
ఆస్మోటిక్ డీ హైడ్రేషన్ బెస్ట్
బొప్పాయి, జామ, ఉసిరి వంటి పండ్లకు మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు తెగనమ్ముకోకుండా లేదా వృథాగా పారేయకుండా వాటిని ఎండ బెట్టి నిల్వ ఉండే వివిధ ఉత్పత్తులుగా మార్చితే రైతులకు మంచి అదనపు ఆదాయం చేకూరుతుంది. ఎండబెట్టే క్రమంలో ఆస్మోటిక్ డీహైడ్రేషన్ ప్రక్రియ మేలైనదని, తద్వారా అనేక విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసు కోవచ్చని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా స్థానం (ఐఐహెచ్‌ఆర్) చెబుతోంది.
బొప్పాయి ఫ్రూట్ బార్ తయారీ విధానం
బొప్పాయి మన దేశంలో ఒక ముఖ్యమైన పంట. అద్భుతమైన వాసన, రుచి, విటమిన్ ఎ, సిలకు ఇది పెట్టింది పేరు. బొప్పాయికి మార్కెట్‌లో గిరాకీ లేనప్పుడు దూర ప్రాంతాలకు ఖర్చులు భరించి రవాణా చేయటం కష్టం. అందువల్ల కోత అనంతర నష్టం బొప్పాయిలో చాలా ఎక్కువ. కొన్నిసార్లు చిన్న కాయలు లేదా బాగా పెద్ద కాయలను మార్కెట్‌లో అమ్మటం కష్టమవుతుంది. అటువంటప్పుడు రైతులు బొప్పాయి ఫ్రూట్ బార్ (బొప్పాయి తాండ్ర)ను తయారు చేసి అమ్ముకోవచ్చు. ఫ్రూట్ బార్‌లు పోషకవంతమైనవి. చూపులకు నచ్చుతాయి. రుచిగా ఉంటాయి. రవాణా చేయటం సులభం. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అయితే, బొప్పాయి గుజ్జుతో తాండ్రను తయారు చేయటం మామిడి అంత తేలిక కాదు. దీన్ని తయారు చేసే క్రమంలో పగుళ్లు వస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు ఒక ప్రాసెస్‌ను కనిపెట్టారు.
నీటి శాతం తగ్గించి, తాండ్రగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. బొప్పాయి ఫ్రూట్ బార్ చక్కటి తాజా పండు మాదిరిగానే వాసన వస్తుంది. రూపం, రుచి కూడా బాగుంటాయి. దీన్ని చిరుతిండిగా తినొచ్చు. పిల్లలకు, పర్వతారోహకులకు, రక్షణ సిబ్బంది, సైనికులకు ఇది ఉపయోగకరం. ఈ డీహైడ్రేటెడ్ ప్రొడక్ట్‌ను చిన్న, సన్నకారు పరిశ్రమలతో పాటు మధ్యతరహా పరిశ్రమల్లోనూ తయారు చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా ప్రాసెసింగ్ యూనిట్లకు ఉపయోగపడేలా ఈ సాంకేతికతను రూపొందించినట్లు ఐఐహెచ్‌ఆర్ పేర్కొంది. కిలో ఫ్రూట్ బార్ తయారు చేయడానికి 7-8 కిలోల బొ΄్పాయి కాయలు అవసర మవుతాయి. ఇది సాధారణ పరిస్థితుల్లో ఆరు నెలలు నిల్వ ఉంటుంది.
జామ ముక్కల వొరుగుల తయారీ టెక్నాలజీ
జామ పండ్లలో గుజ్జు ఎక్కువ నీటితో కూడి తియ్యగా ఉంటుంది కాబట్టి తాజా పండ్లు తినటమే బాగుంటుంది. జామ పండు చక్కటి సువానతో పాటు విటమిన్ సిని కలిగి ఉంటుంది. అయితే, పండు చాలా త్వరగా పాడైపోతుంది. కాబట్టి, ప్రాసెస్ చేస్తే మంచి లాభదాయకం. జెల్లీ, జ్యూస్, ఫ్రూట్ బార్ వంటి ఉత్పత్తులను జామపండుతో తయారు చేయటం మనకు తెలుసు. అయితే, ఆస్మోటిక్ డైహైడ్రేసన్ పద్ధతిలో తొలుత నీటి శాతాన్ని తగ్గిస్తే.. పూర్థిస్థాయి ప్రాసెసింగ్, ఎయిర్ డ్రయ్యింగ్ చప్పున పూర్తవుతుంది. ఈ సాంకేతికత ద్వారా తెలుపు, గులాబీ రంగు గుజ్జు ఉండే జామ పండ్ల ముక్కలను డీౖహె డ్రేట్ చెయ్యొచ్చు. ఆస్మో–ఎయిర్ డ్రైడ్ ఫ్రూట్స్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియ చాలా వినూత్నమైన పద్ధతి. జామ ముక్కలకు తొలుత పంచదార ΄ాకం కలపటం ఆస్మోటిక్ డీౖహె డ్రేషన్‌లో తొలి దశ.
ఆ తర్వాత పాక్షికంగా నీరు తగ్గిన ముక్కలను హాట్ ఎయిర్ డ్రయ్యర్ ద్వారా తేమ శాతాన్ని 15% కన్నా తక్కువ తేమ ఉండేలా తయారు చేయాలి. ఇలా తయారైన జామ ఎండు ముక్కలను చిరుతిండిగా తినొచ్చు. లేదా ఇతర డ్రైఫ్రూట్స్‌తో కలిపి తినొచ్చు. దీన్ని ఐస్‌క్రీమ్ పరిశ్రమలో, ఫ్రూట్ సలాడ్లలో, ఖీర్‌లో, కేకులు, బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. పిల్లలకు, బరువైన వస్తువులు తీసుకెళ్లలేని పర్వతారోహకులకు, సైనికులకు ఎక్కువ ఉపయోగకరం. ఈ ప్రాసెస్ చాలా సులభం. పెద్ద యంత్ర పరికరాలేమీ అక్కర్లేదు. దీన్ని చిన్నసన్నకారు ప్రాసెసర్లు, మహిళా సంఘాలు, ఇతర స్వయం ఉపాధి పొందే వర్గాల వారు ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. కిలో ఆస్మో-ఎయిర్ డ్రైడ్ జామ ఒరుగులు తయారు చేయటానికి 7–8 కిలోల జామ పండ్లు కావాలి. 6 నెలల నుంచి ఏడాది వరకు నిల్వ ఉంటాయి.
సహజ రంగుతో కూడిన వుసిరి ఒరుగులు
ఔషధ గుణాల పుట్ట అయిన ఉసిరికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంటుంది. అస్కార్బిక్ ఆసిడ్ అధిక పాళ్లలో కలిగిఉండటంతో పాటు యాంటీబయోటిక్, లాక్జేటివ్‌గా పనిచేసే గుణాలు దీనికి ఉన్నాయి. కోకుమ్ / మాంగోస్టీన్‌లో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి జీర్ణశక్తిని, ఆకలిని పెంచుతాయి. దీని రంగును ఉసిరి ఒరుగులకు పట్టిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇటు ఉసిరి, అటు మాంగోస్టీన్‌లలో ఔషధ గుణాలు ఎక్కువే గానీ అవి త్వరగా పాడైపోతాయి. వీటిని నేరుగా పండ్లను తినటం కష్టం. ప్రాసెస్ చేయాల్సిందే. కోకుమ్ జ్యూస్‌ను తీసి వుసిరి తొనలకు కలిపితే.. వుసిరి ఒరుగులకు మంచి ఎరుపు రంగుతోపాటు సువాసన వస్తాయి. ఆస్మోటిక్ పద్ధతిలో ఎండబెట్టిన వుసిరి తక్కువ అసిడిక్‌గా ఉంటాయి. రుచి బాగుంటుంది.

ఎర్రటి ఈ ఒరుగులను విడిగా చిరుతిండిగా తినొచ్చు లేదా ఇతర డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తినొచ్చు. పిల్లలకు, పర్వతారోహకులకు, సైనికులకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కోకుమ్ రంగు కలిపిన ఉత్పత్తులు మార్కెట్‌లో లేవు. చిన్న తరహా ప్రాసెసింగ్ సదుపాయాలున్న వారు వీటిని తయారు చేసుకోవచ్చు. ఆస్మోటిక్ పద్ధతిలో ఎండబెట్టిన ఉసిరి ఉత్పత్తులు తాజా పండ్ల మాదిరిగానే ఉంటాయి. 4-5 కిలోల ఉసిరి పండ్లు, 2 కిలోల కోకుమ్ పండ్లు కలిపి తయారు చేస్తే ఓస్మో-ఎయిర్ డ్రైడ్ స్లైసెస్ తయారవుతాయి. జాగ్రత్తగా నిల్వ చేస్తే ఒక ఏడాది పాటు నిల్వ ఉంటాయి.