Revenue Departments
-
AP: ఇటు ప్రకటన.. అటు సాయం..
సాక్షి, అమరావతి: తుపాను బాధితులకు నిత్యావసరాల సరుకులతోపాటు ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రతి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనకు అనుగుణంగా రెవెన్యూ శాఖ శుక్రవారం సాయంత్రం జీవో ఆర్టీ నెంబర్ 67 జారీ చేసింది. ఇప్పటివరకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.2,500 చొప్పున అందిస్తూ వస్తున్నారు. తాజాగా పునరావాస కేంద్రాలకు రాని బాధిత కుటుంబాలకు సైతం ఈ ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ మాదిరిగానే ఈ ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్లకు సూచించారు. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 10 వేల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయగా మిగిలిన కుటుంబాలకు కూడా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. 2,068 గ్రామాలపై ప్రభావం మిచాంగ్ తుపాను 15 జిల్లాల పరిధిలో 240 మండలాల్లోని 2,068 గ్రామాలపై ప్రభావం చూపినట్లు తేలింది. ఆయా గ్రామాల్లో బాధితుల కోసం 494 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 31,628 మందికి ఆశ్రయం కల్పించారు. 1,32,569 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. 3.71 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లను సరఫరా చేశారు. తక్షణ వైద్యం కోసం 355 శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందించారు. మరోవైపు నిత్యావసరాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, లీటర్ వంట నూనె అందించారు. ఇప్పటివరకు 1,02,844 కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత 16 మండలాల్లో రెండో రోజు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 22 వైద్య శిబిరాలు నిర్వహించి 1,500 మందికి వైద్యసేవలు అందించారు. జ్వర పీడితులను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. పొలాల్లో ముంపు నీటిని తొలగించేందుకు 1,080 మంది ఉపాధి కూలీలను వ్యవసాయ సహాయక చర్యలకు వినియోగించారు. వరద నీటితో యనమదుర్రు డ్రెయిన్ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. తడిచిన ధాన్యం కొనుగోలు తడిచిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం 6,252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనిలో చాలా వరకు తేమ ఉన్న ధాన్యం కావడం గమనార్హం. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్ అజయ్, సివిల్ సప్లయిస్ జిల్లా అధికారి సుధాసాగర్లు ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారు. మేజర్ డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులను వేగవంతం చేశారు. -
సర్వే నంబరే మార్చేశారు.. ఒకే సర్వే నంబరు రెండు చోట్లా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులోని ఒకే సర్వేనంబరును వేర్వేరు చోట్ల చూపిస్తూ అటు అధికారులను.. ఇటు ప్రజలను బురిడీ కొట్టించారు. తిమ్మాపూర్ బొక్కలగుట్టలో సర్వేనంబరు 31లో అనేక అక్రమాలు జరిగాయి. ఈ సర్వేనంబరులో అటవీశాఖ(మహసుర)కు సంబంధించిన మొత్తం 2,966ఎకరాల భూమి ఉంటే అందులో 1985వ సంవత్సరంలో 40ఎకరాలు రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. ఈ భూమిలోనే 1986వ సంవత్సరంలో బొక్కలగుట్టకు చెందిన నిరుపేదలు ఇళ్లు కట్టుకునేందుకు రెండు గుంటల చొప్పున పట్టాలు ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ అటవీ ప్రాంతంగా ఉండడంతో ఎవరూ నివాసం ఏర్పర్చుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని గ్రామంలో ఓ భూసామి సర్వే నంబరు 31 ఉరఫ్ 11 సర్వేనంబరులో ఐదున్నర ఎకరాల చొప్పున రెండు భాగాలుగా ఇద్దరు వ్యక్తులకు 11 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు. ఆ భూమి 31 సర్వేనంబరు అటవీశాఖకు సంబంధించినది కావడంతో ముందున్న 31 తొలగించి 11 సర్వేనంబరుగా చేర్చుతూ రెవెన్యూ రికార్డులకు ఎక్కించారు. ధరణి ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. కొనుగోలు చేసిన వారు సాగులో ఉన్నారు. దీనిపై ఇన్నాళ్లూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఇదంతా వెలుగులోకి రాలేదు. రెండేళ్ల క్రితం నుంచి బొక్కలగుట్ట గ్రామస్తులు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు మళ్లీ తమకే కేటాయించాలని కోరారు. ఆ స్థలం వద్ద నిరసనలు చేపట్టారు. అదే సమయంలో అక్కడ పెద్దయెత్తున అటవీ, సర్కారు భూములు, పట్టాభూముల్లో ఆక్రమణలు జరుగుతున్న తీరుపై ‘సాక్షి’లో కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు సర్వే చేసి కబ్జాగురైన భూమికి హద్దులు ఏర్పాటు చేశారు. ఈ సర్వే నంబరులోనే కొందరు దళితులకు పట్టా భూములు సైతం వెలుగులోకి వచ్చాయి. తాజాగా 31/11 సర్వే నంబరులో ఏకంగా వెంచరు వేసి ప్లాట్లు చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకే సర్వే నంబరు రెండు చోట్లా? ఒక గ్రామ కంఠం పరిధిలో ఒకే సర్వేనంబరు రెండు చోట్ల ఉండదు. తిమ్మాపూర్ శివారులో ఒకే సర్వేనంబరు రెండు చోట్లా రికార్డుల్లోకి ఎక్కింది. 31/11సర్వేనంబరు తిమ్మాపూర్ శివారు బొక్కలగుట్ట గ్రామ పరిధిలో ఉంది. 11 సర్వేనంబరు తిమ్మాపూర్ శివారులో భీమా గార్డెన్ వెనకాల 1.23ఎకరాలు ఉంది. 31తీసేసి 11సర్వేనంబరుగా మార్పు చేసి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారు. 1936 ప్రాంతంలో పహాని ఉన్నట్లు చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేసి ఇద్దరు వ్యక్తులకు అమ్మేసి ఓ డాక్యుమెంట్ రూపొందించారు. ఆ తర్వాతి కాలంలో భూ ప్రక్షాళన సమయంలోనూ ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగానే కొత్త ధరణి పోర్టల్‌లోకి మారారు. ఇదంతా అప్పట్లో బొక్కలగుట్టకు చెందిన భూసామి చేసిన నిర్వాకమేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఖాళీ జాగాను తమ భూమిగా మార్చుకునేందుకు ఏకంగా సర్వేనంబర్లను మార్చేసినట్లు చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించిన పాత రికార్డులు అటూ రెవెన్యూ, ఇటు అటవీ శాఖ వద్ద లేకపోవడం గమనార్హం. అనుమతులు ఇవ్వని మున్సిపాలిటీ రామక్రిష్ణాపూర్ పట్టణ పరిధిలో విలీన గ్రామంగా ఉన్న బొక్కలగుట్టలోని సాగు భూమి లో ఏర్పాటు చేసిన వెంచరుకు మున్సిపాలిటీ నుంచి అనుమతి ఇవ్వలేదు. రెవెన్యూ నుంచి ‘నాలా’(వ్యవసాయేతర భూమి)గా అనుమతులు తీసుకుని ప్లాటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 11ఎకరాల్లో ప్లాటింగ్ చేస్తుండగా, బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంది. గాంధారి ఖిల్లా వెళ్లే దారిలోనే ఉండడంతో భవిష్యత్తులో కాలనీలు ఏర్పడే అవకాశం ఉందని అమ్మకాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ భూమిలో వెంచరు ఏర్పాటు చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు వెళ్లాయి. రికార్డుల్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆదాయార్జన శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆదాయార్జన శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయాన్ని ఆర్జించే శాఖలపై సీఎం జగన్ శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం (ఎక్సైజ్) నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, స్పెషల్ సీఎస్‌లు నీరబ్‌కుమార్ ప్రసాద్, రజత్ భార్గవ, భూగర్భ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పీసీసీఎఫ్ వై. మధుసుదన్‌రెడ్డి, వాణిజ్యపన్నుల శాఖ కార్యదర్శి గుల్జార్, రవాణాశాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా, పురపాలక శాఖ కమిషనర్ కోటేశ్వరరావు, స్టాంప్, రిజిస్ట్రేషన్స్ కమిషనర్ రామకృష్ణ, సేల్స్ టాక్స్ స్పెషల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్, అడిషనల్ డీజీలు ఎన్.సంజయ్, రవిశంకర్ అయ్యన్నార్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, మైన్స్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి దీనివల్ల సమర్థత పెరుగుతుందని, పన్నులుచెల్లించేవారికి సౌలభ్యంగా సేవలు అందుతాయి.. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి వీటిని అధ్యయనం చేసి వచ్చే సమీక్షా సమావేశంలో తనకు నివేదించాలన్న సీఎం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర లక్ష్యాలను చేరుకున్నామో సీఎం జగన్‌కు వివరించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించిన అధికారులు గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 25.29శాతం వృద్ధి 2022-23లో రాష్ట్రంలో వాణిజ్యపన్నుల ఆదాయం రూ. 51,481 కోట్లు. 93.24శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా వెల్లడించిన అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు. లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణలద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించిన అధికారులు. సీఎం ఆదేశాల మేరకు డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతలపట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పనితీరును మెరుగుపరుచుకుంటున్నామన్న అధికారులు. యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడం ద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయన్న సీఎం. వీటిపై దృష్టిపెట్టాలన్న సీఎం. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ది చెందినట్టుగా తెలిపిన అధికారులు గత ఐదేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం 2018-19లో ఈ శాఖ ఆదాయం రూ.4725 కోట్లు కాగా, 2022-23 నాటికి రూ. 8071కోట్లకు చేరిన ఆదాయం రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామవార్డు సచివాలయాలు సహా ఇతర చోట్లకూడా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలన్న సీఎం ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్ఉంచాలన్న సీఎం. మానవ ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి వాటిని అమల్లోకి తీసుకురావడంపై దృష్టిపెట్టాలన్న సీఎం. వచ్చే సమీక్షా సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలని అధికారులకు సీఎం ఆదేశం. అవినీతి నిరోధకశాఖను క్రియాశీలకంగా ఉంచాలని సీఎం ఆదేశం. డ్రగ్స్, మత్తుపదార్థాలను నివారించడానికి, వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు గట్టి దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం యూనివర్శిటీలు, కాలేజీలు, విద్యాసంస్థల వద్ద కచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ ఉండేలా హోర్డింగ్స్ఉంచాలన్న సీఎం. డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు, టోల్ ఫ్రీ నంబర్ పనితీరుపై ప్రతి జిల్లాలో ప్రతి 15 రోజులకోసారి మాక్ డ్రిల్ చేపట్టాలన్న సీఎం. గనులు ఖనిజాల శాఖలో 2022-23 సంవత్సరంలో రూ.4500 కోట్లు లక్ష్యం కాగా, రూ. 4,756 కోట్ల ఆదాయం. గత ఏడాదితో పోలిస్తే 26శాతం వృద్ధి. ఈ ఏడాది రూ.6వేలకోట్ల మేర ఆదాయ లక్ష్యాన్ని పెట్టుకున్నామన్న అధికారులు. రవాణాశాఖలో 2022-23లో ఆదాయం రూ. 4294.12 కోట్లు. 95.42శాతం లక్ష్యాన్ని చేరుకున్న రవాణా శాఖ 2018-19లో ఈ ఆదాయం రూ. 3224.98 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) లో రూ.6999.42 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు. రవాణాశాఖలో మెరుగైన విధానాలు తీసుకురావాలన్న సీఎం. దీనిపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న సీఎం. -
చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలి: సీఎం జగన్
-
ఆదాయాన్ని సమకూర్చే శాఖలపై సీఎం జగన్ సమీక్ష
-
అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఆదాయార్జన శాఖలపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పన్ను చెల్లింపుదారులకు అధికారులు మరింత అవగాహన కల్పించాలని, చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని సీఎం సూచించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ‘‘నియంత్రణ చర్యల వల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గింది. అక్రమ మద్యం తయారీపై ఎస్ఈబీ(స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) ప్రత్యేక దృష్టి సారించాలి’’ అని సీఎం అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖపైనా సీఎం సమీక్ష శాశ్వత భూహక్కు, భూ సర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాల్లో.. వార్డుల్లో...సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా ఓరియెంటేషన్ అందించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో.. ఏఏ రకాల డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న విషయాలపై ప్రజలకూ అర్ధమయ్యేలా వివరించాలని సీఎం సూచించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాను అప్‌గ్రేడ్ చేయాలని సీఎం ఆదేశించారు. మైనింగ్ శాఖపై సమీక్ష నాన్ ఆపరేషనల్ మైన్స్పై మరింత దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని సీఎం జగన్ అన్నారు. చదవండి: లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ: మంత్రి కాకాణి -
Telangana: ఉదయం 10:30 కల్లా సీట్లలో కూర్చోవాలి
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారా? విధులకు హాజరయ్యే విషయంలో సమయ పాలన పాటించడం లేదా? ఇష్టారాజ్యంగా సెలవులు తీసుకుంటూ ఉన్నతాధికారులకు అందుబాటులో ఉండడం లేదా?.. అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ రెవెన్యూ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు. సచివాలయంలోని రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ, దేవాదాయ, రిజిస్ట్రేషన్ల శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఉద్దేశించి రెవెన్యూ శాఖ అదనపు కార్యదర్శి నరేందర్‌రావు పేరిట ఈనెల 12న జారీ అయిన 35084/ఓపీ1/ఏ1/2022 అనే సర్క్యులర్ ఇదే విషయాన్ని ధ్రువపరుస్తోంది. ఈ సర్క్యులర్‌లో పేర్కొన్న హెచ్చరికల్లాంటి మార్గదర్శకాలు కూడా సచివాలయ రెవెన్యూ ఉద్యోగుల అలసత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని, కొందరు చాలా ఆలస్యంగా వస్తున్నారని, మరికొందరు ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఆఫీసుకు రావడం లేదని, ఇందుకు సంబంధించిన సెలవు పత్రాలు ఎప్పటికో సమర్పిస్తున్నారని, సెలవు పెట్టిన సందర్భాల్లో కూడా లీవ్ లెటర్లు ఇవ్వకుండా లేట్ పర్మిషన్లు, ఓడీ నోట్లు తీసుకుంటున్నారని, ఈ నేపథ్యంలోనే సర్క్యులర్‌ను జారీ చేశామని, ఈ సర్క్యులర్‌లోని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం గమనార్హం. సచివాలయ రెవెన్యూ శాఖ తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో సిబ్బందికి జారీ చేసిన మార్గదర్శకాలివే.. ►సచివాలయ నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి ఉదయం 10:30 గంటలకల్లా వచ్చి విధులు ప్రారంభించాలి. ఈ విషయంలో అత్యవసర సమయాల్లో మాత్రం 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 10:40 గంటలకు అటెండెన్స్ రిజిస్టర్‌ను మూసివేస్తాం. ►రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు తమకు నిర్దేశించిన సమయం కన్నా అరగంట ముందుగానే ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. సంబంధిత సెక్షన్ అధికారి అనుమతి లేకుండా వారు కార్యాలయం నుంచి వెళ్లడానికి వీల్లేదు. అధికారులు వెళ్లేంతవరకు అటెండర్లు కార్యాలయం విడిచి వెళ్లరాదు. ►సచివాలయంలోని రెవెన్యూ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి నెలలో మూడు సార్లు మాత్రమే ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి ఇస్తారు. అది కూడా అత్యవసర సమయాల్లో మాత్రమే నెలకు గంట కంటే ఎక్కువ సమయం ఆలస్యం కాకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా రావాల్సి వస్తే ప్రతి ఉద్యోగి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ►వరుసగా మూడు రోజులు ఆలస్యంగా వచ్చిన ప్రతిసారీ క్యాజువల్ లీవ్ (సీఎల్) మినహాయిస్తాం. సీఎల్‌లు కూడా అయిపోతే కాంపెన్సేటరీ అకౌంట్ నుంచి ఈ సెలవులను మినహాయిస్తారు. ఎవరైనా ఉద్యోగి అదే పనిగా ఆలస్యంగా వస్తుంటే ఆ ఉద్యోగిపై సచివాలయ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అధికారం సంబంధిత అధికారికి ఉంటుంది. మధ్యాహ్నం రెండుగంటల లోపు వస్తే దాన్ని ఆఫ్‌డే లీవ్‌గా, ఆ తర్వాత దాన్ని ఫుల్డే లీవ్‌గా పరిగణిస్తారు. ►ఎవరైనా ఉద్యోగి సెలవు పెట్టాలనుకున్నప్పుడు సెలవు పత్రాలు కూడా సంబంధిత అధికారికి ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది. -
‘రాబడి’ శాఖల్లో.. బదిలీల కదలిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కీలక శాఖల్లో బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నవారికి స్థాన చలనం కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, భూపరిపాలన, పన్నుల శాఖల్లో త్వరలోనే బదిలీలు జరగనున్నట్టు తెలిపాయి. ప్రభుత్వ పాలన, ఆదాయ సమీకరణలో కీలకంగా వ్యవహరించే ఈ నాలుగు శాఖల్లో చాలా కాలం నుంచి బదిలీలు లేకపోవడం, పదోన్నతులు, సర్దుబాటు ప్రక్రియ క్రమంగా కొలిక్కి వస్తుండటం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం నేపథ్యంలో.. బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్టు సమాచారం. ఒక్కొక్కటిగా.. ఓ కొలిక్కి రాష్ట్ర ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో బదిలీలు జరిగి చాలాకాలం అవుతోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికత ప్రాతిపదికన ఇటీవలి కాలంలో జరిగిన మల్టీజోనల్, జోనల్, జిల్లా స్థాయి బదిలీలు, అప్పుడప్పుడు పదోన్నతులు వచ్చినప్పుడు చేసే బదిలీలు మాత్రమే జరిగాయి. కానీ పూర్తిస్థాయి సాధారణ బదిలీలు జరగలేదు. రిజిస్ట్రేషన్ల శాఖలో అయితే దశాబ్ద కాలం నుంచీ ఒకేచోట పనిచేస్తున్న సబ్రిజిస్ట్రార్లు కూడా ఉన్నారు. పన్నుల శాఖలో కూడా ఏళ్ల తరబడి పాతుకుపోయిన ‘వసూల్ రాజా’లు కీలక ప్రాంతాలను అంటిపెట్టుకుని వదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణ బదిలీలు లేకపోవడంతో వారికి ప్రయోజనకరంగా మారింది. పలుచోట్ల అధికారులు కార్యాలయాలకు ðవెళ్లకుండానే.. సీనియర్ అసిస్టెంట్ స్థాయి సిబ్బందితో వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇక కీలకమైన భూపరిపాలన శాఖ, ఎక్సైజ్ శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇటీవలి పదోన్నతుల సమయంలో కొందరికి స్థాన చలనం కలిగిందే తప్ప.. సాధారణ బదిలీలు లేవు. ఈ శాఖలన్నింటిలో బదిలీలు అనివార్యమనే చర్చ జరుగుతోంది. కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు నిజానికి చాలా కాలం నుంచీ ఆయా శాఖల ఉన్నతాధికారులు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. బదిలీలపై నిషేధం అమల్లో ఉండటం, ఎత్తివేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రక్రియ ముందుకు పడలేదు. ఈ క్రమంలో తాజాగా రిజిస్ట్రేషన్లశాఖ బదిలీలపై దృష్టి సారించింది. సబ్ రిజిస్ట్రార్లు ఎక్కడెక్కడ, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? వారిపై ఏమైనా కేసులు న్నాయా? చర్యలు పెండింగ్‌లో ఉన్నాయా? అనే వివరాలను ఉన్నతాధికారులు సేకరించారు. ఇక పన్నుల శాఖలో వీలైనంత త్వరగా బదిలీల ప్రక్రియ పూర్తికావాలని, లేకుంటే ఆదాయ వనరుల సమీకరణపై ప్రభావం పడుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్దేశించుకున్న రాబడి లక్ష్యం పూర్తి కావాలంటే.. ఐదారు నెలల ముందే బదిలీలు జరగాలని, అధికారులు కొత్త స్థానాల్లో కుదురుకుని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తారని పేర్కొంటున్నాయి. ఇప్పుడు జరగకుంటే ఎన్నికల తర్వాతే! ఈ ఏడాదిలో బదిలీలు జరగకపోతే.. వచ్చే ఏడాది ఎన్నికలతో బదిలీలకు అవకాశం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల తర్వాతే బదిలీలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నాయి. ఈ క్రమంలో వచ్చే రెండు మూడు నెలల్లో కీలక ఆదాయ శాఖల్లో బదిలీలు జరుగుతాయనే చర్చ జరుగుతోంది. -
ఆలయ ఆభరణాలతో ఆదాయం
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల్లో వినియోగంలో లేని బంగారు ఆభరణాలను ఎస్బీఐ గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో చాలా దేవాలయాలకు ఆదాయం భారీగా పడిపోయింది. ఉత్స వాల నిర్వహణ, దేవాలయాల నిర్వహణ ఖర్చులు ప్రస్తుతం ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో భక్తుల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందడానికి వీలుగా బంగారాన్ని పెట్టుబడిగా పెట్టాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాలయాల అధీనంలో ఉన్న బంగారు నగలలో వినియోగించకుండా ఉన్న వాటిని సేకరించి బంగారు కడ్డీలుగా మార్చి స్టేట్ బ్యాంకు గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయనున్నారు. ఏయే దేవాలయాల్లో ఎంత బంగారం దీని పరిధిలోకి వస్తుందో లెక్కలు తేల్చాలని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు, ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో సమావేశమయ్యారు. కాగా, పెద్ద మొత్తంలో ఉన్న వెండిని కూడా బ్యాంకులో తొలుత బంగారంలోకి మార్చి ఆ బంగారాన్ని గోల్డ్ బాండ్ పథకం కింద ఎస్బీఐలో ఉంచనున్నారు. దేవుడి పేరుతో పాసు పుస్తకాలు.. దేవాలయాలభూములకు దేవుడి పేరుతో పట్టా తీసుకోనున్నారు. చాలా భూములు అన్యాక్రాంతమైన నేపథ్యంలో కమిషనర్ కొద్దినెలలుగా ఇతరుల చేతుల్లోని భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అంశంపై దృష్టి సారించారు. 2,622 ఎకరాల భూమిని ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఆయా దేవాలయాల్లోని దేవుడి పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. -
మహా‘నాలా’గోల వినరూ!
సాక్షి, సిటీబ్యూరో: సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటున్న ప్రజలకు ‘నాలా’గోల దడ పుట్టిస్తోంది. సేల్ డీడ్, లింక్స్ డాక్యుమెంట్స్, పహణీలు, పాస్‌బుక్, 13 ఏళ్ల ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్, సైట్ ఫొటోలు నాలుగు సైడ్లు, అవుట్సైడ్లు, లేఅవుట్ కాపీలు అర్కిటెక్ట్ సేవలతో నిక్షిప్తం చేసి చివరకు ఎల్ఆర్ఎస్ ఫీజుపై 33 శాతం అదనంగా ఫీజు కట్టేందుకు సిద్ధమైన దరఖాస్తుదారులకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్(నాలా) సర్టిఫికెట్ తీసుకురావాలంటూ హెచ్ఎండీఏ నుంచి షార్ట్‌ఫాల్స్ వస్తుండడంతో తలబొప్పి కడుతోంది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ వెళ్లి నాలా సర్టిఫికెట్ తీసుకొచ్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. నెలరోజుల్లో చేతికందాల్సిన ఆ నాలా సర్టిఫికెట్లు దరఖాస్తుదారులకు ఆలస్యంఅవుతుండడంతో అప్పటికే హెచ్ఎండీఏ నుంచి మీరు షార్ట్‌ఫాల్స్ ఆప్‌లోడ్ చేయకపోవడంతో మీ దరఖాస్తును తిరస్కరిస్తున్నామంటూ సమాచారం రావడంతో బిక్కమొహం పెడుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఘట్కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకరపల్లి జోన్ల అన్నింటిలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని ఇటు ప్లానింగ్ విభాగం అధికారులు, అటు దరఖాస్తుదారులు వాపోతున్నారు. ‘నాలా’ కోసం అష్టకష్టాలు... వ్యవసాయభూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకునేందుకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్(నాలా) కింద చెల్లించేదే నాలా పన్ను. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగానే ఈ నాలా సర్టిఫికెట్‌ను రెవెన్యూ విభాగం జారీ చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోవడం లేదు. నెలల కొద్దీ దరఖాస్తుదారులను వెంటతిప్పుకుంటోందనే విమర్శులున్నాయి. ఫలితంగా సొంతింటి కల సాకారం చేసుకునే పనిలో సామాన్యుడు బోల్తాపడుతున్నాడు. అయితే బడాబడా రియల్ ఎస్టేట్ వ్యాపారులైతే రెవెన్యూ అధికారులకు అమ్యమ్యాలు చూపుతుండటంతో దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే చేతికి అందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విభాగాలు సామాన్యుడిని ఒక మాదిరిగా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను మరో రకంగా చూస్తుందనే అపవాదును మూటగట్టుకుంటున్నాయి. నాలా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆర్డీవో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదికను ఎంఆర్వోకు రాస్తున్నారు. మళ్లీ ఎంఆర్వో పూర్తిస్థాయిలో తనిఖీ చేశాక తిరిగి నాలా సర్టిఫికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆర్డీవోకు నివేదిక పంపుతున్నారు. అక్కడి నుంచి అన్నీ తనిఖీ చేశాక దరఖాస్తుదారుడు నాలా పన్ను చెల్లించి సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. ఈ రెండంచెల పద్ధతికి చాలా రోజులు సమయం తీసుకుంటుండటం ఆరోపణలకు తావిస్తోంది. ఈ సమయంలోనే హెచ్ఎండీఏ డీపీఎంఎస్ షార్ట్‌ఫాల్స్ ఆప్‌లోడ్ చేయలేదని దరఖాస్తును తిరస్కరించడంతో దరఖాస్తుదారుల్లో అగ్రహం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం హెచ్ఎండీఏ నాలా సర్టిఫికెట్ అడుగుతున్నా, అనుకున్న సమయానికి రెవెన్యూ విభాగం నుంచి ఆ సర్టిఫికెట్ రాకపోవడంతో వందలాది మంది దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. నాలా ఫీజు హెచ్ఎండీఏలోనే వసూలు చేయాలి... 2015 అక్టోబర్ 20వ తేదీనాటికి ప్లాటు మీద రిజిష్టర్డ్ సేల్ డీడ్ ఉంటేనే 33 శాతం ఎల్ఆర్ఎస్ రుసుంతో హెచ్ఎండీఏ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తోంది. జీవో 151 ప్రకారం లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల క్లియరెన్స్‌లో భాగంగా నాలా చార్జీలు వసూలుచేసుకునే వీలును హెచ్ఎండీఏకు ప్రభుత్వం కల్పించింది. ఇదే విధానాన్ని భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చేవారికి కల్పించాలని, నాలా సర్టిఫికెట్ కోసం రెవెన్యూ విభాగం చుట్టూ తిరగాలంటే చాలా సమయం పడుతోందని, ఆలోపు హెచ్ఎండీఏలో దరఖాస్తు చేసుకున్న డీపీఎంఎస్ ఫైల్ తిరస్కరణ గురవుతోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి హెచ్ఎండీఏలోనే సింగిల్ విండోలో పని పూర్తయ్యేట్టుగా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. -
తహసీల్దార్లు కావలెను
నెల్లూరు(పొగతోట): జిల్లాలో రెవెన్యూ శాఖలో తహసీల్దార్ల కొరత అధికంగా ఉంది. నెల్లూరు, కావలి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్లు, 46 మండలాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ కీలకంగా వ్యవహరిస్తుంది. బాలాయపల్లి, ఇందుకూరుపేట, రాపూరు, ఆత్మకూరు, సంగం, ఏఎస్‌పేట, కలిగిరి మండలాలు, రెండు ప్రత్యేక తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తహసీల్దార్లు లేని మండలాల్లో డీటీలను ఇన్చార్జిలుగా నియమించారు. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో రికార్డుల నిర్వహణ, ప్రజల సమస్యలు పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. పాసుపుస్తకాల మంజూరు, మీ–భూమికి భరోసా, ఓటర్ల జాబితా సిద్ధం చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం డీపీసీ నిర్వహించి డీటీలకు పదోన్నతులు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా ఉందనే విమర్శలున్నాయి. డీపీసీ నిర్వహిస్తే జిల్లాకు తహసీల్దార్లను కేటాయించే అవకాశం ఉంది. ఎన్నో సేవలు మండల కేంద్రాల్లోని రెవెన్యూ కార్యాలయాలకు ప్రజలకు నిత్యం వెళుతుంటారు. ఆదాయం, నివాస, కుల, జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ భూములకు సంబం«ధించి అడంగళ్, వన్–బీ, రేషన్‌కార్డులు, పాసు పుస్తకాలు తదితర సేవలు తహసీల్దార్ నుంచి వారికి అందాల్సి ఉంటుంది. అ లాగే జిల్లాలో భూ సమస్యల పరి ష్కారం కోసం మీ భూమి భరోసా కా ర్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అధి కారుల కొరత కారణంగా ఈ కార్యక్రమం వేగవంతంగా సాగడం లేదు. కొన్ని సంవత్సరాలుగా.. మండలాలు, డివిజన్లు, కలెక్టరేట్, స్పెషల్ పోస్టులకు మొత్తం 67 మంది తహసీల్దార్ల అవసరం ఉంది. 46 మం దిని నియమించాల్సి ఉంది. కలెక్టరేట్లో ఎనిమిది మంది, రెవెన్యూ డివి జన్లకు ఐదుగురు డీఏఓలు, తెలుగుగంగ, ఐటీడీఏ తదితర శాఖలో ఎని మిది స్పెషల్ తహసీల్దార్ పోస్టులు ఉ న్నాయి. గతేడాది ప్రకాశం జిల్లా నుం చి నలుగురు తహసీల్దార్లను జిల్లాలకు కేటాయించారు. వారిలో ముగ్గురు మాత్రమే బాధ్యతలు స్వీకరించారు. 8 లక్షలున్నాయి భూ సమస్యలు 16.50 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో తహసీల్దార్లు పరి ష్కరించాల్సినవి 8 లక్షలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తే ఫైళ్ల నిర్వహణ వేగవంతం ఆయ్యే అవకాశాలు న్నాయి. కాగా తహసీల్దార్ల ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇతర జిల్లాల నుంచి కేటాయించాలని చేయమని సీసీఎల్ఏకు నివేదికలు పంపించారు. గుంటూరు జి ల్లా నుంచి తొమ్మిదిమంది తహసీల్దార్ల ను జిల్లాలకు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. డీపీసీ నిర్వహించాల్సి ఉంది జిల్లాలో తహసీల్దార్ల కొరత ఉంది. ఈ క్రమంలో సీసీఎల్ఏకు నివేదికలు పంపించాం. త్వరలో ఇతర జిల్లా నుంచి తహసీల్దార్లను కేటాయించే అవకాశం ఉంది. ప్రభుత్వం డీసీపీ నిర్వహించాల్సి ఉంది. ఫైళ్లు పెండింగ్ లేకుండా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నాం. – వి.వెంకటసుబ్బయ్య, డీఆర్వో -
నేడు తేలనున్న పంటనష్టం లెక్క
- సర్వేలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం - ఇప్పటి వరకు వరి 1648 హెక్టార్లలో నష్టం నల్లగొండ అగ్రికల్చర్: ఇటీవల జిల్లాలో కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన పంటల లెక్క శుక్రవారం తేలనుంది. పంటనష్టం సర్వే చేయడంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నిమగ్నమయ్యాయి. గ్రామాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి రైతు వారీగా పంటనష్టం అంచనాలు వేయడం వలన సర్వే కొంత ఆలస్యమవుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా 37 మండలాలలోని 320 గ్రామాల్లో సుమారు13287 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అందులో వరి 1367 హెక్టార్లు, 16 హెక్టార్లలో మొక్కజొన్న పంటలకు నష్ట జరిగినట్లు ప్రాథమికంగా అంచనాలు వేశారు. అయితే 10 మండలాలలో పంటలకు నష్టం జరగలేదని క్షేత్ర స్థాయిలో పర్యటించిన సర్వే బృందాలు ఇప్పటి వరకు నివేదికలు అందించాయి. 27 మండలాల్లో మాత్రమే పంటలకు నష్టం జరిగినట్లు నిర్ధారించారు. గురువారం నాటికి 13 మండలాల నుంచి పంటనష్టం నివేదికలు వ్యవసాయ శాఖకు అందాయి. అందులో వరి 1648 హెక్టార్లు కాగా మొక్కజొన్న 16 హెక్టార్లలో నష్టం జరిగినట్లు నివేదించారు. అయితే అత్యధికంగా పంట నష్టం జరిగిన 14 మండలాల నుంచి నివేదికలు నేడు అందే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి రైతుల వారీగా వివరాలను సేకరించి వారి బ్యాంకు అకౌంట్ బుక్ జీరాక్స్‌లను తప్పక తీసుకోవాల్సి ఉన్నందున సర్వే కొంత ఆలస్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం వరకు పంటనష్టం జరిగినా పరిహారం అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో పంటనష్టం జరిగిన రైతులు తమ పంట పొలాలను అధికారులకు చూపించి జాబితాలో పేర్లను నమోదు చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. సర్వే పూర్తి అయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన తరువాత నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందే అవకాశం ఉంటుంది.