్డీఏ పరిదిలో పేదలకు పంపిణీ చేస్తున్న స్థలాల్లో వేగంగా పనులు చేపట్టాలని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం గత 45 రోజుల్లో రూ.1,085 కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పటికే 3.69 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రూఫ్ లెవల్, ఆపై దశలో ఉన్న ఇళ్ల త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. మరో 8.64 లక్షల ఇళ్లు బేస్మెంట్ ఆపై దశల్లో ఉన్నాయన్నారు. వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గత సమీక్షలో సీఎం జారీ చేసిన ఆదేశాలను అమలు చేశామని తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం’ స్పెషల్ ఆఫీసర్లను కూడా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో నియమించి, ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామని వివరించారు. బ్యాంకుల నుంచి త్వరితగతిన రుణాలు ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఇలా ఇప్పటి వరకూ 11.03 లక్షల మందికి పావలా వడ్డీతో రూ.35 వేల చొప్పున రుణాలిప్పించామని.. రూ.3,886.76 కోట్ల మేర రుణాలు మంజూరు అయ్యాయని తెలిపారు. సీఆర్డీఏలో ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, భూమి చదును చేసే పనులు చేశామన్నారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మాణం పూర్తయిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ జైన్, శ్రీలక్ష్మి, విజయానంద్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మిషా, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పేదల ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గృహనిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు. గడచిన 45 రోజుల్లో హౌసింగ్ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామన్న అధికారులు. ఇప్పటివరకూ 3.70 లక్షల ఇల్లు పూర్తి. రూఫ్ లెవల్.. ఆపైన నిర్మాణంలో ఉన్నవి 5.01లక్షల ఇళ్లు. త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించిన అధికారులు. మరో 45 రోజుల్లో వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. బేస్మెంట్ లెవల్ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64లక్షలుపైనే. వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్న అధికారులు. సీఎం ఆదేశాలమేరకు జగనన్నకు చెబుదాం స్పెషల్ ఆఫీసర్లు కూడా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారని వెల్లడించిన అధికారులు. సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణంలో వాడే మెటీరియల్ నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామన్న అధికారులు. సీఎం ఆదేశాలమేరకే ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం. ఇప్పటివరకూ 11.03 లక్షలమందికి రూ. 35 వేల చొప్పున రుణాలు. రూ. 3886.76 కోట్లమేర పావలా వడ్డీకే రుణాలు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే... సీఆర్డీయే ప్రాంతంలో పేదల ఇళ్లనిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం.... వేగంగా నిర్మాణ పనులును ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలన్న సీఎం. ఇళ్లులేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. పేదలకు ఎంత త్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయన్న సీఎం. సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్న అధికారులు. ల్యాండ్ లెవలింగ్ పనులు చేశామన్న అధికారులు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం ఆదేశం. 5024 టిడ్కో ఇళ్లను అందించనున్న ప్రభుత్వం. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏ ఎండీ ఇంతియాజ్, ఏపి టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ లక్ష్మీషా, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! -
పేదల ఇళ్ల నిర్మాణాలకు.. రోజువారీ లక్ష్యాలు
సాక్షి, అమరావతి : పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తిచేసేందుకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సగటున రూ.43 కోట్ల విలువ చేసే పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లెక్కన 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.15,810 కోట్లు ఖర్చుచేయనుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించే యజ్ఞాన్ని ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిడ్కోతో కలిపి ఇప్పటికే రెండు విడతల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులివ్వగా 20.28 ఇళ్లకు శంకుస్థాపనలు జరిగి వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లలో ఇప్పటికే 3.40 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. లక్ష్య సాధనలో భాగంగా... ప్రస్తుతం రోజుకు సగటున రూ.25 కోట్ల నుంచి రూ.28 కోట్ల పనులు చేస్తున్నారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు రూ.43 కోట్ల మేర పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బిల్లుల చెల్లింపుల్లో కాలయాపన లేకుండా చూస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.730 కోట్ల మేర గృహ నిర్మాణ సంస్థ బిల్లు చెల్లింపులు చేపట్టింది. మరోవైపు.. శనివారాన్ని హౌసింగ్ డేగా నిర్వహిస్తున్నారు. ఆ రోజు జిల్లా కలెక్టర్లు, మండల, సచివాలయాల స్థాయి అధికారులు లేఅవుట్లను సందర్శించి పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఇలా ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ ఏడు హౌసింగ్ డేలు నిర్వహించారు. అధికారులు 306 లేఅవుట్లను సందర్శించారు. ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఇందులో హౌసింగ్ డే రోజున లేఅవుట్లకు వెళ్లిన అధికారులు తనిఖీల తాలూకు ఫొటోలను అప్లోడ్ చేయడంతో పాటు, తమ దృష్టికి వచ్చిన సమస్యలు, ఇబ్బందులను టోకెన్ రైజ్ చేస్తున్నారు. అంతేకాక.. 11 మంది సీనియర్ అధికారులను ఆయా జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా గృహ నిర్మాణ శాఖ నియమించింది. వీరు ప్రతినెలా తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లి ఇళ్ల పథకం అమలు, తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. గత ఏడాది రోజూ రూ.28 కోట్ల ఖర్చు గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సగటున రూ.28 కోట్ల చొప్పున పేదల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం ఖర్చుచేసింది. పేదలకు ఖరీదైన ప్రాంతాల్లో ఉచితంగా స్థలాలిచ్చిన ప్రభుత్వం, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. దీంతోపాటు పావలా వడ్డీకి బ్యాంకు రుణం రూపంలో రూ.35 వేలు అందిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు.. సిమెంట్, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందిస్తున్నారు. ఇలా 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణ పథకం కోసం ప్రభుత్వం రూ.10,203 కోట్లు ఖర్చుచేసింది. జిల్లాలకు రోజువారీ లక్ష్యాలు ఇళ్ల నిర్మాణాల వేగాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా రోజువారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నాం. ఎక్కడైనా పనులు మందగమనంలో ఉంటే అక్కడ పర్యటించి సమీక్షించి పనులు జోరందుకునేలా చేస్తున్నాం. ప్రస్తుతం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఐదు లక్షల ఇళ్లను పూర్తిచేయనున్నాం. – లక్ష్మీశా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ -
ఆత్మ గౌరవంతో ‘లక్ష’ణంగా..!
సాక్షి, అమరావతి: పట్టణ పేదలు ఆత్మ గౌరవంతో సగర్వంగా జీవించేలా తీర్చిదిద్దిన టిడ్కో ఇళ్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మొదటి విడతగా ఇప్పటికే 48,416 టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రెండో దఫాలో మరో 40 వేలకు పైగా యూనిట్లను పట్టణ పేదలకు అందచేసేందుకు సిద్ధమైంది. జూన్ నాటికి మొత్తం లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందించారు. దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో భారంగా గడిపిన బడుగు జీవులు అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన టిడ్కో గృహాలకు యజమానులుగా మారుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కావలి నుంచి మొదలయ్యే టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ జూన్ చివరి వరకు కొనసాగనుంది. కావలి మున్సిపాలిటీలో అన్ని వసతులతో పూర్తి చేసిన 2,112 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నెల 29వతేదీన శ్రీకాకుళంలో 1,280 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్లు సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్ల టిడ్కో ఇళ్ల పంపిణీ మే నెల మొదటి వారంలో మొదలు కానుంది. మే రెండో వారంలో పొన్నూరు, గుంటూరు యూఎల్బీలోని వెంగళాయపాలెం, అడవి తక్కెళ్లపాడుతోపాటు ఆళ్లగడ్డ, డోన్, విశాఖపట్నం, గుడివాడ, మచిలీపట్నం, పిఠాపురం, యలమంచిలి, కందుకూరు యూఎల్బీల్లో ఇళ్లను అందజేయనున్నారు. గుడివాడలో భారీ స్థాయిలో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని యోచిస్తున్నారు. అనకాపల్లి యూఎల్బీలో.. అనకాపల్లి యూఎల్బీలో జూన్ మొదటి వారంలో టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నారు. సత్యనారాయణపురం(అనకాపల్లి)లో 3,256 యూనిట్లు, చిత్తూరులో 2,832, పుంగనూరులో 1,536, నరసరావుపేటలో 1,504 యూనిట్లను లబ్ధిదారులకు అందచేస్తారు. రిజిస్ట్రేషన్లు సైతం ఉచితంగానే.. మున్సిపాలిటీల పరిధిలో నివసించే నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలకు అనువుగా జీ+3 అంతస్తుల్లో 300, 365, 430 చ.అడుగుల్లో టిడ్కో ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తోంది. లబ్ధిదారులపై ఏమాత్రం భారం పడకుండా వారి పేరిట ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈమేరకు నివాస ప్రాంగణాల్లో అన్ని వసతులు కల్పించిన అనంతరం లబ్ధిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కు పత్రాలు, ఇంటి తాళాలను అధికారులు అందజేస్తున్నారు. ఈ దఫాలో 17 ప్రాంతాల్లో మొత్తం 40,728 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 88 యూఎల్బీల్లో 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 24 ప్రాంతాల్లో నూరు శాతం ఇళ్ల పంపిణీ పూర్తైంది. కావలి, పాత్రునివలస (శ్రీకాకుళం)లో కూడా శుక్ర, శనివారాల్లో నూరు శాతం పంపిణీ పూర్తవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. పేదల ఆత్మ గౌరవాన్ని పెంచారు రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లంటూ లేని నిరుపేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 21.25 లక్షల గృహాలను నిర్మిస్తున్నారు. ఈ స్థాయిలో ఇళ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరు. ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తూ పేదల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా హౌసింగ్ విధానాలపై ఇటీవల కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ నిర్వహించిన సర్వేలో అంధ్రప్రదేశ్‌లోని టిడ్కో హౌసింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇది సీఎం జగన్ చొరవ వల్లే సాధ్యమైంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు జూన్ నాటికి లక్ష టిడ్కో ఇళ్లు ఇస్తాం. శుక్రవారం నుంచి మలి విడతగా 40,728 ఇళ్లు పంపిణీ చేయనున్నాం. – జమ్మాన ప్రసన్న కుమార్, టిడ్కో చైర్మన్ -
టిడ్కో ఇళ్లపై విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో పథకాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన టీడీపీ.. ప్రస్తుతం ఆ పథకంపై చేస్తున్న అసత్య, విష, దుష్ప్రచారం అంతా ఇంతా కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తి చేసి, చక్కటి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో టిడ్కో ఇళ్ల రూపంలో 2.62 లక్షల మంది పట్టణ ప్రాంత పేద, మధ్య తరగతి లబ్ధిదారులకు ఏకంగా రూ.21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న మేలును వివరిస్తూ ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలన్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన గృహ నిర్మాణ శాఖ, టిడ్కోపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన పనుల గురించి, వెచ్చించిన సొమ్ము గురించి విశదీకరించారు. ఇళ్ల ఖర్చు చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే అధికం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.10,203 కోట్లు ఖర్చు చేశామని గృహ నిర్మాణ శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ఈ లెక్కన రోజుకు రూ.28 కోట్ల మేర ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.43 కోట్ల చొప్పున రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే అధికమని తెలియజేశారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇంత బడ్జెట్ లేదన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదే నిదర్శనమని చెప్పారు. ఇప్పటి వరకు 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయని, స్లాబ్ పూర్తి అయిన, స్లాబ్‌కు సిద్ధంగా ఉన్న ఇళ్లు మరో 4,67,551 ఉన్నాయన్నారు. కొద్ది రోజుల్లో ఈ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటుక, సిమెంటు, స్టీలు, ఇతర సామగ్రికి నాణ్యత పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 4,529 పరీక్షలు చేశామని, 2 శాతం మేర లోపాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. నాణ్యతలో రాజీపడొద్దు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని సీఎం వైఎస్ జగన్ మరోసారి అధికారులకు స్పష్టం చేశారు. వైఎస్సార్, జగనన్న కాలనీల్లో నిర్మాణం పూర్తయిన ఇళ్లకు వెనువెంటనే కరెంటు, నీరు సహా ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి ఇంటికీ సోక్పిట్స్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా భవిష్యత్తులో వాన నీరు భూమిలోకి ఇంకిపోయేలా చేయొచ్చని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం ► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి: రూ.56,102.91 కోట్లు ► కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం: రూ.36,026 కోట్లు (ఇందులో తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు, శాశ్వత సదుపాయాలకు : రూ.32,909 కోట్లు) ► శాశ్వత సదుపాయాల్లో నీటి సరఫరా: రూ.4,128 కోట్లు ► విద్యుత్, ఇంటర్నెట్: రూ.7,989 కోట్లు ► డ్రైనేజీ, సీవరేజ్: రూ.7,227 కోట్లు ► రోడ్లు, ఆర్చ్‌లు : రూ.10,251 కోట్లు ► పట్టణ ప్రాంత లేఅవుట్లలో వసతుల కల్పన: రూ.3,314 కోట్లు ► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీలు: రూ.13,758 కోట్లు -
టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు రూ. 21 వేల కోట్లు లబ్ధి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. మంత్రి జోగి రమేష్, సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్‌పై పెట్టిన ఖర్చును వివరించిన అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేయనున్న ఖర్చు వివరాలను వివరించిన అధికారులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.10,203 కోట్ల రూపాయలు ఖర్చు రోజుకు రూ.28 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం రోజుకు రూ.43 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయం హౌసింగ్‌పై ఏపీ చేస్తున్న ఖర్చు కొన్ని చిన్న రాష్ట్రాల బడెట్ కన్నా అధికమని వివరించిన అధికారులు ఇప్పటివరకూ 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయన్న అధికారులు శ్లాబ్ పూర్తి చేసుకున్నవి, శ్లాబుకు సిద్ధంచేసినవి.. 4,67,551 ఇళ్లు ఉన్నాయన్న అధికారులు. ఇవి కొన్నిరోజుల్లో పూర్తవుతాయన్న అధికారులు ఇళ్ల నిర్మాణం జరుగుతున్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్ష కరెంటు, తాగునీరు సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్న అధికారులు జగనన్న కాలనీల్లో డ్రైనేజీ టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష.. సీఎం జగన్ ఏమన్నారంటే.. టిడ్కో ఇళ్ల మీద జరుగుతున్న అసత్య ప్రచారం, విష ప్రచారం అంతా ఇంత కాదు వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి తమ ప్రభుత్వ హాయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ పూర్తిగా విస్మరించింది. తమ హయాంలో టీడీపీ ఒక్క లబ్ధిదారునికి కూడా ఇళ్లు ఇవ్వలేకపోయింది మన ప్రభుత్వ హయాంలో వాటిని పూర్తి చేస్తూ... మంచి మౌలిక సదుపాయాలుతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నాం టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు రూ.21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూర్చాం ఈ వాస్తవాలను ప్రజలముందు ఉంచాలి -
రోజుకు 2,000 ఇళ్లు పూర్తి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ మధ్య 27,895 ఇళ్లు నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. అదే విధంగా 1,19,493 స్టేజ్ కన్వర్షన్లు (ఇంటి నిర్మాణం ఒక దశ నుంచి మరో దశకు వెళ్లడం) నమోదయ్యాయి. ఈ లెక్కన రోజుకు సగటున 1,860 ఇళ్ల నిర్మాణం పూర్తవుతుండగా, 7,966 స్టేజ్ కన్వర్షన్లు అవుతున్నాయి. ఈ నిర్మాణాలను మరింత వేగంగా చేపట్టడంపై గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. దీంతో ప్రస్తుతం రోజుకు రెండు వేల ఇళ్ల వరకూ నిర్మాణం పూర్తవుతున్నాయి. వీటిని మరింత వేగవంతం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 11 మంది సీనియర్ అధికారులను జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించింది. వీరు వారంలో రెండు రోజులపాటు ఆయా జిల్లాల్లోని లేఅవుట్లలో పర్యటించి నిర్మాణ పనులను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ యజ్ఞాన్ని రాష్ట్రంలో చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులివ్వగా 17.22 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు. ఇవి ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. డిసెంబర్ నుంచి పుంజుకున్న నిర్మాణాలు గత ఏడాది రాష్ట్రంలో భారీగా వర్షాలు, గోదావరి వరదలు ఇళ్ల నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపాయి. పలు జిల్లాల్లో లేఅవుట్లలో నిర్మాణ మెటీరియల్ తరలించడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డిసెంబర్ నుంచి నిర్మాణాలు పుంజుకున్నాయి. డిసెంబర్ 1 నుంచి 15 మధ్య 83,166 స్టేజ్ కన్వర్షన్లు, 12,296 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేవి. ఇలా క్రమంగా పెరుగుతూ ఫిబ్రవరి 1–15 తేదీల నాటికి 1.19 లక్షల స్టేజ్ కన్వర్షన్లు, 27వేలకు పైగా నిర్మాణాలు పూర్తయ్యే స్థాయికి పనుల వేగం పెరిగింది. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యం నిర్దేశించుకుంది. ఇప్పటికే 2,74,210 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది రూ.7,630 కోట్ల ఖర్చు పేదల ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7,630 కోట్లు ఖర్చుచేసింది. ఇందులో రూ.5,325 కోట్లు లబ్ధిదారులకు చెల్లింపులు కాగా.. సబ్సిడీపై 7.45 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరాకు రూ.373 కోట్లు, 94,242 టన్నుల స్టీల్ సరఫరాకు రూ.673 కోట్లు.. ఇసుక, ఇతర నిర్మాణ సామాగ్రి అందించడానికి రూ.620 కోట్ల మేర ఖర్చయింది. ఇక ఈ పథకం కింద ఇళ్లులేని పేదలకు ఉచితంగా రూ.లక్షలు ఖరీదుచేసే స్థలాన్ని ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. అదనపు సాయం కింద పావలా వడ్డీకి రూ.35వేల చొప్పున బ్యాంకు రుణ సాయం అందిస్తున్నారు. దీంతో పాటు ఉచితంగా ఇసుక, సబ్సీడీపై స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రి సరఫరా చేస్తున్నారు. మొత్తంగా పథకం ద్వారా పేదలకు ప్రభుత్వం రూ.1.05 లక్షల కోట్ల మేర మేలు చేస్తోంది. 631 లేఅవుట్ల సందర్శన ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే శనివారాన్ని హౌసింగ్ డేగా నిర్వహిస్తున్నాం. గడిచిన నాలుగు శనివారాల్లో 631 లేఅవుట్లను జిల్లా, మండల, గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి అధికారులు, సిబ్బంది సందర్శించి అక్కడి సమస్యలను మా దృష్టికి తెస్తున్నారు. వాటిని జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించడానికి ప్రత్యేక నిధిని కేటాయించాం. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ -
నాణ్యతలో రాజీవద్దు
పేదలందరికీ ఇళ్లు పథకానికి మనందరి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన అనంతరం వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలి. ఈ మేరకు భవిష్యత్ ప్రణాళిక ఉండాలి. కోర్టు కేసుల కారణంగా పలువురు లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని నిర్ణయించాం. ఈ క్రమంలో భూసేకరణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సొంత ఇల్లు అనేది పేదల చిరకాల స్వప్నం అని, ఈ క్రమంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల్లో ఏ చిన్న లోపానికి కూడా తావు ఇవ్వద్దని గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. లే అవుట్లలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ, ప్రతి పేద కుటుంబానికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. వర్షాలు పూర్తిగా తగ్గి, వాతావరణం అనుకూలిస్తుండటంతో గత డిసెంబర్ నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలిపారు. నిర్మాణంలో నాణ్యత లోపించకుండా తీసుకున్న చర్యలను వివరించారు. నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు మెటల్ నాణ్యతపై 285 పరీక్షలు.. సిమెంటుపై 34, స్టీలుపై 84, ఇటుకలపై 95 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయిన 15 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు వివరించారు. కోర్టు కేసుల కారణంగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని రెండు లేఅవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామన్నారు. సుమారు 30 వేల మందికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం జనవరి ఆఖరు నాటికి రూ.7,630 కోట్లు ఖర్చు చేశామన్నారు. మొత్తంగా ఈ పథకం మొదలు పెట్టినప్పటి నుంచి రూ.13,780 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 2.75 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, మరో 74 వేల ఇళ్లకు స్లాబ్ వేసే పనులు కొనసాగుతున్నాయని, ఇంకో 79 వేల ఇళ్లు రూఫ్ లెవెల్లో ఉన్నాయన్నారు. మార్చి నాటికి సుమారు 5 లక్షల ఇళ్లు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు కరెంట్, నీటి కనెక్షన్లు వెంటనే ఇవ్వాలని, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది.. లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రభుత్వం చేయని విధంగా సాయం ► పేదల సొంతింటి కలను సాకారం చేయడం కోసం చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనం చర్యలు తీసుకున్నాం. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల’ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ఖర్చును ఓసారి పరిశీలిస్తే.. ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక పంపిణీ, తక్కువ ఖరీదుకే సామగ్రిని అందించడం రూపంలో ప్రభుత్వం రూ.13,780 కోట్లు ఖర్చు చేసింది. ► ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,117 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్, జగనన్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు తదితర సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు వెచ్చిస్తున్నాం. అంటే కేవలం జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసమే రూ.36,026 కోట్ల మేర ఖర్చు చేస్తున్నాం. ► పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రూ.17,132.78 కోట్ల విలువ చేసే 28,554.64 ఎకరాల ప్రభుత్వ భూములు తీసుకున్నాం. రూ.15,364.5 కోట్ల విలువ చేసే 25,374.66 ఎకరాల భూములను కొనుగోలు చేశాం. విశాఖలో పేదలకు పంపిణీ చేసిన భూముల విలువ రూ.12,405 కోట్లు. ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన ఇతర భూములు 13,425.14 ఎకరాలు. వీటి విలువ రూ.11,200.62 కోట్లు. ఇలా మొత్తంగా అన్ని రకాలుగా ఇళ్ల పట్టాల కోసం పేదలకు పంచిన భూములు 71,811.49 ఎకరాలు కాగా, వీటి విలువ రూ.56,102.91 కోట్లు. ఇలా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కోసం మన ప్రభుత్వం రూ.1,05,908.91 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. గణనీయమైన సహాయం ► మరోవైపు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మన ప్రభుత్వం గణనీయమైన సహాయం చేస్తోంది. గత మూడున్నరేళ్లలో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, 300 చదరపు అడుగుల ఇళ్లు ఉచితంగా అందించడం, మిగిలిన కేటగిరీల లబ్ధిదారులకు తమవంతుగా చెల్లించిన వాటిపై సబ్సిడీ ఇవ్వడంతో పాటు, ఉచితంగా రిజిస్ట్రేషన్ల రూపంలో అండగా నిలిచాం. ► టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.8,015 కోట్లు. మన ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాల విలువ చూస్తే మొత్తంగా రూ.20,755 కోట్లు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ఖర్చు, మౌలిక సదుపాయాల కోసం ఈ మూడున్నరేళ్లలో రూ.8,734 కోట్లు ఖర్చు పెట్టాం. దీంతో పాటు 300 చదరపు అడుగుల ఇళ్లను ఉచితంగా ఇవ్వడం ద్వారా దాదాపు రూ.10,339 కోట్ల లబ్ధి చేకూర్చాం. 300 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు తమ వంతుగా చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేసి వారికి ఎంతో ఉపశమనం కలిగించాం. ► మిగిలిన వారికీ ఊరట కల్పించే చర్యల్లో భాగంగా 365, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు తమ వంతుగా చెల్లించాల్సిన డబ్బులో కల్పించిన సబ్సిడీ కారణంగా రూ.482 కోట్ల మేర మేలు చేకూర్చాం. రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా తొలగించి ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా మరో రూ.1,200 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ► ఈ సమీక్షలో గృహ నిర్మాణ, మున్సిపల్ శాఖ మంత్రులు జోగి రమేశ్, ఆదిమూలపు సురేశ్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదిన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీషా, జేఎండీ శివప్రసాద్, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్ పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాలు ఉండకూడదు: సీఎం జగన్
-
గృహనిర్మాణశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష