సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జన గణనకు మించిన తాజా వివరాలతో, వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా స్మార్ట్ పల్స్ సర్వే సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సర్వే వల్ల రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి, కుటుంబ ఆదాయం, ఆరోగ్యం, సామాజిక భద్రత, తదితర సంపూర్ణ వివరాలు తెలుసుకోవడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేర్చడానికి వీలవుతుందన్నారు. ఇది సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాదని తెలిపారు. ఈ నెల మూడవ వారంలో చేపట్టనున్న స్మార్ట్ పల్స్ సర్వేపై శనివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, 13 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి ప్రయోజనాన్ని రాష్ట్రంలో చిట్టచివరి గుమ్మం వరకూ చేర్చాలన్నదే తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఈ సర్వేను ప్రతి అధికారి ఒక యాగంలా నిర్వహించాలని కోరారు. 35 వేల బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయని, ఒక్కో ఎన్యుమరేటర్ రోజూ 14 ఇళ్లకు వెళ్లి డేటాను సేకరిస్తారని చెప్పారు. సర్వే అధికారుల మధ్య సమన్వయం కోసం కమాండ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 22న పల్స్ సర్వే కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మొత్తం సర్వేకు రెవెన్యూ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందన్నారు.
వాటి ఆధారంగానే సర్వే..
ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, కుళాయి బిల్లు, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రం, కిసాన్ పత్రం, డ్వాక్రా సర్టిఫికెట్, పోస్ట్ లేదా ప్రి మెట్రిక్ స్కాలర్ షిప్ వంటి 20 కొలమానాల ఆధారంగా సర్వే నిర్వహిస్తామన్నారు. ఈ సర్వేను మిషన్ మోడ్‌లో నిర్వహించాలని అధికార యంత్రాంగానికి సూచించారు.
పక్కాగా పల్స్ సర్వే: సీఎం
Published Sun, Jun 19 2016 1:39 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM
Advertisement
Advertisement