కళ్లెదుటే ఖరీదైన లోగిళ్లు! | CM Jagan To participate in house warming of YSR Jagananna Colony | Sakshi
Sakshi News home page

కళ్లెదుటే ఖరీదైన లోగిళ్లు!

Published Mon, Oct 2 2023 3:47 AM | Last Updated on Mon, Oct 2 2023 6:54 PM

CM Jagan To participate in house warming of YSR Jagananna Colony - Sakshi

కాకినాడ జిల్లా సామర్లకోటలో నిర్మించిన వైఎస్సార్‌ జగనన్న కాలనీ

కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన అప్పారావు దినసరి కూలి. ఆర్నెళ్ల క్రితం వరకూ నెలకు రూ.2,500 అద్దె చెల్లించాల్సి రావడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. ఆయన భార్య రత్నం సొంత ఇంటి కలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా నెరవేర్చింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడుకు వెళ్లే రోడ్డులో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని ఇవ్వడంతోపాటు గృహ నిర్మాణానికి ఆర్థికంగా చేదోడుగా నిలిచింది. ఏమ్మా ఈ ఇల్లు మీదేనా? చాలా బాగుందంటూ ఎవరైనా పలకరిస్తే చాలు.. ‘అవునండీ సీఎం జగన్‌ మాకిచ్చిన కానుక ఈ ఇల్లు. ఇన్నాళ్లూ అద్దెలు కట్టలేక, పిల్లల చదువులు, కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడ్డాం.

కొత్త ఇంటిలోకి వచ్చాక చిన్న టిఫిన్‌ సెంటర్‌ నడుపుతున్నా. వేడినీళ్లకు చన్నీళ్లలా మా సంపాదన ఉంది’ అని ఆనందంగా చెబుతోంది. సామర్లకోట లేఔట్‌లో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న కృష్ణకుమారి అనే మహిళను ఇక్కడికి వచ్చి ఎన్నిరోజులు అయింది? అని పలుకరించగా ‘నా భర్త చిరు వ్యాపారి. వివాహం అయిన రోజు నుంచి అద్దె ఇంటిలోనే ఉంటున్నాం. సంపాదన ఖర్చులకే సరిపోయేది కాదు. స్థలం కొనడానికే రూ.10 లక్షలు దాకా ఉండాలి. దీంతో ఇక ఇంటి కల నెరవేరదని ఆశ వదులుకున్న తరుణంలో ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇచ్చి ఇంటిని కూడా మంజూరు చేస్తోందని తెలియడంతో దరఖాస్తు చేసుకున్నాం. ఎనిమిది నెలల క్రితం గృహ ప్రవేశం కూడా చేశాం. నా బిడ్డ చదువులకు కూడా ప్రభుత్వం సాయం చేస్తోంది. ఇప్పటివరకు మూడుసార్లు అమ్మఒడి వచ్చింది. రూ.75 వేలు పొదుపు సంఘం రుణం వచ్చింది’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది. 

(వడ్డే బాలశేఖర్‌ – సామర్లకోట నుంచి సాక్షి ప్రతినిధి): ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇళ్ల స్థలాలు.. అది కూడా ఖరీదైన ప్రాంతాల్లోనే.. ఆపై గృహ నిర్మాణాలను కూడా చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక సంచలనం. అక్క చెల్లెమ్మల సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసేందుకు భూ సేకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.75,670 కోట్లను వ్యయం చేసింది. అంత విలువైన స్థిరాస్తిని మహిళల చేతుల్లో పెట్టింది. పేదల పక్కా ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 68,677 ఎకరాలను పంపిణీ చేసిందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ సైతం ప్రశంసించింది.

17,005 జగనన్న కాలనీల్లో సకల సామాజిక, కనీస సదుపాయాలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం దశలవారీగా దాదాపు రూ.30 వేల కోట్లను వ్యయం చేస్తోంది. ఇక ఆగస్టు నెలాఖరు వరకు 21.31 లక్షల ఇళ్ల నిర్మాణాల కోసం మరో రూ.12,295.97 కోట్లను అక్క చెల్లెమ్మల ఖాతాలకు పారదర్శకంగా జమ చేసింది. ఉచితంగా ఇచ్చే ఇసుకతోపాటు రాయితీపై సామగ్రిని సమకూరుస్తోంది. తద్వారా మరో రూ.40 వేల మేరకు లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన ప్రాంతాన్ని బట్టి స్థలం, ఇంటి విలువ రూ.15 లక్షలు, ఆపైన పలుకుతుండటం విశేషం.

ఇళ్ల లబ్ధిదారుల్లో బీసీ మహిళలే అత్యధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేస్తున్నారు. పూర్తైన ఇళ్లకు మంచినీటి, విద్యుత్‌ సరఫరాపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా తనిఖీలు జరిపి నిర్థారించేలా చర్యలు తీసుకున్నారు. రోజు వారీ లక్ష్యాలను నిర్ధారించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షిస్తుండటంతో ఐదు లక్షలకుపైగా పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయి.

ఖరీదైన ప్రాంతంలో పేదలకు ఇళ్లు
కాకినాడ జిల్లా సామర్లకోట – ప్రత్తిపాడు రోడ్డులో 2,412 నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 54 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. రెండు కాలనీలుగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటివరకు 800 వరకూ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 1,408 ఇళ్లు పునాదిపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన సామర్లకోట వైఎస్సార్‌ జగనన్న కాలనీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించి పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ క్రమంలో సామర్లకోట మునిసిపాలిటీలోని జగనన్న కాలనీల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక్కడ సెంటు స్థలం మార్కెట్‌ విలువ రూ.10 లక్షలపైన పలుకుతోందని చెబుతున్నారు. విద్యుత్, నీటి సరఫరాతో పాటు, ఇతర సదుపాయాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తోంది. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో పేద మహిళకు రూ.15 లక్షలకుపైగా విలువైన ఆస్తిని సీఎం జగన్‌ సమకూర్చారు. 

అత్యంత నాణ్యత ప్రమాణాలతో..
పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలను స్మశానాలతో పోల్చుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు విషం కక్కారు. నిత్యం పేదల ఇళ్ల పథకంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా కాలనీల్లో అత్యంత నాణ్యత ప్రమాణాలతో పేదల ఇళ్ల నిర్మాణాలున్నాయి. ప్రతి ఇంటికీ హాల్, కిచెన్, బెడ్‌రూమ్, వరండా, స్టేర్‌ కేస్‌ లాంటి వసతులు ఉండటం విశేషం. సామర్లకోటలో మెజారిటీ లబ్ధిదారులు తామే ఇళ్లు నిర్మించుకునే ఆప్షన్‌ ఎంచుకున్నారు. ఆప్షన్‌–3 లబ్ధిదారుల ఇళ్లను షీర్‌వాల్‌ టెక్నాలజీలో అజయ వెంచర్స్‌ లేబర్‌ ఏజెన్సీ నిర్మిస్తోంది. 

ఉచితంగా ఇసుక.. సబ్సిడీపై సామగ్రి
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ రెండు విడతల్లో 21.25 (టిడ్కోతో కలిపి) లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకే రూ.35 వేలు బ్యాంక్‌ రుణం, రూ.15 వేలు విలువైన ఉచిత ఇసుక, సబ్సిడీపై సిమెంట్, స్టీల్, మెటల్‌ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామాగ్రిని అందించడం ద్వారా మరో రూ.40 వేల మేర లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా..
పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన ఇళ్లు 5,24,850కి చేరుకున్నాయి. మిగిలినవి శరవేగంగా కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 43,602 ఇళ్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లాలో 37,141 ఏలూరు జిల్లాలో 26,815 ఇళ్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ బిల్లులను ప్రభుత్వం వేగంగా చెల్లిస్తోంది. నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్‌లు అందచేస్తోంది.

5న సామర్లకోట లే అవుట్‌లో ఇళ్లకు సీఎం జగన్‌ ప్రారంభోత్సవాలు
పేదలందరికి ఇళ్లు–నవరత్నాల్లో భాగంగా పూర్తయిన ఐదు లక్షల గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 5వ తేదీన సామర్లకోటలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్‌ అజయ్‌ జైన్‌ తెలిపారు. అదే రోజు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లే అవుట్లలో ఇళ్లను మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారని, సామూహిక గృహ ప్రవేశాలు ఉంటాయని అజయ్‌ జైన్‌ ‘సాక్షి’కి వెల్లడించారు. ఐదు లక్షల గృహాల లే అవుట్లలో నూటికి నూరు శాతం మంచినీటి, విద్యుత్‌ సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. రహదారులు, అంతర్గత రహదారులు, స్వాగత తోరణాలు కూడా పూర్తైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5.24 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి  అయ్యాయని చెప్పారు. 


తిరగకుండానే మంజూరైంది..
టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే పట్టించుకోలేదు. ఆ పార్టీ సానుభూతిపరులం కాదని సంక్షేమ పథకాల నుంచి తొలగించారు. తమ పార్టీ జెండా పట్టుకుంటే అన్నీ వస్తాయని ఆ పార్టీ నాయకులు చాలాసార్లు ఆశ పెట్టారు. ఇప్పుడు ఏ నాయకుడు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే మాకు ఇంటి స్థలం మంజూరైంది. త్వరలో గృహప్రవేశం కూడా చేయనున్నాం. ప్రభుత్వం మాకిచ్చింది సెంటు స్థలమేనని హేళనగా మాట్లాడుతున్న టీడీపీ నాయకులు వారి ప్రభుత్వంలో గజం స్థలం కూడా ఇచ్చిన పాపాన పోలేదు.
– సూర్య భాస్కర్‌ కుమార్, సామర్లకోట, కాకినాడ జిల్లా

దశాబ్దాల కల నెరవేరింది..
మా ఆయన చిరు వ్యాపారి. ఆయన సంపాదనంతా ముగ్గురమ్మాయిల చదువులు, కుటుంబ పోషణకే సరిపోయేది. వారికి పెళ్లిళ్లు చేయడానికి తలకు మించిన భారమైంది. దీంతో మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు సీఎం జగన్‌ మా దశాబ్దాల ఇంటి కలను నెరవేర్చారు. ఆయన రుణం ఈ జన్మకు తీర్చుకోలేం. 
– లంక లక్ష్మి, వైఎస్సార్‌–జగనన్న కాలనీ సామర్లకోట, కాకినాడ జిల్లా

ఇంతకన్నా మేలు ఏ ప్రభుత్వం చేయలేదు..
నెలకు రూ.3,500 చెల్లించి అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. సుమారు 10 ఇళ్లు మారాం. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకుని ఆత్మగౌరవంతో జీవిస్తున్నాం. మా పిల్లల చదువులకు కూడా అమ్మఒడి ద్వారా సీఎం జగన్‌ అండగా నిలుస్తున్నారు. ఇంతకన్నా మేలు మాకు ఏ ప్రభుత్వం చేయలేదు. 
– వి.సతీష్, పద్మావతి, వైఎస్సార్, జగనన్న కాలనీ సామర్లకోట

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా..
రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా సీఎం జగన్‌ పాలిస్తున్నారు. ప్రజల కనీస అవసరాల్లో ఒకటైన గూడు కోసం ఏ ఒక్కరు బాధ పడకుండా చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనిధంగా పేదలకు ఏకంగా 30 లక్షలకు పైగా ఇంటి పట్టాలు ఇచ్చారు. ఐదు లక్షల ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అందిస్తున్నాం. శరవేగంగా మిగిలిన నిర్మాణాలను కూడా పూర్తి చేస్తాం. 
– దవులూరి దొరబాబు, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త 

ఎప్పటికప్పుడు పురోగతి పరిశీలన
పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తున్నాం. సామర్లకోటలో త్వరలో సీఎం జగన్‌ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం.  
– డాక్టర్‌ లక్ష్మీశా, ఎండీ, ఏపీ గృహనిర్మాణ సంస్థ 

ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం 
పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి సమాజంలో సముచిత స్థానం లభిస్తుంది. ఇది కేవలం గృహ నిర్మాణంగానే చూడకూడదు. ఇళ్ల నిర్మాణంతో అనుబంధ రంగాల కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. సిమెంట్, ఇనుము, ఇటుకలు.. ఇలా వివిధ పరిశ్రమల ఉత్పత్తిలో వృద్ధి పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుంది. పేదలు తమ సంపాదనలో తిండికి పెట్టే ఖర్చుతో సమానంగా ఇంటి అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పక్కా ఇళ్లు సమకూరితే అద్దెల భారం తగ్గుతుంది. ఆ మొత్తాన్ని మంచి ఆహారం, ఆరోగ్యం, పిల్లల భవిష్యత్‌ కోసం ఖర్చు చేస్తారు. దీంతో మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతుంది. 
– ప్రొఫెసర్‌ కె.మధుబాబు, ఆర్థిక శాస్త్రం విభాగాధిపతి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement