
సాక్షి, విజయవాడ : గత ఐదేళ్ల టీడీపీ పాలనలో టీడీపీ నేతలు ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడి పేదల పొట్టకొట్టారని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదలవాళ్ల సంక్షేమ పథకాల్లో అక్రమాలకు పాల్పడి మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రులు ఇప్పుడు నీతి వ్యాఖ్యలు బోధిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో చదరపు అడుగు ఇంటిస్థలానికి రూ.1100 అయితే. 2300గా వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 25 లక్షల ఇళ్లు కట్టిస్తే... వాటిని కూడా టీడీపీ నేతలు తమ ఖాతాల్లో వేసుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో కేవలం ఏడు లక్షల ఇళ్లు మాత్రమే కట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
టెక్నాలజీ పేరు చెప్పి దోచేశారు..
‘టెక్నాలజీ పేరు చెప్పి.. ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టు అధిక ధరలకు అప్పచెప్పారు. దోచుకోవడానికే టెక్నాలజీ పేరు చెప్పుకుని పేదలను మోసం చేశారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా ఆర్భాటపు ప్రచారం చేశారు. మాజీ మంత్రి నారాయణ చదరపు అడుగు రూ.1600 కాంట్రాక్టు ఇచ్చామని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో చదరపు అడుగు రూ.1200 నుంచి 1300 కే ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఇక్కడ మాత్రం టీడీపీనేతలు పేదొళ్లను దోచుకున్నారు. పైసా తీసుకోకుండా పేదవాడికి ఉచితంగా ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. పేదలపై జగన్‌కు ఉన్న ప్రేమ, ఆదరణకు ఇదే నిదర్శనం. ప్రతి ఇంటి నిర్మాణంలో టీడీపీ హయాంలో చదరపు అడుగుకు వెయ్యి రూపాయల అవినీతి జరిగింది. దోచుకున్న సొమ్ము టీడీపీ నేతలు తిరిగి ప్రజలకు చెల్లించాలి. మీ దోపిడీని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతాం. ఈ అంశంపై చర్చించేందుకు మాజీమంత్రి నారాయణ ముందుకు రావాలి. ఎటువంటి విచారణకు చేసైనా డబ్బులు రికవరీ చేస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపడతాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment