ఓటమి భయంతోనే టీడీపీ నాయకుల బురదజల్లుడు
పేదల సంక్షేమానికి వ్యతిరేకి చంద్రబాబు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స
సాక్షి ప్రతినిధి, విజయనగరం: హింసాత్మక ఘటనలకు పాల్పడాలనే పన్నాగంతోనే టీడీపీ నాయకులు అధికారులను బదిలీ చేయించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన శుక్రవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీకి భారీగా ఓట్లు వేసే బడుగు, బలహీన వర్గాలున్న ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు ప్రేరేపించడం ద్వారా పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు కుట్రపన్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలన్నీ ఎస్పీలు బదిలీ అయిన ప్రాంతాల్లోనే జరగడం నిజం కాదా? అని ప్రశి్నంచారు.
తొమ్మిదిచోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగితే.. వాటి విషయం టీడీపీ నాయకులు మాట్లాడటంలేదని చెప్పారు. అవి ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లే పనులు తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ పడదన్నారు. పేదల సంక్షేమానికి ఆయన వ్యతిరేకి అని విమర్శించారు. ధనవంతులు, బలిసినవారే చంద్రబాబుకు కావాలన్నారు. అందుకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి సంక్షేమ పథకాలను అందనీయకుండా ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాశారని గుర్తుచేశారు. పింఛన్ల పంపిణీని అడ్డుకుని 32 మంది వృద్ధుల మరణానికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేయూత, ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యాదీవెన ఇవ్వొద్దని కూడా లేఖ రాశారని గుర్తుచేశారు. వ్యవసాయం శుద్ధదండగ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ చెప్పే విదేశాలకు వెళ్లారని తెలిపారు. మరి కూటమి నాయకులు ఎక్కడికెళ్లారో ఎందుకు తెలియజేయలేదని ప్రశి్నంచారు. తమ పాలన చూసి ఓటు వెయ్యమని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. రాష్ట్రంలో 175కి 175 స్థానాల్లోను విజయం తమదేనని పూర్తి విశ్వాసంతో చెబుతున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment