Crop damage survey
-
మానవత్వంతో ఆదుకోండి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : వరదల్లో నష్టపోయిన వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని, ప్రతి రైతును ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణం పంట నష్టంపై అంచనా వేసి.. డిసెంబర్ 15లోపు నివేదిక అందించాలని, 31లోగా రైతులకు పరిహారం పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలన్నారు. నివర్ తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో శనివారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సమీక్ష వివరాలను ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్‌బాషా మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సమగ్రంగా పరిశీలన ► పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతి ఒక్క వరద బాధితుడిని మానవతా దృక్పథంతో చూడాలని సీఎం చెప్పారు. ఉదారంగా వ్యవహరించి, నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ► పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం అందించాలన్నారు. పునరావాస కేంద్రాలు విడిచి వెళ్లిపోయినా సరే, అలాంటి వారందరికీ రూ.500 ఇవ్వాలని చెప్పారు. బుగ్గవంకకు రూ.39 కోట్లు ► వైఎస్సార్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బుగ్గవంక సుందరీకరణ పనులకు రూ.39 కోట్లు కేటాయించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.65 కోట్లతో బుగ్గవంక సుందరీకరణ పనులు చేపట్టారు. ఆయన మృతితో ఆ పనులు నిలిచిపోయాయి. పెండింగ్‌లో ఉన్న ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం, అదనంగా 1.2 కిలోమీటర్ల మేర కొత్త నిర్మాణాలకు రూ.39 కోట్లు వెచ్చించాల్సి ఉందని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా, కలెక్టర్ హరికిరణ్‌లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వెంటనే ఆ పనులు చేపట్టాలని ఆదేశించారు. ► అన్నమయ్య ప్రాజెక్టును 10 టీఎంసీలకు విస్తరించాలని, తక్కువ ఖర్చుతో విస్తరణ చేపట్టవచ్చని, అలాగే పింఛా ప్రాజెక్టును 2 టీఎంసీలకు విస్తరించవచ్చని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సూచించగా, ప్రతిపాదనలు చేపట్టాలని సీఎం తెలిపారు. రేణిగుంటలో ఘన స్వాగతం.. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 10.15 గంటలకు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, ఎస్బీ అంజద్ బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు, భూమన కారుణాకర్రెడ్డి, ఆర్కే రోజా, ఆదిమూలం, ఎం.ఎస్ బాబు, ద్వారాకనాథరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పలువురు అధికారులు స్వాగతం పలికారు. సీఎం వెంట రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఉన్నారు. వైఎస్సార్ జిల్లాలో అపార నష్టం ► వైఎస్సార్ జిల్లాలోని మైనర్ ఇరిగేష్ ప్రాజెక్టులలో పూర్తి సామర్థ్యం మేరకు 0.327 టీఎంసీల నీరు ఉందని, అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితిని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ► జిల్లాలో 825 గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 72,755 హెక్టార్లు, ఉద్యాన వన శాఖకు సంబంధించి 3,240 హెక్టార్లలో పంట నీట మునిగిందని, 757 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. ► జిల్లా వ్యాప్తంగా 12,741 మందిని రేస్క్యు ఆపరేషన్‌లో కాపాడామని, పునరావాస కేంద్రాలలో 15,289 మందికి ఆశ్రయం కల్పించామని తెలిపారు. 192.6 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్లు, 1,234 కి.మీ మేర పంచాయతీ రోడ్లు దెబ్బ తిన్నాయని వివరించారు. 8,129 మేకలు, గొర్రెలు, కోళ్లు మృతి ► చిత్తూరు జిల్లాలో 21 మండలాల్లోని 245 గ్రామాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించి 9,658 హెక్టార్లు, ఉద్యానవన శాఖకు సంబంధించి 1,729.52 హెక్టార్లల్లో పంటలు నీట మునిగాయని జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్త ముఖ్యమంత్రికి వివరించారు. ► పశు సంవర్థక శాఖకు సంబంధించి మేకలు, గొర్రెలు, కోళ్లు కలిపి 8,129 మృత్యువాత పడ్డట్లు తెలిపారు. 245 కచ్చా ఇళ్లు దెబ్బ తిన్నాయని, రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించి పలువుర్ని కాపాడామన్నారు. ► 44 పునరావాస కేంద్రాలలో 4,012 మంది ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా 543.8 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్ల ఉపరితలం దెబ్బతినిందని చెప్పారు. రూ.1,082.5 లక్షలు విలువ చేసే బిల్డింగులు, డ్రెయిన్లు, పైప్ లైన్లు దెబ్బ తిన్నాయన్నారు. 34,200 హెక్టార్లలో పంటలు మునక ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి 18 మండలాల్లోని 107 గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 33,269 హెక్టార్లు, ఉద్యానవన శాఖకు సంబంధించి 931 హెక్టార్లలో పంటలు నీట మునిగాయని కలెక్టర్ చక్రధర్‌బాబు సీఎంకు వివరించారు. రేస్క్యూ ఆపరేషన్ ద్వారా 17,163 మందిని కాపాడామని, 155 పునరావాస కేంద్రాల్లో 17,163 మందికి ఆశ్రయం కల్పించామని చెప్పారు. 343.04 లక్షల విలువ చేసే బిల్డింగులు, డ్రెయిన్లు, పైప్ లైన్లు దెబ్బ తిన్నాయని చెప్పారు. 290 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు భరోసా తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించాలని, దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి -
‘చిల్లీ’.. తల్లడిల్లి
ఖమ్మంవ్యవసాయం: మిర్చి సాగు రైతులను కన్నీరు పెట్టిస్తోంది. జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. దీంతో పంట సాగు చేసిన రైతులపై కోలుకోలేని దెబ్బపడింది. జిల్లాలో ఈ ఏడాది 23,410 హెక్టార్లలో మిర్చి పంట సాగు చేశారు. జిల్లాలోని ఖమ్మం, కూసుమంచి, మధిర, వైరా వ్యవసాయ డివిజన్లలో పంటను విస్తారంగా సాగు చేశారు. సత్తుపల్లి వ్యవసాయ డివిజన్లో మాత్రం సాగు తక్కువగా ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరస్ తెగుళ్లు ఆశించి పంటకు నష్టం వాటిల్లింది. ఎకరాకు సగటున 7 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. దీంతో సాగుకయ్యే కనీస పెట్టుబడులు పూడకపోగా.. ఎకరాకు రూ.50వేల నుంచి రూ.60వేల మేరకు రైతులు నష్టపోయారు. ఇక కౌలు రైతులు మరో రూ.20వేల మేర నష్టాలను చవిచూస్తున్నారు. పండిన పంటకు కూడా ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబమంతా ఆరుగాలం శ్రమించినా ఎకరాకు మరో రూ.15వేల మేర నష్టం జరిగింది. పెరిగిన సాగు విస్తీర్ణం ఈ ఏడాది జిల్లాలో మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 19,828 హెక్టార్లు కాగా.. అంతకుమించి 23,410 హెక్టార్లలో పంట సాగు చేశారు. గత ఏడాది 19,605 హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 5వేల హెక్టార్లలో అదనంగా పంట సాగు చేశారు. ఇతర పంటల కంటే మిర్చి పంట ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే ఆలోచనతో రైతులు మిర్చి సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ముంచిన తెగుళ్లు అనుకూలించని వర్షాలు, తుపాన్లు, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మిర్చి పంటకు తీరని నష్టం జరిగింది. వర్షాల కారణంగా గాలిలో తేమశాతం పెరగడంతో పంట తెగుళ్ల బారినపడింది. ఆగస్టు, డిసెంబర్, జనవరి నెలల్లో కురిసిన వర్షాలు, తుపాన్లు పంటకు ప్రతికూలంగా మారాయి. ప్రధానంగా తోటలకు జెమినీ వైరస్ సోకింది. దీనిని కొంత మేరకు నియంత్రించుకోవడం తప్ప పూర్తి పరిష్కారం లేదు. దీనికి తోడు ఎండు తెగులు ఆశించింది. తెగుళ్ల నివారణకు రైతులు మందులను మార్చిమార్చి పిచికారీ చేశారు. గుంటూరు నుంచి మందులు తెచ్చి వినియోగించినా ఫలితం కనిపించలేదు. తెగుళ్ల కారణంగా పైరు ఆశించిన రీతిలో లేదు. దిగుబడులపై గణనీయంగా ప్రభావం పడింది. ఎకరాకు 7 క్వింటాళ్లు మించని దుస్థితి ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల వల్ల జిల్లాలో సగటున ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నల్లరేగడి నేలల్లో మిర్చి గుంటకు క్వింటా చొప్పున 40 గుంటల (ఎకరా) భూమిలో 40 క్వింటాళ్ల పంట పండుతోంది. అయితే ఇక్కడి భూములు వివిధ రకాలుగా ఉండడంతో మిర్చి ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల మేరకు దిగుబడులు వస్తాయి. అయితే ఈ ఏడాది కనీస దిగుబడులు కూడా రాలేదు. ఎకరాకు రూ.50వేల నుంచి రూ.60వేల మేర పెట్టుబడి నష్టం మిర్చి సాగుకు ఎకరాకు నారు పోసింది మొదలు పంటను మార్కెట్‌కు చేర్చి.. విక్రయించే వరకు రూ.1.10లక్షల నుంచి రూ.1.20లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఈ ఏడాది ఎకరాకు సగటున 7 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుత ధర క్వింటాల్‌కు సగటున రూ.7,500 వరకు పలుకుతోంది. అంటే ఎకరాకు పంట అమ్మితే రూ.52,500 వస్తున్నాయి. ఎకరాకు దాదాపు రూ.50వేల నుంచి రూ.60వేల మేరకు రైతు పెట్టుబడి నష్టపోతున్నాడు. ఇక కౌలు రైతు పరిస్థితి మరీ దయనీయం. ఈ రైతులు కౌలు మరో రూ.20వేల మేరకు నష్టపోతున్నారు. ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు కనీసం పెట్టుబడులు కూడా పూడక తల పట్టుకున్నారు. మిర్చి ముంచింది.. ఈ ఏడాది మిర్చి పంట ముంచింది. పెట్టుబడుల్లో సగం కూడా పూడే పరిస్థితి లేదు. తుపాను కారణంగా తెగుళ్లు బాగా పెరిగాయి. వర్షాల వల్ల శ్రమ కూడా పెరిగింది. జెమినీ వైరస్‌తో కొందరు రైతులు తోటలను వదిలేశారు. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు. పండిన పంటకు తగిన ధర కూడా లేదు. దీనివల్ల కూడా నష్టపోతున్నాం. – సిరసవాడ వెంకటేశ్వర్లు, వెదళ్లచెరువు, తిరుమలాయపాలెం మండలం పంటకు ప్రతికూల పరిస్థితి.. ప్రస్తుతం మిర్చి పంటకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు బాగా దెబ్బతీశాయి. పంట చేతికందే సమయంలో పెథాయ్ తుపాను రావడం కూడా పంటకు నష్టం కలిగించింది. జనవరిలో కురిసిన వర్షం కూడా పంటపై ప్రభావం చూపింది. మొత్తంగా ఈ ఏడాది మిర్చి దిగుబడులు ఆశాజనకంగా లేవు. – జి.అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాధికారి -
కడప గడపలో కరువు దరువు
సాక్షి ప్రతినిధి కడప: అతివృష్టి.. అనావృష్టి.. క్రమం తప్పకుండా కడప గడపలోనే తిష్టవేశాయి. వెరసి జిల్లా రైతాంగానికి వ్యవసాయం కడుభారంగా మారింది. జీవనోపాధి కోసం నగరాలకు వలసలు తెరపైకి వచ్చాయి. పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతు నగరాల్లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా జీవనం సాగిస్తున్నారు. ఆదిరించి అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఉత్తుత్తి మాటలకు పరిమితమైంది. కరువు ప్రకటన చేస్తుంది..ఆపై ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఊసే ఎత్తదు. ఇదే పరిస్థితిని నాలుగేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్నారు. పంట ఏదైనా సరే.. నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. ఆరుతడి పంటలు, పండ్లతోటలు, ఆకుతోటలు, చిరుధాన్యాలు, పూలతోటలు ఇలా ఏ పంటైనా సరే రైతులు అప్పుల ఊబిలోకి వెళ్తున్నారు. 2013–14 నుంచి ఇప్పటికీ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఈమారు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సరాసరిన 65 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం మినహా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని రైతన్నలు వాపోతున్నారు. పేరుకుపోతున్న పరిహారం.. వరుస కరువులను చవిచూస్తున్న రైతులకు పరిహారం మాత్రం సకాలంలో దక్కలేదు. 2013 నుంచి ఇప్పటి వరకు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు జిల్లాకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.56.08 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. వ్యవసాయ పంటలకు రూ.45.87 కోట్లు కాగా, ఉద్యానవన పంటలకు రూ.10.21 కోట్లు అందాల్సి ఉంది. 44 మండలాల్లోని 51వేల మందికిపైగా రైతులు నష్టపరిహారమైన ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదు చూస్తున్నారు. సకాలంలో చెల్లించి రైతులకు దన్నుగా నిలవాలనే దృక్పథం ప్రభుత్వంలో కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు. వ్యవసాయం తప్ప మరోపని చేసేందుకు ఆసక్తి చూపని రైతన్న ఉద్యాన పంటలను సాగుచేస్తే అకాల వర్షాలు, ఈదురుగాలులు దెబ్బతీస్తున్నాయి. ఏటా ఆయా విపత్తుల వల్ల నిండా మునిగిపోతున్నారు. సాయమందించాలనే మాటను ప్రభుత్వం ఎప్పుడో మరచిపోయిందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పంట నష్టం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపినా ఉలుకుపలుకు లేదని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పెదవి విరుస్తుండడం విశేషం. జిల్లాలో 2013లో ఫిబ్రవరి నుంచి 2017 అక్టోబరు వరకు ప్రకృతి విపత్తులతో 4,293 హెక్టార్లలో ఉద్యాన పంటలు(తోటలు) దెబ్బతినగా 9,425 మంది రైతులు రూ.10.21 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ఉద్యానశాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాగా ఇంత వరకు పైసా కూడా ప్రభుత్వం మంజూరు చేసి ఉంటే ఒట్టని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై 31 వరకు సాగు చేసిన పంటలే పరిగణలోకి.. ఈనెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాలోని 51 మండలాలను కరువు మండలాలుగా గుర్తించినట్లు ప్రకటిస్తూ జీఓ నంబరు 6ను విడుదల చేసింది. ఆపై ఈ ఖరీఫ్‌కు సంబందించి జూలై 31వ తేదీ లోపు సాగైన పంటలకు మాత్రమే పరిహారంటూ కట్ఆఫ్ డేట్‌ను ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల గుండెల్లో గునపం దించినట్లవుతోంది. కేవలం జూలై నెలాఖరులో ఏ రైతులైతే పంట సాగు చేసి ఉంటారో వారి పేర్లను మాత్రం పరిహారం కోసం నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆగస్టులో పంట సాగు చేసిన వారి నోట్లో మట్టిగొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. సాధారణంగా ఖరీఫ్‌కు సంబంధించి జూన్‌లో ప్రారంభించి సెప్టెంబరు నెల వరకు వర్షాభావంతో పంటలు దెబ్బతినడం, వర్ష విరామం(వర్షాలు నెలల తరబడి పడకపోవడం)తో, దిగుబడిని ఆధారం చేసుకుని నష్ట అంచనాలు తయారు చేయడం సర్వసాధారణం. కాగా ప్రభుత్వం ముందుగానే కరువు మండలలాను ప్రకటించింది. కట్ ఆఫ్‌డేట్ నిర్ణయించిన కారణంగా పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) సగం మందికి కూడా అందే అవకాశం లేకుండా పోతోందని పలువురు రైతులు మండిపడుతున్నారు. జూలై 31వ తేదీ వరకు పంటలను సాగు చేసిన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించడంతో ఆగస్టు నెలలో పంట సాగు చేసి నష్టపోయిన రైతుల నోట్లో మట్టి కొట్టే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. 6245 హెక్టార్ల పంట నమోదు చేయరంటా.. జిల్లాలో జూన్ నెలలో 69.2 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 31.9 మిల్లీ మీటర్లు కురిసింది. జూలై నెలలో 96.7 మిల్లీ మీటర్ల వాన పడాల్సి ఉండగా కేవలం 21.5 మిల్లీ మీటర్లు మాత్రమే పడింది. ఆగస్టులో 114 ఎంఎం కురవాల్సి ఉండగా ఇప్పటికే 36ఎంఎం పడింది. ఈ ఖరీఫ్ సీజన్‌కు సాధారణ సాగు 1,33,356 హెక్టార్లు కాగా, జూలై ఆఖరుకు 12,501 హెక్టార్లల్లో మాత్రమే పంటలు సాగుచేసినట్లు అధికారిక లెక్కలు కట్టారు. ఆగస్టు మొదటి వారంలో కురిసిన వానలకు మెజార్టీ రైతులు పత్తి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఇతర పంటలను కలిపి 6245 హెక్టార్లలో సాగు చేశారు. ఆగస్టులో సాగైన ఈ పంటల నమోదును చేపట్టేదిలేదని అధికారులు ఖరాఖండిగా చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ ధర్నా.. నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంభిస్తోంది. పరిహారం ఇవ్వకుండా కేవలం ప్రకటనలతో ముడిపెడుతూ కాలం వెళ్లబుచ్చుతోంది. ఈమారు కూడా కరువు మండలాలు ప్రకటన మినహా ఎలాంటి చేయూత కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా సోమవారం కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ ధర్నా చేపట్టనున్నట్లు కడప, రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు కొత్తమద్ధి సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. రైతుల సమస్యల పరిష్కా రం కోసం వైఎస్సార్సీపీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని వారు వివరించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాలో జిల్లాలోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
పక్కాగా సర్వే
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో పంట నష్టం అంచనాకు బృందాలు సర్వేలో నిమగ్నమయ్యాయి. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని శుక్రవారం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసి నాలుగైదు రోజుల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంట నష్టానికి సంబంధించి కలెక్టర్ దివ్యదేవరాజన్ కొద్దిరోజుల ముందే బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 22 నుంచే ఈ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా వ్యాప్తంగా 101 క్లస్టర్లకు గాను 101 బృందాలను ఏర్పాటు చేసి సర్వే కోసం పంపించారు. ఒక్కో బృందంలో వ్యవసాయ శాఖ నుంచి ఏఈఓ, రెవెన్యూ శాఖ నుంచి వీఆర్ఓ ఉన్నారు. సర్వే కోసం వారికి ప్రత్యేక యాప్‌ను ఇచ్చారు. ఆ యాప్‌పై వారికి అవగాహన కల్పించేందుకు సమావేశం కూడా నిర్వహించారు. ప్రధానంగా జియో ట్యాగింగ్ ద్వారా పంట నష్టం సర్వేను నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పూర్తి పారదర్శకంగా నష్టం జరిగిన రైతులనే పరిగణనలోకి తీసుకునే పరిస్థితి. తద్వారా సర్వేలో బోగస్ పేర్ల నమోదు జరిగే ఆస్కారం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక గ్రామంలోని పంట నష్టపోయిన రైతుకు సంబంధించి చేను ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేసే క్రమంలో దాని అక్షాంశాలు, రేఖాంశాలు అందులో నమోదవుతాయి. అంతేకాకుండా సర్వే చేసిన తేదీ, సమయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైతు పేరు, సర్వేనంబర్, ఎన్ని ఎకరాలు ఉందనేది అందులో పేర్కొంటారు. ఇక పంట నష్టానికి సంబంధించి మాత్రం ఆ యాప్‌లో నమోదు చేయరు. రికార్డులో నష్టం వివరాలను నమోదు చేసుకుంటారు. ఇలా సర్వే ఒక పారదర్శకంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టంలో రాజకీయ జోక్యం, గ్రామంలో భూస్వాముల నుంచి ఒత్తిడి చోటుచేసుకొని బోగస్ పేర్లు, ఎకరాలు నమోదు చేయడం వంటివి, తద్వారా పరిహారాన్ని పరిహాసం చేసి స్వాహా చేసేవారు. దీనికి అవకాశం లేకుండా జియో ట్యాగింగ్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేస్తుండడంతో అసలైన రైతులకు పంట నష్టపరిహారం దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఎక్కువ రోజులు.. సాధారణ సర్వే కంటే జియో ట్యాగింగ్ ద్వారా చేపడుతున్న ఈ సర్వేకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా మామూలు సర్వేలో బృందాలు ఒక చేనులో పరిశీలన చేసిన తర్వాత పక్క చేనులో కూడా ఇదే పరిస్థితి ఉందని నమోదు చేసుకొని నష్టాన్ని అంచనా వేసేవారు. కానీ దీంట్లో ఆ పరిస్థితి లేదు. నష్టం జరిగిన ప్రతి రైతుకు సంబంధించి జియో ట్యాగింగ్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఒక క్లస్టర్ పరిధిలో 5వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది. సాధారణ సర్వేలో రోజు 400 నుంచి 500 ఎకరాలు సర్వే చేసే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ జియో ట్యాగింగ్ సర్వేలో సుమారు 200 నుంచి 250 ఎకరాల వరకు సర్వే చేయడం జరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా సాధారణ సర్వే కంటే రెట్టింపు రోజులు ఈ జియో ట్యాగింగ్ సర్వేకు పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఈ సర్వే 10 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంది. పకడ్బందీగా సర్వే జరుగుతుండడంతో పంట నష్టపోయిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి నాలుగైదు రోజుల్లో పంట నష్టానికి సంబంధించి సమగ్ర నివేదిక పంపించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే సర్వే ప్రారంభమై ఉండడం, కొంత ఆలస్యమైనా మరో వారం, పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏనుగు కేశవ్‌రెడ్డి జైనథ్ మండలం కాప్రి గ్రామంలో 5.11 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. ఇటీవల భారీ వర్షాలకు చేనులో వరద నీరు నిలిచి పంట పూర్తిగా నష్టపోయాడు. సర్వే బృందం పంట నష్టం నమోదులో ఒక కొత్త పద్ధతిని అవలంబించింది. పంట నష్టపోయిన చేనులో రైతును నిల్చోబెట్టి ఆ చేనుకు సంబంధించి ప్రత్యేక యాప్‌లో ఫొటో తీసుకోవడమే కాకుండా ఆ రైతు పేరు, సర్వేనంబర్, ఎన్ని ఎకరాలు ఉందనే విషయాలను నమోదు చేసుకున్నారు. ఇక ఆ ఫొటో తీసిన సమయం, తేదీ అందులో స్పష్టంగా కనిపిస్తోంది. జియో ట్యాగింగ్ ద్వారా ఆ ప్రాంతంలోని అక్షాంశాలు, రేఖాంశాలు నమోదవుతాయి. పంట నష్టం సర్వేలో బోగస్ పేర్లు, ఎకరాలు, తదితర నమోదు చేసే అవకాశం లేదు. తద్వారా పంట నష్టపోయిన నిజమైన రైతులకే పరిహారం అందజేసేందుకు అవకాశం ఉంటుందనేది అధికారుల భావన. పకడ్బందీగా సర్వే.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో పకడ్బందీగా సర్వే నిర్వహించడం జరుగుతోంది. పంట నష్టం సర్వేలో పూర్తి పారదర్శకత ఉంటుంది. జియో ట్యాగింగ్ ద్వారా రైతు చేనుకు సంబంధించి ఫొటోతోపాటు రైతు వివరాలు, చేను అక్షాంశాలు, రేఖాంశాలు నమోదు చేయడం జరుగుతుంది. తేదీ, సమయం అన్ని స్పష్టంగా ఉంటాయి. – మంగీలాల్, జేడీఏ, ఆదిలాబాద్ -
నేడు తేలనున్న పంటనష్టం లెక్క
- సర్వేలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం - ఇప్పటి వరకు వరి 1648 హెక్టార్లలో నష్టం నల్లగొండ అగ్రికల్చర్: ఇటీవల జిల్లాలో కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన పంటల లెక్క శుక్రవారం తేలనుంది. పంటనష్టం సర్వే చేయడంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నిమగ్నమయ్యాయి. గ్రామాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి రైతు వారీగా పంటనష్టం అంచనాలు వేయడం వలన సర్వే కొంత ఆలస్యమవుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా 37 మండలాలలోని 320 గ్రామాల్లో సుమారు13287 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అందులో వరి 1367 హెక్టార్లు, 16 హెక్టార్లలో మొక్కజొన్న పంటలకు నష్ట జరిగినట్లు ప్రాథమికంగా అంచనాలు వేశారు. అయితే 10 మండలాలలో పంటలకు నష్టం జరగలేదని క్షేత్ర స్థాయిలో పర్యటించిన సర్వే బృందాలు ఇప్పటి వరకు నివేదికలు అందించాయి. 27 మండలాల్లో మాత్రమే పంటలకు నష్టం జరిగినట్లు నిర్ధారించారు. గురువారం నాటికి 13 మండలాల నుంచి పంటనష్టం నివేదికలు వ్యవసాయ శాఖకు అందాయి. అందులో వరి 1648 హెక్టార్లు కాగా మొక్కజొన్న 16 హెక్టార్లలో నష్టం జరిగినట్లు నివేదించారు. అయితే అత్యధికంగా పంట నష్టం జరిగిన 14 మండలాల నుంచి నివేదికలు నేడు అందే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి రైతుల వారీగా వివరాలను సేకరించి వారి బ్యాంకు అకౌంట్ బుక్ జీరాక్స్‌లను తప్పక తీసుకోవాల్సి ఉన్నందున సర్వే కొంత ఆలస్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం వరకు పంటనష్టం జరిగినా పరిహారం అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో పంటనష్టం జరిగిన రైతులు తమ పంట పొలాలను అధికారులకు చూపించి జాబితాలో పేర్లను నమోదు చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. సర్వే పూర్తి అయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన తరువాత నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందే అవకాశం ఉంటుంది.