నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి : వరదల్లో నష్టపోయిన వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని, ప్రతి రైతును ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణం పంట నష్టంపై అంచనా వేసి.. డిసెంబర్ 15లోపు నివేదిక అందించాలని, 31లోగా రైతులకు పరిహారం పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలన్నారు. నివర్ తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో శనివారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు.
గన్నవరం నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సమీక్ష వివరాలను ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజాద్‌బాషా మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సమగ్రంగా పరిశీలన
► పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతి ఒక్క వరద బాధితుడిని మానవతా దృక్పథంతో చూడాలని సీఎం చెప్పారు. ఉదారంగా వ్యవహరించి, నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
► పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం అందించాలన్నారు. పునరావాస కేంద్రాలు విడిచి వెళ్లిపోయినా సరే, అలాంటి వారందరికీ రూ.500 ఇవ్వాలని చెప్పారు.
బుగ్గవంకకు రూ.39 కోట్లు
► వైఎస్సార్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బుగ్గవంక సుందరీకరణ పనులకు రూ.39 కోట్లు కేటాయించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.65 కోట్లతో బుగ్గవంక సుందరీకరణ పనులు చేపట్టారు. ఆయన మృతితో ఆ పనులు నిలిచిపోయాయి. పెండింగ్‌లో ఉన్న ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం, అదనంగా 1.2 కిలోమీటర్ల మేర కొత్త నిర్మాణాలకు రూ.39 కోట్లు వెచ్చించాల్సి ఉందని డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా, కలెక్టర్ హరికిరణ్‌లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వెంటనే ఆ పనులు చేపట్టాలని ఆదేశించారు.
► అన్నమయ్య ప్రాజెక్టును 10 టీఎంసీలకు విస్తరించాలని, తక్కువ ఖర్చుతో విస్తరణ చేపట్టవచ్చని, అలాగే పింఛా ప్రాజెక్టును 2 టీఎంసీలకు విస్తరించవచ్చని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సూచించగా, ప్రతిపాదనలు చేపట్టాలని సీఎం తెలిపారు.
రేణిగుంటలో ఘన స్వాగతం..
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 10.15 గంటలకు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, ఎస్‌బీ అంజద్ బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు, భూమన కారుణాకర్‌రెడ్డి, ఆర్కే రోజా, ఆదిమూలం, ఎం.ఎస్ బాబు, ద్వారాకనాథరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పలువురు అధికారులు స్వాగతం పలికారు. సీఎం వెంట రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఉన్నారు.
వైఎస్సార్ జిల్లాలో అపార నష్టం
► వైఎస్సార్ జిల్లాలోని మైనర్ ఇరిగేష్ ప్రాజెక్టులలో పూర్తి సామర్థ్యం మేరకు 0.327 టీఎంసీల నీరు ఉందని, అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితిని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.
► జిల్లాలో 825 గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 72,755 హెక్టార్లు, ఉద్యాన వన శాఖకు సంబంధించి 3,240 హెక్టార్లలో పంట నీట మునిగిందని, 757 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు.
► జిల్లా వ్యాప్తంగా 12,741 మందిని రేస్క్యు ఆపరేషన్‌లో కాపాడామని, పునరావాస కేంద్రాలలో 15,289 మందికి ఆశ్రయం కల్పించామని తెలిపారు. 192.6 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్లు, 1,234 కి.మీ మేర పంచాయతీ రోడ్లు దెబ్బ తిన్నాయని వివరించారు.
8,129 మేకలు, గొర్రెలు, కోళ్లు మృతి
► చిత్తూరు జిల్లాలో 21 మండలాల్లోని 245 గ్రామాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించి 9,658 హెక్టార్లు, ఉద్యానవన శాఖకు సంబంధించి 1,729.52 హెక్టార్లల్లో పంటలు నీట మునిగాయని జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్త ముఖ్యమంత్రికి వివరించారు.
► పశు సంవర్థక శాఖకు సంబంధించి మేకలు, గొర్రెలు, కోళ్లు కలిపి 8,129 మృత్యువాత పడ్డట్లు తెలిపారు. 245 కచ్చా ఇళ్లు దెబ్బ తిన్నాయని, రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించి పలువుర్ని కాపాడామన్నారు.
► 44 పునరావాస కేంద్రాలలో 4,012 మంది ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా 543.8 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్ల ఉపరితలం దెబ్బతినిందని చెప్పారు. రూ.1,082.5 లక్షలు విలువ చేసే బిల్డింగులు, డ్రెయిన్లు, పైప్ లైన్లు దెబ్బ తిన్నాయన్నారు.
34,200 హెక్టార్లలో పంటలు మునక
► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి 18 మండలాల్లోని 107 గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 33,269 హెక్టార్లు, ఉద్యానవన శాఖకు సంబంధించి 931 హెక్టార్లలో పంటలు నీట మునిగాయని కలెక్టర్ చక్రధర్‌బాబు సీఎంకు వివరించారు. రేస్క్యూ ఆపరేషన్ ద్వారా 17,163 మందిని కాపాడామని, 155 పునరావాస కేంద్రాల్లో 17,163 మందికి ఆశ్రయం కల్పించామని చెప్పారు. 343.04 లక్షల విలువ చేసే బిల్డింగులు, డ్రెయిన్లు, పైప్ లైన్లు దెబ్బ తిన్నాయని చెప్పారు. 290 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని తెలిపారు.
మృతుల కుటుంబాలకు భరోసా
తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించాలని, దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు.
వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment