సాక్షి,గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త సూపరింటెండెంట్ ఎస్‌ఎస్‌వీ రమణ ఓవరాక్షన్ చేశారు. కొత్త సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించకపోయినా తానే సూపరింటెండెంట్ అంటూ ఎస్‌ఎస్‌వీ రమణ హడావిడి చేశారు. అయితే ఎస్‌ఎస్‌వీ రమణ వ్యవహారంపై సీనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ రౌడీ షీటర్ నవీన్ చేతిలో హ త్యకు గురైన మృదుల సహానా కేసు విషయంలో ప్రభుత్వం చెప్పింది చేయలేదని కక్షగట్టి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ కిరణ్ కుమార్‌ను ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించింది. కిరణ్ కుమార్ స్థానంలో ఎస్‌ఎస్‌వీ రమణను జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ సోమవారం రాత్రి జీవో జారీ చేసింది. కొత్త సూపరింటెండెంట్ నియామకంపై డీఎంఈ.. జీజీహెచ్‌కీ సమాచారం ఇవ్వలేదు.
రౌడీషీటర్ నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీయూలో ఉంచి ఆస్పత్రి అధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్ చేతిలో దారుణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.
దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్ నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు.
ఆమెకు మరుసటి రోజు ఉదయం 6 గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సీరియస్ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment