‘చాల్స్’ స్థలాల యజమానులెవరు? | The letter to the Department of Revenue in the Housing Department | Sakshi
Sakshi News home page

‘చాల్స్’ స్థలాల యజమానులెవరు?

Published Fri, Aug 21 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

The letter to the Department of Revenue in the Housing Department

♦ రెవెన్యూ శాఖకు గృహనిర్మాణ శాఖ లేఖ
♦ చాల్స్ యాజమాన్యంపై కొరవడిన స్పష్టత
♦ ఆదర్శ్ కుంభకోణం తర్వాత అప్రమత్తమైన ప్రభుత్వం
 
 సాక్షి, ముంబై : నగరంలో బాంబే డవలప్‌మెంట్ డిపార్టుమెంట్ (బీడీడీ) నిర్మించిన చాల్స్ స్థలాల యజమానులెవరో తెలపాలని కోరుతూ రెవెన్యూ శాఖకు గృహనిర్మాణ శాక లేఖ రాసింది. శిథిలావస్థకు చేరుకున్న బీడీడీ చాల్స్‌ను పునరుద్ధరించి పేదలకు పక్కా గృహాలు అందజేయాలని 1980 నుంచి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎంతమంది ప్రయత్నించినా ఆ ప్రతిపాదన చర్చలకే పరిమితం కావడంతో ప్రత్యక్షంగా కార్యరూపం దాల్చలేకపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఇందుకు సంబంధించిన పనులు వేగవంతం చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. 2022 నాటికల్లా నగరంలో వర్లీ, శివ్డీ, రే రోడ్, డిలాయిల్ రోడ్ ప్రాంతాల్లో ఉన్న మొత్తం 207 బీడీడీ చాల్స్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాని ఆ చాల్స్ స్థలాల హక్కులు ఎవరివో ఇంతవరకు స్పష్టంగా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో స్థలాల యజమానులెవరో ముందు తెలుసుకోవాలని గృహనిర్మాణ శాఖ లేఖ రాసింది.

 ది గవర్నర్ ఆఫ్ బాంబే..: కాగా ఈ స్థలాలకు సంబంధించిన ప్రాపర్టీ నామిని కార్డుపై ‘ది గవర్నర్ ఆఫ్ బాంబే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియన్ కౌన్సిల్, గవర్నర్ ఆఫ్ బాంబే’ అని నమోదై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ స్థలాలు తమవే అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. కాని కొద్ది నెలల కిందట సంచలనం సృష్టించిన కొలాబాలోని ‘ఆదర్శ సొసైటీ’ కుంభకోణం ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

స్థలాల యజమానులు ఎవరో ముందు ఆరా తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముంబైలో 1925 కంటే ముందు నిర్మించిన ఈ బీడీడీ చాల్స్‌లో సుమారు 16,700 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇందులో కొన్ని పోలీసు, ప్రభుత్వ సిబ్బంది క్వార్టర్స్ కూడా ఉన్నాయి. త్వరలో టెండర్లు ఆహ్వానించి అర్హులైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలనే ప్రతిపాదన ను ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే స్థలాల యజమానులెవరో తెలుసుకున్న తరువాతే ప్రత్యక్షంగా పనులు ప్రారంభించేందుకు వీలుంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement