CM YS Jagan Mohan Reddy Mandate High Level Houses To Poor People From October 25 - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం

Published Tue, Aug 24 2021 2:53 AM | Last Updated on Tue, Aug 24 2021 10:18 AM

CM Jagan mandate in a high-level review on Houses to poor people - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇంటి పట్టాలు అందచేయడంతోపాటు గృహాలను కూడా నిర్మించి ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని మూడో ఆప్షన్‌ కింద కోరుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులను అక్టోబర్‌ 25వతేదీ నుంచి ప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈలోగా అందుకు అవసరమైన సన్నాహాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగా అర్హులైన పేదలకూ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ ద్వారా పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు (ప్లాట్లు) ఇచ్చేందుకు అవసరమైన భూములను గుర్తించడంతోపాటు సమీకరణ పూర్తి చేసి విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధం చేసి అమలు తేదీని ప్రకటించాలని సీఎం ఆదేశించారు. పేదల ఇళ్ల నిర్మాణాలు, వైఎస్సార్‌ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల మంజూరు, ఎంఐజీ లే అవుట్లు తదితరాలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చదవండి: Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..!

లబ్ధిదారులకు నాణ్యమైన సామగ్రి        
పేదల ఇళ్ల నిర్మాణ సామగ్రిని సమకూర్చడంలో నాణ్యతా ప్రమాదదణాలు తప్పకుండా పాటించాలని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. విద్యుదీకరణకు కూడా నాణ్యమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలని సూచించారు.

గ్రూపుల ఏర్పాటు
ఆప్షన్‌ 3 కింద ప్రభుత్వమే గృహాలను నిర్మించి ఇవ్వాలని కోరుకున్న లబ్ధిదారులకు ఇళ్లు కట్టించి ఇచ్చే పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న చోట లబ్ధిదారులతో కలిసి గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పేదల కాలనీల్లో ఇంటర్నెట్‌ 
పేదల కోసం నిర్మిస్తున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కూడా ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు.
పేదల ఇళ్ల నిర్మాణాలు, వైఎస్సార్‌ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల మంజూరు, ఎంఐజీ లే అవుట్లు తదితరాలపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

కొత్తగా అర్హులైన పేదలకూ ఇళ్ల పట్టాలు 
కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలకు 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలపై కూడా ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఆగస్టు 22 వరకు ఇళ్ల పట్టాల కోసం కొత్తగా  3,55,495 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 1,99,201 అర్హత ఉన్నవని అధికారులు పేర్కొన్నారు. మరో 9,216 దరఖాస్తులు వెరిఫికేషన్‌ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చదవండి: త్వరలోనే థర్డ్‌ వేవ్‌!

మధ్య తరగతికి ప్లాట్లపై దసరాకు కార్యాచరణ
లాభాపేక్ష లేకుండా పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో ప్లాట్లు ఇచ్చే పథకంపై కూడా ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 150, 200, 250 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్ల కోసం వివిధ రకాల భూములను గుర్తించి సమీకరణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధం చేసి అమలు తేదీలను ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.
 
టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష
ఫేజ్‌ –1లో భాగంగా 85,888 టిడ్కో ఇళ్ల పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు. 
డిసెంబర్‌ 2021 నాటి కల్లా ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఫేజ్‌ –2 ఇళ్లు జూన్‌ 2022 నాటికి, ఫేజ్‌ –3 ఇళ్లు డిసెంబర్‌ 2022 నాటికి పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. నిర్దేశిత సమయంలోగా ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు.

రివర్స్‌ టెండర్లతో నిర్మాణ సామగ్రిలో భారీగా ఆదా
తొలి దశ పేదల ఇళ్లకు సంబంధించి నిర్మాణ సామగ్రికి రివర్స్‌ టెండర్లు నిర్వహించడం ద్వారా రూ.5,120 కోట్లు ఆదా చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒక్కో ఇంటి నిర్మాణ సామగ్రిలో దాదాపుగా రూ.32 వేల చొప్పున ఆదా అయిందని తెలిపారు. లబ్ధిదారుల కోరిక మేరకే వారికి నిర్మాణ సామగ్రిని పంపిణీ చేస్తున్నామని, దీనికోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించామని చెప్పారు.

ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌
వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు, ఇతరత్రా అంశాలపై ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మించనున్న ఇళ్ల మ్యాపింగ్, రిజిస్ట్రేషన్, జాబ్‌కార్డుల జారీ, జియో ట్యాగింగ్‌ దాదాపుగా పూర్తైందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా కాలనీల్లో 80 శాతానికిపైగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. 

ప్రతి నగరం, మున్సిపాలిటీ వాటర్‌ ప్లస్‌ స్థాయికి చేరాలి
రాష్ట్రంలోని మూడు పెద్ద నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతి మురుగునీరు, వ్యర్థ జలాలను నిర్దేశిత ప్రమాణాల మేరకు శుద్ధి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వాటర్‌ ప్లస్‌ సర్టిఫికెట్లు సాధించడంపై అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ అభినందించారు. ఉత్తమ తాగునీటి సరఫరా విధానాలు, మురుగునీటి నిర్వహణపై మార్గదర్శకాలను కలెక్టర్లు, కమిషనర్లకు పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలలో ఇవి అమలయ్యేలా చూడాలని,  తద్వారా పట్టణాలు ఉన్నత ప్రమాణాల దిశగా అడుగులు వేయాలన్నారు.

ప్రతి నగరం, మున్సిపాల్టీ సర్టిఫికెట్‌ పొందిన నగరాల స్ధాయిని చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్‌ పాండే, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. 

‘వాటర్‌ ప్లస్‌’ నగరాల్లో విజయవాడ, విశాఖ, తిరుపతి
– దేశవ్యాప్తంగా 9 నగరాల ఎంపిక
స్వచ్ఛభారత్‌ మిషన్‌ అర్బన్‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ అందించే వాటర్‌ ప్లస్‌ సర్టిఫికేషన్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు నగరాలకు చోటు లభించింది. దేశవ్యాప్తంగా కేవలం 9 నగరాలు మాత్రమే వాటర్‌ప్లస్‌ సర్టిఫికెట్‌ పొందగా అందులో 3 నగరాలు రాష్ట్రం నుంచి అర్హత సాధించినట్లు సీఎం నిర్వహించిన సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లు వాటర్‌ ప్లస్‌ సర్టిఫికెట్‌ పొందాయని చెప్పారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి డ్రైన్లు, నాలాలతో పాటు ఇతర వ్యర్ధ జలాల శుద్ధి, నిర్వహణ, పునర్వినియోగాన్ని నిర్దేశిత ప్రమాణాల మేరకు సమర్ధవంతంగా నిర్వహించే నగరాలకు వాటర్‌ ప్లస్‌ సర్టిఫికెట్‌ను కేంద్ర ప్రభుత్వం అందచేస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement