పేదలందరికీ ఇళ్లు పథకంతో మురిసిన జనం
టీడీపీ హయాంలో ఒక్క ఇల్లూ ఇవ్వని చంద్రబాబు
హుద్‌హుద్ ఇళ్ల పేరుతో పచ్చ నేతల దోపిడీ పర్వం
పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం అంటే.. కేవలం వారు తలదాచుకోడానికి గూడు కల్పించడమే కాదు.. సమాజంలో సగౌరవంగా తలెత్తుకొని బతికేలా ఆత్మవిశ్వాసాన్ని కల్పించడమే. అందుకే.. సొంత ఇల్లు పేదల ఆత్మ గౌరవానికి సూచిక. మన అక్కచెల్లెమ్మలకు ఒక అన్నగా ఇస్తున్న కానుకే ఈ జగనన్న ఇల్లు’
-ఇదీ.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బడుగుల ఆత్మ గౌరవానికి సౌధాలుగా చెప్పుకునే ఇంటి గురించి చెప్పిన మాటలు.
‘ఒక సెంటు భూమిలో ఇల్లు కట్టిస్తామని జగన్ చెబుతున్నాడు. ఆ సెంటు భూమి బరియల్ గ్రౌండ్‌కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరైనా చనిపోతే అందులో పూడ్చడానికి మాత్రమే ఈ సెంటు భూమిని ఉపయోగించవచ్చు’
-ఇవీ.. 40 ఏళ్లు సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పేదల సౌధాలపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు.
నిజమే సెంటు స్థలంలో ఇల్లు చిన్నదే. కానీ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చంద్రబాబు.. ఎన్ని సెంట్ల స్థలాల్లో నిరుపేదలకు ఇళ్లు కట్టారో ఆయనకే ఎరుక.
సాక్షి, అనకాపల్లి: సొంత ఇల్లు... పేదల ఆత్మగౌరవ సూచిక. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇంటి స్థలం కాగితం చేతికివ్వడం అంటే ఆత్మగౌరవ పతాకాన్ని వారి చేతికిచ్చినట్లే. ఎందరో అభాగ్యుల దుర్భర జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పథకం వెలుగులు నింపుతోంది.
ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో 58,626 మంది మహిళల పేరిట ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మింపజేస్తోంది. ఇదంతా ఉచితమే. పేదల మీద భారం లేకుండా సొంత ఇంటి కలను నిజం చేసే బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారు. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది.
682 లే అవుట్లలో నిర్మాణాలు
అనకాపల్లి జిల్లాలో మొత్తం 682 లేఅవుట్లలో జగనన్న ఇళ్లు నిర్మిస్తున్నారు. 34,431 ఇళ్ల పట్టాలను ఉచితంగా పంపిణీ చేశారు. 24,195 మంది లబ్ధిదారులు తమ సొంత స్థలాల్లో నిర్మాణం చేపడుతున్నారు. అంతేకాకుండా ఒక్కో ఇంటికి రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించింది. 18,738 ఇళ్లు పూర్తవ్వగా.. పురోగతిలో 36,029 ఇళ్లు ఉన్నాయి. పూర్తయిన ఇళ్లకు ఇప్పటివరకూ రూ.445.54 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం కల్పించే మౌలిక వసతుల వ్యయం కలిపితే ఇంటి స్థలం, ఇల్లు ఖరీదు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ కాలనీలు ఊర్లుగా రూపుదిద్దుకుంటున్నాయి.
మెరుగైన జీవితం కోసం..
ఒక పేద కుటుంబం అన్ని సంక్షేమ పథకాలనూ అందుకుంటూ సొంత ఇంట్లో ఉంటే... మెరుగైన జీవితం వారికి తప్పకుండా దక్కుతుంది. ఆయా కుటుంబాల అభ్యున్నతికి బాటలు పడతాయి. దశాబ్దం తిరిగేసరికి... సమాజంలో గణనీయమైన మార్పు కచ్చితంగా కనిపిస్తుంది. అభివృద్ధికి నిర్వచనం... నేటి కంటే రేపు బాగుండటం అని వైఎస్ జగన్ పదేపదే చెబుతుంటారు. దానికి సాక్ష్యంగా ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతున్నాయి.
సమగ్ర సౌకర్యాలతో...
ళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందిస్తోంది. నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీల్‌ను రాయితీపై ఇస్తోంది. ఐఎస్‌ఐ మార్కు ఉన్న నాణ్యమైన సిమెంట్, స్టీల్, ఇతర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువకే అందిస్తోంది. కేవలం ఇళ్లను నిర్మించి ఇవ్వడమే కాకుండా.. పూర్తిస్థాయి సౌకర్యాల్ని ప్రభుత్వం కల్పిస్తోంది. సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు అన్ని కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికీ భూగర్భ కేబుళ్లు వేస్తున్నారు. పేదలకు ‘క్వాలిటీ లైఫ్’ అందించడానికి ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞంలా నిర్మాణాలు సాగుతున్నాయి.
బాబు హయాంలో బేల చూపులే...
14 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడు పేదల గురించి ఆలోచించలేదు. అధికారంలో ఉన్నప్పుడు.. సీఎం స్థాయి నుంచి జన్మభూమి కమిటీ వరకూ దోచుకునేందుకు ఎక్కడ దారి దొరుకుతుందో చూడటమే తప్ప.. పేద ప్రజలకు ఒక గూడు ఇద్దామన్న ఆలోచనే వారికి కనిపించలేదు. 2014లో హుద్‌హుద్ ధాటికి వేల మంది ప్రజలు ఇళ్లు కోల్పోయారు. 2016 ఏప్రిల్ నాటికి బాధితులకు ఇళ్లు అప్పగిస్తామని చెప్పారు. 2019 ఎన్నికలు వచ్చేంత వరకూ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. బాధితుల జాబితా అధికారుల వద్ద ఉన్నా.. దానితో సంబంధం లేకుండా టీడీపీ జన్మభూమి కమిటీలే అర్హుల జాబితాని సిద్ధం చేశాయి. ఇళ్ల కేటాయింపులో 80 శాతం వరకూ టీడీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యమిచ్చారు. ఇతర పార్టీల వారు బాధితుల జాబితాలో ఉన్నా.. వారిని పక్కకు తప్పించారు. ఇలా ఒక్క ఇంటిని కూడా నిరుపేదకు ఇవ్వని చరిత్ర తెలుగుదేశం పార్టీది.
సొంతిల్లు.. చీకూచింతా లేని జీవితం
నా పేరు వారాది కృష్ణవేణి, నేను ఒంటరి మహిళను. అనకాపల్లి మండలంలోని రేబాక గ్రామంలో నా తల్లితో కలిసి ఉండేదాన్ని. నా తల్లి మరణించాక చాలా కాలం నుంచి ఒంటరి బతుకే నాది. గత ప్రభుత్వంలో బతుకు చాలా భారంగా ఉండేది. జగనన్న ప్రభుత్వంలో నా కష్టాలన్నీ తీరాయి. మా ఊరికి చేరువగానే జగనన్న లేఅవుట్ వేశారు. నాకు సొంతిల్లు లేదని తెలుసుకున్న మా వలంటీర్ నా ఆధార్, ఇతర వివరాలతో మా ఊరి సచివాలయంలో దరఖాస్తు పెట్టారు. రోడ్డుకు ఆనుకుని లేఅవుట్‌లో ముందు వరుసలోనే నా పేరున స్థలం మంజూరైంది. వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాను.
సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ వచ్చి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోలు తీసుకునేవారు. నిర్మాణ దశల మేరకు నాలుగు విడతల్లో బి ల్లును నా బ్యాంకు ఖా తాలో జమ చేశారు. ఇసు క, సిమెంట్, ఇనుముతో కలిపి మొత్తం రూ.లక్షా, 80 వేలు లబ్ధి చేకూరింది. దీంతో చాలా వేగంగా నా ఇంటి పనులు పూర్తి చేసుకున్నా. ఇప్పుడు జగనన్న ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న ఇంటిలోనే ధైర్యంగా బతుకుతున్నా. పేదల కోసం ఆలోచించే మనసున్న నాయకుడు జగనన్న. ఈ ప్రభుత్వం నన్ను ఓ ఇంటికి యజమానికి చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీనే ఒంటరి మహిళ పింఛన్ ఇంటికే వచ్చి వలంటీర్ అందిస్తున్నారు. జగనన్న దయతో ఎలాంటి చీకూచింత లేకుండా సంతోషంగా బతుకుతున్నా.
పాకల్లో బతుకులు.. పక్కా ఇంటికి
మాది చోడారం మండలంలోని సాయిపల్లి (చాకిపల్లి). నా పేరు పోలేపల్లి లచ్చిమి. మాది సేనా పేద కుటుంబం. నేను, మా ఆయన అప్పలనాయుడు కూలి పనులకు, సెరువు పనికి ఎల్తాం. రోజూ పనికెల్లకపోతే పూట గడివని బతుకులు మావి. మాకు ఇద్దరు పిల్లలు. మా కష్టం మీదే ఆల్లని పోసించుకోవాల. సొంతంగా నాణ్ణెమైన ఇల్లు లేదు. దీంతో పూరిపాకలోనే ఉంతన్నాం. కూలాడితే గానీ కుండాడని మాలాంటోళ్లం సొంతిల్లు కట్టుకోగలమా. ఎన్ని పెబుత్వాలు మారినా మా బతుకులు పాకల్లోనే గడిసిపోతాయనుకునేటోళ్లం. జగనన్న సీఎం అయ్యాక మాలాంటోళ్ల బతుకుల్లో వెలుగులొచ్చాయి.
మా ఊర్లో సచివాలయం ఆపీసోళ్లు, వలంటీరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మా పేర్లు రాసుకెళ్లారు. ఇల్లు లేనోళ్లకి ఇంటి స్థలాలు ఇచ్చారు. కొన్ని రోజులకి మా ఊరు చివర్లో ఏసిన జగనన్న కోలనీలో మాకూ ఓ స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకోడానికి లచ్చా ఎనబయ్యేల రూపాయలు, సిమెంటు, తలుపులు, కిటికీలు, దారమందాలు, కరెంటు సామాన్లు అన్నీ ఇచ్చారు. దానికితోడు మావు కష్టపడి దాచుకున్న కొంత డబ్బు జతచేసి మా తాహతు మేరకు ఇల్లు కట్టుకున్నాం. జగనన్న దయవల్ల మాకూ సొంతగూడు ఏర్పడింది. ఇపుడు మీరెక్కడుంతన్నారని మా సుట్టాలడిగితే సాయిపల్లి జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకొని ఉంతన్నామని ధైర్నెంగా సెప్తున్నాం. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం.
నెరవేరిన సొంతింటి కల
నా పేరు పోలమూరి సత్యవతి. మాది మునగపాకలోని తిమ్మరాజుపేట. నేను గృహిణిని. నా భర్త బాబూరావు స్థానిక హైస్కూల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం మాది. ఇద్దరు సంతానం. అమ్మాయికి పెళ్లి చేశాం. కొడుకు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మాకు సొంతిల్లు లేదు. ఇరవయ్యేళ్లుగా అద్దె ఇళ్లలోనే ఉంటున్నాం. చాలా సార్లు అద్దె చెల్లించేందుకు మేం పడ్డ కష్టాలు మర్చిపోలేం. గత ప్రభుత్వ హయాంలో సొంతింటి కోసం పనులు మానుకుని తిరగడం తప్ప ఫలితం లేకపోయింది. ఎన్నికల ప్రచారంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట మేరకు వలంటీరే మా ఇంటికొచ్చి, అవసరమైన పత్రాలు తీసుకుని సచివాలయంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేశారు.
వెంటనే నాకు ఇంటి పట్టా మంజూరు చేశారు. అధికారులు స్వయంగా వచ్చి హద్దులతో సహా స్థలం చూపించి, మాకు అప్పగించారు. ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకున్నా. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.లక్షా 80 వేలు సాయం అందించింది. దీనికి తోడు ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాల రూపంలో కలిగిన లబ్ధి, ఇతరుల నుంచి కొంత అప్పు తీసుకుని సొంతింటి కల నెరవేర్చుకున్నాం. సీఎం జగన్ పుణ్యమా అని ఏళ్లనాటి కల నెరవేరింది. మాకంటూ శాశ్వత చిరునామా వచ్చిందంటే జగనన్న చలవే. మాలాంటి పేదోళ్లకు మేలు జరగాలంటే మళ్లీ మళ్లీ జగనే సీఎం కావాలి.
Comments
Please login to add a commentAdd a comment