సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేకొద్దీ కరెంట్, నీటి సరఫరా, డ్రైనేజీ లాంటి కనీస సదుపాయాలను అందుబాటులోకి తేవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కొత్త ఇళ్లలోకి ప్రవేశించే ముందు ఎవరైనా తొలుత వీటినే కోరుకుంటారని, అందువల్ల ఈ మూడింటిని తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..
నిర్ణీత దశకు రాగానే కరెంట్ కనెక్షన్
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టిడ్కో ఇళ్లు కాకుండా రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పటికే ఇళ్ల నిర్మాణాల కోసం ఖర్చు పెట్టాం. గృహ నిర్మాణాలు పూర్తవుతున్నకొద్దీ కనీస సదుపాయాలను కల్పించాలి. ఇళ్ల లబ్ధిదారులతో క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. నిర్మాణం నిర్ణీత దశకు చేరుకోగానే ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి. ఇందుకు తగ్గట్టుగా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.
ప్రత్యామ్నాయ స్థలాలు..
రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఏర్పాటైన కాలనీల్లో లక్షల ఇళ్లను నిర్మించడం ద్వారా నిరుపేదలకు గృహ యోగం కల్పిస్తున్నాం. కొన్ని చోట్ల న్యాయ వివాదాల కారణంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వాటిపై దృష్టి సారించాలి. కోర్టు వివాదాలతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయిన చోట్ల వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషించి ఆ స్థలాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలి.
గృహనిర్మాణశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
లేఔట్ల సందర్శన.. 4 రకాల పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. టిడ్కో ఇళ్లు కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణాల కోసం ఇప్పటివరకు రూ. 6,435 కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. క్రమం తప్పకుండా లేఔట్లను సందర్శించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నామని, డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దఫాలు లేఔట్లను పరిశీలించినట్లు వెల్లడించారు.
ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి మొత్తం నాలుగు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని లేఔట్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన ల్యాబ్‌లను కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు.
సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, ప్రత్యేక కార్యదర్శులు అజయ్‌జైన్, సాయిప్రసాద్, విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీ షా, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment