వెంకటపాలెం సభలో మాట్లాడుతున్న సీఎం జగన్
పేద వర్గాలపై పెత్తందారుల దోపిడీలను సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అలాంటి మార్పులకు మనసా వాచా కర్మణా సహకరించే ప్రభుత్వంగా, మీ అన్నగా.. నిరుపేద అక్కచెల్లెమ్మల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో ‘సామాజిక అమరావతి’కి పునాదిరాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మనందరిది.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పేదలకు మేలు జరిగే ప్రతి విషయంలో మనందరి ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలకు మంచి జరగకూడదని రాక్షస బుద్ధితో అడ్డుకుంటున్న వారితో పెద్ద యుద్ధమే చేస్తున్నామన్నారు. సోమవారం సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు 50,793 ఇళ్ల నిర్మాణం, 45 సామాజిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో సీఎం జగన్ మాట్లాడారు.
తొలుత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...
వెంకటపాలెంలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
ఆ తర్వాత కూడా బుద్ధి మారలేదు..
సీఆర్‌డీఏలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇళ్లç స్థలాలు ఇవ్వకుండా, ఇళ్లు కట్టించకుండా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు సృష్టించిన ఊరుపేరూ లేని సంఘాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ – 5 అడ్డు తగిలాయి. వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. ఇందుకోసం ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లిన దౌర్భాగ్యమైన పరిస్థితిని మన రాష్ట్రంలో మాత్రమే చూస్తున్నాం. ఈ పెద్దమనుషులు, పెత్తందార్లు, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో 5 కేసులు వేశారు.
ఈ కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ మూడేళ్ల పాటు పోరాటం చేస్తూ వచ్చాడు. దేవుడు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ మంచికే ఉంటాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచింది. అనుమతులు తెచ్చుకుని మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి అడ్డు తగిలేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వారు ఎక్కని గడప దిగని గడప లేదు. కలవని కేంద్ర మంత్రీ, కేంద్ర సెక్రటరీలు కూడా లేరు. ఇంతమందిని కలిశాక చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా ఉండదు.
చరిత్రలో నిలిచిపోయే రోజు
ఇంతమంది పెత్తందార్లు ఒక్కటై పేదవాడికి ఇళ్లు రాకూడదని అడ్డుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నించిన పరిస్థితులు దేశ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఇలా పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ, ఎన్నెన్నో అవరోధాలను అధిగమించి విజయం సాధించి పేదల ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ ఇళ్ల నిర్మాణానికి, మీ ఇంటి కలల సాకారానికి ఇవాళ ఇక్కడ పునాదులు కూడా వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల సొంతింటి కలల సాకారానికి మనం చేసిన సామాజిక న్యాయ పోరాటం చరిత్ర ఉన్నంత వరకూ ఎప్పడూ మర్చిపోలేనిది. పెత్తందారులపై పేదవాడు, పేదల ప్రభుత్వం సాధించిన విజయంగా చరిత్రలో పదిలంగా ఉంటుంది.
గతంలో ఎన్నడూ చూడలేదు
అమరావతిని పేరుకేమో రాజధాని అంటారు. రాజధానిలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుపడి కోర్టులకు వెళ్లారు. పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ (సామాజిక అసమతుల్యత) వస్తుందని, కులాల సమతుల్యం దెబ్బతింటుందని న్యాయస్థానాల్లో వాదించిన చరిత్ర వీళ్లది. ఇలాంటి పెత్తందారులున్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైన మనుషులను, మనస్తత్వాలను, వాదనలను, రాతలను, టీవీల్లో డిబేట్లను, రాజకీయ పార్టీలను గతంలో ఎప్పుడూ చూడలేదు.
నయా జమీందార్ల మొసలి కన్నీరు
పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే ఈ నయా జమీందార్లు, పెత్తందార్లంతా అడ్డుతగిలే కార్యక్రమం చేశారు. తెలుగు భాష ఏమైపోతుందని మొసలి కన్నీరు కారుస్తారు. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకే పంపిస్తారు. మన పిల్లలు మాత్రం తెలుగు బడులకే పోవాలంటారు. నా అక్కచెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తే రకరకాల కోర్టు కేసులు వేశారు.
పేదవాడు ఎప్పుడూ పేదవాడుగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ ఆలోచనకు ఇవొక నిదర్శనాలు. మీ బిడ్డ పేదల కోసం అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్షకు చోటివ్వకుండా బటన్ నొక్కి రూ.2.25 లక్షల కోట్లు పంపిస్తే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీ బిడ్డ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారు.
ప్రతి ఒక్కరూ ఆలోచించండి
గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. చంద్రబాబు హయాంలో కన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల వృద్ధి రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఈ రోజు ఎలా చేయగలుగుతున్నాడు? ఆ రోజు గజదొంగల ముఠా ఎందుకు చేయలేకపోయింది? మీ బిడ్డ హయాంలో ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తున్నాయి? చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు? ప్రతి ఒక్కరూ ఆలోచించండి.
ఏ పేదవాడు, అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని వలంటీర్, సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్షకు తావివ్వకుండా ఒకటో తారీఖునే అది ఆదివారమైనా, పండగరోజైనా సరే తెల్లవారుజామునే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చేతిలో పెన్షన్ డబ్బులు పెడుతున్నారు. ఈ వ్యవస్థను కూడా పెత్తందార్లు, పేదల వ్యతిరేకులు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు.
హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు
ఏ సమాజమైనా, కుటుంబమైనా నిన్నటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్ బాగుండాలని కోరుకుంటుంది. అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అంటారు. అలాంటి ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటే, వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం, అమానుషత్వం, రాక్షసత్వం అంటారు. విచిత్రమేంటంటే పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ దాన్ని వారు హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు.
ఈ రోజు ఉదయాన్నే ఈనాడు పేపర్‌లో చూశా. వాళ్లు రాసిన రాతలు చూసి ఆశ్చర్యం అనిపించింది. దిగజారుడుతనం ఏ స్థాయికి వెళ్లిందంటే చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికా, సింగపూర్‌ల నుంచి మనుషులు రావచ్చట. కానీ ఇదే అమరావతిలో చుటు్టపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఈనాడులో రాస్తారు. ఇంత దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావజాలం ఎక్కడైనా ఉంటుందా?
జగనన్నను టచ్ కూడా చేయలేరు
ఎన్నికల సీజన్ రాగానే కొందరు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు పేదలను పీక్కుతిన్నాడు. పవన్‌కళ్యాణ్ ఎన్నో పార్టీలు మార్చాడు. బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం.. ఇలా ఎన్ని పార్టీలైనా మార్చగలడు. మా జగనన్నను ఓడిస్తారా.. ఎంతమంది వచ్చినా ఆయన్ను టచ్ కూడా చేయలేరు.ఇంకొకడు జగనన్నతో పోటీ అంటూ నడుస్తున్నాడు. నువ్వెంత నీ స్థాయి ఎంత? పెత్తందార్ల కోటలను బద్దలుకొట్టి, పేదల పక్షాన నిలిచి సుప్రీంకోర్టు దాకా వెళ్లి వారిని గెలిపించి జగన్ చరిత్రను తిరగరాశారు. పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు అని కోర్టుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు.
– జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి
మీరొచ్చాకే బడుగు వర్గాలకు ధైర్యం వచ్చింది
మీరు పాదయాత్ర చేస్తే రోడ్లపై పసుపు నీళ్లు చల్లిన వ్యక్తులను ఇక్కడ చూశాం. మా సమస్యలు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. జగనన్న వచ్చిన తర్వాత మాకు ధైర్యం, భరోసా వచ్చింది. జగన్ పేదల పక్కనుంటే చంద్రబాబు పెత్తందార్ల తరఫున యుద్ధం చేస్తున్నాడు. కోర్టులలో సైతం జగన్ గెలిచి ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జీవితకాలం పేద వాడి గుండెల్లో మీ పేరు నిలిచిపోతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలను లక్షాధికారులను చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుంది.
– బాపట్ల ఎంపీ నందిగం సురేష్
పాలకుడంటే ప్రజల కన్నీటిని తుడిచేవాడు..
పాలకుడంటే పాలించేవాడే కాదు, ప్రజల సంక్షేమాన్ని కోరుతూ వారి కన్నీటిని తుడిచేవాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త అర్థం చెప్పారు. మేం మీకు రుణపడి ఉంటాం. మీరే మా ధైర్యం అన్నా. మీకు పక్కనే ఉన్న వెంకన్న స్వామి, కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మాకు పట్టాలు ఇచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది, ఇప్పుడు ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. మేం అనేక పథకాల ద్వారా కూడా లబ్ధిపొందుతున్నాం. నగదు రూపంలో మొత్తం రూ.1,89,250, స్థిరాస్తి రూపంలో రూ.పది లక్షల నుంచి రూ. పదిహేను లక్షలు వరకు లబ్దిపొందాను.
– రోజా, లబ్ధిదారు, మంగళగిరి
వలంటీర్లపై బురద జల్లుతున్నారు
నేను సొంత ఇల్లులేక, అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడ్డాను, నాకు ఏ ప్రభుత్వంలో ఇల్లు రాలేదు, కానీ, మీరు రాగానే మంజూరైంది, మా పేదల తరఫున మీరు నిలబడి చేసిన న్యాయపోరాటానికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. నేను వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధి పొందాను, నా కొడుకు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడంటే మీరే కారణం. అన్నా.. నేను నాలుగేళ్లుగా వలంటీర్‌గా సేవలు అందిస్తున్నాను, ఈ మధ్యకాలంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మాపై బురద జల్లుతున్నారు. మీరు మాకు ధైర్యం ఇచ్చారు, థాంక్యూ అన్నా.
– స్వప్న, లబ్దిదారు, రాణిగారితోట, విజయవాడ తూర్పు నియోజకవర్గం
Comments
Please login to add a commentAdd a comment