‘మార్కెట్ విలువ సవరణ’పై పిల్..
ప్రతివాదులకు నోటీసులిచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించబోమంటూ జారీ చేసిన మెమోపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వ వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఐజీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ సమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. భూముల మార్కెట్ విలువలను సవరించబోమంటూ రెవెన్యూ (స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ నెల 2న జారీ చేసిన మెమోను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత, రైతు నాయకుడు ఎం.కోదండరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి, విచారణ జరిపింది.
అమలు కచ్చితమేమీ కాదు..
ప్రభుత్వం చట్ట ప్రకారం ఏడాది తరువాత ఏడాది మార్కెట్ విలువలను సవరించి తీరాల్సిందేనని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. మార్కెట్ విలువల సవరణపై నిర్ణయం తీసుకునే పరిధి స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేదన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... తెలంగాణ రాష్ట్ర మార్కెట్ విలువ సవరణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సవరణ విషయంలో అవి మార్గదర్శకం మాత్రమే చేస్తాయన్నారు.