సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిరుపేద అక్కచెల్లెమ్మల ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేసిన బ్యాంకు రుణాలకు సంబంధించి వడ్డీ డబ్బుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎంవైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇళ్ల లబ్ధిదారులపై భారం పడకుండా అదనపు సాయం కింద పావలా వడ్డీకి రూ.35 వేల చొప్పున బ్యాంకు రుణాలను అందిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మంజూరు చేసిన రుణాలకు సంబంధించి ప్రభుత్వం భరించే వడ్డీ మొత్తాన్ని జమ చేసేందుకు సన్నాహాలు చేయాలని సూచించారు.
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. గృహ నిర్మాణ శాఖపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
ప్రతి ఇంటినీ ఆడిట్ చేయండి
జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17 వేలకు పైగా ఊళ్లనే కొత్తగా నిర్మిస్తున్నాం. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతి ఇంటిని ఆడిట్ చేయాలి. అందులో భాగంగా విద్యుత్, తాగునీరు కనెక్షన్లు ఇచ్చారా? ఇంకుడు గుంత ఉందా? తదితర అంశాలను పరిశీలించాలి. ఇంటి నిర్మాణంలో పేదలపై భారం పడకూడదు అదనపు సాయం కింద పావలా వడ్డీకి బ్యాంకు రుణాలను మంజూరు చేశాం. మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటి వరకూ మంజూరు చేసిన రుణాలపై వడ్డీ డబ్బుల విడుదలకు సన్నద్ధం కావాలి.
గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఫిబ్రవరికి మరో ఐదు లక్షల ఇళ్లు
నవరత్నాల పథకం కింద 21.25 లక్షల పేదల ఇళ్లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 7.43 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసి పేదింటి అక్కచెల్లెమ్మలకు అందించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు.
గత సమీక్షలో సీఎం నిర్దేశించిన ప్రకారం నిర్మాణాలు పూర్తై లబ్ధిదారులకు అందించిన ఇళ్లకు సంబంధించి మౌలిక సదుపాయాలపై నిశితంగా పరిశీలన చేసినట్లు వివరించారు. విద్యుత్, తాగునీరు సౌకర్యాలను సమకూర్చడంతోపాటు ఇంకుడు గుంతలు, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం అదనపు సాయం కింద 12,72,143 మంది మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున రుణాలను అందించామన్నారు.
ఇలా రూ.4,483 కోట్ల మేర రుణాలను మహిళలు అందుకున్నట్లు సీఎం దృష్టికి తెచ్చారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దీవాన్ మైదీన్, టిడ్కో ఎండీ శ్రీధర్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ
పట్టణ ప్రాంత పేదలకు అందించిన టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థంగా పనిచేసేలా చూడాలి. వారికి తగిన అవగాహన కల్పించి ప్రభుత్వం అందించిన రూ.లక్షల విలువైన ఆస్తిని ఎలా సమర్థంగా నిర్వహించుకోవాలో దిశానిర్దేశం చేయాలి. తద్వారా భవనాలు నాణ్యతగా ఉండటంతోపాటు పరిసరాలు నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షణ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment