మామిడి చెట్లు విస్తారంగా పెరుగుతాయి. ఒక చెట్టుకు మరొకటి అడ్డం కాకుండా దీర్ఘకాలంలో మంచి దిగుబడులు ఇవ్వాలంటే ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టుకుంటే మేలు? మామిడి ప్రకృతి సేద్యంలో ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న పెనుమత్స కృష్ణంరాజు మాత్రం ఎకరానికి 40 చెట్లుంటే చాలంటున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎకరానికి 160 మొక్కలు నాటిన ఆయన కాలక్రమంలో చెట్లు కలిసిపోయి దిగుబడి తగ్గిపోతూ ఉంటే.. 75% చెట్లు తీసేశారు. రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతులను సూచించే శాస్త్రవేత్తలు మరీ వత్తుగా వేసుకోమని చెబుతూ ఉంటే.. సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్ కృష్ణంరాజు మాత్రం ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి 40 చెట్లుంటే చాలు అంటున్నారు. ఎకరానికి రూ. 20 వేల ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.
ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మామిడి సాగు చేస్తున్న సీనియర్ రైతు పెనుమత్స కృష్ణం రాజు ఈ ఏడాది మిత్రుడు నంబూరి వినోద్‌రాజుతో కలిసి సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొహిర్ మండలం నాగిరెడ్డివారిపల్లిలో కృష్ణంరాజు తన మిత్రులతో కలిసి 23 ఏళ్ల నుంచి 116 ఎకరాల్లో బంగినపల్లి, దసేరి, హైదర్ పసంద్, రాయల్ స్పెషల్ వంటి 16 మామిడి రకాలు సాగు చేస్తున్నారు. తొలుత ఎకరానికి 160 మొక్కలు(5 మీ.“ 5మీ.) నాటారు. అప్పట్లో రసాయనిక వ్యవసాయం చేశారు. పదేళ్ల వరకు ఎకరానికి 4 టన్నుల దిగుబడి వచ్చింది. తర్వాత ప్రూనింగ్ చేసినా దిగుబడి తగ్గింది. చీడపీడలు మొండికేశాయి. 2006లో ఎకరానికి 60 చెట్లు తీసేశారు. 2012 నుంచి సుభాష్ పాలేకర్ పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. చెట్లు కలిసిపోయి దిగుబడి తగ్గిపోవడంతోపాటు కాయ సైజు తగ్గింది. దుబాయ్ ఎగుమతి మార్కెట్‌ను కోల్పోయారు. దీంతో 2014లో 20 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా ఎకరానికి మరో 60 చెట్లు తీసేసి 40 చెట్లు(10 మీ.“ 10 మీ.) ఉంచారు. చెట్లు తగ్గించినా దిగుబడి పెరగడంతో గత ఏడాది తోట అంతటా ఎకరానికి 40 చెట్లు ఉంచి మిగతా చెట్లు తీసేశారు.
అధిక ఉష్ణోగ్రత దెబ్బ
మామిడిని ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రత దెబ్బతీసింది. మార్చిలో ఉన్నట్టుండి ఉష్ణోగ్రత 3–4 డిగ్రీలు పెరగడంతో రసాయనిక వ్యవసాయం చేసే ఇరుగు పొరుగు తోటల్లో 75% పిందె రాలిపోయింది. వీరి తోటలో పిందె సగానికి సగం రాలిపోయింది. దీంతో తోట మొత్తంలో ఎకరానికి 2 టన్నుల మేరకు వచ్చే సగటు దిగుబడి ఈ ఏడాది వెయ్యి–1200 కిలోలకు పడిపోయింది. అయినా, ఎకరానికి రూ. 20 వేల లోపే ఖర్చు కావడం (ఇందులో 80% కూలీల ఖర్చు), వెబ్‌సైట్ ద్వారా నేరుగా వినియోగదారులకు అమ్ముతుండడంతో మంచి నికరాదాయం పొందుతున్నారు.
పకడ్బందీగా ప్రకృతి సేద్యం
ప్రకృతి వ్యవసాయ పద్ధతిని నంబూరి వినోద్‌రాజు పర్యవేక్షణలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 40 దేశీ గిర్, ఒంగోలు ఆవులను పెంచుతున్నారు. కాపు పూర్తయిన తర్వాత తొలకరిలో జనుము, జీలుగ విత్తనాలు వెదజల్లి 2 నెలలకు కలియదున్నేస్తారు. వర్షాకాలంలో ఎకరానికి 500 కిలోల ఘనజీవామృతం, టన్ను చివికిన పశువుల ఎరువు వేస్తారు. ఎకరానికి వెయ్యి లీటర్ల ద్రవ జీవామృతం వర్షాకాలంలో మాత్రమే ఇస్తున్నారు. చెట్ల పెరుగుదలకు అరటి పువ్వులు, బెల్లం సమపాళ్లలో తీసుకొని 7 రోజులు మురగబెట్టి ఆ ద్రావణాన్ని.. వెయ్యి లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున (3%) కలిపి మూడు దఫాలు చెట్లపై పిచికారీ చేస్తారు. పూత దశలో ఫాస్ఫరస్ కొరత లేకుండా.. నువ్వుల కాడలు, బెల్లం సమపాళ్లలో వారం రోజులు మురగబెట్టి.. ఆ ద్రావణాన్ని వెయ్యి లీటర్ల నీటికి 3 లీటర్లు కలిపి.. రెండు దఫాలు పిచికారీ చేస్తారు. పిందె దశలో, కాయ పక్వానికి వచ్చే దశలో కాల్షియం, పొటాష్ లోపం రాకుండా పిచికారీలు చేస్తారు. సముద్ర గవ్వల సున్నంతో వెనిగర్ కలిపి పిచికారీ చేస్తారు. పొగాకు కాడలు, బెల్లం సమపాళ్లలో తీసుకొని వారం మురగబెట్టి.. ఆ ద్రావణాన్ని వెయ్యి లీటర్ల నీటికి 3 లీటర్లు కలిపి పిచికారీ చేస్తారు. తేనెమంచు పురుగు, బూడిద తెగులు వంటి చీడపీడలకు కషాయాలను సొంతంగా తయారు చేసుకొని ట్రాక్టర్లతో పిచికారీ చేస్తారు. ఈ పద్ధతులు పాటించడం వల్ల కాత, దిగుబడి బాగా వస్తోందని వినోద్ రాజు వివరించారు.
గడ్డిలో మాగబెట్టడానికి 6 రోజులు.. 10 రోజుల నిల్వ సామర్థ్యం..
పంటను రసాయనాల్లేకుండా ఆరోగ్యదాయకంగా పండించడంతోపాటు కాయను కోసి మగ్గబెట్టే ప్రక్రియను కార్బయిడ్ రహితంగా అత్యంత శ్రద్ధతో చేపట్టడం వల్ల నాణ్యమైన, తీయనైన, పరిశుభ్రమైన మామిడి పండ్లను వినియోగదారులకు అందించగలుగుతున్నామని వినోద్‌రాజు తెలిపారు. పక్వానికి వచ్చిన కాయను తొడిమతో సహా కోసి, మగ్గబెట్టి ప్యాక్ చేయడానికి 6 రోజులు పడుతుందన్నారు. కోసిన కాయ సొనను పీల్చుకోవడానికి రెండు రోజులు ఉంచిన తర్వాత అరగంట సేపు సున్నపు నీటిలో ఉంచుతారు. దీని వల్ల ఫంగస్, వైరస్ ఇన్ఫెక్షన్లు పోతాయి. తర్వాత అర గంట సేపు షాంపూ వాష్ చేస్తారు. ఇదయ్యాక 6 గంటలపాటు కాయలను ఆరబెడతారు. తోటలోనే ప్రత్యేకంగా రైపెనింగ్ ఛాంబర్స్ నిర్మించారు. ఇథిలిన్ గ్యాస్ వదిలి కొన్ని, గడ్డిలో వేసి కొన్ని మాగబెడుతున్నారు. ఇథిలిన్ గ్యాస్‌తో 12 గంటల్లో మగ్గిపోతాయి. గ్యాస్ లేకుండా వరి గడ్డిలో మగ్గబెట్టడానికి రెండు రోజుల సమయం పడుతోంది. ఆ తర్వాత 2 రోజులు గాలిపోసుకోనిచ్చిన తర్వాత ప్యాక్ చేసి హైదరాబాద్‌లో వినియోగదారులకు అందిస్తున్నారు. పండ్లు నాణ్యంగా ఉండటంతోపాటు సహజమైన రుచి, తీపి, సువాసన తమ పండ్లను ప్రత్యేక స్థానంలో నిలుపుతున్నాయని వినోద్ రాజు తెలిపారు. కాయ కోసిన తర్వాత 6 రోజులకు ప్యాకింగ్ చేస్తున్నామని, ఆ తర్వాత పది రోజుల పాటు నిశ్చింతగా నిల్వ ఉంటున్నాయని వివరించారు. ఇతర పద్ధతుల్లో మగ్గబెడితే తీపి బ్రిక్స్ లెవల్ 15–18గా ఉంటుందని, తమ పండ్లలో 22–25 వరకు ఉంటున్నదని ఆయన తెలిపారు. కోత అనంతరం ప్రత్యేక శ్రద్ధతో నాణ్యమైన పండ్లను వినియోగదారులకు అందిస్తుండడం విశేషం.
https://knfarms.in/
Comments
Please login to add a commentAdd a comment