సీఎం ప్రోద్బలంతోనే టీడీపీ శ్రేణుల విధ్వంసం: వైఎస్ జగన్
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి
తాజాగా తాడిపత్రి ఘటనే అందుకు నిదర్శనం
ఈ అరాచకాలు, దమనకాండను ప్రజల్లో ఎండగట్టాలి
ప్రతి కార్యకర్తకూ తోడుగా నిలిచి అండగా ఉండాలి
అవసరమైతే కోర్టుల దాకా వెళ్లి న్యాయం జరిగేలా చూడాలి
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులకు దిశానిర్దేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శాంతి భద్రతలపై ఒకవైపు మభ్యపుచ్చే ప్రకటనలు చేస్తూ మరోవైపు దాడులకు పురిగొల్పుతూ అనైతిక పరిపాలన సాగిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘నేరం చేయాలంటే ఎవరైనా సరే భయపడాల్సిందేనన్న చంద్రబాబు అంటూ తాజాగా ఈనాడులో కథనం! మరి అటు చూస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వస్తే టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించాయి.
పార్టీ కార్యకర్త మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగాయి. అంటే ఒకవైపు భయాందోళన ఆయనే (సీఎం చంద్రబాబు) క్రియేట్ చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టే స్టేట్‌మెంట్లు ఇస్తారు. వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లో ప్రచారం చేస్తారు. మరోవైపు ఒక పద్ధతి ప్రకారం దాడులకు తెగబడుతున్నారు. అనంతరం ఏమీ జరగనట్లు అనుకూల మీడియా ద్వారా వారే ప్రచారం చేస్తారు’ అని మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టి టీడీపీ నేతల దమననీతిని బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు.
గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. లీగల్ సెల్ ప్రతినిధులు ప్రతి బాధిత కార్యకర్తకూ అండగా నిలవాలని, అవసరమైతే న్యాయస్థానాల వరకు వెళ్లి వారికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..
మనకు ఓటేయని వారికీ మంచి చేశాం..
ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న దారుణ పరిస్థితులు మీకు తెలియనివి కావు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏరోజూ ఇలాంటివి ప్రోత్సహించలేదు. ఎన్నికలు అయ్యే వరకే రాజకీయాలు.. ఎన్నికలు ముగిశాక మనకు ఓటు వేయని వారు సైతం మనవారే అన్నట్లుగా ప్రతి అడుగు వేశాం. ఏ స్థాయిలో మనం అడుగులు వేశామంటే.. మనకు ఓటు వేయని వారిని కూడా వెతుక్కుంటూ వెళ్లి మరీ ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. ఆ స్థాయిలో మంచి చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఎక్కడా వివక్ష, అవినీతి ఉండకూడదనే ప్రధాన లక్ష్యంతో మన అడుగులు పడ్డాయి.
ఎక్కడికక్కడ రెడ్‌బుక్ రాజ్యాంగం..
ఈ రోజులో ఏ స్థాయిలో శాంతి భద్రతలు దిగజారిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటే.. పైన ఉన్నవారు రెడ్‌బుక్ పట్టుకుంటారు. మరి అందులో మంచి చేసిన వారి పేర్లు రాసి, వారికి మంచి చేసే కార్యక్రమం జరుగుతుందా? అంటే అది కాదు. ఎవరిని తొక్కాలి? ఎవరిని నాశనం చేయాలి? ఎవరి ఆస్తులను ధ్వంసం చేయాలి? ఎవరి మీద కేసులు పెట్టాలి? అనే అంశాలతో రెడ్‌బుక్ తయారు చేసుకుని పైస్థాయిలో ఉన్న వారు అరాచకాలు సృష్టిస్తూ విధ్వంసాలకు పాల్పడుతుంటే కింది స్థాయికి వచ్చేసరికి ఎవరి స్థాయిలో వారు రెడ్‌బుక్‌లు తెరవడం మొదలు పెట్టారు. నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో రెడ్‌బుక్‌లు ఓపెన్ చేసి విధ్వంసాలకు తెగబడుతున్నారు.
మీ చొరవ చాలా అవసరం..
ఇలాంటి పరిస్థితుల్లో మీ (లాయర్ల) అవసరం చాలా ఉంది. ఈరోజు ఏదైనా విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు పోవాలంటే దానికి చొరవ అవసరం. అలా ఎవరో ఒకరు చొరవ చూపకపోతే కోర్టులు కూడా వినే పరిస్థితి ఉండదు. జరుగుతున్న దాడులపై కేసులు పెట్టించడం దగ్గర నుంచి అవి కోర్టుల వరకు వెళ్లడం, వాటిపై వాదనలు వినిపించి న్యాయం చేయడానికి అడుగులు వేస్తే కానీ మనవాళ్లకు మనం న్యాయం అందించలేని పరిస్థితి నెలకొంది. అందుకోసం ఒక పద్ధతి ప్రకారం అడుగులు వేద్దాం.
మన హయాంలోనే లాయర్ల సంక్షేమం..
లాయర్ల సంక్షేమం, తోడ్పాటు చర్యలు వైఎస్సార్‌సీపీ హయాంలోనే జరిగాయి. రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి వారికి తోడుగా ఉన్నాం. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన యువ లాయర్లకు మూడేళ్లపాటు ప్రతి ఆరు నెలలకోసారి రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందచేశాం. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉంటే వారు పేదలకు అండగా ఉంటారన్న దృక్పథంతో అవన్నీ చేశాం.
బాధితులపైనే తిరిగి కేసులు
ఈరోజు ఎక్కడా న్యాయం, ధర్మం కనిపించడం లేదు. పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. అన్యాయం జరిగిందని పోలీసుల దగ్గరకు వెళ్లి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే మనవారిపైనే వారు ఎదురు కేసులు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిదీ డిజిటలైజ్ అయినప్పుడు హార్డ్ డిస్క్‌లు, సర్వర్‌లో వివరాలు ఉంటాయి కదా? అలాంటప్పుడు పేపర్లు కాల్చేయాలని ఎవరనుకుంటారు? పోనీ ఒకవేళ ఎవరైనా ఆ పని చేయాలనుకుంటే రెండు నెలల తరవాత, ఈ ప్రభుత్వంలో, పైగా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్నప్పుడు బుద్ధి ఉన్నవాడు ఎవరైనా చేస్తారా? అంటే ప్రతిదీ వీళ్లే ఏదో చేస్తారు. మళ్లీ దొంగకేసు మన వాళ్ల మీద పెడతారు.
పక్కవాళ్లకు అంటించే కార్యక్రమం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. అటువైపు ఉన్నవాడు మనవాడు కాదనుకుంటే చాలు.. మీరు పోయి ఏదైనా చేసేయండి! పోలీసులు మీకు తోడుగా ఉంటారు! పోలీసులు వాళ్ల మీదే కేసులు పెడతారు! మీకు అన్ని విధాలుగా రక్షణ ఇస్తారంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు అభయహస్తం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment