సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో పథకాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన టీడీపీ.. ప్రస్తుతం ఆ పథకంపై చేస్తున్న అసత్య, విష, దుష్ప్రచారం అంతా ఇంతా కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తి చేసి, చక్కటి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో టిడ్కో ఇళ్ల రూపంలో 2.62 లక్షల మంది పట్టణ ప్రాంత పేద, మధ్య తరగతి లబ్ధిదారులకు ఏకంగా రూ.21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు.
ఈ క్రమంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న మేలును వివరిస్తూ ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలన్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన గృహ నిర్మాణ శాఖ, టిడ్కోపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన పనుల గురించి, వెచ్చించిన సొమ్ము గురించి విశదీకరించారు.
ఇళ్ల ఖర్చు చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే అధికం
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.10,203 కోట్లు ఖర్చు చేశామని గృహ నిర్మాణ శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ఈ లెక్కన రోజుకు రూ.28 కోట్ల మేర ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.43 కోట్ల చొప్పున రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే అధికమని తెలియజేశారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇంత బడ్జెట్ లేదన్నారు.
పేదలందరికీ ఇళ్లు పథకానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదే నిదర్శనమని చెప్పారు. ఇప్పటి వరకు 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయని, స్లాబ్ పూర్తి అయిన, స్లాబ్‌కు సిద్ధంగా ఉన్న ఇళ్లు మరో 4,67,551 ఉన్నాయన్నారు. కొద్ది రోజుల్లో ఈ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటుక, సిమెంటు, స్టీలు, ఇతర సామగ్రికి నాణ్యత పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 4,529 పరీక్షలు చేశామని, 2 శాతం మేర లోపాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.
నాణ్యతలో రాజీపడొద్దు
నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని సీఎం వైఎస్ జగన్ మరోసారి అధికారులకు స్పష్టం చేశారు. వైఎస్సార్, జగనన్న కాలనీల్లో నిర్మాణం పూర్తయిన ఇళ్లకు వెనువెంటనే కరెంటు, నీరు సహా ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి ఇంటికీ సోక్‌పిట్స్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా భవిష్యత్తులో వాన నీరు భూమిలోకి ఇంకిపోయేలా చేయొచ్చని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం
► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి: రూ.56,102.91 కోట్లు
► కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం: రూ.36,026 కోట్లు (ఇందులో తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు, శాశ్వత సదుపాయాలకు : రూ.32,909 కోట్లు)
► శాశ్వత సదుపాయాల్లో నీటి సరఫరా: రూ.4,128 కోట్లు
► విద్యుత్, ఇంటర్నెట్: రూ.7,989 కోట్లు
► డ్రైనేజీ, సీవరేజ్: రూ.7,227 కోట్లు
► రోడ్లు, ఆర్చ్‌లు : రూ.10,251 కోట్లు
► పట్టణ ప్రాంత లేఅవుట్‌లలో వసతుల కల్పన: రూ.3,314 కోట్లు
► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీలు: రూ.13,758 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment