ఏ భూమి అయినా ధరణిలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా స్లాట్ బుక్ చేయాలి. పట్టాదారు పాస్‌బుక్, ఖాతా నంబర్, సర్వే నంబర్, క్రయ విక్రయాలు చేసే వ్యక్తుల పేర్లు, వారి ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్లు ఆ స్లాట్‌లో పొందుపరచాలి. కానీ ఇక్కడ ఆ భూమికి సంబంధించి ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోయినా, సర్వే నంబర్, ఖాతా నంబర్‌తో పనిలేకుండా స్లాట్ ఎలా బుక్ అయ్యింది? రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఏకంగా ‘బిలా దాఖలా’ భూమికి ఎసరు పెట్టారు. రికార్డులు లేవనే సాకుతో పొజి షన్‌లో ఉన్న రైతులను మభ్యపెట్టి బహిరంగ మార్కెట్ కంటే.. చౌకధరకు ఈ భూములు కొట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వెంటనే వాటికి సర్వే నంబర్ సృష్టించి, ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, వారు దరఖాస్తు చేసిందే తడవుగా అధికారు లు ఈ భూములను వారి పేరున బదలాయిస్తున్నారని అంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.వెయ్యి కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని.. చాలా తక్కువ రేటుకు కొనేస్తున్నారని సమాచారం.
కోకాపేట సమీపంలో ఉండడంతోనే...
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల–కొండకల్ గ్రామాల మధ్యన కొండకల్ రెవెన్యూ పరిధిలో 76.24 ఎకరాల ఏ అడ్రస్ లేని(బిలా దాఖలా) భూమి ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవు. 45 మంది స్థానిక రైతులు ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. పొజిషన్‌లో ఉన్నా వారి పేర్లు కూడా రికార్డుల్లో లేవు. పహాణీలు, పట్టాదారు పాసు పుస్తకాలు అసలే లేవు.
కనీసం వీటి సర్వే నంబర్ ఏమిటో కూడా చాలామందికి తెలియదు. బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.15 కోట్ల పైమాటే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్‌కు ముఖ్యంగా కోకాపేటకు అతిసమీపంలో ఉన్న ఈ భూములపై కొంతమంది ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఎలాగైనా వీటిని చేజిక్కించుకోవాలని భావించి తెరవెనుక కథ నడిపించారు. ఏ అడ్రస్ లేని ఈ మిగులు భూములు ప్రభుత్వానికి చెందుతాయని, ఈ విషయం బయటకు చెబితే..వాటిని సర్కారు లాగేసుకుంటుందని చెప్పి రైతుల నోరు మూయిస్తున్నారు.
అంతా కలిసి..
ఓ వైపు రికార్డులు లేవని, ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తూ పొజిషన్‌లో ఉన్న రైతులను భయాందోళనకు గురి చేస్తూ.. మరోవైపు రెవెన్యూ అధికారులతో ఈ భూములకు ఎంజాయ్‌మెంట్ సర్వే చేయించారు. తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పాత రికార్డులను పరిశీలించి ఏడీ రిపోర్టు జారీ చేశారు. దీని ఆధారంగా కలెక్టర్ సూచన మేరకు సీసీఎల్‌ఏ ఈ భూములకు క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
అయితే అప్పటికే ఈ భూములపై కన్నేసిన బడా నేతలు, రియల్టర్లు, వ్యాపారులు పహాణీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే నంబర్, ఖాతా నంబర్లు లేవనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే తాము చూసుకుంటామని నమ్మ బలికారు. భూములు అమ్మాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసు కొచ్చారు. చేసేది లేక రైతులు కూడా తలవంచక తప్ప లేదు. రైతుల్లో ఉన్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని రూ.2 కోట్లకు ఎకరం చొప్పున 21 ఎకరాలకుపైగా కొల్లగొట్టారు. అంతేకాదు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించకుండానే ‘ధరణి’లో స్లాట్ బుక్ చేసి.. గుట్టుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు.
సర్వే నంబరు 555..దానికి బై నంబర్లు వేసి...
ఇప్పటి వరకు ఏ అడ్రస్ లేని ఈ భూములకు రైతుల నుంచి చేతులు మారిన వెంటనే కొత్త అడ్రస్ సృష్టించారు. సర్వే నంబర్ 555గా నామకరణం చేసి..బై నంబర్లతో ఆయా భూములను బడాబాబులకు కట్టబెడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే.. ఎక్కడ తన ఉద్యోగానికి ఎసరు వస్తుందోననే భయంతో ఈ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తుత తహసీల్దార్ సెలవులో వెళ్లి.. డిప్యూటీ తహసీల్దార్లతో పని కానిచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
శేరిగూడ భూములపైనా కన్ను
సంగారెడ్డి– రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని శేరిగూడ రెవెన్యూ పరిధిలోనూ 90 ఎకరాలకు పైగా బిలా దాఖలా భూములు ఉన్నాయి. వీటిని కూడా కొల్లగొట్టేందుకు రెవెన్యూ అధికారులు, నేతలు, రియల్టర్లు, వ్యాపారులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. విచిత్రమేమంటే.. ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి.. సాగు చేస్తున్న రైతుల పేర్లు మాత్రం ఇప్పటికీ ధరణిలో కనిపించడం లేదు. కానీ వారి నుంచి కొనుగోలు చేసిన నేతలు, వ్యాపారులు, రియల్టర్ల పేర్లు మాత్రం ఆ వెంటనే నమోదవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల కొంత మంది రైతులు మండల ఆఫీసులో ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం అనుమతించింది
కొండకల్ రెవెన్యూ పరిధిలో ‘బిలా దాఖలా’ భూములు ఉన్న మాట వాస్తవమే. వీటికి సంబంధించి గతేడాది ప్రభుత్వం ఎంజాయ్‌మెంట్ సర్వే చేయించింది. ఆ నివేదిక ఆధారంగా భూ రికార్డులు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాత రికార్డులను పరిశీలించి, వాటికి సర్వే నం.555గా నిర్ధారించింది. కలెక్టర్ సిఫార్సు మేరకు సీసీఎల్‌ఏ ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.’ అని చెప్పిన తహసీల్దార్ నయీమొద్దీన్.. పొజిషన్‌లో ఉన్న రైతుల వివరాలు ధరణిలో ఎందుకు నమోదు చేయడం లేదని ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేయడం విశేషం. – తహసీల్దార్, నయీమొద్దీన్
Comments
Please login to add a commentAdd a comment