విజన్‌ లేని బాబు.. పారిపోయేందుకు పవన్‌ సిద్ధం.. కోతికి కొబ్బరిచిప్పలా షర్మిల | Ambati Rambabu Comments On YSRCP Siddham Meeting Success | Sakshi
Sakshi News home page

విజన్‌ లేని బాబు.. పారిపోయేందుకు పవన్‌ సిద్ధం.. కోతికి కొబ్బరిచిప్పలా షర్మిల

Published Tue, Jan 30 2024 5:26 PM | Last Updated on Mon, Feb 5 2024 1:51 PM

Ambati Rambabu Comments On YSRCP Siddham Meeting Success - Sakshi

సాక్షి, తాడేపల్లి: భీమిలిలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించిందని మంత్రి అంబటి రాంబాబు అ‍న్నారు. తొలిసభ విజయం పార్టీ క్యాడర్‌కు మరింత నూతనోత్తేజం ఇచ్చిందని అన్నారు. అంబటి రాంబాబు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శలు, సెటైర్లు వేశారు.

నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పాలనను సీఎం జగన్‌ చెబుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలోని వైఫల్యాలను కూడా సీఎం జగన్‌ వివరించారు. సీఎం జగన్‌ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు కూడా సభలు నిర్వహిస్తున్నా ప్రజాస్పందన లేకుండా పోయింది. తాను ఇది చేశానని చెప్పుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరు. చంద్రబాబు పరిపాలన అంతా ఆయన వర్గం కోసమే. అయినా ప్రజల్ని మభ్యపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.  ​

.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేసిన మేలును సీఎం జగన్‌ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబుకు తనకు ఏం విజన్‌ ఉందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో పట్టుబడి చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారు. తాను తప్పు చేయలేదని మాత్రం ఆయన చెప్పలేకపోతున్నారు. ఆరోగ్యం బాగాలేదన్న కారణంతోనే బెయిల్‌ తెచ్చుకున్నారు.

చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే నాకు ముక్కుతాడు వేస్తాడట. అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదు. ఆంబోతులకు ఆవుల్ని సరఫరా చేసిన చరిత్ర చంద్రబాబుది.  చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఆయనకంటూ ఓ మంచి విజన్‌ లేదు. ఆయనకున్న విజన్‌.. అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు. మేనిఫెస్టో పేరుతో మోసం చేసిన ఘనత ఆయనది. అసలు మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేసి.. దాన్ని లేకుండా చేయడమే ఆయన విజన్‌. చంద్రబాబుకి ఉంది విజన్‌ కాదు.. ఆయన ఒళ్లంతా విషమే. 

పవన్‌ కల్యాణ్‌ సిద్ధం అంటున్నారు... దేనికి సిద్ధం? . చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా?. చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా? ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా? అని అంబటి ప్రశ్నించారు. 

కన్నా లక్ష్మీనారాయణ తనపై రాళ్ల దాడికి నేనే కారణం అని అంటున్నారు. ఆ అవసరం నాకు లేదు. సింపథీ కోసమే ఆయన అలా చేస్తున్నారు. బాబు, కన్నా నన్ను టార్గెట్‌ చేశారు. అయినా నేను భయపడను. 

కోతికి కొబ్బరి చిప్పలా కాంగ్రెస్‌ పార్టీకి షర్మిల దొరికింది. ఎన్నికల్లో ఓడిపోయాక ఆమె తెలంగాణకు తిరిగి వెళ్లడం ఖాయం అని అంబటి అన్నారు. 

ఏపీలో ఇల్లు లేని వాళ్లకు కూడా హడావిడి చేస్తున్నారని.. ఎన్నికలయ్యాక వీరంతా హైదరాబాద్‌కు వెళ్లిపోతారని అంబటి స్పష్టం చేశారు. 

పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్‌ విజన్‌. కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం జగన్‌ సిద్ధంగా ఉ‍న్నారు. ప్రజలకు జరిగిన మంచి.. రాష్ట్రాభివృద్ధి.. సంక్షేమ పథకాలే వైఎస్‌ జగన్‌కు తిరుగులేని విజయాన్ని అందిస్తాయి. అభిమన్యుడిలా ప్రతిపక్షాలు పన్నిన పద్మ వ్యూహాన్ని ఛేదించి  వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం అవుతారని అంబటి ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

చేసిందేమిటో చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది:

  • జరగబోతున్న ఎన్నికలకు సర్వసన్నద్ధం అయ్యి మొన్న భీమిలిలో సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాం. 
  • ఆ సభ కనీవినీ ఎరుగని రీతిలో అశేష ప్రజానీకం పాల్గొని మరింత నూతనోత్సాహాన్ని ఇచ్చారు. 
  • ప్రత్యర్థి రాజకీయ వర్గాల గుండెల్లో దడ పుట్టించేలా పెద్ద ఎత్తున ఈ సభ జరిగింది. 
  • ఆ సభలో జగన్‌ గారు అనేక విషయాలను మాట్లాడారు.
  • వైఎస్సార్సీపీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎంతటి చక్కని పరిపాలన ఇచ్చారో చెప్పారు. 
  • దానితో పాటు చంద్రబాబు పరిపాలన విధానాలను ప్రజలకు వివరిస్తూ ఆయన్ను సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. 
  • మేం ఇన్ని కార్యక్రమాలు చేశాం..జగన్మోహన్‌ రెడ్డి, వైఎస్సార్సీపీ మార్క్‌ను వేశాం..మీరు ఏ గ్రామమైనా వెళ్లి నడిబొడ్డున నిలబడి ఈ గ్రామానికి ఇది చేశాను అని చెప్పగలరా అని అడిగారు. 
  • చంద్రబాబు కూడా సభలు పెడుతున్నారు కానీ జగన్‌ గారు సూటిగా అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకుండా తప్పుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. 
  •  సుధీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తి కూడా నేను ఇది చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదంటే..అది ప్రజా సంక్షేమం కోసం జరిగిన పరిపాలన కాదని అర్ధమవుతోంది. 
  • కేవలం తన వర్గాన్ని, తన తాబేదార్లు, పెత్తందార్ల కోసం మాత్రమే ఆయన పరిపాలన చేశాడు. 
  • సమాధానం చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసం, బాలయ్య సినిమాలో డైలాగులు చెప్పుకుంటూ పోతున్నాడు. 

అందితే జుట్టు..అందకపోతే కాళ్లు..అదే చంద్రబాబు విజన్‌:

  • జగన్‌ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తాను అధికారంలోకి వచ్చాక రాజకీయంగా, ఆర్థికంగా బలపడేలా చేశానని చెప్పారు. 
  • సుమారు రూ.2.53 లక్షల కోట్లు నేరుగా వారి వారి ఖాతాలకు అందించానని చెప్పారు. 
  • మీరు పద్నాగేళ్లలో ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం చేశారా అంటే మాత్రం మాట్లాడడు. 
  • కానీ నాకో విజన్‌ ఉంది అని చంద్రబాబు, ఆయన పత్రికలు మాత్రం డప్పు కొట్టుకుంటున్నారు. 
  • చంద్రబాబు 53 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో జైళ్లో ఉన్నాడు. కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్షాధారాలతో న్యాయస్థానాలు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపాయి. 
  • ఆ 53 రోజులు చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదంటూ ఆయన, ఆయన పత్రికలు చెప్పుకొచ్చాయి. 
  • ఆయన వళ్లంతా భయంకరమైన పరిస్థితి వచ్చింది..ఆయనకు గుండె జబ్బు ఉంది..ఆయనకు ప్రాణాపాయం ఉందంటూ ఎల్లో మీడియా రాసుకొచ్చారు. 
  • బయటకు వచ్చారు..ఇప్పుడు ఆయనకు ప్రాణాపాయం ఉందా? 
  • లోపలుంటే ఏడుపులు పెడబొబ్బలు..బయటకు వస్తే అరుపులు కేకలు పెట్టడమే ఆయన విజన్‌. 
  • చంద్రబాబు విజన్‌ ఏంటంటే అందితే జుట్టు..అందకపోతే కాళ్లు..అదే చంద్రబాబు విజన్‌. 
  • ఇలాంటి విజన్‌ చేసిన చంద్రబాబుకు మరో విజన్‌ కూడా ఉంది. ఎన్నికలకు ముందు దస్తాలకు దస్తాలు మేనిఫెస్టో విడుదల చేసే విజన్‌ కూడా ఉంది. 
  • లేనిపోనివన్నీ చెప్తాడు..దానిలో పొందుపరుస్తాడు..అసాధ్యమైనవి కూడా చేస్తానంటాడు. 
  • రైతులకు రుణమాఫీ చేస్తానంటాడు..డ్వాక్రా మహిళల రుణమాఫీ చేసేస్తా..కాపులకు కోట్లకు కోట్లు ఇస్తా..కాపులను బీసీల్లో చేర్చేస్తా అని చెప్పే విజన్‌ బాబుది. 
  • ఎన్నికలయ్యాక గెలిస్తే ఆ మేనిఫెస్టోని మాయం చేసేస్తాడు..వెబ్‌సైట్‌లో నుంచి తీసేయడమే ఆయన విజన్‌. 

చంద్రబాబు శరీరంలో అణువణువూ విషమే:

  • నాది విజన్‌..జగన్‌ది పాయిజన్‌ అంటాడు. జగన్‌ గారి విజన్‌..పాయిజన్‌ అయితే రూ.2.53 లక్షల కోట్లు బటన్‌ నొక్కి పేద ప్రజలకు ఇస్తే విషం ఎలా అవుతుంది చంద్రబాబూ..? 
  • నువ్వు విషం..నీ ఆలోచనలు విషం..నీ శరీరంలో ప్రతి అణువణువూ విషమే. 
  • ఈ దేశ రాజకీయాల్లో చంద్రబాబు అంతటి విషపూరిత రాజకీయ వేత్త ఎవరూ లేరు. 
  • అరికాలి నుంచి తల వరకూ విషంతో నిండిపోయిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు. 
  • అత్యంత విషపూరితమైన నల్లత్రాచును తీసుకొచ్చి చంద్రబాబు ముందు పెడితే..ఆయన అలా చూస్తే చాలు అది విషం కక్కుకుని చావకపోతే నన్ను అడగండి. 
  • అంత విషపూరితమైన మనిషి చంద్రబాబు...నేడు జగన్‌ గారిని పాయిజన్‌ అంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. 
  • ఇవే చంద్రబాబుకు చివరి ఎన్నికలు..ఆ విషయం ఆయనే చెప్పుకున్నాడు. 
  • ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే నాకు ఎన్నికలు లేవు..అసెంబ్లీకి రాను అన్నాడు. 
  • అది ఖాయమైంది..అందుకే ఏ విధంగానైనా అబద్ధాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్‌ గారిపై విషం చిమ్మి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. 
  • ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలి అనే ఆత్మస్థైర్యం లేని వ్యక్తిగా చంద్రబాబు నిలిచాడు. 

మీరంతా తట్టాబుట్టా సర్ధుకుని హైదరాబాద్‌ వెళ్లడానికి సిద్ధం:

  • జగన్‌ గారు బీమిలిలో సిద్ధం అన్నారు...మా 175 మంది అభ్యర్థులు సిద్ధం అన్నారు..
  • మేం సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే చంద్రబాబు రెస్పాండ్‌ కాలేదు కానీ పవన్‌ కల్యాణ్‌ మేము కూడా సిద్ధం అంటున్నాడు. 
  • మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే ప్రకటించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న మీరు ఇక దేనికి సిద్ధం..? 
  • పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ నిలబడతాడో తెలియదు..చంద్రబాబు ఒకచోటా..రెండు చోట్ల నిలబడతాడో తెలియదు. 
  • ఒకదానికి మాత్రం వీళ్లంతా సిద్ధం..ఎన్నికల తర్వాత తట్టాబుట్టా సర్ధుకుని హైదరాబాద్‌ నివాసానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. 
  • చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేశ్‌లకు ఎలాగూ ఇక్కడ ఇళ్లు కూడా లేవు కాబట్టి లారీకి సరుకెత్తుకుని సర్ధుకోడానికి సిద్ధంగా ఉన్నారు. 
  • పవన్‌ కల్యాణ్‌ మీరు దేనికి సిద్ధం..? చంద్రబాబు, లోకేష్‌లను భుజానేసుకుని మోయడానికి సిద్ధమా? 
  • ప్యాకేజీ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా?..ఓ కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారు దేనికి మీరు సిద్ధం..? 
  • ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాడానికి సిద్ధమా..? 
  • జగన్‌ గారు సిద్ధం అన్నారు కాబట్టి మేమూ అనాలని అనడం తప్ప వేరేది లేదు. 
  • మీకు సిద్ధం ఎక్కడుంది..పెద్ద అయోమయంలో ఉన్నారు. 
  • మీరు ఓడిపోతారని భయంతో ప్రయాణం చేస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. 

 జగన్‌ గారు అర్జునుడిలా వైఎస్సార్సీపీ జెండా మళ్లీ ఎగురవేయబోతున్నారు

  • చంద్రబాబు, ఆయన సైన్యం జగన్‌ గారిపై బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన్ను ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. 
  • మీది కౌరవ సైన్యం..జగన్‌ గారు అర్జునుడిలా కురుక్షేత్ర యుద్ధంలో గెలవబోతున్నారు.  
  • అభిమన్యుడు కాదు..ఎంత సైన్యం వచ్చినా పద్మవ్యూహాన్ని కూడా జయించి ఏపీలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నారు. 
  • ఐదేళ్లు చిత్తశుద్ధితో పరిపాలన చేశారు..చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారు. 
  • ప్రతి వాగ్ధానాన్ని అమలు చేశారు. మేనిఫెస్టోలోని ప్రతి ఒక్క అంశాన్ని అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్‌ గారు. 
  • మేనిఫెస్టోని దగా చేసి తగలేసిన దౌర్భాగ్యులు మీరు..
  • ప్రజలందరికీ ఇవన్నీ తెలుసు. జగన్‌ గారి లాంటి ఒక గొప్ప నాయకుడిని పోగొట్టుకోడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 
  • తిరిగి ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసి సంక్షేమ రాజ్యాన్ని తెచ్చుకోడానికి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 
  • జగన్‌ గారు రూ.2.53 లక్షల కోట్లు బటన్ నొక్కి సిద్ధంగా ఉన్నారు..ఫ్యాన్‌ గుర్తుకు రెండో సారి బటన్ నొక్కేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. 
  • మధ్యలో మీరు మాత్రం దిష్టిబొమ్మల్లా నిలబడి ఉన్నారు. మీరు త్వరలోనే ప్యాకేజీ తీసుకుని ప్యాకప్‌ కావడానికి సిద్ధంగా ఉన్నారు. 

 రాళ్లు వేయించి, దాడులు చేయించే సంస్కృతి నా చరిత్రలో లేదు:

  • నా ప్రత్యర్థి టీడీపీ తరఫున పోటీకి సిద్ధం అవుతున్న కన్నా లక్ష్మీనారాయణ తొండపి గ్రామం వెళ్తే అక్కడ పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. 
  • రాళ్లు నేనే వేయించానని, ఆయనపై హత్యాయత్నం చేయించానని నా పై బురదజల్లే ప్రయత్నం చేశారు. 
  • ప్రత్యర్థులపై రాళ్లు వేయించడం, దాడులు చేయించడం నా చరిత్రలో లేదు..ఉండదు కూడా. 
  • రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొనే సత్తా ఉన్న రాజకీయ పార్టీలో జగన్‌ నాయకత్వంలో నేనున్నాను. 
  • ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించే సందర్భం నా జీవితంలో లేదు..
  • నన్ను టార్గెట్‌ చేసి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కన్నాపై దాడి చేశారని చెప్పించి సింపతీ పొందాలని చూస్తున్నారు. 
  • అంబోతు రాంబాబు రాళ్లేయించాడు...అంటూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ముక్కుతాడు వేస్తాను అంటున్నాడు. 
  • నువ్వు అధికారంలో వచ్చేది లేదు..సచ్చేది లేదు..
  • నీ వాళ్లకే నువ్వు ముక్కుతాళ్లు వేయలేదు. నీ చరిత్ర ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే నువ్వు ముక్కుతాడు వేస్తావా? 
  • మేం మళ్లీ అధికారంలోకి వస్తాం..నువ్వు ఎక్కడున్నా పట్టుకుని నీ చేతిపై ‘ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే రాజకీయవేత్త’ అని పచ్చబొట్టు వేయిస్తా. 
  • మాట్లాడితే ఆంబోతు అంటున్నావ్‌...పనికిమాలిన, నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి నువ్వే. 
  • నన్ను గిల్లాడు..నేనూ గిల్లుతున్నాను..ఆయన ముక్కుతాడు వేయగలిగితే..నేను పచ్చబొట్టు వేయించలేనా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement