సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సోమవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ఎల్లో ముఠా కుట్రపూరితంగా సృష్టించిన అడ్డంకులను అధిగమించి సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్‌లలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే. ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక.. ఆయా లేఅవుట్‌లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది.
అలాగే.. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.
ఒకొక్కరికి రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల ఆస్తి..
ఇలా ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతోంది. ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్‌డీఏలోని ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలను సమకూరుస్తోంది.
మహిళా సాధికారతే లక్ష్యంగా..
నిజానికి.. సీఎం జగన్ ప్రభుత్వం తొలి నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వస్తోంది. మహిళలు తమంతట తాము నిలదొక్కుకునేలా వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళల పేరిట స్థలాలు, ఇళ్లు అందిస్తోంది. ఇందులో భాగంగా.. దేశంలో ఎక్కడాలేని విధంగా 71,811 ఎకరాల్లో 30.65 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఉచితంగా రూ.76,625 కోట్ల మార్కెట్ విలువైన భూములను పంపిణీ చేశారు.
ఇలా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో 17వేలకు పైగా ఊళ్లనే కొత్తగా నిర్మిస్తున్నారు. పంపిణీ చేసిన స్థలాల్లో ఇప్పటికే రూ.57,375 కోట్ల వ్యయంతో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. కాలనీల్లో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, ఇంటర్‌నెట్, డ్రైనేజీ, సీవరేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నారు.
రూ.లక్షల కోట్ల సంపద సృష్టి
మరోవైపు.. ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ఇంటి స్థలం, ఇల్లు సమకూర్చడం ద్వారా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోంది. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాక.. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం సమకూరుస్తోంది. అంతేకాక.. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తోంది.
మోడల్ హౌస్ చాలా బాగా వచ్చింది
లేఅవుట్‌లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం
Comments
Please login to add a commentAdd a comment