సాక్షి, అమరావతి: తమకంటూ ఓ పక్కా ఇల్లు ఉండాలనేది ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నం. వారి తోబుట్టువుగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీన్ని సాకారం చేస్తూ నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరిటే ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇలా రూపుదిద్దుకున్న ఇళ్లలో గురువారం పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాలకు పేదలు సిద్ధమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా పాల్గొననున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి.
అడ్డంకులను అధిగమిస్తూ..
రాష్ట్రంలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే సీఎం జగన్ నిర్మిస్తున్నారు. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువ రూ.2.5 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టీ రూ.5 లక్షల పైనే ఉంది. అంటే ఈ లెక్కన కనిష్టంగా రూ.75 వేల కోట్లు నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూమిని పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది.
ఈ తరహాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి గతంలో ఏ ప్రభుత్వమూ పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. టీడీపీ, ఎల్లో మీడియా, దుష్ట పన్నాగాలను ఛేదిస్తూ కరోనా అడ్డంకులను అధిగమించి సీఎం జగన్ పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేసరికి ప్రతి మహిళకు కనిష్టంగా రూ.7 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం సమకూరుస్తోంది.
7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి
పేదలందరికీ ఇళ్ల పథకం కింద రెండు దశల్లో కలిపి 21.75 లక్షలకుపైగా (19.13 లక్షల సాధారణ ఇళ్లు + 2.62 లక్షల టిడ్కో ఇళ్లు) గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకూ సాధారణ ఇళ్లు 5,85,829, టిడ్కో ఇళ్లు 1,57,566 నిర్మాణం పూర్తయ్యాయి. మరో 13.27 లక్షల సాధారణ ఇళ్లు, 1.04 లక్షల టిడ్కో ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం లోగా నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది
ఉచితంగా స్థలం.. ఆపై అమిత సాయం
ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో సరిపుచ్చకుండా మరో అడుగు ముందుకు వేసింది. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేస్తోంది. స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణ సాయం చేస్తున్నారు. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున అదనంగా లబ్ధి చేకూరుస్తున్నారు.
వసతుల రూపంలో మరో రూ.1.5 లక్షలు
ఉచితంగా స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూరుస్తూనే ప్రతి ఇంటికి ఉచితంగా మౌలిక సదుపాయాల కల్పన ద్వారా మరో రూ.1.70 లక్షల మేరకు అదనపు లబ్ధిని ప్రభుత్వం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో ఉచితంగా నీటి, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రైన్లు, రోడ్లు లాంటి సకల వసతులను ప్రభుత్వం సమకూరుస్తోంది.
పార్కులు.. జిమ్.. కళ్లు చెదిరే కాలనీ!
పిల్లల కోసం ప్రత్యేకంగా పార్కులు.. వ్యాయామం కోసం జిమ్ సదుపాయాలతో కాకినాడ జిల్లా సామర్లకోట–ప్రత్తిపాడు రోడ్డులో అందంగా రూపుదిద్దుకున్న జగనన్న కాలనీని చూస్తే కళ్లు తిప్పుకోలేరు! లే అవుట్ అభివృద్ధికి ఏకంగా రూ.15 కోట్లు కేటాయించారు. రూ.4 కోట్లతో విద్యుత్తు సబ్ స్టేషన్, మూడు అంగన్‌వాడీ కేంద్రాల భవనాలను నిర్మించారు. పిల్లలకు ఆహ్లాదం కోసం ఏకంగా ఏడు పార్కులను నిర్మించడం విశేషం. ఇందులో ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్కులు కూడా ఉన్నాయి. సామర్లకోట ఈటీసీ లేఆవుట్‌లో సుమారు 52 ఎకరాల్లో 2,412 మందికి మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేశారు. 824 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. షేర్‌వాల్ టెక్నాలజీ ద్వారా నిర్మాణాలను పూర్తి చేశారు. కాలనీలో ఇళ్లను సీఎం జగన్ సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. నవరత్నాలు–పేదలకు ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన జగనన్న ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు.
– సామర్లకోట
Comments
Please login to add a commentAdd a comment