Avocado డాన్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌.. సాగు ఎలా చెయ్యాలి? | Don of fruits avocado How to grow it check full deets inside | Sakshi
Sakshi News home page

డాన్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌.. అవొకాడో పండ్ల తోటలు సాగు ఎలా చెయ్యాలి?

Published Tue, Mar 18 2025 10:57 AM | Last Updated on Tue, Mar 18 2025 1:24 PM

Don of fruits avocado How to grow it check full deets inside

మన దేశంలో పట్టణ  ప్రాంత ప్రజల్లో ఆహార – ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రకాల దేశ, విదేశీ జాతుల పండ్లకు మార్కెట్‌లో గిరాకీ పెరుగుతోంది. అందులో ఒకటి అవొకాడో. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ జి. కరుణాకరన్‌ మాటల్లో చెప్పాలంటే.. అవొకాడో, డ్రాగన్‌ సహా పన్నెండు రకాల దేశ, విదేశీ ఖరీదైన పండ్ల జాతుల సాగు విస్తీర్ణం మన దేశంలో గత మూడేళ్లుగా పెరుగుతోంది. ఈమొక్కలకు గిరాకీ 30% పెరిగింది. పరిమిత నీరు, పోషకాలు, శ్రమతో సాగు చేయడానికి అవకాశం ఉండటం.. ధాన్యపు పంటలతో  పోల్చితే అధికాదాయం రావటం.. యాంత్రీకరణకు అనుకూలం కావటం.. పౌష్టిక విలువలతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం.. మార్కెట్‌లో డిమాండ్‌ ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. అయితే, అవొకాడో పండ్ల తోటలు ఏయే భూముల్లో సాగు చెయ్యాలి? ఏయే రకాలు అనువైనవి? వంటి ప్రశ్నలకు సమాధానాలు డా. కరుణాకర్‌ మాటల్లోనే చదవండి.

అవొకాడో సాగు మనకు కొత్తది కాదు. 70 ఏళ్లుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, సిక్కిం, మహారాష్ట్రల్లో సాగవుతోంది. అయితే, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అవొకాడో తోటలను తామర తంపరగా నాటుతున్నారు. గత మూడేళ్లలోనే 8–10 లక్షల అవొకాడో మొక్కలు నాటారు. ఉష్ణమండలం, తేమ ఎక్కువగా ఉండే ఉప–ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ పెరిగే లక్షణం దీనికి ఉన్నప్పటికీ, తగిన వాతవరణం, నేలల గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవలసిందిగా రైతులను కోరుతున్నాను. 18–33 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతలు, 700–1500 ఎం.ఎం. వర్ష; ఉన్న  ప్రాంతాలు.. 5.5 - 8 వరకు ఉదజని సూచిక (పిహెచ్‌) ఉన్న భూములు అనుకూలం. మొక్కలు నాటిన 5 ఏళ్లకు పూర్తిస్థాయి దిగుబడినిచ్చే స్థితికి పెరుగుతుంది. 

ప్రస్తుతం మంచి మార్కెట్‌ డిమాండ్‌ ఉంది. అందుకే రైతులు, వ్యాపారులు, వినియోగదారులు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే, అవొకాడో ఖరీదైన పండు కాబట్టి మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌లు, డిసర్ట్‌ స్వీట్ల తయారీలో మాత్రమే వాడుతున్నారు. మున్ముందు దిగుబడి పెరిగే నాటికి ప్రాసెసింగ్‌ సదుపాయాలు పెరిగి వేర్వేరు రూపాల్లో వాడకం పెరగాలి. లేదంటే మార్కెట్‌ పడిపోయే ముప్పు ఉంటుంది. 

ఇక రైతుల విషయానికొస్తే.. తోటలు నాటేటప్పుడు అది ఏ రకమో తెలియకుండానే, ఏయే నేలలకు సరి;yతుందో తెలుసుకోకుండానే స్థానిక నర్సరీల నుంచి కొనుగోలు చేసిన మొక్కలు నాటుతున్నారు. దీంతో సాగులో చాలా సమస్యలు వస్తున్నాయి.

‘హాస్‌’ రకం మొక్కలు వద్దు
బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌లో 16 రకాల అవొకాడో మొక్కలున్నాయి. మీ భూమి, నీరు, వాతావరణానికి అనువైన రకాన్ని ఎంచుకోవటంపై శ్రద్ధ పెడితే విజయం సాధించవచ్చు. అర్క సుప్రీం, అర్క రవి, లాంబ్‌ హాస్, పింకర్‌టన్‌ రకాలు మేలైనవి. చాలా మంది హాస్‌ రకం సాగు చేస్తున్నారు. ఇది మనకు సూట్‌ కాదు. 

నెర్రెలిచ్చే భూముల్లో వద్దు
అవొకాడో చాలా సున్నితమైన పంట. నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. అవొకాడోకే కాదు ఏ పండ్ల తోటలకైనా ఎండా కాలం నెర్రెలిచ్చే నల్లరేగడి నేలలు పనికిరావు. వేర్లు తెగి΄ోతాయి. నీరు నిలవని, బాగా గాలి సోకే ఎర్ర గరప నేలలు (రెడ్‌ శాండీ సాయిల్‌) మేలు. 40% ఇసుక కలిసిన చెరువు మట్టిలో కూడా బాగా పెరుగుతుంది. బంక మట్టి నేల (క్లే సాయిల్‌) అసలు పనికిరాదు. ఈ నేలలో సాగు చేయాలంటే... 4x3 అడుగుల గుంతల్లో ఎర్ర మట్టిపోసి, మొక్కలు నాటుకోవాలి. పిహెచ్‌ సమతుల్యంగా ఉండాలి. నీటిలో ఈసీ 1 కన్నా ఎక్కువ ఉంటే సరిగ్గా పెరగదు. అందుకని, అవొకాడో మొక్కలు నాటే ముందు మట్టి, నీటి పరీక్షలు చేయించి ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకోవాలి.

పిహెచ్‌ 7 కన్నా ఎక్కువ ఉంటే, కాల్షియం కార్బొనేట్‌ 20% కన్నా ఎక్కువ ఉన్న నేలలు అనుకూలం కాదు. నీరు తగుమాత్రంగా ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఐరన్‌ లభ్యత సమస్య వస్తుంది. నీటి ఉప్పదనం 2% కన్నా ఎక్కువ ఉంటే పనికిరాదు. క్లోరైడ్‌ సాంద్రత ఎక్కువగా ఉన్న నేలలకు తగిన రకాల మొక్కలను ఎంపిక చేసుకోవాలి.

ఏటా రెండు సీజన్లు
అవొకాడో పూత వచ్చిన తర్వాత 120–150 రోజుల్లో పండ్లు కోతకు వస్తాయి. ఏప్రిల్‌–జూలై, అక్టోబర్‌– ఫిబ్రవరి సీజన్లలో రెండు దఫాలుగా పండ్ల దిగుబడి వస్తుంది. విత్తనం నాటితే 5–6 ఏళ్లలో, అంటు మొక్కలు నాటితే 3–4 ఏళ్లలో కాపుకొస్తాయి. చెట్టుకు 100 నుంచి 500 కాయలు కాస్తాయి. కాయలు పక్వానికి వచ్చినా చెట్టు మీద గట్టిగానే ఉంటాయి. కోసిన తర్వాత మెత్తబడతాయి. ముదురు రంగులోకి మారితే పక్వానికి వచ్చినట్లు గుర్తించి కోయాలి. పక్వ దశను గుర్తించడానికి ఇతర దేశాల్లో చిన్న΄ాటి యంత్రాలను వాడుతున్నారు. మన శరీర ఉష్ణోగ్రతను సెన్సార్లతో గుర్తించే పరికరంతోనే అవొకాడో పక్వ దశను తెలుసుకోవచ్చు. 24% ఆర్గానిక్‌ కంటెంట్‌ ఉన్న దశలో పండును కోయాలి. కాయ కోసిన తర్వాత రంగు మారుతుంది. అవొకాడోతో ఒక ఉపయోగం ఏమిటంటే పండు పక్వానికి వచ్చిన తర్వాత కూడా మార్కెట్‌ ధర లేకపోతే చెట్టు మీదే 1–2 నెలల వరకు కాయ కోతను వాయిదా వేసుకోవచ్చు! 

ముందుగా/ఆలస్యంగా కోతకు రావటం.. మంచి సువాసనతో అధిక గుజ్జు ఉండటం.. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం.. మార్కెట్‌లో గిరాకీ ఉండటం.. కోసుకు తినటానికి లేదా   ప్రాసెసింగ్‌కు అనువుగా ఉండటం.. వంటి అనేక అంశాలను పరిశీలించి అవొకాడో సాగుచేసే రకాలను ఎంపిక చేసుకోవటం కీలకం.  
  
మరికొన్ని మెళకువలు
సముద్రతలం నుంచి 1,000 మీటర్ల ఎత్తుగల ప్రదేశాల్లో వెస్ట్‌ ఇండియన్‌ అవొకాడో వెరైటీలను నాటుకోవాలి. వీటి కొమ్మలు, విత్తనాల ద్వారా మొక్కలు తయారు చేసుకోవచ్చు. మొదటి 5 ఏళ్లూ మధ్యాహ్నపు ఎండ నుంచి మొక్కల్ని కాపాడాలి. 5 ఏళ్ల వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ పూత, కాతను ఉంచకూడదు. తీసెయ్యాలి. 5 మీ.“ 5 మీ. సైజులోగొయ్యి తవ్వి, అది 3 నెలలు ఎండిన తర్వాత మొక్కలు నాటుకోవాలి. అవొకాడో పండ్లను  ప్రాసెస్‌ చేసి అనేక ఉత్పత్తుల తయారు చేయటం, స్ప్రే డ్రయ్యింగ్‌ ద్వారా  పొడిని తయారు చేసే టెక్నాలజీని ఐఐహెచ్‌ఆర్‌ రూపొందించింది. విలువ జోడించి ఉత్పత్తులు అమ్ముకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది.

5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి 
అవొకాడో 2 –  నీరు నిలవని ఎర్ర గరప నేల (రెడ్‌ శాండీ సాయిల్‌)లో అవొకాడో చెట్టు చక్కగా పెరుగుతుంది. బంక మన్ను (క్లే సాయిల్‌) దీనికి సరిపడదు. ఐఐహెచ్‌ఆర్‌ ప్రధాన శాస్త్రవేత్త డా. కరుణాకరన్‌ ఈ విషయాన్ని ఈ చిత్రంలో చక్కగా చె΄్పారు. బంక మన్ను నేలలో అవొకాడో సాగు చేయదలిస్తే 4 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పున గొయ్యి తీసి, ఆ గోతిలో 90% వరకు ఎర్ర గరప మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపి సాగు చేయవచ్చని ఆయన తెలిపారు. గుంతలో సగం వరకే ఎర్ర గరప మట్టిని నింపితే.. చెట్టు కొన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత వేర్లు బంకమన్నులోకి విస్తరించినప్పుడు పోషకాలు, నీరు అందక (చిత్రంలోచూపిన విధంగా) నిలువునా ఎండిపోతుందని వివరించారు. అవొకాడో చాలా సున్నితమైన పంట. వేరుకుళ్లు బెడద ఉంటుంది. అవొకాడో మొక్కల్ని (ఆ మాటకొస్తే ఏ పండ్ల తోటైనా) 5 అడుగుల ఎత్తుమడి (రెయిజ్డ్‌ బెడ్‌) పైనే నాటుకోవాలి. ట్రాక్టర్‌తో అంతర సేద్యం చేసినా బెడ్‌ దెబ్బతినదు. సాళ్ల మధ్య వర్షపు నీరు బయటకు త్వరగా వెళ్లిపోవటానికి కందకం తియ్యాలి. ఇజ్రాయెల్, సౌతాఫ్రికాలో కూడా ఎత్తుమడులపైనే నాటుతారు.5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి.

థాంక్స్‌ టు ‘టొక్సోడాన్‌’!
అవొకాడో.. అమెజాన్, మెక్సికన్‌ అటవీ ప్రాంతాల్లో నివసించే భారీ శాకాహార జంతువు ‘టొక్సోడాన్‌’కు పండ్లు తినే అలవాటుంది. అయితే, దానికి ఏ పండూ సరిగ్గా నచ్చేది కాదు. అవొకాడో పండు టొక్సోడాన్‌కు తెగ నచ్చేసిందట. అందులో పుష్కలంగా ఉండే మోనో అన్‌ శాచ్యురేటెడ్‌ ఫాటీ యాసిడ్సే అందుకు కారణమట. ఇందులో 20% కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనదే కాకుండా ‘సంతృప్తినిచ్చేది’ కూడానట! అందుకే దీనికి ‘వెన్న పండు’ అని పేరు. ఆ విధంగా దీని గొప్పతనాన్ని జనానికి తెలిసేలా చేసినందుకు టొక్సోడాన్‌కి థాంక్స్‌ చెప్పాలి అన్నారు ఐఐహెచ్‌ఆర్‌ (బెంగళూరు)లో పండ్ల పరిశోధనా విభాగాధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. జి. కరుణాకరన్‌! 

అదేవిధంగా, 1950లలో కూర్గ్, వయనాడ్‌ ప్రాంతాల్లో టీ ఎస్టేట్ల యజమానులు వ్యాహ్యాళికి వెళ్తూ పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లేవారు. దారి పక్కన చెట్ల కింద రాలినపడి ఉన్న అవొకాడో పండ్లను కుక్కలు ఇష్టంగా తినటం గమనించారు. అప్పటి వరకు ఇవి తినదగిన పండ్లని చాలా మందికి తెలియదు. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశంలో ‘డాన్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌’ అయ్యింది!  

-నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement