మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారు బొక్కల గుట్టలో ఏర్పాటు చేసిన వెంచర్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులోని ఒకే సర్వేనంబరును వేర్వేరు చోట్ల చూపిస్తూ అటు అధికారులను.. ఇటు ప్రజలను బురిడీ కొట్టించారు. తిమ్మాపూర్ బొక్కలగుట్టలో సర్వేనంబరు 31లో అనేక అక్రమాలు జరిగాయి. ఈ సర్వేనంబరులో అటవీశాఖ(మహసుర)కు సంబంధించిన మొత్తం 2,966ఎకరాల భూమి ఉంటే అందులో 1985వ సంవత్సరంలో 40ఎకరాలు రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. ఈ భూమిలోనే 1986వ సంవత్సరంలో బొక్కలగుట్టకు చెందిన నిరుపేదలు ఇళ్లు కట్టుకునేందుకు రెండు గుంటల చొప్పున పట్టాలు ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ అటవీ ప్రాంతంగా ఉండడంతో ఎవరూ నివాసం ఏర్పర్చుకోలేదు.
దీన్ని ఆసరాగా చేసుకుని గ్రామంలో ఓ భూసామి సర్వే నంబరు 31 ఉరఫ్ 11 సర్వేనంబరులో ఐదున్నర ఎకరాల చొప్పున రెండు భాగాలుగా ఇద్దరు వ్యక్తులకు 11 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు. ఆ భూమి 31 సర్వేనంబరు అటవీశాఖకు సంబంధించినది కావడంతో ముందున్న 31 తొలగించి 11 సర్వేనంబరుగా చేర్చుతూ రెవెన్యూ రికార్డులకు ఎక్కించారు. ధరణి ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. కొనుగోలు చేసిన వారు సాగులో ఉన్నారు. దీనిపై ఇన్నాళ్లూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఇదంతా వెలుగులోకి రాలేదు. రెండేళ్ల క్రితం నుంచి బొక్కలగుట్ట గ్రామస్తులు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు మళ్లీ తమకే కేటాయించాలని కోరారు.
ఆ స్థలం వద్ద నిరసనలు చేపట్టారు. అదే సమయంలో అక్కడ పెద్దయెత్తున అటవీ, సర్కారు భూములు, పట్టాభూముల్లో ఆక్రమణలు జరుగుతున్న తీరుపై ‘సాక్షి’లో కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు సర్వే చేసి కబ్జాగురైన భూమికి హద్దులు ఏర్పాటు చేశారు. ఈ సర్వే నంబరులోనే కొందరు దళితులకు పట్టా భూములు సైతం వెలుగులోకి వచ్చాయి. తాజాగా 31/11 సర్వే నంబరులో ఏకంగా వెంచరు వేసి ప్లాట్లు చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు.
ఒకే సర్వే నంబరు రెండు చోట్లా?
ఒక గ్రామ కంఠం పరిధిలో ఒకే సర్వేనంబరు రెండు చోట్ల ఉండదు. తిమ్మాపూర్ శివారులో ఒకే సర్వేనంబరు రెండు చోట్లా రికార్డుల్లోకి ఎక్కింది. 31/11సర్వేనంబరు తిమ్మాపూర్ శివారు బొక్కలగుట్ట గ్రామ పరిధిలో ఉంది. 11 సర్వేనంబరు తిమ్మాపూర్ శివారులో భీమా గార్డెన్ వెనకాల 1.23ఎకరాలు ఉంది. 31తీసేసి 11సర్వేనంబరుగా మార్పు చేసి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారు. 1936 ప్రాంతంలో పహాని ఉన్నట్లు చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేసి ఇద్దరు వ్యక్తులకు అమ్మేసి ఓ డాక్యుమెంట్ రూపొందించారు.
ఆ తర్వాతి కాలంలో భూ ప్రక్షాళన సమయంలోనూ ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగానే కొత్త ధరణి పోర్టల్‌లోకి మారారు. ఇదంతా అప్పట్లో బొక్కలగుట్టకు చెందిన భూసామి చేసిన నిర్వాకమేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఖాళీ జాగాను తమ భూమిగా మార్చుకునేందుకు ఏకంగా సర్వేనంబర్లను మార్చేసినట్లు చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించిన పాత రికార్డులు అటూ రెవెన్యూ, ఇటు అటవీ శాఖ వద్ద లేకపోవడం గమనార్హం.
అనుమతులు ఇవ్వని మున్సిపాలిటీ
రామక్రిష్ణాపూర్ పట్టణ పరిధిలో విలీన గ్రామంగా ఉన్న బొక్కలగుట్టలోని సాగు భూమి లో ఏర్పాటు చేసిన వెంచరుకు మున్సిపాలిటీ నుంచి అనుమతి ఇవ్వలేదు. రెవెన్యూ నుంచి ‘నాలా’(వ్యవసాయేతర భూమి)గా అనుమతులు తీసుకుని ప్లాటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 11ఎకరాల్లో ప్లాటింగ్ చేస్తుండగా, బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ ఉంది. గాంధారి ఖిల్లా వెళ్లే దారిలోనే ఉండడంతో భవిష్యత్తులో కాలనీలు ఏర్పడే అవకాశం ఉందని అమ్మకాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ భూమిలో వెంచరు ఏర్పాటు చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు వెళ్లాయి. రికార్డుల్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment