అకాల వర్షంతో రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన తీరు
ఈదురుగాలులకు వందల ఎకరాల్లో రాలిపోయిన మామిడి
విరిగిపడిన చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలు, ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు
చాలా చోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం
గాలివానకు హైదరాబాద్ ఆగమాగం.. స్తంభించిన ట్రాఫిక్‌తో ఇక్కట్లు
చెట్లు విరిగి, గోడలు కూలి, పిడుగులతో ఆరుగురు మృతి
సాక్షి నెట్‌వర్క్: అకాల వర్షం పుట్టి ముంచింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని ముంచేసింది. చెట్లపై ఉన్న మామిడి కాయలను రాల్చేసింది. ఈదురుగాలులతో విరుచుకుపడి పలువురి ప్రాణాలనూ బలిగొంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వాన బీభత్సం సృష్టించింది. వరి ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వరంగల్: నీట మునిగిన ధాన్యం
వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జనగామ వ్యవసాయ మార్కెట్ వెయ్యి బస్తాల ధాన్యం తడిసిపోయింది. బచ్చన్నపేట, జనగామ రూరల్, పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల తదితర మండలాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, 33కేవీ లైన్లు నేలకొరిగాయి. చిల్పూరు, జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి.
భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట, కిష్టాపూర్, మహాముత్తారం, కోనంపేటలలో ధాన్యం కొట్టుకుపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో ధాన్యం తడిసింది. మహబూబాబాద్ జిల్లా కురవి, బయ్యారం, గంగారం, మహబూబాబాద్ రూరల్ మండలాల్లో పంటలకు నష్టం జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ధాన్యం నీట కొట్టుకుపోయింది.
కరీంనగర్: వడగళ్ల వాన
మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. పలు గ్రామాల్లో ఇళ్లపై కప్పు రేకులు ఎగిరిపోయాయి. వడగళ్ల వానతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో మామిడికాయలు రాలిపోయాయి. జమ్మికుంటలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది.
ఉమ్మడి ఆదిలాబాద్: వాన తిప్పలు
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వర్షంతో రైతులు తిప్పలు పడ్డారు. పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. సిరికొండ, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, తలమడుగు మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. నర్సాపూర్(జీ), నిర్మల్, లక్ష్మణచాంద మండలాల్లో తీవ్రంగా ఈదురుగాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలయి. ఆసిఫాబాద్ మండలంలో కోతకు వచ్చిన వరిపంట నేలకొరిగింది.
ఉమ్మడి నల్లగొండ: దెబ్బతిన్న మామిడి
నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడ్డాయి. వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, మోత్కూరు మండలాల్లో చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యాదాద్రి కొండపై ఈదురుగాలులు, వానతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చలువ పందిళ్లు నేలకూలాయి. క్యూకాంప్లెక్స్ పైకప్పు రేకులు ఎగిరి సమీపంలో ఉన్న వాహనాలపై పడ్డాయి.
ఉమ్మడి నిజామాబాద్: వణికించిన ఈదురుగాలులు
బలమైన ఈదురుగాలులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను వణికించాయి. నాలుగైదు గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది.
ఉమ్మడి రంగారెడ్డి: నీట మునిగిన కాలనీలు
రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల వాన వణికించింది. పలుచోట్ల వడగళ్లు కురిశాయి. మామిడి నేల రాలింది. చేవెళ్ల, మొయినాబాద్, యాచారం మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. షాద్‌నగర్ పట్టణంలోని లోతట్టు కాలనీలు నీటమునిగాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా: ముంచెత్తిన వాన
మెదక్ ఉమ్మడి జిల్లాను అకాల వర్షం ముంచెత్తింది. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో 3 వేల బస్తాలకుపైగా ధాన్యం మొత్తం తడిసింది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో భారీగా ధాన్యం తడిసింది. పటాన్‌చెరు నియోజకవర్గంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిన్నారం, హత్నూర మండలాల్లో వడగళ్లు పడ్డాయి. ధాన్యం తడిసిపోయింది. జిల్లాలో రెండు ఇళ్లు, ఓ హోటల్ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలంలో ధాన్యం నీట మునిగింది.
హైదరాబాద్ ఆగమాగం
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని ఆగమాగం చేసింది. మియాపూర్‌లో ఏకంగా 13.3 సెంటీమీటర్లు, కూకట్‌పల్లిలో 10.7 సెంటీమీటర్లు భారీ వర్షపాతం నమోదైంది. మూసాపేట గూడ్స్òÙడ్ రోడ్డులో పార్కింగ్ చేసిన లారీలు, కంటైనర్ లారీలు మట్టి దిగబడి ఓ వైపు ఒరిగి పోయాయి. చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు, హోర్డింగ్స్ కూలిపోయాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అత్తాపూర్‌లో ఇళ్ల రేకులు ఎగిరిపోయి సమీపంలోని సబ్‌స్టేషన్‌లో పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది.
‘వాన’ దెబ్బకు ఆరుగురు బలి
రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు, వర్షం ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపడి, గోడలు కూలి, పిడుగులు పడి ఆరుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఇల్లందలో చెట్టు కొమ్మలు విరిగిపడి బీటెక్ విద్యార్థి ఆబర్ల దయాకర్ (22) మృతిచెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్ (నాగ్సాన్‌పల్లి) శివారులోని మామిడితోటలోని కోళ్ల ఫారం గోడ కూలడంతో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మరణించారు. పిడుగుపాటుకు గురై సంగారెడ్డి జిల్లా అందోల్ మండల ఎర్రారంలో గోవిందు పాపయ్య (52), సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లికి చెందిన మల్లేశం (33)మృతి చెందారు.
హైదరాబాద్ బాచుపల్లిలో గోడ కూలి..
భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆ పక్కనే ఉన్న రేకుల ఇళ్లపై గోడ, మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో వాటిలో నివాసం ఉంటున్న ఏడుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కూలీలు ఇచ్చిన వివరాల మేరకు 8 మంది వరకు శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రికల్లా శిథిలాల కింద ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment