రెండున్నరేళ్లలో నిర్మించి తీరుతాం | CM KCR comments on two-bedroom house | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లలో నిర్మించి తీరుతాం

Published Wed, Dec 28 2016 12:20 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

రెండున్నరేళ్లలో నిర్మించి తీరుతాం - Sakshi

రెండున్నరేళ్లలో నిర్మించి తీరుతాం

2.6 లక్షల రెండు పడక గదులు ఇళ్లు కట్టిస్తాం: సీఎం

- ఒక్క రూపాయీ అక్రమం ఉండదు.. ఒక్క రూపాయీ భారం ఉండదు
- గతంలో అక్రమాలెన్నో.. అందుకే కొత్త పథకంలో జాగ్రత్తలు తీసుకున్నాం
- ఇక శర వేగంగా పనులు జరుగుతాయని వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: రెండున్నరేళ్లలో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా, పూర్తి పారదర్శకంగా, పేదలపై ఒక్క పైసా భారం మోపకుండా వంద శాతం ప్రభుత్వ నిధుల తోనే ఇళ్లు నిర్మించి ఇస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని ఎక్కువ నిర్మాణ సంస్థలు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టుల్లోపాలుపంచుకుంటుండడంతో.. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావటం లేదన్నారు. డబుల్‌ ఇళ్ల పనుల్లో ఎక్కువ లాభం ఉండే అవకాశం లేక పోవటం వల్ల కూడా వెనుకంజ వేస్తున్నారని.. ఫలితంగా పనుల్లో కొంత జాప్యం జరిగిందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకున్నామని, ఇక పనుల్లో వేగం పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన రూ.17,660 కోట్లు సిద్ధం చేసుకున్నామని వెల్లడించారు. మంగళవారం శాసనసభలో రెండు పడక గదుల ఇళ్లు, రాజీవ్‌ స్వగృహ, రాజీవ్‌ గృహకల్పతోపాటు బలహీనవర్గాల గృహ నిర్మాణ పథకంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు.

లక్షల మందికి ఇళ్లు కావాలి
‘‘బలహీనవర్గాల ఇళ్ల పథకం కింద ఉమ్మడి రాష్ట్రంలో 2003 వరకు 17,34,826 ఇళ్లను నిర్మించారు. అందుకు రూ.1,805.26 కోట్లు వెచ్చించారు. 2004 నుంచి 2014 వరకు 24,91,870 ఇళ్లను నిర్మించినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు రూ.9,075 కోట్లు ఖర్చు చేశారు. రాజీవ్‌ స్వగృహ కింద రూ.1,621 కోట్లతో 12,089 ఇళ్లు, రాజీవ్‌ గృహకల్ప కింద రూ.392 కోట్లతో 37,217 ఇళ్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో జేఎన్‌ఎన్‌యూ ఆర్‌ఎం కింద 46,519, వాంబే పథకం కింద 6,608 ఇళ్లు కట్టినట్టు రికార్డుల్లో ఉంది. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి ఇక్కడ 43,29,124 ఇళ్లు బలహీనవర్గాల పేరుతో నిర్మించారు. అంటే కొత్త ఇళ్ల అవసరమే ఉండదు. కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ లక్షల మంది తమకు ఇళ్లు కావాలని   దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అంటే ప్రభుత్వ లెక్కల్లో ఉన్నట్టు ఇళ్ల నిర్మాణం జరగలేదు. ఆ పేరుతో చూపిన ఖర్చంతా అవినీతిపరుల జేబుల్లోకి చేరిందన్నది కూడా వాస్తవమే.

భారీగా అవినీతి..
ఇళ్ల పథకం పార్టీల కార్యకర్తల దోపిడీ పథకంగా మారింది. గ్రామాల్లోని కుటుంబాల సంఖ్య కంటే ఎక్కువ ఇళ్లు మంజూరు చేయించి నిధులు కాజేసిన ఘటనలు కోకొల్లలు. నాటి ప్రభుత్వ విచారణలోనే అక్రమాలు వెలుగుచూశాయి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 225 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 122 మంది అధికారులు, 113 మంది దళారులు, రాజకీయ నేతలున్నారు. ఒక జెడ్పీటీసీ, ముగ్గురు ఎంపీటీసీలు, 14 మంది సర్పంచులు, ముగ్గురు సింగిల్‌ విండో చైర్మన్లు అవినీతికి పాల్పడ్డట్టు తేలింది. 1,94,519 మంది అనర్హులు ఇళ్లు పొందారని, వారికి రూ.235.9 కోట్లు చెల్లించారని బయటపడింది. 512 మంది గృహనిర్మాణ శాఖ అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించారు. మరో 140 మందిని సస్పెండ్‌ చేశారు. వీరిలో 122 మందిపై ఆరోపణలు రుజువై శిక్షలు కూడా పడ్డాయి. రూ.2.86 కోట్లను రికవరీ చేశారు. తెలంగాణ వచ్చాక ఈ అవినీతి పూర్తి నిగ్గు తేల్చేందుకు సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం. అది కొనసాగుతోంది. అర్హులకు అన్యాయం జరగొద్దన్న ఉద్దేశంతో సర్వే చేయించి.. అర్హుల సంఖ్యను 2,46,170గా తేల్చాం. మా ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటివరకు రూ.369.48 కోట్లు చెల్లించాం. ఇందిరమ్మ ఇళ్లన్నీ పూర్తయ్యాక రూ.1,159.85 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని కూడా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

రాజకీయ జోక్యం ఉండదు
‘ఈ పథకంలో ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యే కోటాల వంటివి లేకుండా చేశాం. గ్రామాలను ఎమ్మెల్యే ఎంపిక చేస్తే కలెక్టర్‌ ఆధ్వర్యంలోని అధికారుల బృందాలు లబ్ధిదారులను ఎంపిక చేసేలా.. రాజకీయ జోక్యం లేని విధానాన్ని తెచ్చాం. ఇప్పటికి 2.6 లక్షల ‘డబుల్‌’ ఇళ్లను మంజూరుచేశాం. 14,224 ఇళ్లకు టెండర్లు ఖరా రయ్యాయి. 1,217 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వివిధ ప్రాంతాల్లో 9,588 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మార్కెట్‌ ధరతో ప్రమేయం లేకుండా బస్తా రూ.230 చొప్పున సిమెంటు సరఫరా చేసేలా 31 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అని’ సీఎం పేర్కొన్నారు.

పటిష్టంగా ‘డబుల్‌’ పథకం
కొత్తగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల పథకంలో అవినీతి, అక్రమాలు, లోపాలు దొర్లకుండా ఏర్పాట్లు చేశాం. 1974లో గుడిసెల పథకం కింద రూ.400, 1978లో సెమీ పర్మినెంట్‌ హౌజ్‌ స్కీమ్‌ కింద రూ.వేయి చొప్పున చెల్లించారు. 1983లో పక్కా ఇంటి పథకంలో సబ్సిడీ ఇచ్చే విధానం అమల్లోకి వచ్చింది. సబ్సిడీ పోగా మిగతాది లబ్ధిదారు వాటా, బ్యాంకు రుణం రూపంలో క్రమంగా జనంపై భారం పెరుగుతూ వచ్చింది. దీంతో అప్పు చేయడం, రుణాల వసూలు కోసం అధికారులు వారి ఇళ్ల తలుపులు గుంజుకుపోవడం సాధా రణంగా మారింది. ఇలాంటి కష్టాలు ఇక ఉండొద్దన్న ఉద్దేశంతో రెండు పడక గదుల ఇళ్లకు ప్రణాళిక రూపొందించాం. ప్రజలపై పైసా భారం లేకుండా ప్రభుత్వమే ఇల్లు కట్టించే ఇలాంటి పథకంలో దేశంలో మరెక్కడా లేదు.

వారు రక్తం మరిగిన పులుల్లాంటోళ్లు..!
గృహనిర్మాణ శాఖలోని ‘అవినీతి’ సిబ్బందిపై కేసీఆర్‌ ఫైర్‌

గృహ నిర్మాణ శాఖలోని అవినీతి సిబ్బంది రక్తం మరిగిన పులుల వంటివారని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో వారు భారీగా అవినీతికి పాల్ప డ్డారని.. ఆ అవినీతిని భరించలేకనే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ఆ శాఖకు కేటాయిం చకుండా కలెక్టర్లకు అప్పగించామని స్పష్టంచేశారు. ‘‘నేను 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో వ్యవహారాలను అప్పటి నుంచీ గమనిస్తున్నా. అప్పట్లోనే అధికారులు కమీషన్లు తీసుకోవడం చూసిన. ‘పేదల ఎంగిలి కూడు తినకండి మంచిది కాద’ని ఎమ్మెల్యే హోదాలో అధికారులకు సూచించిన. వారిలో మార్పు రాలేదు.

వారు నెత్తురు మరిగిన పులిలాంటోళ్లు.. ఇందిరమ్మ పథకంతో పోలిస్తే రెండు పడక గదుల ఇళ్ల బడ్జెట్‌ చాలా ఎక్కువ. దీని బాధ్యతను కూడా అలాంటోళ్లకు అప్పగిస్తే.. అవినీతి ఇంకా ఎక్కువ ఉంటది. అందుకే కలెక్టర్లకే బాధ్యత అప్పగించాం. ఈ పథకంలో ఒక్క రూపాయి తిన్నా వదిలిపెట్టేది లేదు. ఉద్యోగాలు పీకేస్తాం. ఉద్యోగాలు ఉంచుకుంటరో, పోగొట్టుకుంటరో వారే తేల్చు కోవాలి..’’ అని కేసీఆర్‌ స్పష్టంచేశారు. గృహనిర్మాణంపై సీఐడీ విచారణలో భారీగా అక్ర మాలు బయటపడ్డాయని, ఇంకా విచారణ కొనసాగుతోందని, బాధ్యులుగా తేలిన ఎవరినీ వదిలే ప్రసక్తిలేదని హెచ్చరించారు. పేదలు రెండు తరాల పాటు ఎలాంటి చింత లేకుండా సంతృప్తిగా గడిపేలా రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement