కాకినాడ జిల్లా సామర్లకోటలో పేదల సామూహిక గృహ ప్రవేశాలను ప్రారంభించిన అనంతరం ఓ లబ్ధిదారు ఇంటిలోకి అడుగు పెడుతున్న సీఎం వైఎస్ జగన్ ,సామర్లకోటలో జరిగిన సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం
రాష్ట్రంతో బాబు బంధం ఇదీ..
‘‘ఆ పెద్దమనిషి చంద్రబాబుకు రూ.వేల కోట్ల సంపద ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో సైతం పేదలకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా ఇవ్వలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు. 35 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మూడుసార్లు సీఎంగా చేశాడు. ఆయనకు ప్రజల మీద, రాష్ట్రం మీద, చివరికి కుప్పం మీద గానీ అభిమానం, అనురాగం, బాధ్యత లేదు. రాష్ట్రంలో కానీ, కుప్పంలో కానీ ఇల్లు కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు ఇల్లు పక్క రాష్ట్రం హైదరాబాద్‌లో కనిపిస్తుంది. అదీ ఈ రాష్ట్రంతో ఆ పెద్దమనిషికి ఉన్న అనుబంధం. కుప్పంలో దాదాపు 20 వేల మందికి ఇళ్ల పట్టాలు, 8 వేల గృహ నిర్మాణాలు ఈరోజు జరిగాయి అంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పేదవాడి గడపకు మంచి జరిగిందంటే అది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే’’
– సామర్లకోట సభలో సీఎం జగన్
సామర్లకోట నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘నిరుపేద అక్కచెల్లెమ్మల కళ్లల్లో ఎనలేని సంతోషాన్ని చూశా. బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరగని మహాయజ్ఞం పేదల సొంతింటి కలను మనం సాకారం చేశాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 31 లక్షల కుటుంబాల్లో అంటే రాష్ట్ర జనాభాలో 20 శాతం పైచిలుకు ఉన్న ఇళ్లు లేని నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని తాపత్రయపడ్డా. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి మంచి చేశాం. దేవుడి దయతో నా పేద అక్కచెల్లెమ్మలకు దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు దాదాపు 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 వేల గ్రామ పంచాయతీలు ఉంటే ఈ రోజు 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీలు వస్తున్నాయి.
కాసేపటి క్రితం ఇక్కడ కాలనీలలో ఇళ్లను చూశా. అవి ఇళ్లు కాదు ఊళ్లు అని గర్వంగా చెబుతున్నా. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 7.43 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి మీ బిడ్డగా మీతో ఆనందాన్ని పంచుకుంటున్నా’’ అని సీఎం వైఎస్ జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలి విడతగా 7.43 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ గురువారం కాకినాడ జిల్లా సామర్లకోట ఈటీసీ లేఅవుట్‌లో జరిగిన పేదల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. అనంతరం స్థానిక జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన సభలో లబ్ధిదారులైన మహిళలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
దేవుడిని ఇంతకన్నా ఏం అడగగలను?
మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఉచితంగా ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో 5.85 లక్షల సాధారణ ఇళ్లు, టిడ్కో కింద మరో 1,57,566 లక్షలు కలిపి మొత్తం సుమారు 7.43 లక్షల గృహాల నిర్మాణాన్ని ఇప్పటివరకు పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా మరో 14,33,000 ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రతి పేదవాడి ముఖంలోనూ, అక్కచెల్లెమ్మల ముఖంలోనూ చిరునవ్వులు చూస్తున్నాం. దేవుడిని నేను ఇంతకన్నా ఏం అడగగలను? దేవుడు నాచేత పేదింటి అక్కచెల్లెమ్మలకు ఇంత మంచి చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.
సామర్లకోటలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను చూశా. ఆ ఇళ్లను చూసి లే అవుట్‌లో నాన్న గారి విగ్రహాన్ని ప్రారంభించి వస్తున్నప్పుడు ఇక్కడ ఇంటి స్థలం ధర ఎంత ఉందని దొరబాబును (హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్) అడిగా. కేవలం ఇంటి స్థలం విలువ అక్షరాలా రూ.12 లక్షలు పలుకుతోందని దొరబాబు చెప్పాడు. అక్కడ 54 ఎకరాల లేఅవుట్‌లో పేదలకు 2,412 ఇళ్ల స్థలాలిచ్చాం. ఇప్పటికే వెయ్యికిపైగా ఇళ్లు పూర్తై గృహ ప్రవేశాలు చేశారు.
రూ.32 వేల కోట్లతో కనీస వసతులు..
రాష్ట్రంలో 21.76 లక్షల గృహ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పేదవాడికీ ఇచ్చే ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు రూ.2.70 లక్షలు. ఇందులో రూ.1.80 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తూ మరో రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు వచ్చేటట్టు చేశాం. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నాం. దాని విలువ మరో రూ.15 వేలు ఉంటుంది. సిమెంట్, మెటల్ ఫ్రేమ్స్, స్టీల్ తదితర నిర్మాణ సామగ్రి అంతా కూడా ధర తగ్గించి ఇవ్వడం వల్ల ప్రతి అక్కచెల్లెమ్మకు మరో రూ.40 వేల దాకా మేలు జరుగుతోంది. మొత్తం కలిపి ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షలవుతుంది. ఇంటి స్థలం, ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు డ్రెయినేజీ, రోడ్లు, నీటి సరఫరా, కరెంట్ సరఫరా లాంటి కనీస వసతుల కోసం మరో రూ.32 వేల కోట్లను ఖర్చు చేస్తున్నాం.
మనసున్న ప్రభుత్వం...
ఇంతకు ముందెప్పుడూ జరగనిది ఈరోజు జరుగుతోందంటే అందుకు కారణం.. కేవలం ముఖ్యమంత్రి మారాడు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రికి, ఈనాడు ఉన్న ముఖ్యమంత్రికి మధ్య తేడా చూడండి. నేడు ఉన్న ముఖ్యమంత్రికి మనసు ఉంది. మీపట్ల అభిమానం, బాధ్యత ఉంది. ఇదొక్కటే గత ప్రభుత్వానికి, మీ బిడ్డకు ఉన్న తేడా. అలాంటి మనసున్న ప్రభుత్వం మనందరిది కాబట్టే ప్రతి అక్కచెల్లెమ్మకూ ఒక శాశ్వత చిరునామా ఉండాలని అనుకున్నా.
ఆ శాశ్వత చిరునామా విలువ తెలిసిన ప్రభుత్వంగా నా పాదయాత్రలో చూసిన ప్రతి కష్టానికీ పరిష్కారాన్ని చూపుతూ ఈ 52 నెలలుగా పరిపాలన సాగింది. పేదింటి అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకు తపనపడుతూ మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇలాంటి మనసు గత పాలకులకు లేదు. 2014–19 మధ్య చంద్రబాబు పాలన చూస్తే పేదవాడికి ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. తేడాను మీరే ఒకసారి గమనించండి.
రాక్షసులు యాగాలను భగ్నం చేసినట్లుగా..
బుుషులు, మునులు, దేవతలు మంచి కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి దుర్మార్గంగా కుట్రలు చేస్తారని విన్నాం. అలాగే మనందరి ప్రభుత్వం పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తున్నప్పుడు, అక్కచెల్లెమ్మలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే తపనతో అడుగులు వేస్తున్నప్పుడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు వాటిని అడ్డుకుంటూ ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసి ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎన్ని అవరోధాలు తలెత్తాయో మీకు తెలుసు.
ఒకవైపు చంద్రబాబు లాంటి దుర్మార్గులు కోర్టుకు వెళ్లి ఆపాలని ప్రయత్నం చేయగా మరోవైపు మీ బిడ్డ ప్రభుత్వం రాగానే కోవిడ్ వచ్చి పడింది. కోవిడ్ కారణంగా రాష్ట్రానికి రెండేళ్ల పాటు రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు పెట్టాల్సిన ఖర్చు పెరిగిపోయింది. అయినా కూడా మీ బిడ్డ ఎక్కడా సాకులు చెప్పలేదు. కారణాలు వెతకలేదు. మీ బిడ్డ కింద మీదా పడి ఏదో ఒకటి చేశాడు.
ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపనతో అడుగులు వేశాడు. 31 లక్షల ఇళ్ల స్థలాలలో దాదాపు 22 లక్షల ఇళ్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 7.43 లక్షల ఇళ్లు ఇప్పటికే పూర్తయిన పరిస్థితుల మధ్య ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకునేందుకు ఇక్కడికి వచ్చా. నా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల కోసం ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 72 వేల ఎకరాలను సేకరించి 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం.
వీటి మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి స్థలం కనీసం రూ. 2.5 లక్షలతో మొదలు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా కనిపిస్తోంది. కనీసం రూ.2.50 లక్షలే అనుకున్నా దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాల రూపంలో సుమారు రూ.75 వేల కోట్లు విలువైన స్థిరాస్తిని నా అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాల రూపంలో ఇవ్వగలిగాం. ఇళ్ల పట్టాలివ్వడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటా.
పేదలపై ప్రేమ, బాధ్యతతో 35 కార్యక్రమాలు
ఒక్క ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణమే కాదు.. నవరత్నాల్లోని ఏ పథకాన్ని చూసినా, డీబీటీని తీసుకున్నా అంతే ప్రేమ, బాధ్యతతో అడుగులు వేశాం. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకం, అవ్వాతాతలకు పెన్షన్లు, రైతు భరోసా.. ఇలా రాష్ట్రంలో 35 పైచిలుకు కార్యక్రమాలు మన ప్రభుత్వంలో అమలవుతున్నాయి. పేదవాడి మీద ప్రేమతో, వారి జీవితాలు మారాలి, మార్చాలనే తపన, తాపత్రయంతో 52 నెలలుగా అడుగులు వేస్తూ వస్తున్నాం.
ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏనాడూ ఇలా పేదల మీద ప్రేమ, బాధ్యత చూపలేదు. కాబట్టే మనం అధికారంలోకి వచ్చేటప్పటికి 31 లక్షల కుటుంబాలు అంటే రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా సొంత ఇళ్లు లేని నిరుపేదలుగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది. నాడు కూడా ఇదే రాష్ట్రం, కేవలం సీఎం మాత్రమే మారాడు. ఇవాళ 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం.
Comments
Please login to add a commentAdd a comment