అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి: వైఎస్‌ జగన్‌ | Atchutapuram SEZ Incident: YS Jagan Slams Chandrababu's Govt | Sakshi
Sakshi News home page

అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి: వైఎస్‌ జగన్‌

Published Fri, Aug 23 2024 12:32 PM | Last Updated on Fri, Aug 23 2024 1:09 PM

Atchutapuram SEZ Incident: YS Jagan Slams Chandrababu's Govt

అనకాపల్లి, సాక్షి: అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘అచ్యుతాపురం ఘటన బాధాకరం. ఈ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదు. ఘటన జరిగింది రాత్రి కాదు పట్టపగలు. అయినా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. హోం మంత్రి పర్యవేక్షణకు వెళుతున్నాను అన్న మాటే లేదు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారు. ఎంత మంది చనిపోయారో తెలియదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకూడదన్న తాపత్రయం కనిపించింది. కలెక్టర్ కమిషనర్ ఎప్పుడు వెళ్లారనేది చాలా బాధ కలిగించే విషయం. ఘటనా స్థలానికి ఆంబులెన్సులు కూడా రాని పరిస్థితి. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారు.

.. ఇలాంటి ఘటనే మా హయాంలో జరిగింది. అదీ కోవిడ్‌ సమయంలో. ఎల్జీ పాలీమర్స్‌ ఘటనలో 24 గంటల్లోపే పరిహారం ఇప్పించాం. కోటి రూపాయల పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదే. అప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన కాసేపటికే కలెక్టర్‌ ఘటనా స్థలానికి వెళ్లారు. నేనే ఉదయం 11 గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లాను. గంట్లలోనే రూ.30 కోట్లు పరిహారం సొమ్ము పంపించాం. గతంలో ఏ ప్రభుత్వం మా ప్రభుత్వంలా స్పందించలేదు. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తోంది. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలి. 

.. పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలి. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇప్పటివరకు ఒక రూపాయి ముట్టలేదు. ఇవ్వాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోండి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులకు పరిహారం ఇవ్వకపోతే నేను వచ్చి స్వయంగా ధర్నా చేస్తాను. బాధితులకు అండగా ఉంటాను.

.. చంద్రబాబు ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయాను. ఇష్యూను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ప్రభుత్వం అనేది బాధ్యతతో వ్యవహరించాలి. పరిశ్రమలపై పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కంపెనీలు సమర్పించే నివేదికలపై థర్డ్‌పార్టీ కంపెనీలు అడిట్‌లు, సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. కానీ, గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మానిటర్‌ చేయడం మానేశారు. సూపర్ పిక్స్ అమల మీద వీరి దృష్టి లేదు. వీళ్ల ధ్యాస అంతా రెడ్‌ బుక్‌ అమలుపైనే. రెడ్‌ బుక్‌ మీద పెట్టిన శ్రద్ధ.. ఇలాంటి వాటి మీద పెట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవికావు. కార్మికులు చనిపోయేవారు కాదు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం దృష్టి పెడుతోంది. 

.. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. ఇంటి వద్దకు వచ్చే పెన్షన్, ఉచిత రేషన్ ఆగిపోయింది. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడం లేదు. పిల్లలకు సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడి కింద ఒక్క రూపాయి సాయం ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారు. స్కూల్స్‌, ఆస్ప్రతులు, పరిశ్రమలు.. అన్ని వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. కొట్టడం, చంపడం ఆస్తుల ధ్వంసం చేయడమే ఈ ప్రభుత్వ పాలనలో కనిపిస్తుంది’’ అని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement