టీడీపీ, జనసేన మూకల పోస్టింగులకు బలైన గీతాంజలి
ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
పిల్లల పేరిట రూ.20 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్
డిపాజిట్ పత్రాలను అందించిన ఎమ్మెల్యే శివకుమార్
తెనాలి: టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల అసభ్యకర పోస్టింగులకు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన గొల్తి గీతాంజలి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఆ కుటుంబానికి అందింది. గీతాంజలి కుమార్తెలు రిషిత, రిషికల పేరిట చెరొక రూ.10 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆ పత్రాలను గురువారం సాయంత్రం గీతాంజలి భర్త బాలచంద్ర సమక్షంలో చిన్నారులకు అందజేశారు.
ముందుగా గీతాంజలి చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావుతో కలిసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం డిపాజిట్ పత్రాలను చిన్నారులకు అందజేశారు. ప్రభుత్వం ద్వారా తన కుటుంబానికి జరిగిన మేలును గీతాంజలి బహిరంగంగా మీడియాలో చెప్పటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వికృత పోస్టింగులతో ఆమె బలవన్మరణానికి కారకులయ్యారని ఎమ్మెల్యే శివకుమార్ ధ్వజమెత్తారు.
తన చేత్తో ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను అందుకున్న గీతాంజలి భౌతికకాయానికి తానే పూలమాల వేయాల్సి రావటం ఎమ్మెల్యేగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతగానో కలచివేసిందన్నారు. అమాయక మహిళలపై ఇలాంటి వేధింపులకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు.
ఎన్నారై పంచ్ ప్రభాకర్ రూ.2 లక్షల సాయం
టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబానికి ఎన్నారై పంచ్ ప్రభాకర్ రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఆయన పంపిన డబ్బును గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి, స్థానిక నేతలు గీతాంజలి భర్త బాలచంద్ర, చిన్నారులు రిషిత, రిషికలకు అందజేశారు.
ఈ నగదు సాయం చేసిన ఎన్నారై పంచ్ ప్రభాకర్ వీడియో కాల్ ద్వారా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆందోళన చెందవద్దని, ఇద్దరు పిల్లలు ఎంతవరకు చదువుకున్నా ఖర్చులను తన మిత్ర బృందంతో కలిసి తామే భరిస్తామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇలాంటి వేధింపులు బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆర్థిక సాయం అందించిన పంచ్ ప్రభాకర్‌కు బాలచంద్ర ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment