బస్సుయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, మంత్రి విడదల రజిని, నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లెల రాజేష్
సాక్షి ప్రతినిధి, గుంటూరు/చిలకలూరిపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన చేయూతతో తాము సాధించిన అభివృద్ధిని, సాధికారతను బడుగు, బలహీన వర్గాల ప్రజలు వేనోళ్ల వినిపించారు. సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో విజయగీతిక వినిపించారు. ఈ యాత్రకు నియోజకవర్గం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వేలాదిగా తరలివచ్చారు. తాము సాధించిన అభివృద్ధిని వివరించారు. జై జగన్ అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. వారికి పట్టణ ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు.
నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు నేతృత్వంలో నూతన వ్యవసాయ మార్కెట్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు ఈ యాత్ర జరిగింది. పట్టణంతోపాటు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో కళా మందిర్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభ జనసంద్రాన్ని తలపించింది. ఈ భారీ బహిరంగ సభలో ప్రసంగించిన పలువురు నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆరి్థకంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్న వైనాన్ని వివరించారు. ఆ సమయంలో సభకు హాజరైన ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.
సామాజిక న్యాయ సారథి సీఎం వైఎస్ జగన్ : మంత్రి విడదల రజిని
ముఖ్యమంత్రి వైఎస్ జనగ్‌మోహన్ రెడ్డి సామాజిక న్యాయ సారథిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాలుగా అగ్రస్థానంలో నిలబెడుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలను ఈ వర్గాలకు అందిస్తూ సాధికారత దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకే పెద్దపీట వేస్తున్నారన్నారు. చిలకలూరిపేటలో తొలిసారి బీసీ మహిళని నిలబెట్టి ఏ రాజకీయపార్టీ ఎన్నడూ చేయని సాహసాన్ని జగనన్న చేశారన్నారు.
ఈ స్థానాన్ని గెలుపొందడంతోపాటు బీసీ మహిళకు వైద్య, ఆరోగ్య శాఖను అప్పగించారని గుర్తు చేశారు. మున్సిపాలిటీ ఓసీకి రిజర్వు అయితే మైనారిటీకి చైర్మన్ ఇచ్చామని, మార్కెట్ యార్డును ఎస్సీలకు రెండుసార్లు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తెలిపారు. అన్ని వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని, దీనికి చిలకలూరిపేటే నిదర్శనమన్నారు.
రూ. 2 వేల కోట్లతో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.900 కోట్లతో నిరి్మస్తున్న బైపాస్ త్వరలో పూర్తవుతుందన్నారు. పట్టణానికి మంచినీరందించేందుకు రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని తెచ్చామన్నారు. ఎస్సీ భవన్, బీసీ భవన్, కాపు కమ్యూనిటీ హాల్‌కు త్వరలో శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. కోటి రూపాయలు సొంత నిధులతో షాదీఖానా కట్టించామన్నారు. కార్పొరేట్ స్థాయిలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇంగ్లిష్ మీడియంతో బడుగుల ఉన్నతి: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
సమాజంలో అణచివేతకు గురైన వర్గాలను సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టి బడుగుల ఉన్నతికి బాటలు వేశారని చెప్పారు. సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఈ సమాజంలో అణచివేతకు గురైన వారందరూ చదువుకుని పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదుగుతారని వివరించారు.
అన్ని పదవుల్లో పెద్దపీట వేస్తున్నారు: ఎమ్మెల్యే ముస్తఫా
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిన ముఖ్యమంత్రి స్వతంత్ర భారత చరిత్రలో సీఎం జగన్ ఒక్కరేనని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా చెప్పారు. ఈ వర్గాలను ఇంతలా అభివృద్ధి చేసిన సీఎంలు ఎవరూ లేరన్నారు. అన్ని పదవుల్లోనూ ఈ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు.
బాబు కల్లపోల్లి మాటలు నమ్మొద్దు: ఎమ్మెల్సీ ఏసురత్నం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. ఈ రాష్ట్రానికి ఏ మేలూ చేయని చంద్రబాబునాయుడు కల్లపోల్లి మాటలు చెబుతూ మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారని, ఆయన మాటలు నమ్మొద్దని చెప్పారు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి అమలు చేయలేదన్నారు. బాబు 14 ఏళ్ల పాలనలో కేంద్రం 14 లక్షల గృహాలు మంజూరు చేస్తే, పది వందలు కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు జగన్ 31 లక్షల మందికి గృహ వసతి కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment