సాక్షి, అమరావతి: ఒకేసారి 30 లక్షల మందికిపైగా మహిళలకు ఇళ్ల పట్టాలను అందించడం దేశ చరిత్రలోనే ఓ రికార్డు కాగా అడ్డంకులను అధిగమిస్తూ పేదల గృహ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సాకారం చేస్తోంది. పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో ఏపీ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. అత్యధికంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (12.85 లక్షలు), గుజరాత్ (8.78 లక్షలు), మహారాష్ట్ర (8.10 లక్షలు) ఉండగా ఏపీలో 7.93 లక్షలు పూర్తైనట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ గణాంకాల్లోనే స్పష్టంగా ఉంది.
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా సీఎం జగన్ చేస్తున్న గృహ యజ్ఞంపై కేంద్ర మంత్రులు సైతం పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మాత్రం అట్టడుగున ఉందంటూ యథావిధిగా వక్రీకరణ కథనాలను ప్రచురించారు.
దేశంలోనే అత్యధిక ఇళ్లు
పేదలకు పక్కా గృహాల కల్పనలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 30.6 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన 71,811.49 ఎకరాల భూమిని వైఎస్ జగన్ ప్రభుత్వం పంపిణీ చేసింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా పారదర్శకంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో ఏపీలో అత్యధిక ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.
మంజూరైన ఇళ్ల పనులను మొదలు పెట్టడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన వనరులను వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పించడం, లబ్ధిదారులకు సబ్సిడీపై నిర్మాణ సామాగ్రి సరఫరా చేయడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంది. పేదల ఇళ్ల నిర్మాణాల పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న చిత్తశుద్ధిని చూసి ఇటీవలే సీఆర్‌డీఏ పరిధిలో 47వేల ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ అనుమతులు ఇచ్చింది.
కుట్రలను అధిగమించి
నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కోర్టులను ఆశ్రయించి న్యాయ వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. ఈ అవరోధాలను అధిగమించి 2020 డిసెంబర్‌లో 30.6 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించే సమయంలో కోవిడ్ రెండో విడత ప్రారంభం అయింది. దీంతో కొన్ని నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి.
2021 జూలైలో మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించి తొలి దశలో 15.6 లక్షల గృహ నిర్మాణాలను ప్రారంభించారు. నిర్మాణాలు చురుగ్గా సాగుతున్న సమయంలో మరోమారు టీడీపీ కోర్టుల్లో కేసులు వేయడంతో కొద్ది నెలలు పనులు నిలిచిపోయాయి. విశాఖ, సీఆర్‌డీఏ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీని కూడా కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నించారు. విశాఖ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో గత ఏడాది ఏప్రిల్ నెలలో 1.24 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి నిర్మాణాలు ప్రారంభించారు.
రోజుకు రెండు వేలకు తగ్గకుండా
రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి. నిత్యం రెండు వేల ఇళ్లకు తగ్గకుండా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. పనుల్లో వేగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదలకు ఉచితంగా స్థలాలను పంపిణీ చేయడంతో పాటు యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందచేస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇస్తున్నారు. దీంతోపాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందించడంతో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment