మనిషి కనీస అవసరాల్లో ఒకటైన గూడును నిరుపేదలకు సమకూర్చడానికి మనం ఆరాట పడుతుంటే, ఈ గృహ యజ్ఞానికి ఆటంకాలు ఏర్పరుస్తూ పేదల కడుపు కొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. పేదలకు ఇళ్లు రాకూడదన్నదే వారి ఆలోచన. ఈ క్రమంలో మన సంకల్పం సడలడానికి వీల్లేదు. న్యాయ పరమైన, ఇతర అడ్డంకులన్నీ అధిగమించడానికి అన్ని చర్యలూ తీసుకోండి. ఏం కావాలన్నా వెనువెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థిర నివాసం లేకుండా ఒక్క పేద కుటుంబం కూడా ఉండటానికి వీల్లేదనే సంకల్పంతో మన ప్రభుత్వం ముందుకు వెళుతోంటే, ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు రానివ్వకుండా నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నాయని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వాటన్నింటినీ అధిగమించి ఇళ్ల నిర్మాణ వేగాన్ని ఇదే రీతిలో కొనసాగించాలని ఆదేశించారు.
గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం పురోగతి గురించి మాట్లాడుతూ.. వైఎస్సార్– జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్న కొద్దీ అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలని చెప్పారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు వెనువెంటనే కరెంటు, నీటి సరఫరా కనెక్షన్‌లు ఇవ్వాలన్నారు. ఒక్క విశాఖపట్నంలోనే 1.24 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, డిసెంబర్‌లోగా ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.
ఇందుకు ఏం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వీలైనంత త్వరగా అక్కడ పేదలకు నివాసం కల్పించాలని ఆదేశించారు. పలు చోట్ల కోర్టు కేసుల కారణంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిపోయిందని, అక్కడ ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టి.. ఈ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని చెప్పారు. కొత్తగా ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించడంపై నిర్ధేశిత కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. వీటన్నింటినీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వచ్చే నెలలో 5 లక్షల ఇళ్లు పూర్తి
వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పేదల ఇళ్ల నిర్మాణం పూర్తవుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఇప్పటి వరకు 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. రూఫ్ లెవల్, ఆపై స్థాయి నిర్మాణంలో 5,68,517, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి పేదల గృహ నిర్మాణాల కోసం రూ.2,201 కోట్లు ఖర్చు చేశామన్నారు.
సీఆర్‌డీఏలో పేదల ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలను కూడా సీఎంకు వివరించారు. 45,101 మంది లబ్ధిదారులు ఆప్షన్–3 ఎంపిక చేసుకున్నారని తెలిపారు. ఆ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే కాంట్రాక్టర్లను ఎంపిక చేశామన్నారు. లే అవుట్‌లలో ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి నీటి సరఫరా, అప్రోచ్ రోడ్లు, విద్యుత్ సరఫరా తదితర పనులపై దృష్టి పెట్టామన్నారు. ఇప్పటి వరకు 71,452 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించామని అధికారులు వెల్లడించారు.
ఈ నెలలో మరో 29,496, వచ్చే నెలలో 49,604 ఇళ్లను అప్పగించనున్నామని చెప్పారు. 300 చదరపు అడుగుల ఇళ్లను ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నందున మిగిలిన కేటగిరీల్లోని (365, 430 చ.అ) లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా దాదాపు రూ.2 వేల కోట్లు రుణాలుగా ఇప్పించామన్నారు. సీఆర్‌డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కోర్టులో పిటిషన్‌లు, వాటిపై విచారణ అంశాన్ని ప్రస్తావించారు.
వాణిజ్య సముదాయాల ఏర్పాటు
వందలు, వేల సంఖ్యలో ఇళ్లు ఉన్న టిడ్కో కాలనీల్లో వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి దశలో 15 టిడ్కో కాలనీల్లో ఏర్పాటు చేయాలన్నారు. మహిళల ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఏర్పాటయ్యేలా చూడాలని సూచించారు. దీంతో అందుబాటు ధరలలో సరుకులు అక్కడి పేదలకు అందుతాయని, మహిళలకూ ఉపయోగం ఉంటుందన్నారు. గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
టిడ్కో గృహ సముదాయాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వివిధ ప్రతిపాదనలను పరిశీలించాలన్నారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దీవాన్, టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ జి లక్ష్మీశా, ఏపీ జెన్‌కో ఎండీ చక్రధర్ బాబు, మైన్స్,æ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment