లోకేష్‌ అసత్య ప్రచారం.. జగన్‌ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది: అంబటి రాంబాబు | Ex Minister Ambati Rambabu Key Comments On YS Jagan Security, Check Out The Details Inside | Sakshi
Sakshi News home page

లోకేష్‌ అసత్య ప్రచారం.. జగన్‌ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది: అంబటి రాంబాబు

Published Wed, Aug 7 2024 4:34 PM | Last Updated on Wed, Aug 7 2024 7:56 PM

Ex Minister Ambati Rambabu Key Comments On YS Jagan Security

సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిగత భద్రతపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, ఆయనపై చేస్తున్న ప్రచారం గర్హనీయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయనకు ఏదైనా అనుకోనిది జరిగితే, అందుకు కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ఆయన తేల్చి చెప్పారు.

కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత భద్రతపై టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడమే కాకుండా, మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసే నాటికి ఉన్న భద్రతను కొనసాగించాలంటూ వైఎస్‌ జగన్‌ హైకోర్టును ఆశ్రయిస్తే.. దానిపైనా  మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ట్వీట్‌ చేస్తున్నారని గుర్తు చేశారు.  

వైఎస్‌ జగన్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించామని, అయితే గతంలో తనకు ఉన్న 986 మంది భద్రతా సిబ్బంది కావాలని ఆయన కోరుతున్నారని సీఎం చంద్రబాబుతో పాటు, హోం మంత్రి కూడా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. గతంలో జగన్‌కు 986 మందితో భద్రత ఉందని, టీడీపీ కరపత్రంగా ఉన్న ఎల్లో మీడియాలో చెప్పడం.. దాన్నే చంద్రబాబు మొదలు మంత్రులంతా ప్రస్తావిస్తూ.. పచ్చి అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.
    
నిజానికి వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు సెక్యూరిటీగా ఉన్నది కేవలం 139 మంది మాత్రమే. అయినా అప్పుడు జగన్‌గారు మొత్తం 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణంగా ప్రచారం చేస్తోందని చెప్పారు. ఒక అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు అదే నిజమని అనుకోవాలనేది వారి ఉద్దేశంగా ఉందని అన్నారు. ఇప్పుడు ఆయన సీఎం కాకపోయినా, వైఎస్‌ జగన్‌ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని.. తాను నెల్లూరు, పులివెందుల, వినుకొండ, విజయవాడ.. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆయన్ను చూడటానికి, కలవడానికి కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ముందుకు తోసుకొస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్ధితుల్లో వైఎస్‌ జగన్‌కు ఏ స్థాయిలో సెక్యూరిటీ ఉండాలనేది ఆలోచించాలని కోరారు.

సీఎంగా వైఎస్‌ జగన్‌ రాజీనామా చేయగానే ఎస్‌ఆర్‌సీ రిపోర్ట్‌ రాకుండానే సెక్యూరిటీని విత్‌డ్రా చేశారని, ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీని తీసేశారని, ఆ ఇంటికి వెళ్లే రూట్లలో ఉన్న చెక్‌పోస్టులు, పోలీస్‌ ఔట్‌పోస్టులను కూడా ఎత్తేశారని గుర్తు చేశారు. అంతే కాకుండా, ఇల్లు, క్యాంప్‌ ఆఫీస్‌ ఉన్న రోడ్‌ను మొత్తం ఓపెన్‌ చేసి, అందరినీ అనుమతించారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీల కార్యకర్తలు కొందరిని జగన్‌ ఇంటి గేటు వద్దకు పంపించి, గొడవలు చేయించారని, వాటన్నింటినీ తమ అనుకూల మీడియాలో విపరీతంగా ప్రచారం చేసి, ఆయనను అప్రతిష్టపాల్జేసే ప్రయత్నం చేశారని ప్రస్తావించారు. ఇంకా ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న నాయకుడు, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాట్లాడుతూ.. ‘జగన్‌ చనిపోలేదు. ఓడిపోయాడు అంతే. ఆయన చనిపోతే తప్ప ఆ పార్టీ నాశనం కాదు’.. అని వ్యాఖ్యానించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఇవన్నీ చూసిన తర్వాతే తాము జగన్‌గారి భద్రత కోపం హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. 

మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ను ప్రస్తావించిన అంబటి రాంబాబు.. ‘చంద్రబాబు కుమారుడివి నువ్వు. మంత్రివర్గ సభ్యుడివి. ఇంకా అబద్దాలు ఎందుకు చెబుతున్నారు?. లోకేష్‌ గారు మీకు బుర్ర ఇంకా వికసించలేదనిపిస్తుంది. జగన్‌గారి కాన్వాయ్‌లో ల్యాండ్‌ క్రూజర్లు ఉన్నాయా?. మాకు ఎక్కడా కనిపించడం లేదే!. బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు అంటున్నావు!. కానీ ఇచ్చింది ఒకటి. అది లోపభూయిష్టమైంది. అది షెడ్‌లో ఉన్న కారు. నేను కూడా జగన్‌ తో కలిసి అందులో ప్రయాణించాను. వినుకొండ వెళ్ళేటప్పడు తాడేపల్లి దాటగానే ఏసీ పని చేయలేదు. వర్షం పడుతోంది. అద్దాలు మంచుతో ఉంటే దారి కనిపించక దిగి ప్రైవేట్‌ వాహనంలో వెళ్ళారు. ఈరోజు కోర్టులో మీ న్యాయవాదే ఆ కారు బాగాలేదని ఒప్పుకున్నది వాస్తవం కాదా?. అలాంటప్పుడు ఎందుకు అంత పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు?’.

‘పది మంది సాయుధ గార్డులతో భద్రత అంటున్నారు. ఆయన వెంట ఉంటున్నది ఇద్దరే. పది మంది కాదు. గార్డులు ఇంటి చుట్టూ ఉంటారు. కానీ ఆయన వెంట వెళ్ళేది ఇద్దరే గార్డులు. మీకు మాత్రం చాలా మంది కావాలి. మరి జగన్‌గారికి వద్దా?. చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన బ్లాస్ట్‌లో సేవ్‌ అయ్యారు. అప్పుడు సెక్యూరిటీ తెచ్చుకున్నారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదే?. 2004లో చంద్రబాబు ఓటమి పాలైన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగా, రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యారు. అయినా ఎవరూ చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించమని కోరలేదు. అది అప్పటి నుంచి అలాగే కొనసాగుతోంది. అదే ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీని అడ్డు పెట్టుకుని, అంగళ్లలో చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా పోలీసులపైనే దాడి చేయించారు. దాంతో ఒక కానిస్టేబుల్‌ కన్ను కూడా పోయింది.అసలు మీ భద్రత ఎప్పుడైనా తగ్గించారా?. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కరకట్టపై ఎంత సెక్యురిటీ ఉంది. ఎన్ని సెక్యూరిటీ పోస్ట్‌లు ఉన్నాయి. గుర్తు చేసుకొండి. కానీ ఇప్పుడు మాత్రం జగన్‌ సెక్యూరిటీ తొలగించి ఏదో ఒకటి చేయాలని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రజా సంకల్పయాత్ర జరుగుతున్నప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో జగన్‌పై హత్యాయత్నం జరిగితే, దాన్ని కోడి కత్తి అని వ్యంగ్యంగా మాట్లాడారని, తర్వాత సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ ఎన్నికల ప్రచారంలో రాయి విసిరి దాడి చేస్తే, దాన్ని కూడా గులకరాయి అంటూ గో బెల్‌ ప్రచారం చేశారని గుర్తు చేశారు.
    
వైఎస్‌ జగన్‌కు ఉన్న సెక్యూరిటీని ఎస్‌ఆర్‌సీ నిర్ణయం లేకుండా మార్చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన, నారా లోకేష్‌కు ఎంత సెక్యూరిటీ ఉందో చూడాలంటూ.. లోకేష్‌ మంత్రిగా, ఎమ్మెల్యేగా కాకుండా చంద్రబాబు కుమారుడిగా ఉన్న సమయంలో పెద్ద సంఖ్యతో కూడిన సెక్యూరిటీతో ఉన్న ఫోటో చూపించారు. రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలన్న అంబటి రాంబాబు, ఎవరూ, ఎక్కడా శాశ్వతం కాదని.. ఎప్పుడు ఏదైనా జరగొచ్చని, బండ్లు ఓడలు అవుతాయని, ఓడలు బండ్లు అవుతాయని గుర్తు చేశారు. అందుకే తప్పుడు ప్రచారం చేసి జగన్‌ను పలుచన చేయాలని ప్రయత్నించవద్దని తేల్చి చెప్పారు.

వైఎస్‌ జగన్‌ గురించి నేను ఈ మధ్య ఒక మాట విన్నాను. ఒక పత్రిక కోర్‌ కమిటీ సమావేశంలో జగన్‌ సెక్యూరిటీ తగ్గించాలి. ఆయన ఉంటే టీడీపీ బతకదు.. అని అన్నారని మాకు సమాచారం అందింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. జామర్స్‌ విషయంలో కూడా కోర్టులో ప్రభుత్వం ఒకలా చెప్పింది. చంద్రబాబు ఇల్లు ఉన్న హైదరాబాద్‌లో ఆయన వీధిలో ఇప్పటికీ ఎవరినీ అనుమతించరు. చివరకు చంద్రబాబు మనవడు దేవాన్ష్‌కు కూడా ఆరుగురు గన్‌మ్యాన్‌లు ఉండచ్చు కానీ.. జగన్‌ డొక్కు బుల్లెట్‌ప్రూఫ్‌ కారు ఇస్తారా? అని నిలదీశారు. లోకేష్‌ నువ్వు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నావు. రెండు ల్యాండ్‌ క్రూజర్‌లు ఎక్కడున్నాయో చెప్పండి?. మీకు మాత్రం అంత మంది సెక్యూరిటీ కావాలి, మాజీ సీఎం విషయంలో మాత్రం అబద్దపు ప్రచారం చేస్తున్నారు’ అని చురకలంటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement