
సాక్షి, అమరావతి : సమగ్ర భూ సర్వేపై సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన చంద్రబాబు.. మళ్లీ దాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో సమగ్ర భూ సర్వేకి శ్రీకారం చుట్టగా. ఇప్పుడు అదే సర్వేని కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఈ మేరకు సమగ్ర భూ సర్వేపై రెవెన్యూ శాఖ మంత్రి అనగానికి సత్యప్రసాద్ స్పందించారు. సమగ్ర సర్వేను మిగిలిన గ్రామాల్లోనూ చేపడతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. గతంలో చేసిన సర్వేపై గ్రామ సభలు పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.. ‘రీ సర్వే 7 వేల గ్రామాల్లో పూర్తి అయ్యింది. 5 శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తాం. ఆ తర్వాత మళ్ళీ రీ సర్వేని ముందుకు తీసుకుని వెళతాం’ అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.
గతంలో సమగ్ర సర్వేపై చంద్రబాబు ఏమన్నారంటే
రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు గతంలో నారా చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో ఒకసారి రీ సర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వేను చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజమానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు అదే సమగ్ర భూ సర్వేపై చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం గమనార్హం.