AP Ministers Praising CM YS Jagan Over Housing Project In Amaravati - Sakshi
Sakshi News home page

అమరావతిలో ఇళ్ల నిర్మాణం.. సీఎం సంకల్పానికి తార్కాణం 

Published Mon, Jul 24 2023 8:26 AM | Last Updated on Mon, Jul 24 2023 11:17 AM

Construction Of Houses In Amaravati Determination Of CM Jagans Will - Sakshi

మంగళగిరి/సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు కట్టడం ఒక ఎత్తయితే.. అమరావతి రాజధానిలో అది మరొక ఎత్తని, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ సంకల్పానికి ఇది తార్కాణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోని జగనన్న లేఅవుట్‌లో ‘నవరత్నాలు–పేదలందరికే ఇళ్లు’ పథకం ద్వారా నిర్మిస్తున్న గృహాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని ఆదివారం వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఆర్‌డీఏ పరిధి అమరావతి రాజధానిలో పేద, బడుగు, బలహీనవర్గాలు ఉండటానికి వీల్లేదని.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు, ఆయన సామాజికవర్గం మాత్రమే ఇక్కడ నివసించాలని కుట్రతో కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అయినా..  ముఖ్యమంత్రి పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాక అక్కడ ఇళ్లను సైతం నిర్మించి ఇచ్చేందుకు చేస్తున్న కృషి ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనమని మంత్రులు కొనియాడారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరగదని, పేదలకు ఇళ్లు రావని టీడీపీతో పాటు ఆయన తోక పారీ్టలు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చి తీరుతున్నామన్నారు. ఇది రాష్ట్రంలో చారిత్రక ఘట్టమని, రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం కడుపుమంటతో రగలిపోతున్నాడన్నారు.   

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్లు.. 

ఇక అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజతో పాటు సామాజిక మౌలిక వసతులకు సంబంధించి అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, డిజిటల్‌ లైబ్రరీ, ఈ–హెల్త్‌ సెంటర్ల భవన నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని మంత్రులు తెలిపారు. గ్రీన్‌ సోషల్‌ ఫారెస్ట్‌లో భాగంగా లేఅవుట్‌లో అభివృద్ధి చేసిన చెరువు వద్ద, ఇతర ప్రాంతాల్లో 30వేల మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని 25 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను అతి త్వరలోనే పూర్తిచేసేందుకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన షీర్‌వాల్‌ టెక్నాలజీతో ఇళ్లను శరవేగంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో దాదాపు 35వేల ఇళ్లను ఈ టెక్నాలజీతో నిర్మిస్తారని వారు చెప్పారు. ఇక్కడ ప్రతి ఇంటికీ నీరు, విద్యుత్‌ సౌకర్యంతో పాటు పూర్తిస్థాయిలో రహదారులు, డ్రైనేజి వ్యవస్థలను ఏర్పాటుచేసి గేటెడ్‌ కమ్యూనిటీ లేఅవుట్లుగా ఆరు నెలల్లో తీర్చిదిద్దుతామన్నారు.  

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి, సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ లక్ష్మీశా తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement