పేదలందరికీ ఇళ్లు పథకానికి మనందరి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన అనంతరం వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలి. ఈ మేరకు భవిష్యత్ ప్రణాళిక ఉండాలి. కోర్టు కేసుల కారణంగా పలువురు లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని నిర్ణయించాం. ఈ క్రమంలో భూసేకరణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి.
- సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సొంత ఇల్లు అనేది పేదల చిరకాల స్వప్నం అని, ఈ క్రమంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల్లో ఏ చిన్న లోపానికి కూడా తావు ఇవ్వద్దని గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. లే అవుట్‌లలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ, ప్రతి పేద కుటుంబానికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలన్నారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. వర్షాలు పూర్తిగా తగ్గి, వాతావరణం అనుకూలిస్తుండటంతో గత డిసెంబర్ నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలిపారు. నిర్మాణంలో నాణ్యత లోపించకుండా తీసుకున్న చర్యలను వివరించారు.
నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు మెటల్ నాణ్యతపై 285 పరీక్షలు.. సిమెంటుపై 34, స్టీలుపై 84, ఇటుకలపై 95 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయిన 15 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు వివరించారు. కోర్టు కేసుల కారణంగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని రెండు లేఅవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామన్నారు.
సుమారు 30 వేల మందికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం జనవరి ఆఖరు నాటికి రూ.7,630 కోట్లు ఖర్చు చేశామన్నారు. మొత్తంగా ఈ పథకం మొదలు పెట్టినప్పటి నుంచి రూ.13,780 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 2.75 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, మరో 74 వేల ఇళ్లకు స్లాబ్ వేసే పనులు కొనసాగుతున్నాయని, ఇంకో 79 వేల ఇళ్లు రూఫ్ లెవెల్లో ఉన్నాయన్నారు.
మార్చి నాటికి సుమారు 5 లక్షల ఇళ్లు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు కరెంట్, నీటి కనెక్షన్‌లు వెంటనే ఇవ్వాలని, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది.. లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఏ ప్రభుత్వం చేయని విధంగా సాయం
► పేదల సొంతింటి కలను సాకారం చేయడం కోసం చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనం చర్యలు తీసుకున్నాం. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల’ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ఖర్చును ఓసారి పరిశీలిస్తే.. ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక పంపిణీ, తక్కువ ఖరీదుకే సామగ్రిని అందించడం రూపంలో ప్రభుత్వం రూ.13,780 కోట్లు ఖర్చు చేసింది.
► ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,117 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్, జగనన్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు తదితర సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు వెచ్చిస్తున్నాం. అంటే కేవలం జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసమే రూ.36,026 కోట్ల మేర ఖర్చు చేస్తున్నాం.
► పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రూ.17,132.78 కోట్ల విలువ చేసే 28,554.64 ఎకరాల ప్రభుత్వ భూములు తీసుకున్నాం. రూ.15,364.5 కోట్ల విలువ చేసే 25,374.66 ఎకరాల భూములను కొనుగోలు చేశాం. విశాఖలో పేదలకు పంపిణీ చేసిన భూముల విలువ రూ.12,405 కోట్లు. ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన ఇతర భూములు 13,425.14 ఎకరాలు. వీటి విలువ రూ.11,200.62 కోట్లు. ఇలా మొత్తంగా అన్ని రకాలుగా ఇళ్ల పట్టాల కోసం పేదలకు పంచిన భూములు 71,811.49 ఎకరాలు కాగా, వీటి విలువ రూ.56,102.91 కోట్లు. ఇలా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కోసం మన ప్రభుత్వం రూ.1,05,908.91 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూరుస్తోంది.
గణనీయమైన సహాయం
► మరోవైపు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మన ప్రభుత్వం గణనీయమైన సహాయం చేస్తోంది. గత మూడున్నరేళ్లలో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, 300 చదరపు అడుగుల ఇళ్లు ఉచితంగా అందించడం, మిగిలిన కేటగిరీల లబ్ధిదారులకు తమవంతుగా చెల్లించిన వాటిపై సబ్సిడీ ఇవ్వడంతో పాటు, ఉచితంగా రిజిస్ట్రేషన్‌ల రూపంలో అండగా నిలిచాం.
► టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.8,015 కోట్లు. మన ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాల విలువ చూస్తే మొత్తంగా రూ.20,755 కోట్లు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ఖర్చు, మౌలిక సదుపాయాల కోసం ఈ మూడున్నరేళ్లలో రూ.8,734 కోట్లు ఖర్చు పెట్టాం. దీంతో పాటు 300 చదరపు అడుగుల ఇళ్లను ఉచితంగా ఇవ్వడం ద్వారా దాదాపు రూ.10,339 కోట్ల లబ్ధి చేకూర్చాం. 300 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు తమ వంతుగా చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేసి వారికి ఎంతో ఉపశమనం కలిగించాం.
► మిగిలిన వారికీ ఊరట కల్పించే చర్యల్లో భాగంగా 365, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు తమ వంతుగా చెల్లించాల్సిన డబ్బులో కల్పించిన సబ్సిడీ కారణంగా రూ.482 కోట్ల మేర మేలు చేకూర్చాం. రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా తొలగించి ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా మరో రూ.1,200 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది.
► ఈ సమీక్షలో గృహ నిర్మాణ, మున్సిపల్ శాఖ మంత్రులు జోగి రమేశ్, ఆదిమూలపు సురేశ్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదిన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీషా, జేఎండీ శివప్రసాద్, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment