ఒక్క పాఠశాలా మూయలేదు | Minister Botsa during the question and answer session | Sakshi
Sakshi News home page

ఒక్క పాఠశాలా మూయలేదు

Published Thu, Mar 16 2023 4:28 AM | Last Updated on Thu, Mar 16 2023 3:16 PM

Minister Botsa during the question and answer session - Sakshi

సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూయలేదు. పైగా టీడీపీ హయాంలో మూతపడిన 5 వేల స్కూళ్లలో 3 వేలు తిరిగి ప్రారంభించాం. రాష్ట్రంలో ఒక్క పాఠశాలనైనా మూసివేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ‘విద్యా రంగంలో 14వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని  మూడో స్థానానికి తీసుకొచ్చాం. మీరు ఆరోపిస్తున్నట్టుగా 27వ స్థానంలో ఉందని నిరూపిస్తే ఇదే సభలో నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అని సవాల్‌ విసిరారు.

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు వీరాంజనేయులు, సాంబశివరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ.. ‘సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి 15 రోజులకోసారి విద్యా రంగంపై సమీక్ష చేసిన సీఎంను నేను ఎప్పుడూ చూడలేదు. విద్యా రంగం అభివృద్ధి పట్ల ఆయనకున్న తపనకు ఇది నిదర్శనం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో 102 శాతం నమోదవుతోంది.

2018–19లో స్కూళ్లలో 70.43 లక్షల మంది పిల్లలుండగా, వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో 37 లక్షల మంది, ఎయిడెడ్‌ సంస్థల్లో 2.08 లక్షల మంది, ప్రైవేటు పాఠశాలల్లో 31.14 లక్షల మంది ఉన్నారు. అదే 2022–23లో 70.18 లక్షల మంది పాఠశాలలకు వెళ్తుంటే, వారిలో ప్రభుత్వ స్కూళ్లలో 39.70 లక్షల మంది, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1.09 లక్షల మంది, ప్రైవేటులో 29.39 లక్షల మంది చదువుతున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగినట్టా? తగ్గినట్టా? మీరే చెప్పాలి. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను తీసుకొస్తున్నాం. 5,419 పోస్టులు అప్‌గ్రేడ్‌ చేశాం.

ప్రైవేటు స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. విద్యార్థులకు 5 లక్షల ట్యాబ్‌లు ఉచితంగా ఇచ్చాం. హైసూ్కళ్లు అన్నింటినీ సీబీఎస్‌ఈ స్కూల్స్‌గా మారుస్తున్నాం. మీ పిల్లలు కాన్వెంట్‌కు వెళ్లి చదువుకోవాలి. పేదవాడి పిల్లలకు మాత్రం సబ్జెక్టు టీచర్లు అక్కర్లేదనడం సరికాదు. మీ నియోజకవర్గాల్లో ఏ ఊళ్లో అయినా ఒక్క ప్రభుత్వ పాఠశాలయినా మూసేశారేమో చెప్పండి చూద్దాం’ అని మంత్రి బొత్స సవాల్‌ విసిరారు. దీనికి టీడీపీ సభ్యులు మారు మాట్లాడలేక మిన్నకుండిపోయారు. 

సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత మీకు లేదు : మంత్రి అంబటి రాంబాబు 
‘సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక అర్హత వైఎస్‌ వారసుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తప్ప టీడీపీ నేతలకు లేదు. టీడీపీ వారు ఎస్టిమేట్లు పెంచి ఇష్టానుసారం దోచుకున్నారు. జలయజ్ఞం కింద వైఎస్‌ తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం’ అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.

సభలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ‘బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు రెండో దశ ఫేజ్‌ 2లో 90 శాతం, సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టు 83 శాతం, గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌ 43 శాతం, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ 38 శాతం, వంశధార–నాగావళి నదుల అనుసంధానం 70  శాతం, తారకరామ తీర్థ సాగర్‌ రిజర్వాయర్‌ 41 శాతం, గొర్రెల శ్రీరాములనాయుడు మడ్డువలస రిజర్వాయర్‌ రెండో దశ 79 శాతం, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జంఝావతి రిజర్వాయర్‌ 76 శాతం పూర్తి చేశాం.

హిరమండలం రిజర్వాయర్‌ గొట్టా బ్యారేజ్‌ కుడి ప్రధాన  కాల్వకు ఎత్తిపోతల పథకాన్ని కొత్తగా ప్రారంభించాం. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టుల కోసం 2019 నుంచి ఇప్పటివరకు రూ.543.25 కోట్లు ఖర్చు చేశాం. వీటిని డిసెంబర్‌ 2023 కల్లా పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం’ అని మంత్రి అంబటి వివరించారు. 

ఉద్యమంలా ప్రకృతి వ్యవసాయం : మంత్రి కాకాణి 
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా తీసుకెళ్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో సభ్యులు చింతల రామచంద్రారెడ్డి, అబ్బయ్య చౌదరి లేవెనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ‘తక్కువ పెట్టుబడితో నేలలను పునరుజ్జీవింపజేస్తూ నీటి సంరక్షణ, జీవ వైవిధ్యానికి దోహదపడేలా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలో 8 లక్షల మంది ప్రకృతి సాగు చేస్తున్నారు.

రైతులకు ఇన్‌పుట్స్, ఉపకరణాలు ఆర్బీకే స్థాయిలోనే ఇస్తున్నాం. టీటీడీకి మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.175 కోట్ల విలువైన 12 రకాల ప్రకృతి ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాం. మహిళా సంఘాల ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నాం. ప్రకృతి ఉత్పత్తులకు బ్రాండింగ్‌ కలి్పస్తున్నాం. 25 వేల మందికి సర్టిఫికేషన్‌ ఇస్తున్నాం, పంటల మారి్పడి ద్వారా 2019 నుంచి ఇప్పటివరకు 2.85 లక్షల ఎకరాల్లో వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలను సాగులోకి తీసుకొచ్చాం. 2022–23 రబీలో బోర్ల కింద 37,500 ఎకరాలు పంట మార్పిడి చేశాం’ అని మంత్రి కాకాణి చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement