జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ బ్రోచర్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి బొత్స, అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ గూడు ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో తాజాగా మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రతి నియోజకవర్గంలో మిడిల్ క్లాస్ ఇన్‌కమ్ (ఎంఐజీ) వర్గాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మధ్య తరగతి ఆదాయ వర్గాలకు పారదర్శకంగా, వివాదాలు లేని ఇంటి స్థలాలను సకల సదుపాయాలతో అందచేస్తామని చెప్పారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ వెబ్‌సైట్‌ను సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైఎస్సార్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో లే అవుట్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
సరసమైన ధర.. క్లియర్ టైటిల్
రాష్ట్రంలో ప్రతి పేదకూ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఏకంగా 31 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలను ఇప్పటికే పంపిణీ చేశాం. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. వీటి పనులు చక,చకా జరుగుతున్నాయి. మరోవైపు మధ్య తరగతి కుటుంబాలకు కూడా సరసమైన ధరలకే సొంతింటి కల సాకారం కానుంది. రియల్ ఎస్టేట్ మోసాలకు గురి కాకుండా, లాభాపేక్ష లేకుండా, మార్కెట్ ధర కంటే తక్కువకే వివాద రహిత స్థలాలను క్లియర్ టైటిల్‌తో మధ్య తరగతి కుటుంబాలకు (మిడిల్ ఇన్‌కమ్ గ్రూపు) అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వమే లేఅవుట్ వేసి ఇంటి స్థలాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవడం ద్వారా మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుంది.
మూడు కేటగిరీలలో స్ధలాలు
ఈ పథకం ద్వారా మూడు కేటగిరీలలో ఇంటి స్ధలాలు అందచేస్తాం. ఎంఐజీ –1 (150 గజాలు), ఎంఐజీ –2 (200 గజాలు), ఎంఐజీ –3 (240 గజాలు) స్థలాలను ప్రతి లేఅవుట్‌లో అందుబాటులో తెస్తాం. తొలిదశలో ధర్మవరం, నవులూరు, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో లేఅవుట్ల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
ఆన్‌లైన్‌లో మొదలైన దరఖాస్తుల స్వీకారం
జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ పథకానికి మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తున్నాం. తొలిదశలో లేఅవుట్లు వేసిన 6 జిల్లాల్లోనే కాకుండా మిగిలిన అన్ని జిల్లాలతో పాటు ప్రతి నియోజవర్గంలో ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తుంది. ప్రతి నియోజకవర్గం కేంద్రంలో మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరుగుతుంది.
ఇదీ వెబ్‌సైట్
జగనన్న టౌన్‌షిప్స్‌లో ఇంటి స్థలాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన https://migapdtcp.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారంతా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నాలుగు వాయిదాల్లో ఒక ఏడాదిలో డబ్బులు చెల్లించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. చెల్లింపు పూర్తైన వెంటనే అభివృద్ధి చేసిన ప్లాటును లబ్ధిదారుడి చేతికి అందిస్తాం.
ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి బొత్స
ముందు 10 శాతం చెల్లించాలి
స్మార్ట్ టౌన్స్‌లో ఇంటి స్ధలం కోసం దరఖాస్తు చేసుకునేవారు ప్లాటు నిర్ణీత విలువలో 10 శాతాన్ని ముందుగా చెల్లించాలి. అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలలు లేదా రిజిస్ట్రేషన్ తేదీ లేదా రెండింటిలో ఏది ముందు అయితే ఆ తేదీలోపు మిగిలిన 30 శాతం డబ్బులు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు ప్లాటు అప్పగిస్తారు. వాయిదాల్లో కాకుండా ఒకేసారి మొత్తం డబ్బులు చెల్లిస్తే ఐదు రాయితీ కల్పిస్తారు.
ఉద్యోగులకు మాట ప్రకారం..
మొన్న పీఆర్‌సీ ప్రకటన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చాం. ఆ ప్రకారం ప్రతి లేఅవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు పది శాతం ప్లాట్లను 20 శాతం రిబేట్‌తో ప్రత్యేకంగా కేటాయిస్తాం.
ఆదర్శంగా సమగ్ర లేఅవుట్లు
జగనన్న స్మార్ట్ టౌన్స్‌లో పట్టణాభివృద్ధి సంస్ధల ద్వారా పట్టణ ప్రణాళికా విభాగం నియమ, నిబంధనలకు లోబడి ఏడాదిలో సమగ్ర లే అవుట్లను అభివృద్ధి చేస్తాం. నిబంధనలను పక్కాగా పాటిస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవి ఆదర్శప్రాయంగా, మంచి మోడల్ లే అవుట్‌గా నిలుస్తాయి.
పారదర్శకంగా కేటాయింపు
దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. ఎక్కడా కులం, మతం, ప్రాంతంతో పాటు ఏ రాజకీయ పార్టీ అని చూడం. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు.
లే అవుట్ల ప్రత్యేకతలు..
స్మార్ట్ టౌన్స్‌లో ప్రభుత్వమే లే అవుట్లు వేస్తోంది. కుటుంబ అవసరాలను బట్టి 150, 200, 240 చదరపు గజాల స్ధలాలను ఎంచుకునే వెసులుబాటు లబ్ధిదారుడికి ఉంటుంది. పర్యావరణహితంగా లేఅవుట్లలో 50 శాతం స్థలాన్ని ఉమ్మడి అవసరాలైన పార్కులు, ప్లే గ్రౌండ్స్, స్కూళ్లు, బ్యాంకులు, షాపింగ్ రిక్రియేషన్ సదుపాయాల కోసం కేటాయిస్తారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఉంటాయి. మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరదనీటి పారుదలకు ఈ కాలనీల్లో అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. వీధి దీపాలతో పాటు నాణ్యమైన సదుపాయాలుంటాయి. ఎక్కడా, ఎవరూ వేలెత్తి చూపించలేని తరహాలో లేఅవుట్లను అభివృద్ధి చేస్తాం.
నిర్వహణకు కార్పస్ ఫండ్
ఇవాళ మనం అభివృద్ధి చేస్తున్న టౌన్‌షిప్స్ భవిష్యత్తులోనూ బాగుండాలి. వీటి నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్లాట్ల ఓనర్ల అసోసియేషన్‌కు అప్పగిస్తాం. పట్టణాభివృద్ధి సంస్ధలతో కలిసి సంయుక్తంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం.
ఇలాంటి జాగ్రత్తల ద్వారా మంచి లేఅవుట్లు రావాలని, మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరగాలని కోరుకుంటున్నాం.
పోటీతో.. బయ్యర్స్ మార్కెట్
జగనన్న స్టార్ట్ టౌన్‌షిప్స్ ద్వారా సరసమైన ధరలకు ఇంటి స్థలాలు అందుబాటులోకి
రావడం ద్వారా మార్కెట్‌లోనూ అలాంటి వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా మిగిలిన లే అవుట్లు వేసేవారు కూడా పోటీగా ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ధరలు తగ్గి నాణ్యమైన లే అవుట్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
► ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఎంవీ రామమనోహరరావు, ఎంఐజీ లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్ బసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పండుగ వేళ..
‘‘న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని, అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన, వివాదరహితమైన ఇంటి స్థలాలను జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ పథకం ద్వారా అందిస్తున్నాం. సంక్రాంతి సమయంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’
– సీఎం జగన్
బయట కొంటే ఎన్నో ఇబ్బందులు..
పేదలకే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా మేలు చేస్తూ మంచి లొకేషన్‌లో అతి తక్కువ ధరకే ఇంటి స్థలం ఇవ్వడం మంచి పరిణామం. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే స్థలం వస్తుంది. బయట కొంటే మౌలిక సదుపాయాల నుంచి అనేక ఇబ్బందులుంటాయి. కందుకూరు లే అవుట్ చాలా బాగుంది. సొంతింటి కల సాకారం అవుతోంది.
–వెంకటేశ్వర్లు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ప్రకాశం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment