ఇక సమగ్ర భూసర్వే | KNOW comprehensive land Survey | Sakshi
Sakshi News home page

ఇక సమగ్ర భూసర్వే

Published Tue, Sep 16 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

ఇక సమగ్ర భూసర్వే

ఇక సమగ్ర భూసర్వే

- 17 నుంచి గ్రామాలవారీగా ప్రారంభం
- ఒక్కో ఊళ్లో నెలరోజులు
- పాల్గొననున్న రెవెన్యూ సిబ్బంది
- అక్కడికక్కడే సమస్యల పరిష్కారం
- ఏడాది తర్వాత అంతా ఆన్‌లైన్‌లోనే..
 చొప్పదండి : సర్వే నంబర్ ఒకటైతే రికార్డుల్లో మరోతీరు.. రికార్డుల్లో ఒకరకంగా ఉంటే.. సర్వే నంబర్‌లో తేడాలు.. వాటిని సరిచేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగే రైతులు.. అవి సక్రమమా..? లేక అక్రమమా..? తేల్చడంలో అధికారులకు తలనొప్పులు.. ఇది ఇన్నాళ్లూ జిల్లాలోని భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులకు ఎదురవుతున్న అనుభవాలు. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఏనాడో నిజాంకాలం నాటి అస్తవ్యస్త రికార్డులను సరిచేసేందుకు సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు జిల్లా రెవెన్యూశాఖ సమగ్ర భూ సర్వే చేయాలని నిర్ణయించింది.

పహణీలు, సర్వే నంబర్లలో తేడాలను సరిచేయించేందుకు రెవెన్యూ అధికారులనందరినీ గ్రామాల్లోనే మకాం వేయించి అక్కడికక్కడే పరిష్కరించేందుకు నడుం బిగించింది. పూర్తి వివరాలతో ఏడాదిలోపు మొత్తం వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని భావిస్తోంది. దీనికి ఈనెల 17 నుంచే శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే రైతులకు కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
 
జిల్లా రెవెన్యూ అధికారులు ప్రతి మండలంలోని ఓ గ్రామంలో నెలపాటు సమగ్ర భూసర్వే నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 17న సర్వే ప్రారంభించాలని తహశీల్దార్లకు జిల్లా రెవెన్యూ కార్యాలయం నుంచి ఆదేశాలు కూడా అందాయి. మొదటిసారి చొప్పదండి మండలం కోనేరుపల్లిలో సమగ్ర భూసర్వే కార్యక్రమం చేపట్టనున్నారు. గ్రామ రెవెన్యూ అధికారులతోపాటు ఇతర అధికారులు మొత్తం గ్రామంలోనే మకాం వేసి మొత్తం భూములను సర్వే చేయనున్నారు. ఏడాది తర్వాత భూముల వివరాలన్నీ 1బీ రిజిస్టర్‌తో సహా ఆన్‌లైన్ చేయనున్నారు.

గ్రామాల్లో గుర్తించిన రెవెన్యూ సమస్యలను ఆయా గ్రామంలోనే తహశీల్దార్ నేతృత్వంలో అక్కడికక్కడే పరిశీలించి, సర్వేలు చేసి రైతులకు పరిష్కారం చూపుతారు. ఈ మేరకు గ్రామల్లో విస్తృత ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పిస్తారు. ఆ గ్రామంలో భూములు కలిగి ఉన్న ప్రక్క గ్రామాల రైతులకు కూడా సమాచారం చేరవేస్తారు.
 
సర్వే ఇలా..
ప్రతి గ్రామంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత వీఆర్వోతోపాటు ఆ గ్రామంలో గతంలో పనిచేసిన వీఆర్వో, పక్కగ్రామ వీఆర్వోతో బృందం ఏర్పాటు చేస్తారు.
నిత్యం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ బృందాలు గ్రామంలోనే ఉండి సర్వేలో పాల్గొంటాయి.
గ్రామంలోని ఒకటో సర్వే నంబర్ నుంచి చివరి సర్వే నంబర్ వరకు మోఖాపై ఈ బృందాలు పరిశీలిస్తాయి.
సర్వేయర్‌తోపాటు రెవెన్యూ పరిశీలకులు సర్వే నంబర్ల హద్దులు పరిశీలిస్తారు. అనంతరం తహశీల్దార్ పర్యటించి 1బీ రిజిష్టర్‌తో, పహణీలకు గల తేడాలు పరిశీలిస్తారు. ఏవైనా ప్రొసీడింగ్ సమస్యలుంటే అక్కడికక్కడే జారీ చేస్తారు.
సర్వే సందర్భంగా కబ్జాపై ఏర్పడే సమస్యలు, సర్వేనంబర్‌లో తేడా, సరిహద్దు సమస్య, రికార్డులో భూమికి, కబ్జాలో ఉన్న భూమికి తేడాలు, వివాదాల్లో ఉన్న భూములు, కోర్టు తగాదాల్లో ఉన్న భూములను ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేక రికార్డులు నమోదు చేస్తారు. తహశీల్దార్ ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.
గ్రామంలో సర్వే చేస్తున్న సమయంలో ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులైన 1బీ రిజిష్టర్, పహణీ, గ్రామ నక్షలు వీఆర్వోల వద్ద ఉంటాయి. ప్రభుత్వ భూముల రిజిష్టర్, లావోణి పట్టాలు ఇచ్చిన రికార్డు, ఇనాం భూముల రిజిష్టర్ వంటివి వెంటనే ఉంటాయి.
సర్వే విజయవంతానికి ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యులు, పీఏసీఎస్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు, బ్యాంకర్లకు ముందుగా అవగాహన కల్పిస్తారు.
ఇనాం భూములు, దేవాలయాలు, ఇతర సంస్థల భూములు... రికార్డుల్లో ఇతరుల పేరిట నమోదైన లేదా అక్రమంగా పట్టా మార్పు అయినవాటిని రిజిష్టర్‌లో నమోదు చేస్తారు.
రికార్డుల్లో మార్పు చేయాల్సి వస్తే ప్రతీ సర్వేనంబర్‌వారీగా నివేదికలు తయారు చేస్తారు. దీని వెంట సంబంధిత రైతు అర్జీ లేదా వాంగ్మూలము లేదా పంచనామాను చేరుస్తారు.
గ్రామాల్లో సీలింగ్ ఆస్తులు, భూములు, ప్రభుత్వ భూములు, లావోణీ పట్టాలు ఇచ్చినవి...  క్రయవిక్రయాలు జరిగి ఉండే అవకాశాలుండటంతో వాటిపై పరిశీలన జరిపి వివరాలు రిజిష్టర్‌లో నమోదు చేసుకుంటారు. సర్వే సందర్భంగా వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరిస్తారు.
 
 రైతులు సహకరించాలి : బైరం పద్మయ్య, తహశీల్దార్
 ప్రతి రైతుకు వారి భూసర్వేకు ముందే సమాచారం అందిస్తాం. ఆ రోజు తప్పకుండా హాజరు కావాలి. ఈనెల 17న చొప్పదండి మండలం కోనేరుపల్లిలో సర్వే ప్రారంభిస్తాం. రైతుల సమస్యలు పరిష్కరించి భవిష్యత్తులో మా కార్యాలయానికి రాకుండా చేస్తున్నాం. తహశీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని వాటిని ఆర్డీవోకు పంపి అక్కడ పరిష్కారమయ్యేలా కృషి చేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement