అనకాపల్లి, సాక్షి: అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధితులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. శుక్రవారం ఉదయం అనకాపల్లికి వెళ్లిన ఆయన.. ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు.
బాధితుల వివరాలు, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న జగన్.. వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని వాళ్లకు ధైర్యం చెప్పారు. అలాగే.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఆస్పత్రిలోనే 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
పోలీసుల ఓవరాక్షన్
అంతకు ముందు.. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన అనకాపల్లి వెళ్తుండగా పోలీసులు అతి ప్రదర్శించారు. జగన్ కాన్వాయ్ వెంట వైఎస్సార్‌సీపీ నేతలెవరూ వెళ్లకుండా వాళ్ల వాహనాల్ని అడ్డుకున్నారు.
ఆప్యాయ పలకరింపు
జగన్ రాక సమాచారంతో విశాఖ ఎయిర్‌పోర్టుకు, అనకాపల్లిలోని ఆస్పత్రి వద్దకు భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్లందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఇక ఆస్పత్రిలో సిబ్బందిని పలకరించిన జగన్.. సిబ్బంది కోరడంతో సెల్ఫీలు కూడా దిగారు.
జగన్ ఒత్తిడికి తలొగ్గి..
అచ్యుతాపురం బాధితుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఘటన జరిగిన వెంటనే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. జగన్‌తో పాటు బాధిత కుటుంబాల ఒత్తిడి మేరకు నిన్న సీఎం చంద్రబాబు కోటిరూపాయల పరిహారం ప్రకటన చేశారు. అలాగే బాధితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు రాగా.. విశాఖలోని మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తోంది ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment