సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ సారథ్యంలో వైఎస్సార్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పూర్తి మద్దతు ఉందని, వారి సహకారంతోనే త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. తాడేపల్లిలో గురువారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షులు పోతుల సునీత, రుతు కళ్యాణి నేతృత్వంలో రాష్ట్ర కమిటి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మహిళా సాధికారత అమలు చేసినట్లు తెలిపారు. కులాలు మతాలకు అతీతంగా మహిళా సాధికారతకు సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. మహిళలకు ఉద్దేశించి రూపొందించిన అన్ని పథకాలూ మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికేనని అన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి. దేశ స్థూల ఉత్పత్తి అభివృద్దికి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి అభివృద్దిలో మహిళలు ప్రధాన పాత్ర పోషించాలన్నదనే సీఎం జగన్ ఉద్దేశ్యమని అన్నారు.
చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. మొత్తం జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నప్పుడు వారికి 30 శాతం కన్నా 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రధాని కలిసిన ప్రతిసారీ మహిళా సాధికారత, రిజర్వేషన్లు గురించి ప్రస్థావించడంతో కల సాకారమయ్యిందని అన్నారు.
సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళలకు అనేక రకాలుగా వివిధ పథకాల కింద ఆర్థిక తోడ్పాటు అందించారన్నారు. డీబీటీ ద్వారా 3,43,02,005 మహిళా లబ్దిదారులు రూ.95,867 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 30,76,018 మందికి రూ.75,670 కోట్లు ఆర్థిక సహకారం అందించారన్నారు. ఈ గణాంకాలు మహిళలపై జగన్ ప్రభుత్వం చిత్తశుద్దికి అద్దం పడుతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం, ఆరోగ్యం, విద్య, వైద్యం, రక్షణ కోసం వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు, నవరత్నాలు కింద 2023 బజ్డెట్ లో మొత్తం రూ.27697 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 30 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, స్వేచ్ఛా కార్యక్రమం, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న బడుగు వికాసం మహిళలకు అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారన్నారు.
వైకాపాతోనే కాపులకు న్యాయం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేస్తం పథకం కింద సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున 5 సంవత్సరాల్లో రూ.75 వేలు మొత్తం 357844 మంది మహిళల ఖాతాల్లో రూ.2028.77 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. అయితే గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాపులకు ఏమి చేశారో చెప్పలేకపోయారని అన్నారు. వైఎస్సార్ హౌసింగ్ స్కీం కింద 3076018 మహిళలకు ఇళ్ల పట్టాలు అందించారని అన్నారు. అలాగే వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 41770406 మంది మహిళా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసినట్లు తెలిపారు. తల్లీబిడ్డ పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో 55.1 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో దిశ చట్టం పగడ్బంధీగా అమలు చేయడంతో గతంలో కంటే మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. మహిళలపై నేరాలు 2019లో 67.09 శాతం ఉండగా, 2020లో 65 శాతానికి తగ్గినట్ల తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ ఎఫ్ హెచ్ఎస్) డేటా ప్రకారం రాష్ట్రంలో మహిళలపై లింగ వివక్ష, హింస 43.04శాతం నుండి 30 శాతానికి తగ్గినట్లు తెలిపారు.
జాతీయ స్థాయికి మించి ఏపీలో బాలికల ఎన్రోల్మెంట్
అలాగే మాధ్యమిక విద్యా స్థాయిలో బాలికల ఎన్రోల్మెంట్ జాతీయ స్థాయిలో 79.04 ఉండగా ఏపీలో 84 ఉందన్నారు. దేశంలో కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఏపీ ఉందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళల్లో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిందని, మహిళా కార్మికులు భాగస్వామ్యం 10.86 శాతం పెరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళల కోసం రూ.12628 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మహిళలకు వైఎస్సార్‌సీపీ ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర పార్టీలు ఇవ్వడం లేదని అన్నారు.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహిళల సపోర్టుతో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. గతంలో నామినేటెడ్ పోస్టులు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేని వారికి ఈ సారి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మహిళలు పూర్తి సంతృప్తితో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళలకు జరుగుతున్న మంచి, లబ్దిని జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి వరకు తీసుకెళ్లాలని కోరారు.
సమావేశాలకు లబ్ధి పొందుతున్న వారందరికీ అలాగే తటస్థులను ఆహ్వానించాలని సూచించారు. పార్టీ రూపొందించిన బ్రోచర్స్ పంపిణీ చేయాలని కోరారు. కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు, నంద్యాల, కోనసీమ, ఏలూరు, ప్రకాశం. వెస్ట్ గోదావరి, వైఎస్సార్ కడప జిల్లాలకు సంబంధించి మహిళా కమిటీలు ప్రకటించారని, తిరుపతి త్వరలో ప్రకటిస్తారని అన్నారు. క్రిష్ణా, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు , చిత్తూరు, సత్యసాయి, విశాఖ, అన్నమయ్య జిల్లాల కమిటీలు ప్రకటించాల్సి ఉందని అన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఈస్ట్ గోదావరి, విజయనగరం, ఎన్టీఆర్ జిల్లాలు పూర్తి చేయాల్సి ఉందని విజయసాయి రెడ్డి అన్నారు.
ప్రతిపక్షాల కుట్రలు తిప్పుకొట్టాలి: ఎమ్మెల్సీ పోతుల సునీత
వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ మహిళలకు రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ గారు అనేక అవకాశాలు కల్పించాలని చెప్పారు. ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అందేలా పాలన సాగిస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టర్లు మహిళలకే 50 శాతం కేటాయించేలా జగన్ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు.
ప్రత్యక్ష నగదు బదిలీ,ఇతర పథకాల ద్వారా పెద్ద ఎత్తున మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.. మహిళలకు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అందరికీ చెప్పాల్సిన బాధ్యత మనమీద ఉందన్నారు..జగన్ గారి మీద వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను విమర్శలను తిప్పుకొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. గత చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత హామీలతో అప్పుల పాలైన పొదుపు సంఘాల మహిళలను వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఈ ప్రభుత్వం ఆదుకుందన్నారు.కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడితే, ఆ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు.
ప్రగతి బాటలో మహిళలు: వరుదు కళ్యాణి
వైఎస్సార్ కాంగ్రెస్ మహిళ విభాగం మరో అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా గౌరవంగా జీవిస్తున్నారని అన్నారు. సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా మహిళా సాధికారతతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా దేశంలోనే మందుందని చెప్పారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన సీఎం జగన్ ప్రతి పథకంలోనూ లబ్ధిదారులుగా గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక కార్యక్రమాలతో రాష్ట్రంలో మహిళలు ప్రగతి బాటలో పయనిస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పైగా పదవులు మహిళలకు ఇచ్చి జగన్ గౌరవించారని చెప్పారు. నవరత్నాలు వంటి అనేక పథకాల్లో 90% పైగా మహిళలు లబ్ధిదారులు ఉన్నారని తద్వారా ప్రతి ఇంటిలో మహిళకు అత్యంత ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం దోహదం చేస్తుందని ఆమె చెప్పారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర మహిళా విభాగానికి ఉందని పిలుపునిచ్చారు
Comments
Please login to add a commentAdd a comment