ఇటీవల జిల్లాలో కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన పంటల లెక్క శుక్రవారం తేలనుంది...
- సర్వేలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం
- ఇప్పటి వరకు వరి 1648 హెక్టార్లలో నష్టం
నల్లగొండ అగ్రికల్చర్: ఇటీవల జిల్లాలో కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన పంటల లెక్క శుక్రవారం తేలనుంది. పంటనష్టం సర్వే చేయడంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నిమగ్నమయ్యాయి. గ్రామాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి రైతు వారీగా పంటనష్టం అంచనాలు వేయడం వలన సర్వే కొంత ఆలస్యమవుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా 37 మండలాలలోని 320 గ్రామాల్లో సుమారు13287 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
అందులో వరి 1367 హెక్టార్లు, 16 హెక్టార్లలో మొక్కజొన్న పంటలకు నష్ట జరిగినట్లు ప్రాథమికంగా అంచనాలు వేశారు. అయితే 10 మండలాలలో పంటలకు నష్టం జరగలేదని క్షేత్ర స్థాయిలో పర్యటించిన సర్వే బృందాలు ఇప్పటి వరకు నివేదికలు అందించాయి. 27 మండలాల్లో మాత్రమే పంటలకు నష్టం జరిగినట్లు నిర్ధారించారు. గురువారం నాటికి 13 మండలాల నుంచి పంటనష్టం నివేదికలు వ్యవసాయ శాఖకు అందాయి. అందులో వరి 1648 హెక్టార్లు కాగా మొక్కజొన్న 16 హెక్టార్లలో నష్టం జరిగినట్లు నివేదించారు.
అయితే అత్యధికంగా పంట నష్టం జరిగిన 14 మండలాల నుంచి నివేదికలు నేడు అందే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి రైతుల వారీగా వివరాలను సేకరించి వారి బ్యాంకు అకౌంట్ బుక్ జీరాక్స్‌లను తప్పక తీసుకోవాల్సి ఉన్నందున సర్వే కొంత ఆలస్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం వరకు పంటనష్టం జరిగినా పరిహారం అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో పంటనష్టం జరిగిన రైతులు తమ పంట పొలాలను అధికారులకు చూపించి జాబితాలో పేర్లను నమోదు చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. సర్వే పూర్తి అయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన తరువాత నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందే అవకాశం ఉంటుంది.