మంజూరు కాని పక్కా ఇళ్లు
ఆగిన రూ.72 కోట్ల బిల్లులు
డ్వాక్రా మహిళలకు ఏదీ భరోసా
ఇష్టానుసారంగా తరలుతున్న ఇసుక
పండుటాకులకు తప్పని పింఛన్ కష్టాలు
నేడు కడపకు మంత్రి మృణాళిని రాక
సాక్షి కడప : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు పేద ప్రజలకు ఒరిగిందేమీలేదు. ప్రత్యేకంగా పేదలకు ఒక్కటంటే ఒక్క పక్కా గృహం కూడా మంజూరు కాకపోవడం గమనార్హం. ప్రస్తుత టీడీపీ సర్కార్ ఈ పథకానికి ఎన్‌టీఆర్ గృహనిర్మాణ పథకంగా పేరు మార్చిందే తప్ప నిరుపేదల గూడు.. గోడు గురించి మాత్రం పట్టించుకోలేదు. అలాగే డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణ మాఫీ అటకెక్కి.. ప్రస్తుతానికి పెట్టుబడి నిధి పేరుతో స్థిరీకరించడం తప్ప మాఫీ కింద మహిళలలకు ఇచ్చింది మాత్రం గుండు సున్నా.
ఇష్టానుసారంగా తరలిపోతున్న ఇసుక..
జిల్లాలోని అనేక చోట్ల ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక ఇష్టానుసారం తరలిపోతోంది. కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఇదే అదనుగా భావించుకుని అందినకాడికి దోచుకునేందుకు రీచ్‌లను ఉపయోగించుకుంటున్నారు. మరికొందరు తెలుగుదేశం నేతలు ఇసుక దోపిడీకి తెరలేపారు. నదిలోని ఇసుకను రాత్రికి రాత్రి బెంగళూరు, చెన్నైకి తరలిస్తూ.. లక్షలు ఆర్జిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు కూడా నోరుమెదపడం లేదు. దీంతో ఇసుక భారీగా తరలిపోతోంది. వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో పలుచోట్ల ఇసుకరీచ్‌లు వద్దని పదేపదే ప్రజలు మొత్తుకుంటున్నా.. వారి మాటను పెడచెవిన పెడుతూ.. ఇసుక రీచ్‌లను తెరిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రూ.72 కోట్ల మేర ఆగిన బిల్లులు..
జిల్లా వ్యాప్తంగా గృహనిర్మాణాలకు సంబంధించి సుమారు రూ.72.48 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 17,188 గృహాల్లో 3987 మంది లబ్ధిదారులకు తక్షణమే 21 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇంతవరకూ చెల్లించలేదు. అలాగే 11,424 గృహాలకు దాదాపు రూ. 51 కోట్లు కలుపుకుంటే మొత్తం రూ.72 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల అప్పట్లోనే గృహాలు మంజూరైనా బిల్లులు వస్తాయో రావో అన్న అభద్రతా భావంతో చాలామంది లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. దాదాపు యేడాదిన్నర కాలంగా ఎక్కడికక్కడ నూతన ఇంటి నిర్మాణాలు లేకపోగా.. ఒక్కటంటే ఒక్క గృహం కూడా కొత్తది మంజూరు కాలేదు. పైగా అవకతవకల పేరుతో జియోటాగ్‌లను పెడుతూ విచారిస్తున్న నేపథ్యంలో అక్రమార్కులపై చర్యలు తీసుకుంటూనే కొత్త ఇళ్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
పండుటాకుల కష్టాలు..
కొత్తగా ట్యాగ్‌లు తలమీదికి రావడంతో పండుటాకులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు.. బయోమెట్రిక్.. ఇతర సంతకాలు, ఐరీస్ సేకరణ చేపట్టిన ప్రభుత్వం, తాజాగా ట్యాగ్‌ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించి అమలు చేస్తోంది. అయితే పూర్తిస్థాయిలో సిబ్బందికి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పండుటాకులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
నేడు మంత్రి మృణాళిని రాక..
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, హౌసింగ్‌శాఖ మంత్రి కిమిడి మృణాళిని బుధవారం కడపకు రానున్నారు. ప్రత్యేకంగా అధికారులతో సమీక్ష కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
కష్టాలు ఆలకించరూ!
Published Wed, Aug 5 2015 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement