జైనథ్ మండలం కాప్రి గ్రామంలో ఏనుగు కేశవ్‌రెడ్డి పొలంతో ఫొటో
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో పంట నష్టం అంచనాకు బృందాలు సర్వేలో నిమగ్నమయ్యాయి. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని శుక్రవారం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసి నాలుగైదు రోజుల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంట నష్టానికి సంబంధించి కలెక్టర్ దివ్యదేవరాజన్ కొద్దిరోజుల ముందే బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 22 నుంచే ఈ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా వ్యాప్తంగా 101 క్లస్టర్లకు గాను 101 బృందాలను ఏర్పాటు చేసి సర్వే కోసం పంపించారు. ఒక్కో బృందంలో వ్యవసాయ శాఖ నుంచి ఏఈఓ, రెవెన్యూ శాఖ నుంచి వీఆర్‌ఓ ఉన్నారు.
సర్వే కోసం వారికి ప్రత్యేక యాప్‌ను ఇచ్చారు. ఆ యాప్‌పై వారికి అవగాహన కల్పించేందుకు సమావేశం కూడా నిర్వహించారు. ప్రధానంగా జియో ట్యాగింగ్ ద్వారా పంట నష్టం సర్వేను నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పూర్తి పారదర్శకంగా నష్టం జరిగిన రైతులనే పరిగణనలోకి తీసుకునే పరిస్థితి. తద్వారా సర్వేలో బోగస్ పేర్ల నమోదు జరిగే ఆస్కారం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక గ్రామంలోని పంట నష్టపోయిన రైతుకు సంబంధించి చేను ఫొటోను యాప్‌లో అప్‌లోడ్ చేసే క్రమంలో దాని అక్షాంశాలు, రేఖాంశాలు అందులో నమోదవుతాయి. అంతేకాకుండా సర్వే చేసిన తేదీ, సమయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైతు పేరు, సర్వేనంబర్, ఎన్ని ఎకరాలు ఉందనేది అందులో పేర్కొంటారు.
ఇక పంట నష్టానికి సంబంధించి మాత్రం ఆ యాప్‌లో నమోదు చేయరు. రికార్డులో నష్టం వివరాలను నమోదు చేసుకుంటారు. ఇలా సర్వే ఒక పారదర్శకంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టంలో రాజకీయ జోక్యం, గ్రామంలో భూస్వాముల నుంచి ఒత్తిడి చోటుచేసుకొని బోగస్ పేర్లు, ఎకరాలు నమోదు చేయడం వంటివి, తద్వారా పరిహారాన్ని పరిహాసం చేసి స్వాహా చేసేవారు. దీనికి అవకాశం లేకుండా జియో ట్యాగింగ్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేస్తుండడంతో అసలైన రైతులకు పంట నష్టపరిహారం దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఎక్కువ రోజులు..
సాధారణ సర్వే కంటే జియో ట్యాగింగ్ ద్వారా చేపడుతున్న ఈ సర్వేకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా మామూలు సర్వేలో బృందాలు ఒక చేనులో పరిశీలన చేసిన తర్వాత పక్క చేనులో కూడా ఇదే పరిస్థితి ఉందని నమోదు చేసుకొని నష్టాన్ని అంచనా వేసేవారు. కానీ దీంట్లో ఆ పరిస్థితి లేదు. నష్టం జరిగిన ప్రతి రైతుకు సంబంధించి జియో ట్యాగింగ్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఒక క్లస్టర్ పరిధిలో 5వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది. సాధారణ సర్వేలో రోజు 400 నుంచి 500 ఎకరాలు సర్వే చేసే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ జియో ట్యాగింగ్ సర్వేలో సుమారు 200 నుంచి 250 ఎకరాల వరకు సర్వే చేయడం జరుగుతుందని పేర్కొంటున్నారు.
తద్వారా సాధారణ సర్వే కంటే రెట్టింపు రోజులు ఈ జియో ట్యాగింగ్ సర్వేకు పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఈ సర్వే 10 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంది. పకడ్బందీగా సర్వే జరుగుతుండడంతో పంట నష్టపోయిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి నాలుగైదు రోజుల్లో పంట నష్టానికి సంబంధించి సమగ్ర నివేదిక పంపించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే సర్వే ప్రారంభమై ఉండడం, కొంత ఆలస్యమైనా మరో వారం, పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఏనుగు కేశవ్‌రెడ్డి జైనథ్ మండలం కాప్రి గ్రామంలో 5.11 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. ఇటీవల భారీ వర్షాలకు చేనులో వరద నీరు నిలిచి పంట పూర్తిగా నష్టపోయాడు. సర్వే బృందం పంట నష్టం నమోదులో ఒక కొత్త పద్ధతిని అవలంబించింది. పంట నష్టపోయిన చేనులో రైతును నిల్చోబెట్టి ఆ చేనుకు సంబంధించి ప్రత్యేక యాప్‌లో ఫొటో తీసుకోవడమే కాకుండా ఆ రైతు పేరు, సర్వేనంబర్, ఎన్ని ఎకరాలు ఉందనే విషయాలను నమోదు చేసుకున్నారు. ఇక ఆ ఫొటో తీసిన సమయం, తేదీ అందులో స్పష్టంగా కనిపిస్తోంది. జియో ట్యాగింగ్ ద్వారా ఆ ప్రాంతంలోని అక్షాంశాలు, రేఖాంశాలు నమోదవుతాయి. పంట నష్టం సర్వేలో బోగస్ పేర్లు, ఎకరాలు, తదితర నమోదు చేసే అవకాశం లేదు. తద్వారా పంట నష్టపోయిన నిజమైన రైతులకే పరిహారం అందజేసేందుకు అవకాశం ఉంటుందనేది అధికారుల భావన.
పకడ్బందీగా సర్వే..
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో పకడ్బందీగా సర్వే నిర్వహించడం జరుగుతోంది. పంట నష్టం సర్వేలో పూర్తి పారదర్శకత ఉంటుంది. జియో ట్యాగింగ్ ద్వారా రైతు చేనుకు సంబంధించి ఫొటోతోపాటు రైతు వివరాలు, చేను అక్షాంశాలు, రేఖాంశాలు నమోదు చేయడం జరుగుతుంది. తేదీ, సమయం అన్ని స్పష్టంగా ఉంటాయి. – మంగీలాల్, జేడీఏ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment