సాక్షి, హైదరాబాద్: దేవాలయాల్లో వినియోగంలో లేని బంగారు ఆభరణాలను ఎస్‌బీఐ గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో చాలా దేవాలయాలకు ఆదాయం భారీగా పడిపోయింది. ఉత్స వాల నిర్వహణ, దేవాలయాల నిర్వహణ ఖర్చులు ప్రస్తుతం ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో భక్తుల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందడానికి వీలుగా బంగారాన్ని పెట్టుబడిగా పెట్టాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాలయాల అధీనంలో ఉన్న బంగారు నగలలో వినియోగించకుండా ఉన్న వాటిని సేకరించి బంగారు కడ్డీలుగా మార్చి స్టేట్ బ్యాంకు గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయనున్నారు.
ఏయే దేవాలయాల్లో ఎంత బంగారం దీని పరిధిలోకి వస్తుందో లెక్కలు తేల్చాలని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు, ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో సమావేశమయ్యారు. కాగా, పెద్ద మొత్తంలో ఉన్న వెండిని కూడా బ్యాంకులో తొలుత బంగారంలోకి మార్చి ఆ బంగారాన్ని గోల్డ్ బాండ్ పథకం కింద ఎస్‌బీఐలో ఉంచనున్నారు.
దేవుడి పేరుతో పాసు పుస్తకాలు..
దేవాలయాలభూములకు దేవుడి పేరుతో పట్టా తీసుకోనున్నారు. చాలా భూములు అన్యాక్రాంతమైన నేపథ్యంలో కమిషనర్ కొద్దినెలలుగా ఇతరుల చేతుల్లోని భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అంశంపై దృష్టి సారించారు. 2,622 ఎకరాల భూమిని ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఆయా దేవాలయాల్లోని దేవుడి పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment