survey number
-
‘అడ్రస్’లేని భూములకు సర్వేనంబర్
ఏ భూమి అయినా ధరణిలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా స్లాట్ బుక్ చేయాలి. పట్టాదారు పాస్‌బుక్, ఖాతా నంబర్, సర్వే నంబర్, క్రయ విక్రయాలు చేసే వ్యక్తుల పేర్లు, వారి ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్లు ఆ స్లాట్‌లో పొందుపరచాలి. కానీ ఇక్కడ ఆ భూమికి సంబంధించి ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోయినా, సర్వే నంబర్, ఖాతా నంబర్‌తో పనిలేకుండా స్లాట్ ఎలా బుక్ అయ్యింది? రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఏకంగా ‘బిలా దాఖలా’ భూమికి ఎసరు పెట్టారు. రికార్డులు లేవనే సాకుతో పొజి షన్లో ఉన్న రైతులను మభ్యపెట్టి బహిరంగ మార్కెట్ కంటే.. చౌకధరకు ఈ భూములు కొట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వెంటనే వాటికి సర్వే నంబర్ సృష్టించి, ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, వారు దరఖాస్తు చేసిందే తడవుగా అధికారు లు ఈ భూములను వారి పేరున బదలాయిస్తున్నారని అంటున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని.. చాలా తక్కువ రేటుకు కొనేస్తున్నారని సమాచారం. కోకాపేట సమీపంలో ఉండడంతోనే... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల–కొండకల్ గ్రామాల మధ్యన కొండకల్ రెవెన్యూ పరిధిలో 76.24 ఎకరాల ఏ అడ్రస్ లేని(బిలా దాఖలా) భూమి ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవు. 45 మంది స్థానిక రైతులు ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. పొజిషన్లో ఉన్నా వారి పేర్లు కూడా రికార్డుల్లో లేవు. పహాణీలు, పట్టాదారు పాసు పుస్తకాలు అసలే లేవు. కనీసం వీటి సర్వే నంబర్ ఏమిటో కూడా చాలామందికి తెలియదు. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.15 కోట్ల పైమాటే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్‌కు ముఖ్యంగా కోకాపేటకు అతిసమీపంలో ఉన్న ఈ భూములపై కొంతమంది ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఎలాగైనా వీటిని చేజిక్కించుకోవాలని భావించి తెరవెనుక కథ నడిపించారు. ఏ అడ్రస్ లేని ఈ మిగులు భూములు ప్రభుత్వానికి చెందుతాయని, ఈ విషయం బయటకు చెబితే..వాటిని సర్కారు లాగేసుకుంటుందని చెప్పి రైతుల నోరు మూయిస్తున్నారు. అంతా కలిసి.. ఓ వైపు రికార్డులు లేవని, ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తూ పొజిషన్లో ఉన్న రైతులను భయాందోళనకు గురి చేస్తూ.. మరోవైపు రెవెన్యూ అధికారులతో ఈ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయించారు. తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పాత రికార్డులను పరిశీలించి ఏడీ రిపోర్టు జారీ చేశారు. దీని ఆధారంగా కలెక్టర్ సూచన మేరకు సీసీఎల్ఏ ఈ భూములకు క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటికే ఈ భూములపై కన్నేసిన బడా నేతలు, రియల్టర్లు, వ్యాపారులు పహాణీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే నంబర్, ఖాతా నంబర్లు లేవనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే తాము చూసుకుంటామని నమ్మ బలికారు. భూములు అమ్మాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసు కొచ్చారు. చేసేది లేక రైతులు కూడా తలవంచక తప్ప లేదు. రైతుల్లో ఉన్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని రూ.2 కోట్లకు ఎకరం చొప్పున 21 ఎకరాలకుపైగా కొల్లగొట్టారు. అంతేకాదు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించకుండానే ‘ధరణి’లో స్లాట్ బుక్ చేసి.. గుట్టుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. సర్వే నంబరు 555..దానికి బై నంబర్లు వేసి... ఇప్పటి వరకు ఏ అడ్రస్ లేని ఈ భూములకు రైతుల నుంచి చేతులు మారిన వెంటనే కొత్త అడ్రస్ సృష్టించారు. సర్వే నంబర్ 555గా నామకరణం చేసి..బై నంబర్లతో ఆయా భూములను బడాబాబులకు కట్టబెడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే.. ఎక్కడ తన ఉద్యోగానికి ఎసరు వస్తుందోననే భయంతో ఈ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తుత తహసీల్దార్ సెలవులో వెళ్లి.. డిప్యూటీ తహసీల్దార్లతో పని కానిచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం. శేరిగూడ భూములపైనా కన్ను సంగారెడ్డి– రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని శేరిగూడ రెవెన్యూ పరిధిలోనూ 90 ఎకరాలకు పైగా బిలా దాఖలా భూములు ఉన్నాయి. వీటిని కూడా కొల్లగొట్టేందుకు రెవెన్యూ అధికారులు, నేతలు, రియల్టర్లు, వ్యాపారులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. విచిత్రమేమంటే.. ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి.. సాగు చేస్తున్న రైతుల పేర్లు మాత్రం ఇప్పటికీ ధరణిలో కనిపించడం లేదు. కానీ వారి నుంచి కొనుగోలు చేసిన నేతలు, వ్యాపారులు, రియల్టర్ల పేర్లు మాత్రం ఆ వెంటనే నమోదవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల కొంత మంది రైతులు మండల ఆఫీసులో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అనుమతించింది కొండకల్ రెవెన్యూ పరిధిలో ‘బిలా దాఖలా’ భూములు ఉన్న మాట వాస్తవమే. వీటికి సంబంధించి గతేడాది ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేయించింది. ఆ నివేదిక ఆధారంగా భూ రికార్డులు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాత రికార్డులను పరిశీలించి, వాటికి సర్వే నం.555గా నిర్ధారించింది. కలెక్టర్ సిఫార్సు మేరకు సీసీఎల్ఏ ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.’ అని చెప్పిన తహసీల్దార్ నయీమొద్దీన్.. పొజిషన్లో ఉన్న రైతుల వివరాలు ధరణిలో ఎందుకు నమోదు చేయడం లేదని ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేయడం విశేషం. – తహసీల్దార్, నయీమొద్దీన్ -
సర్వే నంబరే మార్చేశారు.. ఒకే సర్వే నంబరు రెండు చోట్లా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులోని ఒకే సర్వేనంబరును వేర్వేరు చోట్ల చూపిస్తూ అటు అధికారులను.. ఇటు ప్రజలను బురిడీ కొట్టించారు. తిమ్మాపూర్ బొక్కలగుట్టలో సర్వేనంబరు 31లో అనేక అక్రమాలు జరిగాయి. ఈ సర్వేనంబరులో అటవీశాఖ(మహసుర)కు సంబంధించిన మొత్తం 2,966ఎకరాల భూమి ఉంటే అందులో 1985వ సంవత్సరంలో 40ఎకరాలు రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. ఈ భూమిలోనే 1986వ సంవత్సరంలో బొక్కలగుట్టకు చెందిన నిరుపేదలు ఇళ్లు కట్టుకునేందుకు రెండు గుంటల చొప్పున పట్టాలు ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ అటవీ ప్రాంతంగా ఉండడంతో ఎవరూ నివాసం ఏర్పర్చుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని గ్రామంలో ఓ భూసామి సర్వే నంబరు 31 ఉరఫ్ 11 సర్వేనంబరులో ఐదున్నర ఎకరాల చొప్పున రెండు భాగాలుగా ఇద్దరు వ్యక్తులకు 11 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు. ఆ భూమి 31 సర్వేనంబరు అటవీశాఖకు సంబంధించినది కావడంతో ముందున్న 31 తొలగించి 11 సర్వేనంబరుగా చేర్చుతూ రెవెన్యూ రికార్డులకు ఎక్కించారు. ధరణి ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. కొనుగోలు చేసిన వారు సాగులో ఉన్నారు. దీనిపై ఇన్నాళ్లూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఇదంతా వెలుగులోకి రాలేదు. రెండేళ్ల క్రితం నుంచి బొక్కలగుట్ట గ్రామస్తులు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు మళ్లీ తమకే కేటాయించాలని కోరారు. ఆ స్థలం వద్ద నిరసనలు చేపట్టారు. అదే సమయంలో అక్కడ పెద్దయెత్తున అటవీ, సర్కారు భూములు, పట్టాభూముల్లో ఆక్రమణలు జరుగుతున్న తీరుపై ‘సాక్షి’లో కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు సర్వే చేసి కబ్జాగురైన భూమికి హద్దులు ఏర్పాటు చేశారు. ఈ సర్వే నంబరులోనే కొందరు దళితులకు పట్టా భూములు సైతం వెలుగులోకి వచ్చాయి. తాజాగా 31/11 సర్వే నంబరులో ఏకంగా వెంచరు వేసి ప్లాట్లు చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకే సర్వే నంబరు రెండు చోట్లా? ఒక గ్రామ కంఠం పరిధిలో ఒకే సర్వేనంబరు రెండు చోట్ల ఉండదు. తిమ్మాపూర్ శివారులో ఒకే సర్వేనంబరు రెండు చోట్లా రికార్డుల్లోకి ఎక్కింది. 31/11సర్వేనంబరు తిమ్మాపూర్ శివారు బొక్కలగుట్ట గ్రామ పరిధిలో ఉంది. 11 సర్వేనంబరు తిమ్మాపూర్ శివారులో భీమా గార్డెన్ వెనకాల 1.23ఎకరాలు ఉంది. 31తీసేసి 11సర్వేనంబరుగా మార్పు చేసి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారు. 1936 ప్రాంతంలో పహాని ఉన్నట్లు చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేసి ఇద్దరు వ్యక్తులకు అమ్మేసి ఓ డాక్యుమెంట్ రూపొందించారు. ఆ తర్వాతి కాలంలో భూ ప్రక్షాళన సమయంలోనూ ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగానే కొత్త ధరణి పోర్టల్‌లోకి మారారు. ఇదంతా అప్పట్లో బొక్కలగుట్టకు చెందిన భూసామి చేసిన నిర్వాకమేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఖాళీ జాగాను తమ భూమిగా మార్చుకునేందుకు ఏకంగా సర్వేనంబర్లను మార్చేసినట్లు చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించిన పాత రికార్డులు అటూ రెవెన్యూ, ఇటు అటవీ శాఖ వద్ద లేకపోవడం గమనార్హం. అనుమతులు ఇవ్వని మున్సిపాలిటీ రామక్రిష్ణాపూర్ పట్టణ పరిధిలో విలీన గ్రామంగా ఉన్న బొక్కలగుట్టలోని సాగు భూమి లో ఏర్పాటు చేసిన వెంచరుకు మున్సిపాలిటీ నుంచి అనుమతి ఇవ్వలేదు. రెవెన్యూ నుంచి ‘నాలా’(వ్యవసాయేతర భూమి)గా అనుమతులు తీసుకుని ప్లాటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 11ఎకరాల్లో ప్లాటింగ్ చేస్తుండగా, బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంది. గాంధారి ఖిల్లా వెళ్లే దారిలోనే ఉండడంతో భవిష్యత్తులో కాలనీలు ఏర్పడే అవకాశం ఉందని అమ్మకాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ భూమిలో వెంచరు ఏర్పాటు చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు వెళ్లాయి. రికార్డుల్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. -
రాష్ట్రమంతా ఒకే నమూనా సర్వే రాళ్లు
సాక్షి, అమరావతి: సర్వే రాళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద చిక్కు. ఇది సర్వే రాయా, కాదా అని తెలుసుకోవాలంటే దాన్ని పెకలించి చూడాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్న సమస్య. సమగ్ర రీసర్వే తర్వాత ఇలాంటి అనుమానాలకు ఆస్కారమే ఉండదు. సర్వే అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నాటే సర్వే రాళ్లన్నీ ఒకే నమూనాలో ఉంటాయి. ట్రైజంక్షన్లలో పెద్దవి, సర్వే నంబర్ల మధ్య చిన్నవి పాతుతారు. వీటిపై ‘వైఎస్సార్ జగనన్న భూరక్ష –2020’ అనే అక్షరాలు ఉంటాయి. ఈ రాయిని చూస్తేనే ఇది 2020లో జరిగిన రీసర్వే సందర్భంగా నాటిన సర్వే రాయి అని తెలుస్తుంది. సర్వే రాళ్లను గుర్తించడానికి ఎలాంటి చిక్కులు ఉండకుండా ఒకే నమూనా రాళ్లు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చేయడంవల్ల ఒకవేళ ఎక్కడైనా సర్వే రాళ్లు పడిపోయినా సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. ప్రతి సర్వే రాయిని జియో ట్యాగింగ్ చేస్తారు. దీంతో ఎవరైనా ఈ రాళ్లను పీకేసినా ఇది ఎక్కడ ఉండాల్సిందో సులభంగా గుర్తించవచ్చు. మొదటి విడత సర్వే చేయనున్న 5,500 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి 17,461 ‘ఎ’ క్లాస్ సర్వే రాళ్లు, 50 లక్షల ‘బి’ క్లాస్ సర్వే రాళ్లు అవసరమని సర్వే సెటిల్మెంట్ విభాగం లెక్కకట్టింది. ఈమేరకు రాళ్లను వచ్చే నెల ఒకటో తేదీ నాటికి సేకరించాలని ప్రభుత్వం సర్వే సెటిల్మెంట్ శాఖను ఆదేశించింది. భూగర్భ గనులశాఖ సహకారంతో ఈ రాళ్లను సేకరించి ఆయా గ్రామాలకు అవసరమైన మేరకు పంపుతారు. వీటిని ఆయా గ్రామాల్లో సచివాలయాల వద్ద భద్రపరిచేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ‘ఎ’ క్లాస్ రాళ్లు మూడు గ్రామాలు కలిసే సరిహద్దుల్లో (ట్రై జంక్షన్లలో) వీటిని నాటుతారు. పెద్ద పరిమాణంలో ఉండే ఈ రాళ్లను ‘ఎ’ క్లాస్ రాళ్లు అంటారు. ఇవి ఎక్కువ ఎత్తు ఉండటంవల్ల దూరం నుంచే కనిపిస్తాయి. వీటికి సర్వే సెటిల్మెంట్ కమిషనర్ ఆమోదించిన డిజైన్ ప్రకారం పైన రోలు లాగా చిన్న గుంత ఉంటుంది. రాష్ట్రమంతా ఈ రాళ్లు ఒకే ఎత్తు, వెడల్పు, డిజైన్‌లో ఉంటాయి. ‘బి’ క్లాస్ రాళ్లు కొద్దిగా చిన్న పరిమాణంలో ఉండే వీటిని ‘బి’ క్లాస్ రాళ్లు అంటారు. సర్వే నంబర్లకు సరిహద్దులుగా ఈ రాళ్లను నాటుతారు. సర్వే సెటిల్మెంట్ కమిషనర్ ఆమోదించిన డిజైన్ల ప్రకారం వీటికి ఒకవైపు బాణం కోణంలో గుర్తు ఉంటుంది. -
పేదల జాగాకు ‘పెద్దల’ ఎసరు
సాక్షి, సిరిసిల్లటౌన్ : అది 2007 అక్టోబర్ 10 పితృఅమావాస్య. అదే రోజు పితృదేవతలకు సంతర్పణలు సమర్పించుకునేందుకు ముగ్గురు రోడ్డు మీదకు వచ్చారు. ఆర్టీసీ బస్సురూపంలో మృత్యువు వచ్చి వారిని కబళించింది. ఈ సంఘటనలో సిరిసిల్లఅర్బన్ మండలం పెద్దూరుకు చెందిన గీతకార్మికుడు చనిపోగా.. వారి కుటుంబానికి ప్రభుత్వం రెండు గుంటలు పంపిణీ చేసింది. ఇప్పుడు అదే భూమిని ఓ పెద్దమనిషి కబ్జా చేసి మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరిస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. భూపంపిణీ చేసిన జీవన్‌రెడ్డి బాధితులు ఆదిపెల్లి భాగ్య, సాగర్ కథనం ప్రకారం. పెద్దూరుకు చెందిన ఆదిపెల్లి పర్శరాములు వార్డుసభ్యుడు. పెద్దలకు బియ్యం ఇచ్చేందుకు అయ్యగారి వద్దకు మరో ఇద్దరు బంధువులతో కలసి రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంఓనే ఆర్టీసీ బస్సు ఢీకొని పర్శరాములుతోపాటు మరో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో పర్శరాములు కుటుంబం పేదరికానికి చలించిన అప్పటి సర్కారు.. మంత్రి జీవన్‌రెడ్డి చేతుల మీదుగా గ్రామశివారులోని సర్వేనంబరు 405/1లో రెండుగుంటలు అందజేసింది. భర్త మ రణంతో కొద్దిరోజులు అందులో కాస్తు చేసుకున్న భార్య భాగ్య.. ఇంటిపనుల భారంతో చాలారోజులుగా ఖాళీగా వదిలేసింది. పిల్లల భవిష్యత్‌కు ఉపకరిస్తుందని స్థలాన్ని కాపాడుతూ వస్తోంది. ఆ స్థలం విలువ రూ.8 లక్షలు అప్పట్లో ఊరిచివరన ఉన్న ఆ స్థలానికి ఇప్పుడు డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ సుమారు రూ.8 లక్షలు పలుకుతుంది. దీంతో ఓ రియల్‌వ్యాపారి కన్ను పడింది. తనకు పరిచయమున్న ప్రజాప్రతినిధులు, అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కబ్జా చేశాడు. స్థల యజమాని భాగ్య, ఆమె కుమారుడు సాగర్ న్యాయం చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదు. కొద్దిరోజుల క్రితం సదరు రియల్‌వ్యాపారి ‘స్థలం వదిలించుకుంటే మీకు డబుల్బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని’ చెబుతున్నాడు. ‘మా తండ్రి చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమి అది.. దానిని మాకు కాకుండా చేయొద్దు’ అని బతిమిలాడినా వినలేదు. తనపై దాడికి పాల్పడ్డట్లు వారిపై రియల్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి గారూ ఆదుకోవాలి అటు పోలీసులు, ఇటు అధికారుల నుంచి తమకు న్యాయం జరగడం లేదని మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కుటుంబ పెద్దచనిపోతే స్పెషల్ కేసు కింద భూమిని సర్కారు తమకు ఇస్తే.. దానిని పెద్దలు కబ్జా చేశారని, తద్వారా తమ కుటుంబం భవిష్యత్ ఏమిటని రోదించారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. హద్దులు చూపించాలని ఆదేశాం: రియల్టర్ పెద్దూరు శివారులోని 405/1 సర్వేనంబర్‌లో నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. 2007లో గ్రామంలో నెలకొన్న పరిస్థితుల దృష్యా్ట ఆ సర్వే నంబరులో స్థలం లేకున్నా.. రాత్రికి రాత్రే పట్టా తయారు చేయించి పర్శరాములు కుటుంబానికి రెవెన్యూ అధికారులు అందించారు. రెవెన్యూ సర్వేయర్‌తో వారి స్థలానికి హద్దులు చూపించాలని నేను కోరుతున్నా. నేను ఏ స్థలాన్ని కబ్జా చేయలేదు. నాపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. -
అధికారుల చేతుల్లో రైతుల వివరాలు
► ఇంటింటా నిర్వహిస్తున్న సర్వే ► పూర్తి వివరాలు సేకరణ జైనథ్ : మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లోని 55 గ్రామాల్లో రైతుల వారీగా పక్క వివరాలు నమోదుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల వ్యవసాయాధికారి ఏవో వివేక్, కొత్తగా విధుల్లోకి చేరిన ఏఈవోలు ఈ పనులను ప్రారంభించారు. ప్రత్యేకంగా రూపొందిన ప్రొఫార్మాలతో ఏఈవోలు వారి సెక్టార్ పరిధిలోని గ్రామాల్లో సర్వేలను ప్రారంభించారు. రైతుల పూర్తి సమాచారం.. ప్రత్యేకంగా చేపడుతున్న ఈ సర్వేలో రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వేల కోసం ప్రత్యేకంగా రూపొందిన ప్రొఫార్మాలో ఏఈవో సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. దీంట్లో రైతుల పేర్లు, తండ్రి పేరు, గ్రామం, శివారం, ఆధార్ నంబర్, సర్వే నంబర్‌తో పాటు ముబైల్ నంబర్ కూడ నమోదు చేస్తున్నారు. ఇవే కాకుండా రైతులు ప్రస్తుతం వేసిన, వేస్తున్న పంటల పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. రైతులకు పంట రుణం ఉందా? బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉందా? అనే అంశాలు కూడా సేకరిస్తున్నారు. వీటితో పాటు రైతులకు అతి ముఖ్యమైన నీటి పారుదల అంశంపై ఈ సర్వేలు వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులకు నీటి పారుదల వసతి ఉందా? ఉంటే బావుల ద్వారా ఎంత? కాల్వల ద్వారా ఎంత ఉంది? అనే కోణంలో వివరాలు నమోదు చేస్తున్నారు? కాగా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం కోసం యంత్ర పరికరాలు, డ్రిప్ సిస్టమ్, ట్రాక్టర్లు వంటివి ఎంత మందికి అందుబాటులో ఉన్నాయనే అంశాలను సైతం ప్రాధాన్యంగా సర్వే చేస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయంపై ఎంతమంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు? ఎంత మందికి వర్మీ కంపోస్ట్, నాడెం కంపోస్ట్ యూనిటులు ఉన్నాయి? వంటి రైతుల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు ఈ సర్వేలు నిర్వహిస్తున్నట్లు ఆధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సర్వే ద్వారా రైతుల సమగ్ర సమాచారం అందుబాటులోకి రావడంతో వ్యవసాయ శాఖ సేవలు మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉంది. 15రోజుల్లో సర్వే పూర్తి... మండలంలో గత కొన్ని రోజులుగా ఈ సర్వే నిర్వహిస్తున్నాము. ఒక్కొక్క ఏఈవో పరిధి లో 2వేల మంది రైతులు ఉన్నారు. ఈ లెక్క న 15రోజుల్లో సర్వే పూర్తి చేసి, తుది నివేదికలు సిద్ధం చేస్తాం. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం పథకలు అర్హులైన రైతులకు మాత్రమే అందేలా చూడటంతో పాటు, రైతులకు మరింత వేగవంతంగా, నాణ్యతతో సేవలిందవచ్చు. – వివేక్, ఏవో -
‘నేను ఎయిర్‌పోర్టుకు భూమి ఇవ్వలేదు’
భోగాపురం : మండలంలో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టుకు తన భూమి ఇవ్వలేదని గూడెపువలసకు చెందిన రైతు ముదునూరు రాజేష్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. గత నెల 26న విమానాశ్రయానికి తన పేరున ఉన్న భూమిని వేరొకరు ఎయిర్‌పోర్టుకి అధికారులకు అందజేసినట్టు పత్రికల్లో వచ్చిందని, అది వాస్తవం కాదని చెప్పారు. గూడెపువలస రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 60/1లో 1. 12 ఎకరాలు, 60/2లో 0. 38 ఎకరాలు భూమికి పూర్తిగా తాను హక్కుదారుడునన్నారు. కొన్నేళ్లుగా ఆ భూమి సాగు చేస్తూ, దానిపై వచ్చే ఫలసాయాన్ని తానే పూర్తిగా పొందుతున్నానన్నారు. అయితే ఆ సర్వే నంబరు గల భూమిని వేరొక వ్యక్తులు విమానాశ్రయానికి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరైనా భూమి ఇస్తున్నామంటే అది ఎవరది అన్నది కూడా రెవెన్యూ అధికారులు నిర్ధారణ చేసుకోకుండా ప్రకటనలు ఇస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎయిర్‌పోర్టుకి భూమి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై తహశీల్దారు డి. లక్ష్మారెడ్డిని వివరణ కోరగా...తమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం 2012లో రేసర్ల కమల పేరున పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసినట్లు ఉందన్నారు. వారి కుటుం బ తగాదాలు తమకు అనవసరమని చెప్పారు. ఎవరు ఎయిర్‌పోర్టుకి భూమి ఇస్తున్నామని ప్రకటించినా వారి వద్ద నుంచి కేవలం అంగీకారపత్రం తీసుకుంటున్నామే తప్ప, భూమిని తీసుకోవడం లేదన్నారు. -
ఇక సమగ్ర భూసర్వే
- 17 నుంచి గ్రామాలవారీగా ప్రారంభం - ఒక్కో ఊళ్లో నెలరోజులు - పాల్గొననున్న రెవెన్యూ సిబ్బంది - అక్కడికక్కడే సమస్యల పరిష్కారం - ఏడాది తర్వాత అంతా ఆన్లైన్లోనే.. చొప్పదండి : సర్వే నంబర్ ఒకటైతే రికార్డుల్లో మరోతీరు.. రికార్డుల్లో ఒకరకంగా ఉంటే.. సర్వే నంబర్లో తేడాలు.. వాటిని సరిచేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగే రైతులు.. అవి సక్రమమా..? లేక అక్రమమా..? తేల్చడంలో అధికారులకు తలనొప్పులు.. ఇది ఇన్నాళ్లూ జిల్లాలోని భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులకు ఎదురవుతున్న అనుభవాలు. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఏనాడో నిజాంకాలం నాటి అస్తవ్యస్త రికార్డులను సరిచేసేందుకు సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు జిల్లా రెవెన్యూశాఖ సమగ్ర భూ సర్వే చేయాలని నిర్ణయించింది. పహణీలు, సర్వే నంబర్లలో తేడాలను సరిచేయించేందుకు రెవెన్యూ అధికారులనందరినీ గ్రామాల్లోనే మకాం వేయించి అక్కడికక్కడే పరిష్కరించేందుకు నడుం బిగించింది. పూర్తి వివరాలతో ఏడాదిలోపు మొత్తం వివరాలు ఆన్లైన్లో ఉంచాలని భావిస్తోంది. దీనికి ఈనెల 17 నుంచే శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే రైతులకు కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తొలగిపోనున్నాయి. జిల్లా రెవెన్యూ అధికారులు ప్రతి మండలంలోని ఓ గ్రామంలో నెలపాటు సమగ్ర భూసర్వే నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 17న సర్వే ప్రారంభించాలని తహశీల్దార్లకు జిల్లా రెవెన్యూ కార్యాలయం నుంచి ఆదేశాలు కూడా అందాయి. మొదటిసారి చొప్పదండి మండలం కోనేరుపల్లిలో సమగ్ర భూసర్వే కార్యక్రమం చేపట్టనున్నారు. గ్రామ రెవెన్యూ అధికారులతోపాటు ఇతర అధికారులు మొత్తం గ్రామంలోనే మకాం వేసి మొత్తం భూములను సర్వే చేయనున్నారు. ఏడాది తర్వాత భూముల వివరాలన్నీ 1బీ రిజిస్టర్‌తో సహా ఆన్లైన్ చేయనున్నారు. గ్రామాల్లో గుర్తించిన రెవెన్యూ సమస్యలను ఆయా గ్రామంలోనే తహశీల్దార్ నేతృత్వంలో అక్కడికక్కడే పరిశీలించి, సర్వేలు చేసి రైతులకు పరిష్కారం చూపుతారు. ఈ మేరకు గ్రామల్లో విస్తృత ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పిస్తారు. ఆ గ్రామంలో భూములు కలిగి ఉన్న ప్రక్క గ్రామాల రైతులకు కూడా సమాచారం చేరవేస్తారు. సర్వే ఇలా.. ► ప్రతి గ్రామంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత వీఆర్వోతోపాటు ఆ గ్రామంలో గతంలో పనిచేసిన వీఆర్వో, పక్కగ్రామ వీఆర్వోతో బృందం ఏర్పాటు చేస్తారు. ►నిత్యం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ బృందాలు గ్రామంలోనే ఉండి సర్వేలో పాల్గొంటాయి. ► గ్రామంలోని ఒకటో సర్వే నంబర్ నుంచి చివరి సర్వే నంబర్ వరకు మోఖాపై ఈ బృందాలు పరిశీలిస్తాయి. ►సర్వేయర్‌తోపాటు రెవెన్యూ పరిశీలకులు సర్వే నంబర్ల హద్దులు పరిశీలిస్తారు. అనంతరం తహశీల్దార్ పర్యటించి 1బీ రిజిష్టర్‌తో, పహణీలకు గల తేడాలు పరిశీలిస్తారు. ఏవైనా ప్రొసీడింగ్ సమస్యలుంటే అక్కడికక్కడే జారీ చేస్తారు. ►సర్వే సందర్భంగా కబ్జాపై ఏర్పడే సమస్యలు, సర్వేనంబర్‌లో తేడా, సరిహద్దు సమస్య, రికార్డులో భూమికి, కబ్జాలో ఉన్న భూమికి తేడాలు, వివాదాల్లో ఉన్న భూములు, కోర్టు తగాదాల్లో ఉన్న భూములను ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేక రికార్డులు నమోదు చేస్తారు. తహశీల్దార్ ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ► గ్రామంలో సర్వే చేస్తున్న సమయంలో ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులైన 1బీ రిజిష్టర్, పహణీ, గ్రామ నక్షలు వీఆర్వోల వద్ద ఉంటాయి. ప్రభుత్వ భూముల రిజిష్టర్, లావోణి పట్టాలు ఇచ్చిన రికార్డు, ఇనాం భూముల రిజిష్టర్ వంటివి వెంటనే ఉంటాయి. ► సర్వే విజయవంతానికి ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యులు, పీఏసీఎస్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు, బ్యాంకర్లకు ముందుగా అవగాహన కల్పిస్తారు. ►ఇనాం భూములు, దేవాలయాలు, ఇతర సంస్థల భూములు... రికార్డుల్లో ఇతరుల పేరిట నమోదైన లేదా అక్రమంగా పట్టా మార్పు అయినవాటిని రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. ►రికార్డుల్లో మార్పు చేయాల్సి వస్తే ప్రతీ సర్వేనంబర్‌వారీగా నివేదికలు తయారు చేస్తారు. దీని వెంట సంబంధిత రైతు అర్జీ లేదా వాంగ్మూలము లేదా పంచనామాను చేరుస్తారు. ►గ్రామాల్లో సీలింగ్ ఆస్తులు, భూములు, ప్రభుత్వ భూములు, లావోణీ పట్టాలు ఇచ్చినవి... క్రయవిక్రయాలు జరిగి ఉండే అవకాశాలుండటంతో వాటిపై పరిశీలన జరిపి వివరాలు రిజిష్టర్‌లో నమోదు చేసుకుంటారు. సర్వే సందర్భంగా వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరిస్తారు. రైతులు సహకరించాలి : బైరం పద్మయ్య, తహశీల్దార్ ప్రతి రైతుకు వారి భూసర్వేకు ముందే సమాచారం అందిస్తాం. ఆ రోజు తప్పకుండా హాజరు కావాలి. ఈనెల 17న చొప్పదండి మండలం కోనేరుపల్లిలో సర్వే ప్రారంభిస్తాం. రైతుల సమస్యలు పరిష్కరించి భవిష్యత్తులో మా కార్యాలయానికి రాకుండా చేస్తున్నాం. తహశీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని వాటిని ఆర్డీవోకు పంపి అక్కడ పరిష్కారమయ్యేలా కృషి చేస్తున్నాం. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత చెన్నూర్, న్యూస్‌లైన్ : చెన్నూర్ వీఆర్వో జామీర్ అలీ రూ. 6వేలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. తహశీల్దార్ కార్యాలయంలో మంచిర్యాల పట్టణానికి చెందిన షాహీర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. మంధిని గ్రామానికి చెందిన చౌకత్ అలీకి చెందిన సర్వే నంబర్ 991లో 247, 242 గజాల చొప్పున రెండు ప్లాట్లను మంచిర్యాల పట్టణానికి చెందిన షాహీర్ 2012లో కొనుగోలు చేశాడు. ఆ ప్లాట్లను షాహీర్ మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిష్టర్ చేయించుకున్నాడు. నెల రోజుల క్రితం ప్లాట్లకు రెవెన్యూ ప్రొసీడింగ్ కావాలని తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. చెన్నూర్ వీఆర్వో జామీర్అలీ ప్రొసీడింగ్ కావాలంటే రూ.10 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. పది రోజుల క్రితం రూ.4 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. మరో రూ.6 వేలు ఇస్తేనే ప్రొసీడింగ్ ఇస్తానని వీఆర్వో జామీర్ అలీ వేధించగా ఈ నెల 15న బాధితుడు షాహీర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం స్థానిక తహ శీల్దార్ కార్యాలయంలో రూ.6 వేలు లంచం తీసుకుంటుండుగా పట్టుకున్నామని చెప్పారు. అతని వద్ద నుంచి రూ.6 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీఆర్వో జామీర్అలీ ఆస్తుల పై విచారణ చేస్తామని చెప్పారు. ప్రజల్లో చైతన్యం రావాలి : లంచాలు అడిగితే ఏసీబీని ఆశ్రయించాలనే చైతన్యం ప్రజల్లో రావాలని కరీంగనర్ ఏసీబీ డీఏస్పీ సుదర్శన్‌గౌడ్ అన్నారు. లంచాలు ఇవ్వాలని అధికారులు వేధింపులకు గురి చేస్తే నిర్భయంగా ఏసీబీని ఆశ్రయించాలన్నారు. లంచం అడిగితే ఫోన్ 9440446150 చేయాలని సూచించారు. వేధింపులు భరించలేక... ప్రొసీడింగ్ కోసం వీఆర్వో జామీర్ అలీ నెల రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నడు. మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు తిరిగి తిరిగి చాల బాధపడ్డాను. ఆయన వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. నా మాదిరిగా వేధింపులు వేరే వాళ్లకు ఉండ కూడదనే ఉద్దేశంతో లంచ ం అడిగిన వీఆర్వోను పట్టించానని బాధితుడు షాహీర్ తెలిపారు.