గాక్ ఫ్రూట్.. అత్యంత ఖరీదైన పండు. మనకు కొత్త పంట. కానీ, అనేక దక్షిణాసియా దేశాల్లో విరివిగా సాగవుతున్నది. ఎన్నెన్నో ΄ోషకాలు, ఔషధ గుణాల గని ఈ అద్భుత పండు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమకు కూడా ఎంతో ఉపయుక్తమైన పండ్ల జాతి గాక్. కేరళ, కర్ణాటకలో అతికొద్ది మంది ఇంటిపంటగా సాగు చేస్తున్న ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటగా ఏలూరు జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి పెరట్లో సాగు చేస్తూ.. కిలో రూ. 500కు విక్రయిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంటిపంటగా, వాణిజ్య పంటగా సాగు చేసుకోదగిన ఈ కొత్త పంటపై ప్రత్యేక కథనం.
బొరగం వెంకట్ బీటెక్ చదువుకొని పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇంతవరకే అయితే పెద్ద విశేషం ఏమీ లేదు. ఏదైనా మంచి కొత్త పంటను మన ప్రజలకు పరిచయం చేయాలన్న తపనతో ఇంటర్నెట్ సహాయంతో లక్షణమైన గాక్ ఫ్రూట్‌ను సాగు చేయనారంభించారు. వెంకట్ స్వస్థలం ఏలూరు జిల్లా పోలవరం మండలం లోని మామిడిగొంది గ్రామం. గాక్ ఫ్రూట్‌ను కేరళలో కొందరు సాగు చేస్తుండటాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న వెంకట్, మొక్కలు తెప్పించి తన ఇంటి పెరట్లో 2023 నవంబర్ నెలలో నాటారు. సుమారు 300 మొక్కల్ని నాటి, పందిరి పైకి పాకించారు. ఇందులో కొన్ని ఆడ, మగ మొక్కలు కలిసి ఉన్నాయి. చాలా ఏళ్లపాటు పండ్ల దిగుబడిని ఇవ్వటంతోపాటు.. ఏడాది పొడవునా పండ్లను అందించే అద్భుత తీగజాతి పంట ఇది. అవగాహన లోపం వల్ల మొక్కల్ని దగ్గరగా నాటటం వల్ల కొన్ని మొక్కలు చనిపోయాయని, ప్రస్తుతం 120 మొక్కలు మాత్రమే బతికి ఉన్నాయని వెంకట్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.
రెండు నెలల క్రితం నుంచి చక్కని ఎర్రటి పండ్ల దిగుబడి తీసుకుంటున్నానని, ఎంతో ఆరోగ్యకరమైన ఈ పండ్లకు చాలా గిరాకీ ఉందని వెంకట్ తెలి΄ారు. గాక్ ఫ్రూట్ సాగు గురించి తెలుసుకున్న ప్రజలు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కిలో పండ్లకు రూ. 500 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని సంతోషంగా చెప్పారు. ఒక్కో పండు అరకేజీ వరకు బరువు పెరుగుతోంది.
ప్రతి రెండు ఆడ మొక్కల పక్కన ఒక మగ మొక్కను నాటుకోవాలని, 6“6 అడుగుల దూరంలో నాటుకొని పందిరి వేస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల పాటు ఏడాది పొడవునా నిరంత రాయంగా పండ్ల దిగుబడి వస్తూ ఉంటుందన్నారు. దీని తీగలు ఎంత విస్తారంగా పెరిగే వీలుంటే అన్ని ఎక్కువ పండ్ల దిగుబడి వస్తుందని తన అనుభవంలో తెలుసుకున్నానన్నారు.
ఆకాకర జాతికి చెందిన గాక్ ఫ్రూట్ పైన కూడా నూగు ఉంటుంది. లోపల గుజ్జుతో ΄ాటు గింజలు ఎక్కువగానే ఉంటాయి. గింజల్ని తీసేసి గుజ్జును జ్యూస్ చేసుకొని తాగితే పోషకాల లోపం తగ్గి΄ోతుందని, జబ్బులు సైతం తగ్గుతాయని ఆయన చెబుతున్నారు. గాక్ ఫ్రూట్ పూలకు కృత్రిమంగా చేతులతో పరపరాగ సంపర్కం చేస్తే అధిక పండ్ల దిగుబడి వస్తుందని, సహజంగా జరిగితే సగం దిగుబడి మాత్రమే వస్తుందని వెంకట్ వివరించారు.
గాక్ ఫ్రూట్ పువ్వు రెండు నెలల్లో పిందె నుంచి పండు దశకు పెరుగుతుంది. రంగులు మారుతుంది. పిందె పడిన తొలి నెలలో ఆకు పచ్చగా ఉంటుంది. ఈ దశలో ఈ కాయలను గోకాకర మాదిరిగానే కూరవండుకొని తినొచ్చు. దోస కాయ మాదిరి రుచి ఉంటుందన్నారు. రెండో నెలలో మొదటి పది రోజుల్లో పసుపు పచ్చ రంగుకు మారుతుంది. 20 రోజులకు నారింజ రంగులోకి మారి, 30 రోజులకు ఎర్రగా మారుతుంది. పండు పండిన తర్వాత త్వరగా మెత్తబడి పోతుందని వెంకట్ వివరిస్తున్నారు. విత్తనాలు నల్లగా ఉంటాయి.
యూట్యూబ్ ద్వారా వెంకట్ దగ్గర ఈ కొత్త పంట సాగవుతున్నట్లు తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ స్పందించి ఉద్యాన శాఖ అధికారులను పంపారు. పండ్లతో పాటు కొన్ని మొక్కలను తెప్పించి ప్రయోగాత్మకంగా సాగు చేయించటం ప్రారంభించారు.
గాక్ ఫ్రూట్ పోషక విలువలతో కూడిన పంటని, దీన్ని సులువుగా తీగ ముక్కలను కత్తిరించి నాటుకోవచ్చని వెంకట్ ఇంటిపంటను పరిశీలించిన ఉద్యానాధికారి సందీప్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు. ఇది చీడపీడలు ఆశించని పంటని, సాగు చేయటం కూడా సులువేనని అన్నారు. ఇద్దరు రైతులతో తాము ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నామన్నారు.
వియత్నాం, చైనా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో చిరకాలంగా సాగులో ఉన్న గాక్ ఫ్రూట్‌ను అనాదిగా సందప్రదాయ వైద్యంలో విస్తృతంగా వినియోగిస్తున్నారని యూనివర్సిటీ సైన్స్ మలేషియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లైకోపెన్, బీటా కెరోటిన్, ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు అత్యధిక మోతాదులో కలిగి ఉండటం వల్ల కేన్సర్, అల్సర్లు, కంటి సమస్యలు తదితర జబ్బుల్ని నయం చేసే విశేష ఔషధ గుణాలు గాక్ ఫ్రూట్‌లో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా జర్నల్ ఆఫ్ క్రాప్‌సైన్స్‌లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీ పరిశ్రమలకు గాక్ ఫ్రూట్ ముడిసరుకుగా ఉపయోగపడుతున్నందున వాణిజ్యపరమైన విలువ కలిగి ఉండటం మరో విశేషం.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
కిలో రూ. 500కు అమ్ముతున్నా
మన ప్రాంతానికి ఓ మంచి కొత్త పంటను పరిచయం చేయాలనే తపన నాకుండేది. ఇంటర్నెట్‌లో గాలిస్తుండగా గాక్ ఫ్రూట్ గురించి తెలిసింది. కేరళలో ఒకరి దగ్గరి నుంచి మొక్కలు తెప్పించి నాటా. 20 సెంట్ల నా పెరటి తోటలో గాక్ ఫ్రూట్స్ వారానికి 10–15 కిలోల వరకు పండుతున్నాయి. కూరకు ఉపయోగపడే పచ్చి గాక్ కాయలను కిలో రూ. 300కు అమ్ముతున్నా. కేరళలో కిలో రూ. 1,000 – 1,500 వరకు అమ్ముతున్నారు. గ్యాస్ ఫ్రూట్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంపొదించటంతో పాటు.. షుగర్, కేన్సర్ వంటి జబ్బుల్ని కూడా నయం చేస్తుంది. హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల వాళ్లు ముందే బుక్ చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. మొక్కలు కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు.
– బోరగం వెంకట్ (77999 11174),
గాక్ ఫ్రూట్ సాగుదారు, మామిడిగొంది, పోలవరం మండలం, ఏలూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment