Mango farmers
-
ఫలరాజుపై మంచు పంజా!
మామిడి రైతుకు దిగుబడి దిగులు పట్టుకుంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది మామిడి పూత ఆలస్యమవుతోంది. జనవరి (January) మాసం ప్రారంభమై పక్షం రోజులైనా ఆశించిన మేర పూత రాలేదు. ఏటా డిసెంబర్ చివరికల్లా మామిడిచెట్లు పూతతో నిండి కళకళలాడేవి. ఈసారి చలి తీవ్రత, పొగమంచు ప్రభావంతో ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇక్కడ కనిపిస్తున్న మామిడితోట (Mango Field) కర్నూలు మండలం శివరామపురం గ్రామం రైతుది. ఎలాగైనా ఈసారి మంచి దిగుబడులు సాధించాలని పైరు చీడ పీడల బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. వేలాది రూపాయలు పెట్టి ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేశాడు. చివరకు చలి తీవ్రత, పొగమంచు ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటి వరకు చెట్లకు పూత పూయలేదు.కర్నూలు(అగ్రికల్చర్): ఈసారి వ్యవసాయం రైతులకు కలిసి రాలేదు. తొలుత అధిక వర్షాలు, తర్వాత వర్షాభావంతో ఖరీఫ్(Kharif) నిరాశకు గురి చేస్తే, వరుస తుఫానులు రబీ ఆశలను దెబ్బతీశాయి. ఈ క్రమంలో కొందరు రైతులు మామిడి తోటలపై నమ్మకం పెంచుకుంటే ప్రస్తుతం నెలకొన్న చలి తీవ్రత ప్రతికూలంగా మారింది. మామిడి తోటలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో మామడి తోటలు భారీగానే ఉన్నాయి. మామిడితోటలకు పెట్టింది పేరు బనగానపల్లె ప్రాంతం. బనగానపల్లె, అవుకు, సంజామల, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, పాణ్యం, వెల్దురి, బేతంచెర్ల తదితర మండలాల్లో భారీగా మామడి తోటలున్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వ ప్రోత్సాహంతో 2019 నుంచి 2024 వరకు ఉమ్మడి జిల్లాలో మామిడి తోటలు విస్తారంగా అభివృద్ధి చెందాయి. ఒకవైపు ఉపాధి నిధులతో 100 శాతం సబ్సిడీ ఇస్తుండటం, మరోవైపు ఉద్యాన శాఖ ఆకర్షనీయమైన రాయితీల వల్ల మామిడితోటలు పెరిగాయి.కర్నూలు జిల్లాలో విభిన్న పరిస్థితిజిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మామిడి పూత కొంత కనిపిస్తుండగా..తూర్పు ప్రాంతంలో ఇంకా పట్టే దశలోనే ఉంది. ఈభిన్న పరిస్థితికి వాతావరణంలో మార్పే కారణంగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో చలి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు 10–11 డిగ్రీలకు పడిపోయాయి. ఈ వాతావరణం మామిడికి ఇబ్బందికరంగా మారింది. చల్లని వాతావరణం ఉంటే తోటల్లో కొత్త చిగుళ్లు వస్తాయి. నేడు పలు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మామిడిలో కొత్త చిగుళ్లు కనిపిస్తున్నాయి. పత్తికొండ, దేవనకొండ. తుగ్గలి, గూడూరు, సి.బెళగల్ ప్రాంతాల్లో 50 శాతం వరకు మామిడి పూత వచ్చింది. వెల్దుర్తి, ఓర్వకల్లు, బేతంచెర్ల, అవుకు, బనగానపల్లి, కృష్ణగిరి, కల్లూరు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో 30 నుంచి 40 శాతం వరకే పూత వచ్చింది. మామూలుగా అయితే జనవరి మొదటి పక్షంలోపు అన్ని ప్రాంతాల్లోని మామిడిలో 80 శాతంపైగా పూత రావాలి. వాతావరణం చల్లగా ఉండటం, పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటం ద్వారా పలు ప్రాంతాల్లో పూత ఆలస్యమవుతోంది. ఒకతోటలో 100 చెట్లు ఉంటే ఇందులో 35–40 శాతం చెట్లు పూతకు వచ్చాయి. మిగిలిన చెట్లలో పూత ఆలస్యమవుతోంది. జనవరి మొదటి పక్షం గడుస్తున్నా ఆశించిన మేర పూత పట్టకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు చలి తీవ్రత వల్ల తేనెమంచు, పురుగుల బెడద పెరుగుతోంది. ఇది మామిడి రైతులను నిరాశకు గురి చేస్తోంది.వచ్చిన పూత నిలిచేనా...కొన్ని ప్రాంతాల్లో పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ నిలిస్తేనే కాపు బాగుంటుంది. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పూత పిందె రాలిపోతుంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో ఆరంభంలో పూత బాగానే వచ్చినప్పటికి తర్వాత ఎండల ప్రభావంతో 60 శాతంపైగా రాలిపోయింది. ఈ సారి కొన్ని ప్రాంతాల్లో పూత విశేషంగా వచ్చినప్పటికి ఎంత వరకు నిలిచి కాపుగా మారుతుందనేది ప్రశ్నార్థకం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 16000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.ఇందులో కర్నూలు జిల్లాలో 4848 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 10,167 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు 40 శాతం తోటల్లో 50 శాతంపైగా పూత వచ్చింది. 50 శాతం తోటల్లో 30 శాతం వరకే పూత వచ్చింది. 10 శాతం తోటల్లో ఇంకా పూత రాలేదు. పూత రావడంలో హెచ్చు తగ్గులుండటానికి వాతావరణ పరిస్థితులే కారణమని ఉద్యాన అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి చెందిన మామిడిలో 70 నుంచి 80 శాతం వరకు బేనిసా ఉంటోంది. బేనిసా చెట్లు ఒక ఏడాది బాగా కాపు ఇస్తే... మరుసటి ఏడాది కాపునకు రావు. మామిడిలో చాల వరకు పూత రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే పూతను బట్టి మామడి కొనుగోలు యత్నాలు జరుగుతాయి. పూత బాగా నిలిస్తే ఎకరాకు 7–8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ సారి వాతావరణం ప్రతికూలతతో దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.గతేడాది పూత బాగుండేదినాకు రెండు ఎకరాల్లో మామిడి తోట ఉంది. గతంలో ఈ సమయానికి మామిడి చెట్లకు పూత బాగా ఉండేది. ఇప్పటి వరకు ఆశించిన మేర పూత లేదు. తేమశాత ఎక్కువ కవడామో లేక వాతావరణ ప్రభావమో తెలియదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాను. పంట రాకపోతే ప్రభుత్వం అదుకోవాలి. – కురువ శంకర్, మామిడి రైతు, పూడురు గ్రామందిగుబడిపై ప్రభావం నేను బనగానపల్లె, పాణ్యం, బేతంచర్ల మండలాల్లో సుమారు 14 ఎకరాల తోటలను రూ.3 లక్షల కౌలు ఇచ్చి తీసుకున్నాను. దీనికితోడు మందుల పిచికారీ తదితర వాటి కోసం ల్చక్షకు పైగా ఖర్చు చేశాను. సాధారణంగా ఈ సమయానికి పూత వచ్చి ఉండాలి. ఆలస్యం కావడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది.– పాంషా, మామిడి తోటల కౌలు రైతు, బనగానపల్లెమామిడిలో పూతరాకపోతే ఇలా చేయాలి పలు ప్రాంతాల్లో మామిడిలో పూత రావడం ఆలస్యమ్చవుతోంది. పూత రాని పక్షంలో 13–0–45 రసాయన ఎరువు 10 గ్రాములు, 3 గ్రాముల సల్పర్, 1.6 ఎంఎల్ మోనోక్రోటోపాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు పూత రానితోటల్లో పొగపెట్టాలి. ఇలా చేయడం ద్వారా పూత వచ్చే అవకాశం ఉంది. మరో 10–15 రోజుల్లో అన్ని ప్రాంతాల్లోని అన్ని తోటల్లో పూత వచ్చే అవకాశం ఉంది. పూత వచ్చిన తర్వాత చెట్లకు ఎరువులు వేసి తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. పూత వచ్చిన తోటల్లో చీడపీడల యాజమాన్యంలో భాగంగా సాఫ్–2 జిఎం, క్లోరోఫైరిఫాస్ 2 ఎంఎల్, బోరాన్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చి పూత ఉన్నట్లైతే ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 గ్రాములు, హెక్షాకొనజోల్ 1 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంది. – పి.రామాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి, కర్నూలు -
మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
సాక్షి నెట్వర్క్: అకాల వర్షం పుట్టి ముంచింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని ముంచేసింది. చెట్లపై ఉన్న మామిడి కాయలను రాల్చేసింది. ఈదురుగాలులతో విరుచుకుపడి పలువురి ప్రాణాలనూ బలిగొంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వాన బీభత్సం సృష్టించింది. వరి ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరంగల్: నీట మునిగిన ధాన్యం వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జనగామ వ్యవసాయ మార్కెట్ వెయ్యి బస్తాల ధాన్యం తడిసిపోయింది. బచ్చన్నపేట, జనగామ రూరల్, పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల తదితర మండలాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, 33కేవీ లైన్లు నేలకొరిగాయి. చిల్పూరు, జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట, కిష్టాపూర్, మహాముత్తారం, కోనంపేటలలో ధాన్యం కొట్టుకుపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో ధాన్యం తడిసింది. మహబూబాబాద్ జిల్లా కురవి, బయ్యారం, గంగారం, మహబూబాబాద్ రూరల్ మండలాల్లో పంటలకు నష్టం జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ధాన్యం నీట కొట్టుకుపోయింది. కరీంనగర్: వడగళ్ల వాన మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. పలు గ్రామాల్లో ఇళ్లపై కప్పు రేకులు ఎగిరిపోయాయి. వడగళ్ల వానతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో మామిడికాయలు రాలిపోయాయి. జమ్మికుంటలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. ఉమ్మడి ఆదిలాబాద్: వాన తిప్పలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వర్షంతో రైతులు తిప్పలు పడ్డారు. పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. సిరికొండ, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, తలమడుగు మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. నర్సాపూర్(జీ), నిర్మల్, లక్ష్మణచాంద మండలాల్లో తీవ్రంగా ఈదురుగాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలయి. ఆసిఫాబాద్ మండలంలో కోతకు వచ్చిన వరిపంట నేలకొరిగింది. ఉమ్మడి నల్లగొండ: దెబ్బతిన్న మామిడి నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడ్డాయి. వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, మోత్కూరు మండలాల్లో చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యాదాద్రి కొండపై ఈదురుగాలులు, వానతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చలువ పందిళ్లు నేలకూలాయి. క్యూకాంప్లెక్స్ పైకప్పు రేకులు ఎగిరి సమీపంలో ఉన్న వాహనాలపై పడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్: వణికించిన ఈదురుగాలులు బలమైన ఈదురుగాలులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను వణికించాయి. నాలుగైదు గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి రంగారెడ్డి: నీట మునిగిన కాలనీలు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల వాన వణికించింది. పలుచోట్ల వడగళ్లు కురిశాయి. మామిడి నేల రాలింది. చేవెళ్ల, మొయినాబాద్, యాచారం మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. షాద్‌నగర్ పట్టణంలోని లోతట్టు కాలనీలు నీటమునిగాయి. ఉమ్మడి మెదక్ జిల్లా: ముంచెత్తిన వాన మెదక్ ఉమ్మడి జిల్లాను అకాల వర్షం ముంచెత్తింది. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో 3 వేల బస్తాలకుపైగా ధాన్యం మొత్తం తడిసింది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో భారీగా ధాన్యం తడిసింది. పటాన్చెరు నియోజకవర్గంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిన్నారం, హత్నూర మండలాల్లో వడగళ్లు పడ్డాయి. ధాన్యం తడిసిపోయింది. జిల్లాలో రెండు ఇళ్లు, ఓ హోటల్ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలంలో ధాన్యం నీట మునిగింది. హైదరాబాద్ ఆగమాగం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని ఆగమాగం చేసింది. మియాపూర్‌లో ఏకంగా 13.3 సెంటీమీటర్లు, కూకట్‌పల్లిలో 10.7 సెంటీమీటర్లు భారీ వర్షపాతం నమోదైంది. మూసాపేట గూడ్స్òÙడ్ రోడ్డులో పార్కింగ్ చేసిన లారీలు, కంటైనర్ లారీలు మట్టి దిగబడి ఓ వైపు ఒరిగి పోయాయి. చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు, హోర్డింగ్స్ కూలిపోయాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అత్తాపూర్‌లో ఇళ్ల రేకులు ఎగిరిపోయి సమీపంలోని సబ్‌స్టేషన్‌లో పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. ‘వాన’ దెబ్బకు ఆరుగురు బలి రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు, వర్షం ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపడి, గోడలు కూలి, పిడుగులు పడి ఆరుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఇల్లందలో చెట్టు కొమ్మలు విరిగిపడి బీటెక్ విద్యార్థి ఆబర్ల దయాకర్ (22) మృతిచెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్ (నాగ్సాన్పల్లి) శివారులోని మామిడితోటలోని కోళ్ల ఫారం గోడ కూలడంతో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మరణించారు. పిడుగుపాటుకు గురై సంగారెడ్డి జిల్లా అందోల్ మండల ఎర్రారంలో గోవిందు పాపయ్య (52), సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లికి చెందిన మల్లేశం (33)మృతి చెందారు. హైదరాబాద్ బాచుపల్లిలో గోడ కూలి.. భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆ పక్కనే ఉన్న రేకుల ఇళ్లపై గోడ, మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో వాటిలో నివాసం ఉంటున్న ఏడుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కూలీలు ఇచ్చిన వివరాల మేరకు 8 మంది వరకు శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రికల్లా శిథిలాల కింద ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
వ్యవసాయంతో ఎంతో సంతృప్తిగా ఉన్నానంటున్న రైతు
-
మామిడి కాయలపై మచ్చలు ఏర్పడడంతో తగ్గిన నాణ్యత
-
కర్నూలు రైతుల దయనీయ స్థితి..!
-
మామిడి రైతుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అకాల వర్షం, ఈదురు గాలులకు నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అకాల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది. అది కూడా స్థానికంగా ఉండే మహిళా రైతులను యజమానులుగా మార్చి వారి భాగస్వామ్యంతోనే మామిడి పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయిస్తోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో వెయ్యి మంది మహిళలు రూ. 50 లక్షల భాగస్వామ్యం కలిగి ఉంటారు. మిగిలిన రూ.4.50 కోట్లు సబ్సిడీగా లభిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులోని మార్కెట్ యార్డులో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల్లో ఈ రకం మామిడి సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది మామిడికి మంచి ధర ఉన్నప్పటికీ అకాల వర్షాలకు కాయకు మంగు రావడం, మచ్చలు ఉండటం, ఇతర కారణాలతో మార్కెట్ పూర్తిగా పతనమైంది. ప్రధానంగా నూజివీడులో పెద్ద రసాలు, చిన రసాలు, జలాలు, సువర్ణరేఖ, హిమామ్‌పసంగ్, బంగినపల్లి, తొతాపూరి తదితర వెరైటీలు సాగవుతుంటాయి. అయితే ఎక్కువగా తొతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు 90 శాతం మార్కెట్లో ఉంటాయి. ఈ ఏడాది అకాల వర్షాలు, ఈదురు గాలలకు కాయ రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం చూపే విధంగా పంటకు మంచి ధర ఉండేలా స్ధానికంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూజివీడు మార్కెట్ యార్డ్‌లో ఎకరం విస్తీర్ణంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుజ్జు (పల్ప్) సేకరించే యూనిట్ కాకుండా పచ్చడి మామిడికాయ నుంచి పౌడర్ తీసే యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించి ఇప్పటికే వారితో ఒక సమాఖ్య రిజి్రస్టేషన్ చేయించారు. ఒక్కొక్కరు రూ. 5 వేల మూలనిధితో రూ. 50 లక్షలు సమకూర్చుకోగా మిగిలిన రూ. 4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులో స్ధలం కేటాయించింది. పథకం అమలు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్రతో పనులు ప్రారంభమై మూడు నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కానుంది. డీఆర్డీఏ నేతృత్వంలో మహిళా సమాఖ్య దీన్ని నిర్వహించనుంది. ప్రత్యేకంగా చెట్టు నుంచి కోసిన కాయలతో పాటు, రాలిపోయిన కాయలు, వర్షానికి దెబ్బతిన్న కాయలను కూడా సమాఖ్య మార్కెట్ ధరకు కొంటుంది. రైతుకు వెంటనే డబ్బు చెల్లిస్తుంది. కాయల నుంచి మామిడి పౌడర్‌ను తయారు చేసి క్యాండీ, జెల్లీలు తయారు చేసే పరిశ్రమలకు విక్రయించేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొదటి ప్రాసెసింగ్ యూనిట్ రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి మ్యాంగో పౌడర్ యూనిట్ ఇది. నూజివీడులోని మార్కెట్ యార్డులో ఎకరం స్ధలంలో రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. నూజివీడులో 12 వేల ఎకరాలు, ఆగిరిపల్లిలో 20 వేల ఎకరాల్లో మొత్తంగా 32 ఎకరాల్లో రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఉపయుక్తంగా ఉంటుంది. మహిళలే యజమానులుగా దీన్ని డీఆర్డీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. – ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఏలూరు చదవండి: బాలికను కాపాడిన ‘దిశ’ -
ఖమ్మం జిల్లా రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు
-
మామిడి కాయకు కవర్, రైతుకు ప్రాఫిట్
జిల్లాలోని ఖరీఫ్ ఉద్యాన పంటల్లో మామిడిదే అగ్రస్థానం. పంట దిగుబడి నాణ్యంగా ఉంటేనే రైతుకు ఆదాయం. ఇందులో భాగంగానే మామిడి పండ్లు రక్షణ కోసం ఫ్రూట్ కవర్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కీటకాలు, పురుగులు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకుంది. బయట మార్కెట్లో ఒక్కో ఫ్రూట్ కవర్ ధర రూ.2.5 ఉండగా రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ ద్వారా రూపాయికే రైతులకు అందుబాటులోకి తెచ్చింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు:జిల్లాలోని ఉద్యాన పంటల్లో మామి డితే అగ్రస్థానం. ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 58 వేల హెక్టార్లలో మామిడి పంట సాగవుతోంది. ఇందులో ఎక్కువగా గుజ్జు పరిశ్రమకు ఉపయోగించే తోతాపూరి రకం సాగులో ఉంది. టేబుల్ వైరెటీస్గా పిలవబడే బంగినపల్లి, ఇమామ్ పసంద్, మల్గూబ, రసాలు, మల్లిక వంటి రకాలు సుమారు 40 వేల ఎకరాలలో సాగువుతోంది. గతంలో రసాయనిక ఎరువు లు ఎక్కువగా వాడుతున్నారని యూరోపియన్ దేశా ల వారు మామిడి ఎగుమతులను తిరస్కరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించింది. మామిడిలోనూ అధిక దిగుబడులు సాధించేలా చర్యలు చేపట్టింది. తద్వారా విదేశాల నుంచి కూడా ముందస్తు ఆర్డర్లు వస్తున్నాయి. సబ్సిడీతో రూపాయికే కవర్ మొదటి విడతలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 15.3 లక్షల మ్యాంగో కవర్లు మంజూరు చేసింది. ఇదే కవర్ బయట మార్కెట్లో రూ.2.5 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం సబ్సి డీతో రూపాయికే రైతుకు కవర్ మంజూరు చేస్తోంది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా రైతు భరోసా కేంద్రాల్లోనే కవర్లు అందుబాటులోకి తెచ్చింది. వీటిని సక్రమంగా వాడుకుంటే రెండు సార్లు ఉపయోగించవచ్చని యంత్రాంగం సూచిస్తోంది. నాణ్యమైన దిగుబడి మామిడిలో పూత దశ నుంచి పిందె.. కాయ దశ వరకు అనేక క్రిమికీటకాలు ఆశిస్తుంటాయి. మామిడి కాయలకు మచ్చతెగులు సోకుతుంటుంది. దీనిద్వారా పంట దిగుబడి దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించిన రైతులు మామిడి కాయలకు రక్షణగా కవర్లు కట్టి కాపాడుతున్నారు. వీటి వాడకం వల్ల మామిడి కాయలు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయని, లోపలికి ఎటువంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కవర్ లోపల భాగం నలుపు రంగులో ఉండడం వల్ల మామిడికాయకు మంచి ఉష్ణోగ్రత కూడా లభిస్తుంది. దీంతో నాణ్యత గల మామిడి దిగుబడి అవుతుంది. ఆశించిన స్థాయిలో మామిడి ధర ఉంటుంది. సలహా మండలి తీర్మానంతో.. మామిడిలో టేబుల్ వైరెటీస్లో ఎక్కువ భాగం విదేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తుంది. వ్యవసాయ సలహా మండలి సమావేశంలో సభ్యులు ఫ్రూట్ కవర్లు కావాలని తీర్మానించారు. ఆమేరకు ప్రభుత్వానికి పంపాము. ప్రభుత్వ అనుమతితో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీతో కూడిన కవర్లు అందజేస్తున్నాం. – పి.రామచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, చిత్తూరు జిల్లా నాణ్యమైన పంట దిగుబడి జిల్లాలో మొదటి విడతగా 15.3 లక్షల ఫ్రూట్ కవర్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చు. రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించవచ్చు. ఇటీవల మామిడిలో భారీ ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి మామిడి కవర్లు అందుబాటులోకి తెచ్చాం. – మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి చిత్తూరు మామిడి రైతుకు బాసట రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుకు నష్టం వాటిల్ల కూడదని అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించింది. మామిడిలో రక్షణ చర్యలు ప్రారంభించింది. కవర్లు వాడడం వల్ల ఎటువంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించనవసరం లేదు. ఇలాంటి మామిడి కాయలను ఎక్కువగా ఎగుమతి చేయొచ్చు. – పి.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్, చిత్తూరు జిల్లా సమాచారం ఉద్యాన పంటలు ఎకరాల్లో మామిడి 58,000 అరటి 1,500 దానిమ్మ 700 బొప్పాయి 400 మంచి లాభదాయకం మామిడికి ఫ్రూట్ కవర్ వాడకం ఎంతో లాభదాయకం. గతంలో ఈ విధానంలో సాగుచేసిన రైతులకు మంచి ధర లభించింది. అందుకే ఈ ఏడాది మేము కూడా ఈ విధానాన్ని అనుసరించాం. కవర్ల వాడకం వల్ల ఎలాంటి క్రిమిసంహారక మందులు కూడా అవసరం లేదు. నాణ్యమైన పంట దిగుబడి పొందవచ్చు. – ఈశ్వరబాబు, కొత్తపల్లి, గుడిపాల మండలం అవగాహన పెరిగింది అధికారుల సూచనల మేరకు రైతులకు మామిడి కవర్లను సరఫరా చేశాం. క్షేత్రస్థాయిలో ఈ కవర్లను ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించాం. ఒక రూపాయికే కవర్లు పంపిణీ చేశాం. వీటి వల్ల ఎలాంటి కీటకాలు చేరవు. ఎగుమతులకు ఉపయోగపడే విధంగా మామిడి పంట దిగుబడి చేయవచ్చు. – అఖిల, వ్యవసాయకార్యదర్శి, - చేర్లోపల్లి, చిత్తూరు మండలం కవర్‌ను ఎలా ఉపయోగించాలంటే.. ఒక పెద్ద నిమ్మకాయ సైజు వచ్చిన మామిడికాయకు ఈ కవర్‌ను తొడగాలి. ఆపై కాండంకు కవరు మొదటి భాగం వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం వల్ల కాయకు ఎటువంటి పురుగులు ఆశించవు. ఇలా దిగుబడి అయిన మామిడి పళ్లకు మార్కెట్లో 40 శాతానికిపైగా అధిక ధర లభిస్తుంది. (చదవండి : మామిడి ఎగుమతి షురూ) -
మామిడికి పురుగుపోటు వస్తే ఏం చేయాలి?
ఉలవపాడు : ఉలవపాడు బంగినపల్లె మామిడిని పురుగుపోటు పట్టి పీడిస్తోంది. వేసవి వచ్చిందంటే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్నాటక ప్రజలు ఉలవపాడు మామిడి కోసం ఎదురు చూస్తుంటారు. ఎన్నడూ లేనివిధంగా గతేడాది ఉలవపాడు మామిడిలో పురుగులు వచ్చాయి. దీనికి కారణం పండుఈగ అని గుర్తించి వాటి నివారణ కోసం ఈ ఏడాది రైతులు పలు మందులను పిచికారీ చేశారు. అయినా ఈ ఏడాది కూడా పండుఈగ ఉలవపాడు ప్రాంతంలోని తోటల్లోకి చేరి కాయల్లో వస్తున్నాయి. దీంతో నల్లటి మచ్చలు ఏర్పడి పురుగులు వస్తున్నాయి. రైతులకు గడ్డు కాలం ఉలవపాడు ఉద్యాన శాఖ పరిధిలో సుమారు పది వేల ఎకరాల్లో మామిడిసాగు జరుగుతోంది. కందుకూరు డివిజన్ పరిధిలో ఐదు వేల ఎకరాల్లో సాగవుతోంది. ప్రతి ఏడాది ఎకరాకు 2 నుంచి 3 టన్నుల వరకు కాయల దిగుబడి వస్తోంది. టన్ను 20 నుంచి 40 వేల వరకు పలుకుతోంది. అంటే సుమారు 90 కోట్లపైనే వ్యాపారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గతేడాది నుంచి కాయల నాణ్యత సక్రమంగా లేని కారణంగా ఈసారి కూడా వ్యాపారం తగ్గే పరిస్థితి నెలకొంది. రైతులు చేయాల్సింది ఈ పండుఈగ నివారణకు ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. రైతులు లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేయాలి. దీని వల్ల మగ పండుఈగలు బుట్లలోకి చేరుతాయి. దీని వలన కొంత మేర ఉధృతి తగ్గే అవకాశం ఉంది. పండుఈగ కాయలకు తగలకుండా ఉండాలంటే ప్రతి కాయకు కవర్ కట్టాలి. దీని వల్ల కాయల రంగు కూడా బంగారు రంగులో వస్తాయి. ఈ కవర్ ఒకటి రూ.4 పడుతుంది. పురుగులు వస్తున్నాయి గతేడాది నుంచే మా ప్రాంతంలో కాయల్లో పురుగులు వస్తున్నాయి. ఈ ఏడాది తోటల్లో మందులు కూడా భారీగా పిచికారీ చేశాం. అయినా పచ్చికాయలకు నల్లటి మచ్చగా ఏర్పడి లోపల పురుగులు ఏర్పడుతున్నాయి. – సంకూరి మాచెర్ల రావు, మామిడి రైతు, ఉలవపాడు సలహాలు ఇస్తున్నాం మామిడి తోటల్లో పండుఈగ నివారణకు శాస్త్రవేత్తల సహాయంతో రైతులకు సలహాలు ఇస్తున్నాం. తోటలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నాం. శాస్త్రవేత్తలను తీసుకొచ్చి నివారణ చర్యలు చేపడుతున్నాం. – జ్యోతి, ఉద్యాన శాఖాధికారి, ఉలవపాడు -
అయ్యో రాములు.. గిట్లయితే ఎట్ల! కొమ్మ విరగాల్నా? కాయ రాలాల్నా?
ఈ రైతు రాములు. కోహెడలో 6 ఎకరాల మామిడి తోట ఉండగా మరో ఐదున్నర ఎకరాల తోట లీజుకు తీసుకున్నాడు. లక్షా70వేలు లీజు కాగా అతని తోటకు 2లక్షల వరకు లీజు వస్తుంది. ఈ లెక్కన 3.70లక్షలు లీజుకే ఖర్చు కాగా 5టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. అంటే కిలో రూ.45 లెక్క కట్టగా రూ.2.25లక్షలే వచ్చింది. అంటే లీజు ఖర్చే రాలేదు. మరో టన్ను వరకు వస్తుందనుకున్నా కాత ఈదురుగాలులతో నేలరాలింది. ముందే మంచు తేనె రోగం ముంచగా నష్టం తీవ్రంగా ఉందని ఉద్యానఅధికారులను కలిస్తే వారు చెప్పిన నిబంధనలతో నిరాశగా వెనుదిరిగాడు. కరీంనగర్ అర్బన్: ఇది కేవలం రాములు సమస్యే కాదు జిల్లాలో వేలమంది రైతులది ఇదే పరిస్థితి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది నష్టపరిహారం పరిస్థితి. అసలే మంచు తేనే నిండా ముంచగా వచ్చిన అరకొర మామిడి కాయలను ఈదురుగాలులు నేలపాలుచేశాయి. ఎన్నడూ లేనివిధంగా పూత తగ్గగా దిగుబడిపై దిగులు పడ్డ రైతన్నకు అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కనీసం ప్రభుత్వం నుంచి నష్టపరిహారమైనా వస్తుందని ఆశిస్తే నిబంధనలు కొరకరాని కొయ్యగా మారాయి. 33శాతం నష్టం నిబంధన వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. 33శాతం నష్టం జరగాలంటే కొమ్మలు విరగాలట.. కాయలు రాలాలట. అరకొర కాత రాలితే నష్టం జరిగినట్లు కాదట. గతంలో 50శాతం పంట నష్టం జరిగితే పరిహారానికి అర్హులుగా పరిగణించేవారు. ఒక రైతుకు ఎకరం మామిడి తోట ఉంటే అందులో 50శాతం నష్టపోయి ఉండాలి. అంటే కూకటి వేళ్లతో చెట్లు కూలడం, కొమ్మలు విరగడం, కాయలు సగానికి పైగా రాలితే పరిహారం దక్కేది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 50శాతం నుంచి 33శాతానికి తగ్గించింది. అరకొర పండిన పంటను విక్రయించాలంటే ధర కిలో రూ.40–50మాత్రమే పలుకుతోంది. వేయి హెక్టార్లలో దెబ్బతిన్న తోటలు ఇటీవల పలుమార్లు వీచిన బలమైన ఈదురుగాలులు, వడగళ్ల వాన మామిడితోటలను కోలుకోని దెబ్బతీశాయి. జిల్లాలో 2600 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ఈ సారి అరకొరగా 8,200 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మంచు తేనె తెగులుతో పాటు పూత లేకపోవడం, దిగుబడి చేతికందే సమయంలో ప్రకృతిలో మార్పుల కారణంగా ఈదురుగాలులతో వానతో తోటలు ధ్వంసమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి వీచిన బలమైన గాలులతో వేయి హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా గన్నేరువరం, చిగురుమామిడి, మానకొండూర్ మండలాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే చొప్పదండి, రామడుగు, తిమ్మాపూర్, కొత్తపల్లి, గంగాధర, వీణవంక మండలాల్లో తోటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారులు గుర్తించినప్పటికి నిబంధనలు గుదిబండగా మారాయి. ధర అంతంతే కరోనా వైరస్ ప్రభావంతో గత 2020 నుంచి రైతులకు నష్టాలే. 2020కి ముందు కిలో రూ.50–60 పలికిన ధర ప్రస్తుతం రూ.40–50కి మించడం లేదు. కరోనా క్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో పండ్ల వ్యాపారాన్ని నిలిపివేయగా బొమ్మకల్ బైపాస్‌లో ఏర్పాటు చేశారు. ఈ సారి నుంచే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కాగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. నాగ్‌పూర్, మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి తరలించడం జరిగే ప్రక్రియ. కానీ కాత తక్కువగా ఉండటంతో అరకొర వ్యాపారులు వస్తుండగా ధర సగానికే పరిమితమైంది. రైతులకు నష్టం ఎన్నడూ లేనంతగా ఈ సారి మామిడి రైతులకు నష్టం జరిగింది. గతంలో మామిడి కాయలతో మార్కెట్ కళకళలాడేది. గతానికి పోల్చితే పావు వంతు కూడ మార్కెట్ లేదు. ధర ఉన్నా కాయ లేకపోవడం తీరని నష్టం. – నిమ్మకాయల పాషా, వ్యాపారి ప్రభుత్వం ఆదుకోవాలి ఎపుడైనా పూతను బట్టి తోటలను పడుతాం. కానీ ఈ సారి నష్టాలే తప్ప లాభం లేదు. ఇందుర్తిలో రూ.2లక్షలు పెట్టి 6ఎకరాల తోట పట్టిన. 2 టన్నులు కూడ రాలే. రూ.80వేలు వచ్చినయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. – గంట సమ్మయ్య, కౌలుదారు, ఇందుర్తి -
మధుర ఫలం.. చైనా హాలాహలం!
తేనెలూరే మామిడి, నోరూరించే బొప్పాయి, పోషకాలిచ్చే అరటి కనిపిస్తే చాలు కొనేస్తాం. కానీ ఈ పండ్ల వెనుక దాగిన కాలకూట విషం ఆరోగ్యాలను హరిస్తోంది. సహజసిద్ధంగా పండాల్సిన వాటిని 24 గంటల్లో రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టి కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఉద్యానశాఖ అధికారులు తరచూ తనిఖీలు జరిపి వీటికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది. చైనా నుంచి దొడ్డిదారిన మార్కెట్లోకి వస్తున్న ఈ విష రసాయనాల ద్వారా మగ్గించిన పండ్లను తినడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కధనం.. – సాక్షి, అమరావతి విజయవాడలోని ‘నున్న’ మ్యాంగో మార్కెట్ కరోనా ఉధృతిలోనూ ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటుతో మామిడి రైతులతో, వివిధ రాష్ట్రాల వ్యాపారులతో కళకళలాడుతోంది. ఫుడ్ సేప్టీ, ఉద్యాన శాఖాధికారులతో కలిసి ‘సాక్షి బృందం’ మార్కెట్‌ను పరిశీలించగా విస్తుపోయే విషయాలు కనిపించాయి. మామిడి కాయలను కృత్రిమంగా మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న నిషేధిత గోల్డ్ రైప్, ఎఫ్‌వైకే ఎథెఫాన్ రెపైనింగ్ పౌడర్ వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. యశస్విని ప్రసన్న లక్ష్మి ఫ్రూట్ కంపెనీ, ఎస్డీఎఫ్ మ్యాంగో షాపుల నుంచి నాలుగు శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపిన అధికారులు కేసులు నమోదు చేశారు. నూజివీడు, గంపలగూడెం, విస్సన్నపేట, ఆగిరిపల్లి, ఏ.కొండూరు, ఈదర లోకల్ మార్కెట్లలో కూడా ‘సాక్షి బృందం’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇదే రీతిలో నిషేధిత ఎథెఫాన్ పౌడర్‌ను వాడుతున్నట్లు తేలింది. ఏటా రూ.100 కోట్ల ఎథెఫాన్ దిగుమతి పురుగుల మందుల జాబితా కింద 10 శాతం పేస్ట్‌రూపంలో, 39 శాతం లిక్విడ్, 20 శాతం పౌడర్ రూపంలో ఎథెఫాన్ మార్కెట్లోకి వçస్తుంది. మార్కెట్‌కు వచ్చే ఈ ఎథెఫాన్కు అధికారికంగా ఎలాంటి అనుమతుల్లేవు. పెస్టిసైడ్స్ కింద ఏటా చైనా నుంచి రూ.100 కోట్ల విలువైన ఎథెఫాన్ పౌడర్ దేశీయ మార్కెట్లోకి గుట్టు చప్పుడు కాకుండా వస్తోంది. ఎఫ్‌వైకే, గోల్డ్ రైప్ ఎథెఫాన్ ప్యాకెట్లను మామిడి, అరటి, బొప్పాయి మగ్గపెట్టేందుకు విచ్చలవిడిగా వాడుతున్నారు. నున్నతో పాటు నూజివీడు, రాయచోటి, కేదారేశ్వరపేట, ఉలవపాడు, బంగారపాలెం, దామల చెరువు, ఒంగోలు, కాకినాడ, విశాఖ, విజయనగరంతో పాటు చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని గ్రామ స్థాయి మార్కెట్లలో సైతం పండ్లను మగ్గపెట్టేందుకు ఎథెఫాన్‌ను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. మూడు గ్రాములుండే ఒక్కో ప్యాకెట్లో 20 శాతం (600 మిల్లీ గ్రాములు) మించి ఎథెఫాన్ ఉండ కూడదు. ఎథెఫాన్‌తో పాటు మిగిలిన మిశ్రమంపై స్పష్టత లేదు. సాచెట్ మొత్తం ఎథెఫాన్తోనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. నున్న మార్కెట్లో నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో బాక్సులో ఏకంగా ఆరేడు ప్యాకెట్లు వినియోగిస్తున్నారు. అవయవాలపై తీవ్ర ప్రభావం ఎథెఫాన్ ముట్టుకున్న చేతులతో కంటిని తాకితే కంటి చూపు పోతుంది. గొంతులోకి వెళ్తే శ్వాసకోస వ్యవస్థ దెబ్బ తింటుంది. మాగబెట్టే సమయంలో నేరుగా పండు లోపలికి వెళ్లడం వల్ల వీటిని తిన్నవారి నరాల వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. శరీరంలోకి వెళ్తే లివర్, నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు ఇది అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరకు టమోటా లాంటి కూరగాయలను మగ్గపెట్టేందుకు ఎథెఫాన్ లిక్విడ్‌ను వాడుతున్నారు.ఇటీవల వెలుగు చూసిన ఏలూరు ఘటనలో వందలాదిమంది ఆస్పత్రి పాలవడానికి కారణం వారి శరీరంలో పెస్టిసైడ్స్ రెసిడ్యూస్, ఆర్గనోక్లోరైన్, ఆర్గనోఫాస్పేట్ కెమికల్స్ శాతం ఎక్కువగా ఉండడమేనని ఎయిమ్స్, ఐఐసీడీ, ఎన్ఐఎన్ వంటి జాతీయ ఆరోగ్య సంస్థలు గుర్తించాయి. రాష్ట్రంలో 280 రైపనింగ్ చాంబర్లు రాష్ట్రంలో 7.40లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగవుతున్నాయి. ఏటా కోటి 82 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులొస్తున్నాయి.కూరగాయలు 2.64లక్షల హెక్టార్లలో సాగవుతుండగా 75.38లక్షల ఎంటీల దిగుబడులు వస్తున్నాయి. వీటిని మగ్గబెట్టేందుకు 53,923 ఎంటీల సామర్థ్యంతో 280 ఎథిలీన్ రైపనింగ్ చాంబర్స్, 19.60లక్షల ఎంటీల సామర్థ్యంతో 394 కోల్డ్ స్టోరేజ్లున్నాయి. ఎలాంటి హాని కలిగించని ఎథిలిన్ గ్యాస్ ద్వారా పండ్లను మగ్గబెట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తోంది. ఈమేరకు రైపనింగ్ చాంబర్స్‌ను ఏర్పాటు చేసింది. రైపనింగ్ చాంబర్స్ నెలకొల్పేందుకు వ్యక్తిగతంగా ముందుకొచ్చే వారికి 50 శాతం, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు 75 శాతం సబ్సిడీ అందచేస్తోంది. ఎథెఫాన్.. ఓ పురుగుల మందు ఎథెఫాన్‌తో మగ్గబెడితే 24 గంటల్లోనే ఏ పండైనా నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. ఎథెఫాన్ కృత్రిమంగా తయారు చేసిన సింథసైజ్డ్ కెమికల్. మొక్కల పెరుగుదలకు ఉపయోగించే దీన్ని ఆర్గానో ఫాస్పారిక్ (శాస్త్రీయ నామం సీ 2హెచ్ 6 సీఎల్ ఒ 3పీ), ఇౖథెల్ ఫాస్పానిక్ యాసిడ్ అని కూడా అంటారు. దీని పీహెచ్ విలువ 2 కంటే తక్కువ. కడుపులో ఉండే డైల్యూట్ హైడ్రోలిక్ క్లోరిక్ యాసిడ్స్ కంటే పవర్ ఫుల్ యాసిడ్స్ దీంట్లో ఉంటాయి. 1975లో ఎథెఫాన్‌ను పురుగుల మందుల జాబితాలో చేర్చారు. ఏదైనా పురుగుల మందును కోతలకు ముందు వాడితే డీకంపోజ్ అవుతుంది. తినే ముందు వాడితే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చాలా ప్రమాదకరం... ‘నున్న మార్కెట్లో 10 కిలోల మామిడికి ఏకంగా ఆరేడు ఎథెఫాన్ ప్యాకెట్లు వినియోగిస్తున్నారు. ఏకంగా 18 నుంచి 21 గ్రాముల ఎథెఫాన్‌ను వినియోగిస్తున్నారు. ఇది కాల్షియం కార్బైడ్ కంటే ప్రమాదకరం. రెండు కేసులు పెట్టాం. మిగిలిన మార్కెట్లలో తనిఖీలు చేస్తాం’ –ఎన్.పూర్ణచంద్ర రావు, జోనల్ ఫుడ్ కంట్రోలర్, విజయవాడ అవయవాలపై తీవ్ర ప్రభావం ‘ఎథెఫాన్ అత్యంత ప్రమాదకరమైనది. దీనివల్ల గొంతు, ఊపిరితిత్తులు, లివర్ దెబ్బతింటాయి. నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. స్కిన్ అలర్జీలొస్తాయి. పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది’ –డాక్టర్ సూర్యదీప్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ యాసిడ్స్ విడుదల ‘ఒక పదార్థం కానీ పండు కానీ తింటే లోపలకు వెళ్లగానే అమైనోయాసిడ్స్‌గా విడిపోవాలి. ఆ తరా>్వత కార్బోహైడ్రేట్స్‌గా మారి శరీరంలోకి అబ్జార్వ్ అవుతాయి. విషపూరిత రసాయనాలను వినియోగించి బలవంతంగా మగ్గించిన పండ్లను తినడం వల్ల అవసరమైనవి కాకుండా ప్రమాదకరమైన యాసిడ్స్ శరీరంలోకి చేరతాయి. మోతాదు పెరిగే కొద్ది అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చివరికి క్యాన్సర్ కారకంగా మారుతుంది’ – ప్రొ.ఎం.వి బసవేశ్వరరావు, కెమిస్ట్రీ విభాగం, కృష్ణా యూనివర్శిటీ రైపనింగ్ చాంబర్స్‌కు చేయూత ‘కాల్షియం కార్బైడ్‌ను పూర్తిగా కట్టడి చేశాం.ఎథిలిన్ రైపనింగ్ చాంబర్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. వాటి ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి చేయూతనిస్తున్నాం. కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎఫ్ఎస్ఎస్ఎఐ నిబంధనలకు విరుద్ధంగా చైనా నుంచి దిగుమతి అవుతున్న ఎథెఫాన్ వినియోగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటి నియంత్రణకు ఉద్యాన శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకుంటాం’ – ఎం.వెంకటేశ్వర్లు, అదనపు సంచాలకులు, ఉద్యాన శాఖ -
5 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతులకు ఒప్పందాలు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): మామిడి ఎగుమతులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో అగ్రికల్చరల్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా) సౌజన్యంతో ఉద్యానశాఖ మంగళవారం విజయవాడలో ఓ హొటల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బయ్యర్లు–సెల్లర్ల మీట్‌కు అనూహ్య స్పందన లభించింది. ఇందులో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన సుమారు వంద మందికి పైగా మామిడి రైతులు, దేశం నలుమూలల నుంచి ఏటా దేశ విదేశాలకు ఎగుమతి చేసే 55 మంది అంతర్జాతీయ ఎగుమతిదారులు, ట్రేడర్లు పాల్గొన్నారు. ఈ మీట్లో 5 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతులకు సంబంధించిన ఒప్పందాలు రైతులు–ఎగుమతిదారుల మధ్య జరిగాయి. రాష్ట్రంలో ఈ ఏడాది హెక్టార్‌కు 15 టన్నుల చొప్పున 56 లక్షల టన్నులకుపైగా మామిడి దిగుబడులు రానున్న దృష్ట్యా ఆ స్థాయిలో ఎగుమతులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో విజయవాడ, తిరుపతిలలో బయ్యర్స్– సెల్లర్స్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ..మామిడి ఎగుమతులు ఆశించిన స్థాయిలో పెరగాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. అపెడా ఏజీఎం నాగ్‌పాల్ మాట్లాడుతూ..మామిడిని విదేశాలకు ఎగుమతులు చేయాలనుకునే రైతులు అపెడా వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖాముఖి భేటీలో పలువురు ఎక్స్‌పోర్టర్స్ మాట్లాడుతూ అమెరికా, సింగపూర్, లండన్ తదితర దేశాలకు ఎగుమతి చేసేందుకు పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో విజయవాడ కార్గోహెడ్ అబ్రహాం లింకన్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ టి.జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
బంగినపల్లి.. నున్న టు ఢిల్లీ!
నున్న (విజయవాడరూరల్): నున్న మ్యాంగో మార్కెట్లో మామిడికాయల సీజన్ ప్రారంభమైంది. బుధవారం రాత్రి జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బంగినపల్లి మామిడికాయలను ప్యాక్ చేసి వాటిని లారీలో ఢిల్లీకి ఎగుమతి చేశారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రతాప్, ఈదర గ్రామం నుంచి జాన్‌వెస్లీ, కోడూరు గ్రామం నుంచి వెంకటేశ్వరావు, సాయనపాలెం గ్రామం నుంచి వెంకటేశ్వరావు అనే రైతులు తోటల నుంచి వచ్చిన మామిడి పంట దిగుబడులను, 12 టన్నుల కాయలను వేరు చేసి లోడు చేశారు. ఈ ఏడాది మామిడికాయల సీజన్ ప్రారంభంలో బంగినపల్లి మామిడి కాయలు టన్ను ధర రూ.70 వేలకు పలికింది. -
కరోనా: తెంపితే కష్టం.. తెంపకుంటే నష్టం
సాక్షి, నెన్నెల(ఆదిలాబాద్) : మామిడి రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. లాక్డౌన్ నేపథ్యంలో మామిడి రైతులకు గడ్డు పరిస్థితి నెలకొంది. నానా అవస్థలు పడుతూ.. లక్షల పెట్టుబడి పెట్టి కాపాడుకుంటూ వచ్చిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో..? ఏం చేయాలోనని రైతులు తలలు పట్టుకుంటున్నారు. ప్రకృతి కరుణించకపోవడంతో ఈయేడు మామిడి 30 శాతం వరకే కాత కాసింది. ఆ కాస్త పంటనైనా అమ్ముకోలేక.. ఇతర ప్రాంతాలకు తరలించలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోతకొచి్చన మామిడిని తెంపితే మార్కెట్ లేదు.. తెంపకపోతే వర్షాలు కురిస్తే రాలిపోతాయి. ఇదే బెంగతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. (కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు ) 18 వేల ఎకరాల్లో సాగు జిల్లాలోని నెన్నెల, జైపూర్, భీమారం, చెన్నూర్, తాండూర్ మండలాల్లో సుమారు 18 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 6 వేల ఎకరాల్లో నెన్నెలలో మామిడి తోటలు ఉన్నాయి. ఏటా పరోక్షంగా, ప్రత్యక్షంగా మామిడి తోటలపై 25 వేల మంది రైతులు, కూలీలు ఆధారపడి జీవిస్తుంటారు. ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాగ్‌పూర్, హైదరాబాద్, నిజామాబాద్ పట్టణాల్లోని మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలో.. అప్పులు ఎలా తీరుతాయోనని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. కేజీకి రూ.50 చొప్పున సెర్ప్ ద్వారా కొంటే మేలు మామిడికాయలను సెర్ప్ ద్వారా కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బంగినపల్లి కాయలు కేజీకి రూ.35 చెల్లించాలని నిర్ణయించారు. కాని ఆ ధర గిట్టుబాటు కాదని ప్రస్తుతం కాత తక్కువగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కేజీకి రూ.50 చొప్పున సెర్ప్ ద్వారా కొనుగోలు చేస్తే కొంత వరకు ఊరట కలుగుతుందని రైతులు అంటున్నారు. బంగినపల్లితో పాటు అన్ని రకాల చిన్న, పెద్ద కాయలను సైతం సెర్ప్ ద్వారా>నే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. (రాష్ట్రపతి భవన్లో కరోనా పాజిటివ్ ) -
ఎకరానికి 40 చెట్లు మేలు!
మామిడి చెట్లు విస్తారంగా పెరుగుతాయి. ఒక చెట్టుకు మరొకటి అడ్డం కాకుండా దీర్ఘకాలంలో మంచి దిగుబడులు ఇవ్వాలంటే ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టుకుంటే మేలు? మామిడి ప్రకృతి సేద్యంలో ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న పెనుమత్స కృష్ణంరాజు మాత్రం ఎకరానికి 40 చెట్లుంటే చాలంటున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎకరానికి 160 మొక్కలు నాటిన ఆయన కాలక్రమంలో చెట్లు కలిసిపోయి దిగుబడి తగ్గిపోతూ ఉంటే.. 75% చెట్లు తీసేశారు. రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతులను సూచించే శాస్త్రవేత్తలు మరీ వత్తుగా వేసుకోమని చెబుతూ ఉంటే.. సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్ కృష్ణంరాజు మాత్రం ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి 40 చెట్లుంటే చాలు అంటున్నారు. ఎకరానికి రూ. 20 వేల ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మామిడి సాగు చేస్తున్న సీనియర్ రైతు పెనుమత్స కృష్ణం రాజు ఈ ఏడాది మిత్రుడు నంబూరి వినోద్రాజుతో కలిసి సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొహిర్ మండలం నాగిరెడ్డివారిపల్లిలో కృష్ణంరాజు తన మిత్రులతో కలిసి 23 ఏళ్ల నుంచి 116 ఎకరాల్లో బంగినపల్లి, దసేరి, హైదర్ పసంద్, రాయల్ స్పెషల్ వంటి 16 మామిడి రకాలు సాగు చేస్తున్నారు. తొలుత ఎకరానికి 160 మొక్కలు(5 మీ.“ 5మీ.) నాటారు. అప్పట్లో రసాయనిక వ్యవసాయం చేశారు. పదేళ్ల వరకు ఎకరానికి 4 టన్నుల దిగుబడి వచ్చింది. తర్వాత ప్రూనింగ్ చేసినా దిగుబడి తగ్గింది. చీడపీడలు మొండికేశాయి. 2006లో ఎకరానికి 60 చెట్లు తీసేశారు. 2012 నుంచి సుభాష్ పాలేకర్ పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. చెట్లు కలిసిపోయి దిగుబడి తగ్గిపోవడంతోపాటు కాయ సైజు తగ్గింది. దుబాయ్ ఎగుమతి మార్కెట్‌ను కోల్పోయారు. దీంతో 2014లో 20 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా ఎకరానికి మరో 60 చెట్లు తీసేసి 40 చెట్లు(10 మీ.“ 10 మీ.) ఉంచారు. చెట్లు తగ్గించినా దిగుబడి పెరగడంతో గత ఏడాది తోట అంతటా ఎకరానికి 40 చెట్లు ఉంచి మిగతా చెట్లు తీసేశారు. అధిక ఉష్ణోగ్రత దెబ్బ మామిడిని ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రత దెబ్బతీసింది. మార్చిలో ఉన్నట్టుండి ఉష్ణోగ్రత 3–4 డిగ్రీలు పెరగడంతో రసాయనిక వ్యవసాయం చేసే ఇరుగు పొరుగు తోటల్లో 75% పిందె రాలిపోయింది. వీరి తోటలో పిందె సగానికి సగం రాలిపోయింది. దీంతో తోట మొత్తంలో ఎకరానికి 2 టన్నుల మేరకు వచ్చే సగటు దిగుబడి ఈ ఏడాది వెయ్యి–1200 కిలోలకు పడిపోయింది. అయినా, ఎకరానికి రూ. 20 వేల లోపే ఖర్చు కావడం (ఇందులో 80% కూలీల ఖర్చు), వెబ్సైట్ ద్వారా నేరుగా వినియోగదారులకు అమ్ముతుండడంతో మంచి నికరాదాయం పొందుతున్నారు. పకడ్బందీగా ప్రకృతి సేద్యం ప్రకృతి వ్యవసాయ పద్ధతిని నంబూరి వినోద్‌రాజు పర్యవేక్షణలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 40 దేశీ గిర్, ఒంగోలు ఆవులను పెంచుతున్నారు. కాపు పూర్తయిన తర్వాత తొలకరిలో జనుము, జీలుగ విత్తనాలు వెదజల్లి 2 నెలలకు కలియదున్నేస్తారు. వర్షాకాలంలో ఎకరానికి 500 కిలోల ఘనజీవామృతం, టన్ను చివికిన పశువుల ఎరువు వేస్తారు. ఎకరానికి వెయ్యి లీటర్ల ద్రవ జీవామృతం వర్షాకాలంలో మాత్రమే ఇస్తున్నారు. చెట్ల పెరుగుదలకు అరటి పువ్వులు, బెల్లం సమపాళ్లలో తీసుకొని 7 రోజులు మురగబెట్టి ఆ ద్రావణాన్ని.. వెయ్యి లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున (3%) కలిపి మూడు దఫాలు చెట్లపై పిచికారీ చేస్తారు. పూత దశలో ఫాస్ఫరస్ కొరత లేకుండా.. నువ్వుల కాడలు, బెల్లం సమపాళ్లలో వారం రోజులు మురగబెట్టి.. ఆ ద్రావణాన్ని వెయ్యి లీటర్ల నీటికి 3 లీటర్లు కలిపి.. రెండు దఫాలు పిచికారీ చేస్తారు. పిందె దశలో, కాయ పక్వానికి వచ్చే దశలో కాల్షియం, పొటాష్ లోపం రాకుండా పిచికారీలు చేస్తారు. సముద్ర గవ్వల సున్నంతో వెనిగర్ కలిపి పిచికారీ చేస్తారు. పొగాకు కాడలు, బెల్లం సమపాళ్లలో తీసుకొని వారం మురగబెట్టి.. ఆ ద్రావణాన్ని వెయ్యి లీటర్ల నీటికి 3 లీటర్లు కలిపి పిచికారీ చేస్తారు. తేనెమంచు పురుగు, బూడిద తెగులు వంటి చీడపీడలకు కషాయాలను సొంతంగా తయారు చేసుకొని ట్రాక్టర్లతో పిచికారీ చేస్తారు. ఈ పద్ధతులు పాటించడం వల్ల కాత, దిగుబడి బాగా వస్తోందని వినోద్ రాజు వివరించారు. గడ్డిలో మాగబెట్టడానికి 6 రోజులు.. 10 రోజుల నిల్వ సామర్థ్యం.. పంటను రసాయనాల్లేకుండా ఆరోగ్యదాయకంగా పండించడంతోపాటు కాయను కోసి మగ్గబెట్టే ప్రక్రియను కార్బయిడ్ రహితంగా అత్యంత శ్రద్ధతో చేపట్టడం వల్ల నాణ్యమైన, తీయనైన, పరిశుభ్రమైన మామిడి పండ్లను వినియోగదారులకు అందించగలుగుతున్నామని వినోద్‌రాజు తెలిపారు. పక్వానికి వచ్చిన కాయను తొడిమతో సహా కోసి, మగ్గబెట్టి ప్యాక్ చేయడానికి 6 రోజులు పడుతుందన్నారు. కోసిన కాయ సొనను పీల్చుకోవడానికి రెండు రోజులు ఉంచిన తర్వాత అరగంట సేపు సున్నపు నీటిలో ఉంచుతారు. దీని వల్ల ఫంగస్, వైరస్ ఇన్ఫెక్షన్లు పోతాయి. తర్వాత అర గంట సేపు షాంపూ వాష్ చేస్తారు. ఇదయ్యాక 6 గంటలపాటు కాయలను ఆరబెడతారు. తోటలోనే ప్రత్యేకంగా రైపెనింగ్ ఛాంబర్స్ నిర్మించారు. ఇథిలిన్ గ్యాస్ వదిలి కొన్ని, గడ్డిలో వేసి కొన్ని మాగబెడుతున్నారు. ఇథిలిన్ గ్యాస్‌తో 12 గంటల్లో మగ్గిపోతాయి. గ్యాస్ లేకుండా వరి గడ్డిలో మగ్గబెట్టడానికి రెండు రోజుల సమయం పడుతోంది. ఆ తర్వాత 2 రోజులు గాలిపోసుకోనిచ్చిన తర్వాత ప్యాక్ చేసి హైదరాబాద్‌లో వినియోగదారులకు అందిస్తున్నారు. పండ్లు నాణ్యంగా ఉండటంతోపాటు సహజమైన రుచి, తీపి, సువాసన తమ పండ్లను ప్రత్యేక స్థానంలో నిలుపుతున్నాయని వినోద్ రాజు తెలిపారు. కాయ కోసిన తర్వాత 6 రోజులకు ప్యాకింగ్ చేస్తున్నామని, ఆ తర్వాత పది రోజుల పాటు నిశ్చింతగా నిల్వ ఉంటున్నాయని వివరించారు. ఇతర పద్ధతుల్లో మగ్గబెడితే తీపి బ్రిక్స్ లెవల్ 15–18గా ఉంటుందని, తమ పండ్లలో 22–25 వరకు ఉంటున్నదని ఆయన తెలిపారు. కోత అనంతరం ప్రత్యేక శ్రద్ధతో నాణ్యమైన పండ్లను వినియోగదారులకు అందిస్తుండడం విశేషం. https://knfarms.in/ -
మామిడి పోతోంది!
జిల్లాలో మామిడి తోటలు ఎండిపోతున్నాయి.. విపరీతమైన ఎండలకు చెట్లు మాడిపోతున్నాయి. మూడేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సాగునీటి బోర్లలో చుక్కనీరు లేక బోరుమంటున్నాయి. కన్నబిడ్డలతో సమానంగా పెంచిన మామిడి చెట్లు కళ్ల ముందే ఎండిపోతుంటే మామిడి రైతులు కుమిలిపోతున్నారు. చేసేది లేక తోటలను వదిలేస్తున్నారు. మరోవైపు ప్రతికూల వాతావరణం దిగుబడిపై పెను ప్రభావమే చూపింది. పుత్తూరు: మామిడి సాగు జూదంలా మారిపోయిం ది.. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మామిడి రైతుకు కాలం కలిసి రాలేదు. సాగు ఖర్చులు తక్కువగా ఉండడం, ధరలు ఆశాజనకంగా ఉండడంతో పాటు నీటి అవసరం తక్కువ కావడంతో జిల్లా రైతులు సంప్రదాయ పంటల స్థానంలో మామిడి సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగింది. కేవలం మామిడి సాగును ఆసరా చేసుకుని జీవితాలను గడుపుతున్న రైతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోయింది. మాడిపోతున్న తోటలు గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి తోటలు ఈ ఏడాది ఎండితున్నాయి. కొన్నేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టం జిల్లాలో అథఃపాతాళానికి పడిపోయింది. గత ఏడాది మే నాటికి 17.96 మీటర్లుగా ఉన్న భూగర్భ జలమట్టం ఈ ఏడాది మేలో 28.17 మీటర్లకు పడిపోయింది. దీంతో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు స్థోమత లేని రైతులు తోటలను వదిలేశారు. ఎర్రావారిపాళెం మండలం వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన రైతు నారాయణకు ఉన్న 12 ఎకరాల మామిడి తోట పూర్తిగా ఎండిపోవడంతో గత్యంతర లేక కూలి పనులకు పోతుండడం మామిడి రైతుల పరిస్థితికి అద్దం పడుతోంది. తుడిచిపెట్టుకుపోయిన దిగుబడి మరోవైపు ఈ ఏడాది ప్రతికూల వాతావరణం మామిడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. సాధారణంగా జిల్లాలో డిసెంబర్, జనవరి ఆఖరు నాటికి చెట్లుకు పూత వస్తుంది. ఇందుకు పగటిపూట 30 డిగ్రీల లోపు రాత్రి పూట 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనుకూలిస్తాయి. అయితే ఈ ఏడాది మార్చి వరకు కూడా పూత రాకపోవడంతో వచ్చిన పూత సైతం అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాలిపోయిందని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరికొన్ని తోటల్లో వచ్చిన పూతలో మగపూలు ఎక్కువగా రావడంతో పిందె కట్టలేకపోయిందని అధికారులు వివరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి రైతుకు వాతావరణం ప్రతిబంధకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 30 శాతం మించి మామిడి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని వారు అంచనా చేస్తున్నారు. నీరందించలేకున్నారు కాయలు కాసే ముందు చెట్లు నిలువునా ఎండిపోతుంటే అన్నదాత గుండె తరుక్కుపోతోంది. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా మామిడి చెట్లకు నీరందించాలనుకుంటే ఆ ఖర్చు భరించలేకున్నారు. ఒక్క ట్యాంకరుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంత స్థోమత లేక వదిలేస్తున్నారు. అప్పో సప్పో చేసి బోర్లు వేసుకుందామంటే చాలాచోట్ల వెయ్యి అడుగులు డ్రిల్ చేసినా నీటి జాడ కానరావడం లేదు. వర్షాలు కురిస్తేనే.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మా మిడి తోటలు ఎండిపోతున్నాయి. కనీసం 15 రోజులకు ఒకసారైనా ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించాలని రైతులకు సూచిస్తున్నాం. వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. రైతులు ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేస్తున్న ఫారం పాండ్స్‌ను ఏర్పాటు చేసుకుంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు తోటలను సంరక్షించుకోవచ్చు. మళ్లీ వర్షాలు కురిస్తే తోటలు పునరుజ్జీవం పొందే అవకాశం ఉంది. రైతులు భయపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. – నరేష్‌కుమార్‌రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి, పుత్తూరు మూడెకరాల తోట ఎండిపోయింది నీటి వసతి లేకపోవడంతో మూడెకరాల్లో ఉన్న మా మామిడి తోట ఎండిపోయింది. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలంటే చాలా ఖర్చుతో కూడినది కావడంతో అలాగే వదిలేశాను. కొత్తగా బోరు వేసుకుందామన్నా మా ప్రాంతంలో నీళ్లు పడతాయనే నమ్మకం కూడా లేదు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఎలా బతకాలో తెలియక అయోమయంలో పడిపోయాం. ఆనందరెడ్డి, మామిడి రైతు, టీకేఎం పురం -
ఈదురు గాలుల బీభత్సం
సాక్షి, మద్నూర్: జిల్లాలో పలు ప్రాంతాలలో గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని మేనూర్, మొఘా, సుల్తాన్‌పేట్ తదితర గ్రామాల్లో మామిడి తోటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. సుల్తాన్‌పేట్ మాజీ సర్పంచ్ రాములు ఇంటిపై చెట్టు కూలిపడింది. ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఎన్నికల సందర్భంగా సలాబత్పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు టెంట్లు గాలికి కొట్టుకుపోయాయి. నేలరాలిన మామిడి కాయలు రెంజల్: ఈదురు గాలులతో కూడిన వర్షానికి బోధన్ డివిజన్లోని పలు గ్రామాలలో మామిడి కాయలు రాలిపడ్డాయి. సుమారు ఎనభై శాతం పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం జిల్లా క్లస్టర్ లెవల్ హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారి పండరి మండలంలో పర్యటించి, నష్టం వివరాలను సేకరించారు. బోధన్ మండలంలో 122 ఎకరాలు, ఎడపల్లి మండలంలో 46 ఎకరాలు, రెంజల్ మండలంలో 43 ఎకరాలు, నవీపేట్ మండలంలో 112 ఎకరాలు, కోటగిరి మండలంలో 146 ఎకరాలు, రుద్రూర్ మండలంలో 40 ఎకరాలు, వర్ని మండలంలో 65 ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. పంట నష్టం తీవ్రంగా ఉందని పండరి పేర్కొన్నారు. 33 శాతం నష్టం వాటిల్లితే ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. నష్టం అంచనాపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. ఆయన వెంట మండల ఉద్యాన అధికారి అస్రార్, రైతులు ఉన్నారు. వర్షంతో దెబ్బతిన్న పంటలు బీర్కూర్: అకాల వర్షంతో బీర్కూర్ మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షంతో సంబాపూర్, అన్నారం, దామరంచ, కిష్టాపూర్ తదితర గ్రామ శివారులలోని వరి పంట కొంత నేలవాలింది. రైతునగర్ గ్రామశివారులోని మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. అన్నారంలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. బీర్కూర్ మండలంలో సుమారు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షంతో భారీ నష్టం బాల్కొండ: బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో గురువారం రాత్రి చిరు జల్లులతో కూడిన గాలి వీచింది. అకాల వర్షంతో ఎక్కువగా మామిడి పంటకు నష్టం వాటిల్లింది. చిట్టాపూర్, ముప్కాల్, బాల్కొండలలో అధికంగా మామిడి వనాలున్నాయి. బలమైన ఈదురు గాలులు వీయడంతో కాయలు రాలిపోయాయి. దీంతో నష్టపోతున్నా మని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
రాలుతున్న ఆశలు
సాక్షి, చిన్నంబావి: జిల్లాలో మామిడిరైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఏటా పెట్టుబడి పెరుగుతోందని, దిగుబడి పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పుల కారణంగా మామిడిచెట్లు కనీసం 30శాతం పూతకు కూడా నోచుకోవడంలేదని వాపోతున్నారు. ఫలితంగా దిగుబడి లేదని, పూర్తిగా ఈ తోటలపైనే ఆధారపడిన తమ కుటుంబాలు అప్పులపాలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు మొత్తం 11వేల 800 ఎకరాలలో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా పాన్‌గల్ మండలంలో, ఆ తర్వాత వరుసగా చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో సాగు చేస్తున్నారు. గత ఏడాది సకాలంలో పూత రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరకొరగా పండిన పంట చేతికందే సమయంలో అకాలవర్షాలు, వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే చేతికందిన అరకొర పంటకు మార్కెట్లో ధర లేక పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఉన్నాయని, చివరికి అప్పులే మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులే కారణం మామిడిపూత మొదలు నుంచి కాయలు కోసే వరకు పంట దిగుబడి వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. డిసెంబరు చివరివారం జనవరిలో తగినంత పూత రావాలి. ఈసారి మండలంలో ఆ పరిస్థితి లేదు. కాస్తో కూస్తో వచ్చిన పూత ప్రస్తుత వాతావరణానికి రాలిపోతుంది. పలుచోట్ల చెట్లకు అసలుపూత రాలేదు. ఇందుకు ప్రధాన కారణం గత నెలలో కురిసిన వర్షాలు, చలిగాలులు, ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడమేనని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. ఎకరానికి ఐదు టన్నులు ప్రస్తుత ప్రతికూల వాతవరణం మామిడి దిగుబడి పై ప్రభావం చూపనుంది. పరిస్థితులు అనుకూ లిస్తే ఎకరానికి ఐదు టన్నుల దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. కానీ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో చెట్లకు పూత రాలేదని వాపోతున్నారు. అందువల్లే 40శాతం దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.40వేల ఖర్చు ఒక్కసారి పెట్టుబడి పెడితే క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందన్న ధీమాతో అనేక మంది రైతులు మామిడి సాగులోకి దిగుతున్నారు. ఏటా రూ.30 నుంచి రూ.40వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. అయితే కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది పూత రాకపోవడంతో ఇప్పటికే పలుమార్లు రసాయనిక ఎరువులు వాడారు. అయినా ఫలితంలేదని అంటున్నారు. జాడలేని గుత్తేదారులు జిల్లాలో పండించే మామిడికి మంచి డిమాండ్ ఉండటంతో హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు తరలించి విక్రయిస్తుంటారు. రైతులకు సగటున టన్నుకు రూ.10వేల నుంచి రూ.12వేల వరకు ధర పలుకుతుంది. ప్రతిసారి డిసెంబర్, జనవరి నెలలో చెట్లకు వచ్చిన పూతను బట్టి గుత్తేదారులు తోటలను కౌలుకు తీసుకునేవారు. ముందస్తుగా రైతులతో ఒప్పందం చేసుకుంటారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కారణంగా ఒక్క కౌలుదారుడు కూడా ముందుకురావడంలేదని రైతులు చెబుతున్నారు. మూడేళ్లుగా ఇలాగే.. మామిడి రైతులకు మూడేళ్లుగా వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. జూన్ నుంచి నవంబర్ వరకు పంటలకు సరైన మోతాదులో ఎరువులు వేయడం, తగిన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. కానీ రైతులు కౌలుదారులకు అప్పగించడంతో వారు రసాయనిక ఎరువులను వాడి దిగుబడి పెంచుకుంటారు. దీంతో ఒకే ఏడాది పంట వస్తుంది. ఆ తర్వాత దిగుబడి రాదు. అలాగే ఈ వాతావరణానికి తట్టుకునే వంగడాలను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. – వెంకటేశ్వర్లు ఉద్యానవన శాఖ అధికారి పూత నిలవడం లేదు.. ఈ ఏడాది చెట్లకు పూత నిలవడం లేదు. దీంతో కాయలు పట్టలేదు. గతేడాది కంటే ఈ ఏడాది దారుణంగా పూత రాలిపోతోంది. పోయిన ఏడాది పండ్లు విక్రయిస్తే పెట్టుబడి వచ్చింది. ఈసారి మాత్రం అప్పులే మిగిలేలా ఉన్నాయి. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోతే కోలుకోలేని ఇబ్బందే. – వెంకటస్వామి, రైతు, పాన్‌గల్ -
అపార నష్టం
లోకేశ్వరం, న్యూస్‌లైన్ : మండలంలోని పుస్పూర్, హథ్గాం, సాథ్గాం, రాయపూర్‌కాండ్లీ, ధర్మోరా, పంచగుడి, పిప్రి, వాట్టోలి, గడ్‌చాంద, రాజూరా, మన్మద్, పోట్పల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షం కురియడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొక్కజొన్న, జొన్న, మిర్చి, నువ్వు, పొద్దుతిరుగుడు, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. పుస్పూర్ గ్రామంలో స్వల్పంగా వడగండ్లు పడ్డాయి. పంటలకు నష్టం వాటిల్లినా అధికారులు గ్రామాలను సందర్శించడం లేదని రైతులు వాపోతున్నారు. నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు. ఖానాపూర్‌లో.. ఖానాపూర్ : మండలంలో గత రెండు రోజులుగా కురిసిన గాలీ వాన బీభత్సంతో పాటు రాళ్ల వర్షం కారణంగా రైతుల పంటలు తీవ్రంగా నష్టపోయారు. వరి, మొక్కజొన్నతో పాటు నువ్వు, కురగాయలు, మామిడి రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. అతలాకుతలం.. కడెం : మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వర్షం, ఈదురుగాలులతో పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. పెద్దూరు, మద్దిపడగ, ధర్మాజీపేట, చిన్నబెల్లాల్ తదితర గ్రామాల్లో వరి, పెసర, నువ్వు, మిరప, మొక్కజొన్న, పసుపు, ఉల్లి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 250 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ధర్మాజిపేట గ్రామానికి చెందిన రైతు మంతెన సత్యం సాగుచేసిన నువ్వు పంట వర్షం ధాటికి నాశనమైంది. కోళ్లఫారంలో 200 కోళ్లు మృత్యువాతపడ్డాయి. పెద్దూరులో దండికె గంగన్న, సంగ మల్లయ్య, చిట్టేటి ముత్తన్న, గజ్జి ఎర్రన్న, సంగ పోషన్న, తౌర్య, బలరాం నాయక్, రవినాయక్ తదితరుల పంటలు దెబ్బతిన్నాయి. దండికె గంగన్నకు చెందిన మిరప పంట పూర్తిగా నేలకొరిగింది. పెద్దూరు తండాలోని ఇస్లావత్ బలరాంనాయక్ పసుపును ఉడకబె ట్టి ఆరబెట్టాడు. అది వర్షానికి తడిసి ముద్దయింది. అంబారీపేట, పాండ్వాపూరు గ్రామాల్లో కొన్ని ఇళ్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. పంటల నష్టం వివరాలను వీఆర్వోలు శనివారం నుంచి సర్వే చేస్తున్నారు. నేలకొరిగిన పంటలు తానూరు : మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసి న వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్ల వాన ధాటి కి 1600 ఎకరాల్లో గోధుమ, జొన్న పంటలు నేలకొరిగా యి. ఎల్వీ, హిప్నెల్లి, హిప్నెల్లితండా, ఉమ్రి, మసల్గతం డా గ్రామాల్లో నేలకొరిగిన పంటలను చూసి రైతులు తీ వ్ర ఆవేదనకు గురయ్యారు. హిప్నెల్లి గ్రామంలో గాలి ధాటికి 24ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ఇళ్లలోని బట్ట లు, ఆహార ధాన్యాలు తడిసిపోయాయి. శుక్రవారం రా త్రంతా పక్క ఇళ్లలో తలదాచుకున్నారు. వర్షంతో నిరాశ్రయులుగా మారినా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో శనివా రం గ్రామస్తులు బెల్తరోడ, తానూర్ ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. తహశీల్దార్ అంజయ్య అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున పరిహారం ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. గాలుల ప్రభావంతో విద్యుత్ తీగలు తెగిపోయి మండలంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హిప్నెల్లి గ్రామంలో బాధితులకు టీడీపీ నియోజకవర్గ నాయకులు, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న వచ్చి 3 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు.